Monday, February 7, 2011

భాషోద్యమానికి కొత్తబాట : బరంపురం తెలుగు మహాసభలు

తెలుగు జ్యోతిని వెలిగించిన నవీన్ పట్నాయక్
తెలుగు వారిలో  మాతృభాషపై స్ఫూర్తి రగిలించిన ఆరవ అఖిల భారత తెలుగు మహాసభలు భాషోద్యమానికి కొత్తబాట పరిచాయి. ఒరిస్సాలోని బరంపురంలో ఫిబ్రవరి 4 వ తేదీ నుండి 6వ తేది వరకు మూడు రోజులపాటు జరిగిన ఆరవ అఖిల భారత తెలుగు మహాసభలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ముగింపు సభకు శాసనమండలి అధ్యక్షుడు డాక్టర్‌ చక్రపాణి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ శైలజానాథ్‌లు హాజరయ్యారు. రాష్ట్రేతర తెలుగువారి విద్యా సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని శైలజానాథ్‌ హామీ ఇచ్చారు. చక్రపాణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ సంయుక్త శాసనసభ అధ్యక్షునిగా తాను చేసిన సిఫార్సుల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పారు. ఈ సభలో అతిథులుగా పాల్గొన్న ఒరిస్సాలోని కవిసూర్యనగర్‌ శాసనసభ్యురాలు వి.సుజ్ఞానికుమారి దేవ్‌, బరంపురం శాసనసభ్యుడు డాక్టర్‌ రమేష్‌చంద్ర చ్యవుపట్నాయక్‌లు మాట్లాడుతూ తెలుగువారి విద్యా సమస్యల పరిష్కారానికి తాము కూడా ఒరిస్సా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య భూమయ్య, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.చెల్లప్ప, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం సభ్యుడు ఆచార్య కె.రామమూర్తి నాయుడు, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఇన్‌ఛార్జి సంచాలకుడు డాక్టర్‌ మునిరత్నం నాయుడు, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌, ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం అధ్యక్షుడు శ్రీపాద రాంకుమార్‌, కార్యదర్శి పి.వి.రమణ, నిర్వాహక అధ్యక్షుడు పి.సత్యనారాయణలు సభల నిర్వహణలో ప్రధానభూమిక పోషించారు. మూడు రోజుల తెలుగు మహాసభలు దేశం నలుమూలల నుంచి వచ్చిన వందలాది తెలుగు ప్రతినిధుల్లో కొత్తఆశలు, ఆకాంక్షలు రేకెత్తించాయి. రాష్ట్రేతర ఆంధ్రులలో ఐకత్యను పెంచేందుకు దోహదపడ్డాయి. దశాబ్దాల తర్వాత పాతమిత్రుల కలయికకు సభలు వేదికయ్యాయి. వారు ఆనందంతో, కొత్త ఊపిరితో బరంపురానికి వీడ్కోలు పలికారు.
తెలుగు మహాసభల్లో తీర్మానాలు
రాష్ట్రేతర ప్రాంతాల్లో తెలుగు విద్యాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని కోరుతూ పది తీర్మానాలు చేశారు.ఒడిశాలో తెలుగు ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, తెలుగు మాధ్యమ పాఠ్యపుస్తకాలను రూపొందించాలంటూ ఒడిశా ప్రభుత్వాన్ని కోరాలని, రాష్ట్రేతర ప్రాంతాల్లో తెలుగు వారి ఉత్సవాలకు సాంస్కృతిక బృందాలను ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ పంపాలని, తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి, ఇతర భాషల సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించే కార్యక్రమం చేపట్టాలని, ఇతర రాష్ట్రాల్లో తెలుగు వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తెలుగు భాషా వికాసానికి శాశ్వత సభా సంఘం, ఒక నోడల్‌ అధికారి నియామకం, సంయుక్త శాసనసభ సంఘం సిఫార్సుల అమలు వంటివి ఇందులో ఉన్నాయి.

No comments:

Post a Comment