Thursday, December 16, 2010

19న హైదరాబాద్‌లో "తానా" 'తెలుగు వైభవం'

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే సంకల్పంతో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఈ నెల 19న రవీంద్రభారతిలో 'తానా చైతన్య స్రవంతి-తెలుగు వైభవం' ఉత్సవాలను నిర్వహించనుంది. మంగళవారమిక్కడ తానా అధ్యక్షుడు కోమటి జయరామ్‌ విలేకరులతో మాట్లాడారు. ఔత్సాహిక కళాకారుల ప్రతిభను వెలుగులోకితెచ్చేందుకు రెండేళ్లకోసారి రాష్ట్రంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ ఎంపిక చేసిన ప్రతిభావంతులకు 2011లో అమెరికాలో జరిగే తానా సభల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇదే నెల 22, 23 తేదీల్లో చంద్రగిరికోట (తిరుపతి)లో ఆధ్యాత్మిక వైభవం, 24, 25 తేదీల్లో విజయవాడలోని సిద్దార్థ కళాశాల మైదానంలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. తెలుగు కవితల పోటీలు, రాష్ట్రస్థాయి నాటికల పోటీలు, వేదపఠనం, భక్తిగీతాలపాన, జానపద కళల ప్రదర్శన, తెలుగు సాంస్కృతిక సమ్మేళనం వంటి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. సీనియర్‌ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్‌ను గిడుగు రామ్మూర్తి పురస్కారంతో, మల్లాది సుబ్బమ్మను సేవా పురస్కారంతో సత్కరిస్తామని తెలిపారు.
తానా' ఆధ్వర్యంలో విజయవాడలో జానపద కళావైభవం
ప్రాభవం కోల్పోతున్న తెలుగు జానపద కళలకు ప్రాచుర్యం కల్పించి, కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో విజయవాడలో 'జానపద కళావైభవం' పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటుచేయబోతున్నట్టు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు కోమటి జయరాం తెలిపారు. ఈనెల 24, 25  తేదీల్లో సిద్ధార్థ అకాడమీ మైదానంలో వీటిని ఘనంగా నిర్వహిస్తామని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. వీటిల్లో మంచి ప్రావీణ్యం చూపిన కళాకారులకు తానా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. విజయవాడలో జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులను సన్మానించనున్నట్టు తెలిపారు. న్యూజెర్సీలో ఉండే విజయవాడ వాసి సుబ్బారావు అనుమోలు అమెరికాలో స్థిరపడిన వారికి ఇచ్చే అత్యుత్తమ జాతీయ అవార్డును అందుకున్నారని, ఆయన్ను కూడా విజయవాడలో సన్మానించనున్నట్టు తెలిపారు. 23, 24 తేదీల్లో నాటికలు, కవితల పోటీలు, జానపద కళల ప్రదర్శన, దివంగత తెలుగు దిగ్గజాల ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటుచేస్తామని సాంస్కృతిక సమన్వయకర్త విజయ ఆసూరి చెప్పారు. తెలుగుజాతి సంస్కృతి పేరుతో కవితాగోష్ఠి, రచయితల చేత పత్రాల సమర్పణ ఉంటుందనీ, వీటిని పుస్తకరూపంలో ముద్రించి తానా సభల్లో ఆవిష్కరిస్తామని తానా సమన్వయకర్త బీఎస్‌ కోటేశ్వరరావు తెలిపారు. అమెరికాకు వచ్చే తెలుగువారికి తానా ఎప్పుడూ సహాయంగా ఉంటుందని కోమటి జయరాం చెప్పారు. ఇక్కడి నుంచి కొత్తగా వచ్చే వారి కోసం ఉపయోగపడే సమాచారం తానా వెబ్‌సైట్‌లో ఉంటుందని పేర్కొన్నారు. అక్కడికొచ్చి చదువుకునే వారికి ప్రతి ఏటా 35 మందికి ఉపకార వేతనాలు ఇస్తున్నట్టు చెప్పారు. అంతరించిపోతున్న కళలకు తానా ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ అన్నారు. ఈ సమావేశంలో తానా భారత సమన్వయకర్త గారపాటి ప్రసాద్‌, ఆహ్వాన సంఘం సభ్యులు పట్టాభి, బెల్లపు బాబ్జీ, కృచ్ఛేవ్‌, అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment