Friday, December 30, 2016

తెలుగు బాష ప్రాముఖ్యత (ప్రథమ బహుమతి పొందిన వ్యాసం)-కూన రసజ్ఞ


ఉపోద్గాతము :  “చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు బాషయే పుట్టినిల్లు ”. చక్కని కవితలల్లిక లో జిగిబిగిని ప్రదర్శించిన నేర్పు ఈ బాషలోనే వీలైనది. అంతేగాక, అనేక బాషలు ఈ బాషలో చోటు చేసుకున్నాయి. ఎప్పుడైనా ఒక బాష  గొప్పతనం అన్ని బాషలూ నేర్చినగానీ తెలియదు. సంస్కృతము, తమిళము, పారసి మున్నగు బాషలు తెలిసిన రాయలు దేశబాషలందు  తెలుగులెస్స అనుట ఆశ్చర్యం గాదు. బ్రౌనుదొర కూడాఈ బాషను గూర్చి వేనోళ్ల పొగుడుట మన తెలుగు వారి, తెలుగు బాష యెక్క గౌరవము.
దేశ బాషలందు తెలుగు లెస్స: మన తెలుగు బాష దేశ బాషలలో గొప్పది. దేశబాషలందు తెలుగులెస్స, అని శ్రీకృష్ణదేవరాయలు తన “ఆముక్తమాల్యద” లో ఆంధ్రమహావిష్ణువు చే చెప్పించాడు. ఈ మాట ప్రతి తెలుగు వారి గుండెలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాయల పైమాట తెలుగు వారి యెక్క మాతృబాషాభిమానానికి మేలుకొలుపు పాట అయ్యింది. బహుబాషా కోవిదుడైన రాయలు, ఆ బాష లోతుపాతులనెరిగి, మధించి భువన విజయ వికమాదిత్య న్యాయాధిపతిగా చెప్పిన తీర్పు దేశబాషలందు  తెలుగులెస్స అన్న మాట.
తెలుగు  బాష మాధుర్యం:   తెలుగు బాష మాధుర్యానికి కారణాలను పరిశేలిద్దాం. తెలుగు ద్రావిడ బాషలలో నుండి పుట్టింది. సహజముగా ద్రావిడ లక్షణములను బట్టి సరళము, సుకుమారము అయిన తెలుగువాణి, సంస్కృత బాషా కైకర్యం, గాంభీర్య పటుత్వాలను అలవరుచుకొని, తల్లికి, అక్కా చెల్లెండ్రకూ లేని క్రొత్త అందాలను అలవరుచుకుంది.
తెలుగు బాష సస్యశ్యామలమైనది: తెలుగు గడ్డ కవితా సస్యశ్యామలమైనది. సహృదయ సామ్రాట్ అయిన శ్రీకృష్ణదేవరాయలు ఏ బాష వాడైనా, తెలుగు బాషకే కావితాకర్పూర నీరాజనం అందించాడు.
“తరిపి వెన్నెల! ఆణిముత్యాల జిలుగు
పునుగు జివ్వాజీ! ఆమని పూల వలపు
మురళి రవాళులు! కస్తూరి పరిమళములు
కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు బాష” అని నండూరి వారు అన్నారు.

తెలుగు బాష  కోటి కిటికీల గాలి మేడ:  తెలుగు బాష   కొల్లలుగా క్రొత్త పదాలను తనలో కలుపుతుంది.తెలుగు బాష  కోటి కిటికీల గాలి మేడ. అన్నీ వైపుల నుండి వీచే గాలులను ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చి గౌరవించింది. తెలుగుకి గల హృదయ వైశాల్యము అనన్యము. తెలుగు,సంస్కృత పదాలు క్షీరనీర న్యాయంలో కలిసిపోతాయి. అదే తెలుగు బాష విశిష్టత.
మన తెలుగు కవులు: నన్నయ, తిక్కన, ఎఱ్ఱన తెలుగు పాండిత్యము తో మెప్పించిన ఉద్ధండ కవులు. మన తెలుగు కవులు అపార ప్రజ్ఞాధురీణులు. సంస్కృతాంధ్ర పదములు ప్రయోగించటం లో నేర్పరులు. పోతన సంస్కృతాంధ్ర పధములు ఇష్టమైన ఇద్దరినీ మెప్పిస్తానన్నాడు. పెద్దన మనుచరిత్ర లో ఇంతలు కన్నులుండ అని వ్రాసిన పధ్యము లోని తేట తెనుగు నుడికారపు సొంపులు, వంపులు, తామర తంపరలు, అల్లసాని వారి ఆ అల్లికజిగిబిగి లో తెలుగు పదములు, సంస్కృత శబ్ధములు పడుగుపెకల వలె అల్లుకుంటాయి. మన తెలుగు కవులంతా ఈ విధ్యలో నేర్పరులే. తెలుగు కవులకు జరిగిన సత్కార గౌరవములు ప్రపంచములో ఏ దేశంలో ఏ కవులకూ జరగలేదు.
తెలుగువారి సహృదయత, సాహితీ రసికత, నిరుపమానములు. తెలుగు బాష వాజ్మయము లో ప్రాతఃస్మరణీయులు కవిత్రయము, నన్నయ్య ను రాజరాజు ఆదరించాడు. తిక్కన ను మనుసిద్ది, ఎఱ్ఱప్రెగడను వేమారెడ్డి గౌరవించారు. శ్రీనాథుడు రెడ్డి రాజుల కవిగా మహాభోగాలు అనుభవించాడు. ఆయనకు ప్రౌఢధేవరాయులు కనకాభిషేకం చేశాడు. పోతన మహాకవికి తమ హృదయంలోనే దేవాలయాలు కట్టి తెలుగువారు నేటికీ ఆరాదిస్తారు. సాహితీ బొజుడైన కృష్ణదేవరాయులు కవులను పూజించిన విషయము జగత్ ప్రసిద్దము. పెద్దన కవికి రాయులు గండపెండేరము తొడిగి గౌరవించాడు.
Telugu is the Italian of the East: తెలుగు బాష సంగీతానికి అనువైన అజంత బాష. తెలుగు ఆజన్మ సంగీత కవచకుండలాలతో భాసించింది. సంగీత కళారాధనలో మన తెలుగు వారికి కలసి వచ్చిన గొప్ప అదృష్టం మన మాతృ బాష తెలుగు. తెలుగు బాషలో వచనానికి కూడా సంగీత సాహచర్యం ఉంది. తెలుగు పాటలో, పధ్యములో సంగీత సాహిత్యాలు గంగాయమున వలే సంగమించి ఉంటాయని సహృధయులందరికీ విదితమే. పధ్య కవిత్వంతో పాటు తెలుగు బాషలో వెలసిన పాటలు, స్త్రీల పాటలు, గేయాలు, కీర్తనలు, మరి ఏ ఇతర బాషల్లోనూ లేవు. రామధాసు కీర్తనలు తెలుగు దేశమంతా వ్యాపించాయి. తాళ్ళపాక అన్నమాచార్యులు ముప్పై రెండు వేల కీర్తనలు రచించాడు. తెలుగు వారి కళాభినివేశమునకు, మూర్తీభవించిన పారాకాష్ట త్యాగరాజు.
మాతృబాషలో విధ్యాబోధన:  గాంధీజీ 1938 లో తన హరిజన పత్రికలో బాలబాలికలకు ఆంగ్లము ద్వారా విధ్యాబోధన చెయ్యడాన్ని తప్పు పట్టారు. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృబాష వల్లనే వస్తుందని, స్వబాషలో విధ్య ఉంటే, మనకు స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని ‘గాంధీజీ’ వ్రాశారు. మాతృబాషలో విధ్యాబోధన వల్ల మనసులు చురుకుగా పనిచేస్తాయని, రవీంధ్రుడు అన్నాడు.
మాతృబాషలో  విధ్యాబోధన వల్ల గ్రహణ సామర్ధ్యం పెరుగుతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. “మాతృబాషలో విధ్యాబోధన వల్ల విధార్ధులలో సృజనాత్మకత పెరుగుతుంది”.
మాతృబాష తల్లి పాల వంటిది. పరబాష పోతపాల వంటిది.అని కొమర్రాజు లక్ష్మణరావు గారు అన్న మాట సత్యము.
అధికార బాషగా తెలుగు: తెలుగును పరిపాలనా బాషగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. చివరకు 1966 లో తెలుగును అధికారాబాష గా ప్రవేశపెట్టిన బిల్లు చట్టం అయింది. ప్రబుత్వ శాఖలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నడపాలని 1966 డిసెంబర్ లో ఉత్తర్వులు వచ్చాయి. పరిపాలనా బాషగా తెలుగు స్వరూపం ఎలా ఉండాలో నిర్ణయించటానికి పింగళి లక్ష్మీకాంతం, జి.ఆర్.పి గ్విన్ ల అధ్యక్షతన సంఘాలు ఏర్పడ్డాయి. ప్రబుత్వంలో ఒక శాఖగా 1974 మార్చి 19 న “అధికార బాష సంఘం” ఏర్పడింది.
తెలుగు భోదనా భాషగా అమలుకు సూచనలు:  ప్రజాస్వామ్య యుగంలో ప్రజల బాషలో పరిపాలన సాగించాలి. పాలకుల బాష ఒకటి, పాలితుల బాష మరొకటి అయితే, పరిపాలన అడవిని కాచిన వెన్నెల అవుతుంది. ప్రజలకి తమ బాషలో సమస్యలని చెప్పుకొనే హక్కు ఉండాలి. అధికారులు తెలుగులో వివరించే బాధ్యతని కలిగి ఉండాలి. మాతృబాషలో విధ్యార్జన సులభం. ఇది గమన సామర్ధ్యాన్ని, జ్ఞానాన్ని వేగవంతం చేస్తుంది, సృజనాత్మకతకు తోడ్పడుతుంది. అయితే తెలుగు బాషను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చెయ్యాలి.
  • తెలుగులో పాఠ్యగ్రంథాలను ప్రచురిస్తూ, వాటిని మధ్యమధ్యన పరిష్కరిస్తూ ఉండాలి
  • సమగ్రమైన పారిభాషిక పద కోశాల్ని తయారుచేయించాలి.
  • వైజ్ఞానిక, సామాజిక విషయాలపై గ్రంథాలను విరివిరిగా అనువాదం చేయించాలి.
  • ప్రభుత్వము, తెలుగు అకాడమీ, విశ్వవిధ్యాలయాలు వంటి ద్వారా అన్ని స్థాయిలలో, తెలుగు బోధనా బాషగా అమలు చేసేంధుకు వీలుగా గ్రంథాలు రాయించాలి.
  • ప్రజల్లో చైతన్యం వచ్చి, ధీక్షతో, పట్టుదలతో తెలుగును బోధనా బాషగా అమలు చేయటంలో సహకరించాలి.
  • తెలుగును బోధనా బాషగా చదివిన వారికి సాధుపాయాలు కల్పించాలి.
  • తెలుగులో ఐ‌ఏ‌ఎస్, ఐ‌పి‌ఎస్ వంటి ఉన్నత పరీక్షలు వ్రాసే పద్దతిని అమలు చెయ్యాలి.
  • ప్రబుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులు పూర్తిగా తెలుగులోనే ఉండాలి.
  • టైప్ రైటింగ్, షార్ట్ హాండ్, కంప్యూటర్ లలో తెలుగుకి ప్రాధాన్యం కల్పించాలి.

 సమాప్తి:

  • తెలుగు బాష పట్ల మమకారం అంకిత భావం ఉండాలి.
  • ప్రజల వద్దకు పాలన అన్నది తెలుగు బాషను పరిపాలనా బాషగా పూర్తిగా అమలు పరిచినప్పుడే సాధ్యమవుతుంది.
  • అభిమానం మాటలకే పరిమితమైతే దేశ బాషలందు తెలుగు లెస్స్”  అనే పరిహాసానికి గురికాక తప్పదు. కాబట్టి ప్రభుత్వం తెలుగు పట్ల శ్రద్ద వహించాలి.
  • అధికారులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే తెలుగు వెలుగు నాలుదిక్కులా వ్యాపిస్తుంది.
  • ఈ విధంగా తెలుగును భోధనా బాషగా ప్రవేశపెట్టి, మన విధ్యార్థుల సర్వతోముఖ వికాసానికి ఫ్రబుత్వము, ప్రజలు కృషి చేయాలి.
 కూన రసజ్ఞ,
10వ తరగతి,
శ్రీ సరస్వతి జ్ఞాన మందిర్ ఉన్నత పాఠశాల,
బుధవార్ పేట్, నిర్మల్,
నిర్మల్ (మం)
courtesy: www.telugubidda.in

Saturday, August 29, 2015

దేశంలోని ఇతర రాష్ట్రాలలో తెలుగు

తెలుగు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లోనే కాకుండా తమిళనాడు, కర్నాటక, ఒడిశా లలో కూడా మాట్లాడబడుతుంది. తమిళనాడులో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే.బెంగళూరులో 30 % మంది తెలుగు భాష మాట్లాడువారు నివసించుచున్నారు.తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరులలో, ఒడిశా లోని రాయగడలో కూడా తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేల మంది తమిళప్రాంతములకు వెళ్ళి స్థిరపడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష అయిన అరవము లోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్నాటకలో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు. ఇంకా ఒడిశా, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్ధు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరు లలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రింది ప్రాంతాలలో తెలుగు భాష ఎక్కువగా మాట్లాడువారు నివసించుచున్నారు
1. బెంగళూరు 2. చెన్నై 3. హోసూరు 4. కోయంబత్తూరు 5. మధురై (తమిళనాడు) 6. బళ్ళారి 7. రాయగడ 8. హుబ్లి 9. వారణాసి (కాశి) 10. శిరిడి 11. జగదల్పూర్ 12. బరంపురం, ఒడిశా 13. ఖరగ్ పూర్, పశ్చిమ బెంగాల్ 14. షోలాపూర్ 15. సూరత్ 16. ముంబై -భివాండి 17. ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాలు 18. ఒడిశా సరిహద్దు ప్రాంతాలు

Thursday, August 7, 2014

ఎల్లంపల్లె సమీపంలో పురాతన శాసనాలు, రాతి శిల్పాలు లభ్యం

కడప జిల్లా  మైదుకూరు మండలం ఎల్లంపల్లె సమీపంలోని గగ్గితిప్ప వద్ద పురాతన శాసనాలు, రాతి శిల్పాలు బయట పడ్డాయి. ఈ విషయమై రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీ రెండవ దేవరాయలు పరిపాలిస్తూ ఉండగా విజయనగర సామ్రాజ్య సామంతరాజు సంబెట పిన్నయ దేవ మహారాజు యెల్లంపల్లె సమీపంలో పేరనిపాడు రాజధానిగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ క్రీస్తుశకం 1428 లో  ఈ శాసనాలను వేయించారని తెలిపారు. విజయనగర సామ్రాజ్య సామంతరాజు పిన్నయదేవ మహారాజు తన తల్లిదండ్రులు తిప్పలదేవి, సోమయ్య జ్ఞాపకార్థం గగ్గితిప్పకు సమీపంలో భైరవున్ని నిలిపి, వనం, బావితవ్వించాడని కైఫీయత్తుల  ద్వారా తెలుస్తున్నప్పటికీ   ఈ వివరాలు  పురావస్తు శాఖ రికార్డులలో  నమోదు కాలేదని యెల్లంపల్లె పరిసరాల్లోని ప్రదేశాలను  గ్రామస్తులు ఇప్పటికీ కోట , పేట అని పిలుస్తారని  తెలిపారు. సంబెట పాలకుల చరిత్రకు సంబంధించిన ఈ శాసనాలను ,రాతిశిల్పాలను పరిరక్షించాలని తవ్వా ఓబుల్ రెడ్డి ప్రభుత్వ్వనికి విజ్ఞప్తి చేశారు.
బయల్పడ్డాయి. యెల్లంపల్లె గ్రామానికి చెందిన గవిరెడ్డి నాగ ప్రసాద రెడ్డి,మూలే శంకర రెడ్డి
పొలాల వద్దగల భైరవుని బావివద్ద ఈ శాసనాలు,శిల్పాలు ఉన్నట్లు తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి, సమాఖ్య మైదుకూరు శాఖ అధ్యక్షుడు అరబోలు వీరాస్వామి గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకుని ఈవిషయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళారు.  దీంతో తిరుపతిలోని ఆ శాఖ అధికారులు శివకుమార్, జయరాం శాసనాలు, రాతిశిల్పాలు ఉన్న ప్రదేశానికి బుధవారం చేరుకుని శాసనాలను, నాగదేవత, భరవుడు, సర్పం చుట్టుకుని ఉన్న పాదాలను ఇతర శిల్పాలను పరిశీలించారు. అక్కడ ఉన్న రెండు రాతి శాసనాల్లో ఒక శాసనాన్ని నమూనాను సేకరించారు. త్వరలో రెండో శాసనానం నమూనాను కూడా తీసి ఈ నమూనాలను రాష్ట్ర శాఖ అధికారులకు పంపుతామని పురావస్తు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.