Sunday, January 30, 2011

ఆంధ్రులకూ, కన్నడిగులకూ ఇది సమష్టి వారసత్వం

వి.ఎస్.రమాదేవి గారు ( వ్యాసకర్త )  
బెంగళూరులో గత నవంబరు 13వ తేదీన తెలుగు విజ్ఞాన సమితివారు శ్రీకృష్ణదేవరాయల పంచశత పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిపారు. ఈ సంస్థ చాలా సంవత్సరాలుగా, కర్నాటక శాసనసభ పూర్వ అధ్యక్షులు రమేశ్ కుమార్‌గారు, సాహితీ వేత్త డాక్టర్ రాధాకృష్ణరాజుగారు వంటి పెద్దల కార్యదక్షతతో ఎన్నో భాషా సాంస్కృతికపరమైన కార్యక్రమాలను జరుపుతూ తెలుగువారిని, కన్నడిగులను ఆహ్లాదపరుస్తూ వస్తోంది. సంస్థ ప్రస్తుత ముఖ్య పోషకులు రమేశ్ కుమార్‌గారు, అధ్యక్షులు జె.ఎస్.రెడ్డిగారు. డాక్టర్ డి.రాజేశ్వరిగారు కార్యదర్శి. ఆవిడ స్వయంగా చక్కటి కవయిత్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో ఎందరో తెలుగు కవులకు తెలుకు పాఠాలు చెప్పిన దివాకర్ల వెంకటావధానిగారి కూతురు.
కర్నాటకలో చాలా ఏళ్లుగా శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. క్రిందటి సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో కూడా శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత ఘనంగా జరిపారు. బెంగుళూరులో తెలుగు సంస్థ జరుపుకున్న ఉత్సవంలో కన్నడ సాహితీవేత్త చంద్రశేఖర కంబార్‌కు పురస్కార ప్రదానం జరిగింది. కర్నాటకలో కన్నడ తెలుగువారి మధ్య చక్కటి సామరస్యత ఉంది. అందరూ తెలుగు, కన్నడ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో శ్రీ కంబార్ కన్నడ, తెలుగు భాషలు రెండింటికీ ఒకేసారి ప్రాచీన హోదా లభించడం హర్షణీయం అన్నారు.
భాషల అభివృద్ధికి లభించే నిధుల్ని ఒకేరీతిగా వినియోగించితే మరింత అనుకూలంగా రెండు భాషలు అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కన్నడ భాషకు, తెలుగు భాషకు సారూప్యం ఎక్కువ ఉంది కనుక ఒకే లిపి కూడా ఉంటే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ లిపి విషయంలో ఇప్పటికే కొంత ప్రయత్నం జరిగిందని కారణమేమైనా అది ఇప్పుడు కొంత కుంటుపడిందని అంటూ ఉంటారు. ఆ విషయంగా సాహితీవేత్తలలో ఏకీభావం ఉన్నా, రాజకీయ నేతలకే లేదన్నారాయన. వేమన శతకం కన్నడంలోకి అనువదించారు అంటూ సాహిత్య సామ్యరూపాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. ఆయన చాలా మందికి తెలియని మరొక విషయం తెలియజేసారు. ఆయన కన్నడ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉండగా కాంపస్‌లో నీటికొరత ఏర్పడిందట. క్యాంపస్‌కి దగ్గరలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే తుంగభద్ర కాలవ ఉంది. అందులో నుంచి కొంత నీటిని తమకు కేటాయించాలని కోరితే అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుగారు వెంటనే స్పందించి రెండు టిఎంసిల నీటిని కేటాయించి ఆదుకున్నారట. సమాచార సాంకేతిక రంగంలో మన రెండు రాష్ట్రాల ప్రజలు అమెరికావైపు దృష్టి మళ్లించారే కాని మన భాషలను అభివృద్ధి పరుచుకోలేదు. కాని తమిళులు భాషాపరంగా ముందుకు పోయారు. అందువల్ల మన రెండు భాషలు ఒటిన్నర శతాబ్దం అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని అన్నారు శ్రీ కంబార్.
బెంగుళూరులో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులందరూ అవకాశం లభించినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిపి కన్నడ సోదరులను కూడా ఆహ్వానించి తామిద్దరి సఖ్యతను మరింత పెంపొందించుకుంటూ ఉంటారని శ్రీ రమేశ్ కుమార్‌గారన్నారు. బెంగుళూరులోని మల్లేశ్వరం శాసనసభ్యుడు డాక్టర్ అశ్వత్థ నారాయణగారు శ్రీకృష్ణదేవరాయల పాలన నేటి పాలకులకు ఆదర్శం కావాలన్నారు. కర్నాటకలోని తెలుగువారి కానుక కన్నడ భాషాభివృద్ధికి అపారం అన్నారు.
ఆంధ్రనుంచి వలస వెళ్లిన రైతులు అక్కడి వ్యవసాయ రీతుల్లో ఎన్నో మార్పులు తెచ్చారు. కర్నాటక రాష్ట్రంలో రెండు మూడు పంటలు కూడా సంవత్సరానికి పండించే అవకాశం ఉందని వారు అలా పండించి కన్నడ రైతులకు మార్గదర్శకులయ్యారు. అయితే వారందరూ కాంప్‌లలో ఉండేవారు. వాటిని రెవిన్యు గ్రామాలుగా చేయించడానికి నేనక్కడున్నప్పుడు ప్రయత్నాలు జరిగాయి. కొన్ని క్యాంపులు గ్రామాలుగా రూపొందాయి కూడా. శ్రీమతి పురంధ్రీశ్వరిగారు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు. హోసూరులోను, బెంగుళూరులోను ఉన్న ఎన్.టి.రామారావుగారి అభిమాన సంఘం సభ్యులు వచ్చి ఆవిడ్ని తండ్రికి తగ్గ తనయ అంటూ గౌరవించారు. ఆవిడ ఆనాటి మహోత్సవాలలో మాట్లాడుతూ ‘శ్రీకృష్ణదేవరాయలు కన్నడ, తెలుగు భాషీయుల మధ్య తారతమ్యం చూపలేదని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘనంగా ఆయన 500వ పట్ట్భాషేక మహోత్సవాన్ని పలుచోట్ల ఘనంగా జరిపిందని అన్నారు. ఇప్పుడీ భాషాపరమైన భేదాలు బయటకు వస్తున్నా, రాయలు వాటిని అతిగమింఛి ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కొనియాడడమే కాకుండా ‘ఆముక్తమాల్యద’ అన్న గ్రంథాన్ని తెలుగులో రాసారు. ఆయన ఆస్థాన కవులలో ఎక్కువమంది తెలుగు కవులే. వారు కూడా భాషాపరమైన విభేదాలు పాటించలేదు. ఆయన కాలంలో పలు గ్రంథాలు రచించిన మహిళా విద్యావేత్తలు రాజాదరణ పొందారు. అయితే ఆ సంగతి చాలామంది మరిచిపోయారు. ఎంతసేపూ ‘్భవన విజయం’ అంటూ పురుష కవుల సాహితీ రూపాకాలే కానీ ఇటీవలి రోజుల్లో కవయిత్రులతో ‘్భమినీ విజయం’ సాహిత్య రూపకాల ప్రదర్శనలతో వారిని గురించిన విషయాలు బయటికి వచ్చాయి.
రాయలపైన బసవన్న సిద్ధాంతాలు కొంతవరకు ప్రభావం చూపాయనడానికి కూడా కొన్ని ప్రమాణాలు ఈ మధ్య బయటకు వచ్చాయి. రాయల ఆస్థానానికి ఒక వీరశైవ కవియిత్రి కూడ వచ్చిందని కూడా తెలియవస్తోంది. తిరుమల తిరుపతి మొదలు ఎన్నో దేవాలయాల పునరుద్ధరణ జరిపారు రాయలు. వారు పునరుద్ధరించిన ఆలయాల గోపురాలను కూడా మనం కాపాడుకోలేకపోతున్నాం.
ఆయన చెరువులు తవ్విస్తే మనం వాటిని పూడ్చేస్తున్నాం. రైతులను ఆదుకుని ఆయన రాజ్యం అంతా సస్యశ్యామలమయ్యేలాగ చూశారు. చరిత్రకారులు ఆయనను గొప్ప పరిపాలనాదక్షుడిగా విశే్లషిస్తున్నారు. ఆయనను గుర్తు చేసుకుంటూ మహోత్సవాలు జరపడం ఒక్కటే కాదు. ఆయన పాలనలోని మెళకువలను మన కర్నాటకాంధ్ర పాలకులు గ్రహించి వాటిని అమలుపరచాలి. రాయలకాలంనుంచీ తెలుగు కన్నడ అన్న భేదం లేకుండా ముఖ్యంగా రాజకీయవేత్తల గృహాలలో పెళ్లిళ్లు జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కృష్ణదేవరాయల వారసుడైన శ్రీ రంగ దేవరాయలు నేను బెంగుళూరులో ఉన్న రోజుల్లో కర్నాటక శాసనసభా సభ్యుడుగా ఉండేవారు. ఆయన విశాఖపట్నంలోని ఒక సంపన్నుల ఇంటినుంచి శ్రీమతి లలితారాణిని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. ‘‘ నా భర్త కృష్ణదేవరాయల రక్తసంబంధీకులు కారు. దత్తత చేసుకున్నవారి ద్వారా రాయల వంశీకులైనారు ’’ అని అన్నారు శ్రీమతి లలితారాణి.
-వి.ఎస్.రమాదేవి (ఆంధ్రభూమి సౌజన్యంతో.. )

No comments:

Post a Comment