Wednesday, February 23, 2011

తమిళనాడులో వేలయేండ్ల నుంచే తెలుగు వెలుగులు

నుడుల పేరుతో నాడులు ఏర్పడింది ఏభై అరవై సంవత్సరాల కిందట. కానీ అంతకుముందు వేలయేండ్ల నుంచే తెలుగుజాతి పరచుకొన్న తావు చాలా పెద్దది. వక్కణాన (ఉత్తరాన) మహానది దగ్గర నుంచి తెక్కణాన(దక్షిణాన) కన్యాకుమారి వరకూ తెలుగువాళ్లు ఉన్నారు, తెలుగు ఊర్లు ఉన్నాయి. ఇప్పుడున్న పద్దెనిమిది కోట్లమంది తెలుగువాళ్లలో సగం మంది ఇప్పటి ఆంధ్రప్రదేశం లోనూ, సగం మంది వెలుపటా ఉన్నారు. వెలుపట ఉన్నవారిలో నూటికి ఒకరిద్దరు మట్టుకే ఆంధ్రదేశం నుంచి పని పాటలు వెతుక్కుంటూ వలస వచ్చినవారు, మిగిలినవారంతా ఉండూరివారే. ఈ మొత్తం తెలుగునేలను, తెలుగువారిని వెతుక్కుంటూ పోతే మన నుడి, జాతి ఎంత పాతవో ఎరుక పడుతుంది. ఇక్కడ తమిళనుడితో పోల్చి తెలుగునుడి పాతదనాన్ని చెబుతారు. ఒక నుడి పాతదనాన్ని తెలుసు కొనేందుకు మనంచూసేది, తవ్వకాలలో దొరికిన కుండపెంకుల మీద, నాణలమీద ఉన్న రాతలు, రాళ్లపైని చెక్కడాలు (శాసనాలు), పాత సాహిత్యం, నోటి కతలూ పాటలు.
 కుండపెంకులు :
 ఇప్పటికి తమిళనాడులోని ఆదిచ్చనల్లూర్‌ అనే చోట, తవ్వకాలలో కొన్ని కుండపెంకులు దొరికాయి. ఒక పెంకుపైన 'ఉఱిపానై' అనే మాట 'బ్రాహ్మి' లిపిలో ఉంది. 'ఉఱి' అంటే వ్రేలాడేది అని, అది పాత తమిళమాట అని 'ఐరావతం మహదేవన్‌' అనే పరిశోధకుని మాట. 'పానై' అంటే పెద్దకుండ అని ఇప్పటికీ తమిళంలో ఉన్నమాట. ఉఱి అనే మాట తెలుగులో ఇప్పటికీ వాడుకలో వుంది, తమిళంలో లేదు. ఉఱి తీయడమంటే వ్రేలాడదీయడం అనే కదా. 'పానై' అనే మాట కూడా కొద్దిగా మారి 'బాన'గా ఇప్పటికీ తెలుగులో వుంది. అంటే 'ఉట్టిబాన' అనే తెలుగుమాట అన్నమాట. ఇది తమిళానికి ఎంత దగ్గరో, అంతకంటే ఎక్కువగా తెలుగుకు దగ్గరిమాట. ఆదిచ్చనల్లూరు కుండపెంకులు క్రీ.ము. 3వ నూరేడు నాటివి. కుండపెంకులపైన ఉన్న రాతలలో పాతవి తెలుగురాతలే అని చెప్పవచ్చు.
 నాణేలు :
నాణేలు దగ్గరకు వస్తే కావేరి తీరంలో దొరికిన శాతవాహన నాణేలలోని రాతలను తమిళనుడిగా ప్రచారం చేసుకొంటున్నారు తమిళులు. కాదు అది తెలుగే అని ఆరుద్రగారి లాంటి ఎందరో తెలుగు పెద్దలు నిరూపించినారు. ఆ నాణేలు పైన ఉన్న మాటలు ఇవి.
 ' అరచనకు వాచిట్టి మకనకు తిరు చాతకణి' కు
 ఇందులోని అరచ, మకన, తిరు అనేవి తమిళమాటలు కాబట్టి ఈ వాక్యం తమిళమని వారి వాదన. కానీ ఈ మాటలు తెలుగులో కూడా వాడుకలో వుండేవి అని తెలుగులో వచ్చిన ఎన్నో రాతిచెక్క డాలలో, కావ్యాలలో రుజువులు ఉన్నాయి. అన్నింటికీ మించి ఈ వాక్యంలో ఉన్న 'కు' అనే ఆరవ విభక్తి తెలుగు. తమిళం అయితే 'క్కు' అని ఉండితీరాలి. ఈ మందలను ఆరుద్ర గారి 'సమగ్రాంధ సాహిత్యం'లో చదువవచ్చు. ఈ నాణేలు  క్రీ.త. 1 నుండి 3వ నూరేండ్ల కాలానివి.
 వీటికంటే చాలాకాలం పాతవైన తెలుగు నాణలు కరీంనగరు జిల్లా కోటిలింగాల తవ్వకాలలో దొరికాయి. ఈనాణేలు  శాతవాహనుల కంటే ముందరివి. ఈ నాణేలు పైన గోప, నారన లాంటి తెలుగు రాజుల పేర్లు ఉన్నాయి. ఈ నాణేలు  క్రీ.ము. 3వ నూరేండ్లవి. వీటిని బట్టి నాణేలు పైన తమిళంకంటే తెలుగే ముందునుంచీ ఉన్న నుడి.
 రాతి చెక్కడాలు (శాసనాలు) :
 ఇక రాతిచెక్కల గురించి గమనిస్తే అన్ని తావుల్లో మొదట దొరికినవన్నీ ప్రాకృతం నుడివే. 'బ్రాహ్మీ' అనే లిపిలో ఉన్నాయి. క్రీ.ము. నుంచీ ఉన్న ఈ చెక్కడాలలో తెలుగు, తమిళ నుడులలోని ఊర్లపేర్లు, మందిపేర్లు కనబడుతున్నాయి. క్రీ.ము. 3వ నూరేండ్ల కాలాన, అశోకుని కంటే ముందు దొరికింది ఆంధ్రప్రదేశంలోని భట్టిప్రోలు చెక్కడము. ఇందులో పాత, పోతక అనే తెలుగుపేర్లు ఉన్నాయి.
 మనదేశ తొలి నాగరికతగా పేర్కొన్న హరప్పా, మొహంజోదారోలలో దొరికిన చిత్రలిపిని కొద్ది కొద్దిగా చదవగలుగుతున్నవారిలో ఐరావతం మహదేవన్‌ గారు ఒకరు. ఆయనే ఆ నాగరికత నుడి తమిళానికి ఎంత దగ్గరో తెలుగుకీ అంతే దగ్గర అని ఎన్నో మచ్చులు (ఉదాహరణలు) చూపించి చెప్పినారు. దాదా అదే కాలానికి చెందిన తుంగభద్రలోయ లిపులపైన పరిశోధనలు జరిగాయి. కర్నూలు జిల్లాలో దొరికిన ఈ లిపులలో క్రీ.ము. రెండువేల యేండ్ల నాటి 'ఆందింలోకం', 'గిబ్బతీగల' అనే తెలుగు మాటలు ఉన్నట్లు సుబ్రమణ్యం మలయాండి కాశీపాండ్యన్‌ (మరుగునపడిన మన వారసత్వం) లాంటి పరిశోధకులు తెలిపారు.
 వీటన్నింటికంటే పాతదైన సుమేరియన్‌ నాగరికత కాలానికి చెందిన చెక్కడాలలో 'ఉర్‌' 'నిప్పుర్‌' 'ఎంకిడు' లాంటి ఎన్నో తెలుగుమాటలు ఉన్నట్లు రాంభట్ల కృష్ణమూర్తి, సంయుక్త కూనియ్యలు వెతికి తెలిపినారు. ఇంత పాతచెక్కడాలు తమిళంలో లేవు.
 తెలుగువాళ్లు 'దక్షిణ బ్రాహ్మి' అని చెబుతున్న లిపిని తమిళులు 'తమిళ బ్రాహ్మి'గా ప్రచారం చేసుకొంటున్నారు. భట్టిప్రోలు లిపితో బాటు వింధ్య కొండలకు దిగువన కన్యాకుమారి వరకూ దొరికిన అన్ని బ్రాహ్మి చెక్కడాలను తమిళ బ్రాహ్మి అనే చెబుతున్నారు. నిక్కం మాట్లాడితే తెలుగు బ్రాహ్మి అని చెప్పుకోవాలి. దిగువ ఇచ్చిన పట్టికను చూస్తే తేటతెల్లమవుతుంది.
 తమిళంలో ల, , ళ అరు మూడు లకారాలు, , ఱ అనే రెండు రకారాలు, ,, న అనే మూడు నకారపు గుర్తులు. పాత బ్రాహ్మిలిపిలో కూడా ఇవి వున్నాయి కాబట్టి ఈ లిపి తమిళ బ్రాహ్మి అని తమిళుల వాదన. అంటే ళ,,, న అనే రాతలు (అక్షరాలు) తమిళనుడిలోనే ఉన్నాయని వాళ్లంటున్నారు. ళ, ఱ లు ఇప్పటికీ తెలుగులో ఉన్నాయి. 'ళ నన్నయ కాలం వరకూ తెలుగులోనూ ఉండినదే. ఆంధ్ర, కన్నడ, తమిళ, మలయాళ నాడులలో చదువురాని వారిలో ఈ '' అనేసద్దును సరిగ్గా పలుకగలిగేది, గోదావరి అంచులలో ఉన్న కొండరెడ్లు అనేవారు మట్టుకే. 'న అనే క్క రాతను పట్టుకొని ఆ లిపిని తమిళబ్రాహ్మి అనడం సరయినది కాదు.
 క్రీ.త. ఒకటవ నూరేడు నాటి 'జాంబై'(విల్లుపురం జిల్లా) చెక్కడంలో ఒకే నకారం ఉంది. ఆ చెక్కడంలో ఒకే నకారం ఉంది. ఆ చెక్కడంలోని మాటలు ఇవి:
 'సతియపుతో ఆదియన్‌ నెడుమాన్‌ అంచి ఈత్తపళి'
 ఇందులో 'సతియపుతో ఆదియన్‌ నెడుమాన్‌ అంచి' అనేది రాజు పేరు. 'ఈత్తపళి' అంటే ఇచ్చిన పళ్ళి (జైన బసది) అని.మాంగుళం, పుగళూరు చెక్కడాల్లో ఉన్నట్లు ఇందులో రెండు నకార గుర్తులు లేవు. అశోకుని చెక్కడాల్లో కనిపించే సత్యపుత్రులు తెలుగు రాజులే అనడానికి పల్లెపాటలలో రుజువులు న్నాయి. వాటిని తర్వాత చెబుతాను. ఈ జాంబై చెక్కడం కూడా అందుకొక రుజువుగా నిలుస్తుంది.

సాహిత్యం :
 ఇది రెండు రకాలు : 1. రాసి దాచిపెట్టుకొన్నది 2. నోటి సాహిత్యం. మొదటి రకంలో తమిళులకు రెండువేల యేండ్లనాటి సంగసాహిత్యం ఉంది. తెలుగువాళ్లకు పండ్రంగని అద్దంకి పద్యాలకు ముందు సాహిత్యం దొరకలేదు. అయితే ఇక్కడొక అనుమానం వస్తుంది. రెండువేల యేండ్లనాడే వేలపుటల సంగసాహిత్యం వెలసిన తమిళనుడిలో ఆ కాలాన ఒక్క తమిళ చెక్కడం కూడా లేదు ఎందుకని? ఆ కాలపు చోళ, చేర, పాండ్యరాజులు వేసినవన్నీ ప్రాకృతపు చెక్కడాలే. తెలుగువాళ్లలాగా తమిళులు మౌర్యవంశపు రాజుల ఏలుబడిలో లేరు కదా, స్వతంత్రులు కదా, మరి తమిళంలో చెక్కడాలు ఎందుకు లేవు? కలమళ్ల, ఎర్రగుడిపాడులో క్రీ.త 570 నాటికే పూర్తి తెలుగు చెక్కడాలు ఉండగా, పూర్తి తమిళచెక్కడం క్రీ.త. 700 నాటిది దళవానూరులో దొరికింది. అంటే తొలి తెలుగు చెక్కడానికీ, తొలి తమిళ చెక్కడానికి మధ్యన నూరేళ్ల తేడా వుంది.
 సరే, సంగసాహిత్యం ఏ కాలానిదైనా అది తమిళులకు మట్టుకే సొంతం కాదు. సంగసాహిత్యంలో ముల్లయ్‌, కుఱింజి, నెయ్‌దల్‌, మరుదం, పాలై అనే తావులను అక్కడ బ్రతికిన మందిని గురించి వివరంగా ఉంటుంది. సంగ సాహిత్యం వర్ణించినదంతా ఎక్కువగా తెలుగువాళ్ల గురించే. ముల్లయ్‌ తావులోని ఇడయర్లు, కుఱింజి తావులోని కొరవలు, నెయ్‌దల్‌ తావులోని పరదర్లు, పాలై తావు వేడర్లు ఇట్లా దాదాపు అన్ని కులాల మూలాలూ తెలుగే. అంటే తమిళ సంగసాహిత్యనికంటే ముందే తెలుగులో ఈ సాహిత్యం ఉండి ఉండాలి. 'సంగసాహిత్యానికి ఊపిరి తెలుగే, తెలుగువాళ్లే. నోటి సాహిత్యం గురించి చెప్పుకొంటే, అది కూడా చాలా పెద్ద వ్యాసం అవుతుంది. వీలయినంత కుదించి చెబుతాను. తెలుగువాళ్లకు ఉన్నట్లు పల్నాటి చరిత్ర, కాటమరాజు కతల్లాంటి నోటి కావ్యాలు తమిళులకు లేవు. తమిళులకు కుల పురాణాలు కూడా బాగా తక్కువ. తమిళ కులాలలో వన్నియర్లు, వెళ్లాల గౌండర్లు, దేవర్లు లాంటి కొన్ని కులాలవారికే నమ్ముకొన్న కులాలు (ఆశ్రిత కులాలు) ఉన్నాయి. అయితే వన్నియర్ల కులపురాణం చెప్పే నోక్కంవారు, వెళ్లాల గౌండర్ల కతను చెప్పే ముడవాండివారు, దేవర్ల జాతి బిడ్డలైన పిచ్చకణ్ణువారు తెలుగువారే.
 నోక్కంవారు వన్నియర్లకు చెప్పే కుల పురాణంలో రెండువేల ఏండ్లనాడు కొంగునాడు (కోయం బత్తూరు తావు) ను ఏలిన వీరరాయరెడ్డి, ఎరుమనాడు (మైసూరు) ను ఏలిన మాదిగ ఎల్లమ్మ గురించి ఉంటుంది. జాంబువులు చెప్పే కుల పురాణంలో 'ఆది జాంబువులు చెప్పే కుల పురాణంలో జాంబువుడు అసమకదేశంలో మాజేటి ఒడ్డువాడని' ఉంటుంది. ఉత్తర తెలంగాణా తావుకు అసమకదేశమని బుద్ధుని
 కాలం నుంచి క్రీ.త. 6వ నూరేడు వరకూ పేరు ఉంది. ఆ కాలానికి చెందిన కులపురాణం ఇది. తమిళులలో ఇప్పటికీ నిలిచివున్న నోటిపాటలలో వెయ్యేండ్ల చరిత్ర కలిగినవే అరుదు. అంతకుమించి పాతవి ఇప్పటికీ దొరకలేదు. ఇప్పటి తమిళనాడులోని తెలుగు నోటిపాటలలో రెండువేల సంవత్సరాల తెలుగువారి చరిత్ర వుంది. 'సిరివన్నె, కలికిరాముడు' అనే పాటను దళితులు నాలుగయిదు గంటలపాటు పాడుతారు. ఈ పాటలో అంతా రెండువేల యేండ్లనాటి మాదిగరాజుల గురించే వుంటుంది. ఇప్పటికీ తమిళనాడులోని మాదిగ లందరూ తెలుగే మాట్లాడుతున్నారు. మాదిగల్లో తమిళులే ఉండరు. 'సిరివన్నె'.... పాటలో సత్యపుత్ర రాజుల గురించి వస్తుంది. ఈ పాటను తోడు తీసుకొని చూస్తే సత్యపుత్రులు మాదిగలు. వాళ్ల తలనగరం తగడూరు. ఆ తగడూరే ఇప్పటి ధర్మపురి తమిళనాడు ఈ వ్యాసంలోనే చెక్కడాల గురించి చెప్పేటప్పుడు 'జాంబై' లో దొరికిన సత్యపుత్రులు మాదిగలే అని చెప్పడానికి ఆదిజాంబవుని పేరుతో ఏర్పరచుకొన్న 'జాంబై' అనే ఊరే పెద్ద రుజువు.
 ఇప్పటికీ తమిళనాడులోని దాదాపు డెబ్బై నమ్ముకొన్న కులాలు తెలుగువారివే. వీరందరి గురించీ పరిశోధన చేస్తే తెలుగుజాతి, తెలుగునుడి పాతదనాన్ని ఇంకా తేటంగా వెలికితీయవచ్చు.
                                                                                                                               -స.వెం. రమేష్

4 comments:

  1. ఓబుల్ రెడ్డి గారూ! చాలా మంచి వ్యాసాన్ని ప్రచురించారు. సామల వెంకట రమేశ్ గారి వ్యాసాలు మరి కొన్ని ప్రచురించండి, కొన్ని నెను తెలుగు పీపుల్ . కాం లో చదివాను. కానీ ఆ లంకెలు నాదగ్గర లేవు. రమేశ్ గారు ఒకవేళ బ్లాగును నిర్వహిస్తున్నట్లైతే ఆ వివరాలు కూడా తెలుపగలరు. తెలుగు భాషోద్యమ సమాఖ్య లో సభ్యత్వం తీసుకోవాలంటే ఎలాగో కూడా తెలపండి. బ్లాగులు వ్రాసేవారు చాలా మందికి సమాఖ్య గురించి తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది.

    ReplyDelete
  2. విరజాజి గారూ! మీ స్పందనకు ధన్యవాదాలు.
    స.వెం.రమేష్ గారి వ్యాసాల గురించి అడిగారు.
    మీరు అడిగిన వివరాల గురించి రమేష్ గారితో మాట్లాడాను.
    వారు బ్లాగు నిర్వహించడం లేదట!
    వారి వ్యాసాల పుస్తకం " పొరుగు తెలుగు " " నడుస్తున్న చరిత్ర " పత్రికా కార్యాలయం లో లభిస్తుందని తెలిపారు. నడుస్తున్న చరిత్ర పత్రికా సంపాదకులు డాక్టర్ సామల రమేష్ బాబు గారి మొబైల్ నంబర్ ఇస్తున్నాను.
    తెలుగు భాషోద్యమ సమాఖ్య కు కూడా అధ్యక్షులు సామల వారే!
    సామల రమేష్ బాబు గారూ, స.వెం. రమేష్ గారూ వేరు వేరని గమనించగలరు.
    స.వెం.రమేష్ గారు తమిళనాడు ప్రాంతంలో ఉంటూ తెలుగు వారి భాషా,సాంస్కృతిక అంశాలను వ్యాసాల ద్వారా, కార్యక్రమాల ద్వారా వెలుగులోకి తెస్తూ వుంటారు!
    సామల రమేష్ బాబు : 9848016136
    e-mail: ncharitra@gmail.com

    ReplyDelete
  3. హైదరాబాదు అందరిదీ, ఎవరి అబ్బ సొమ్మూ కాదు
    see this
    http://kazachaitanya.blogspot.com/2011/02/blog-post_6125.html

    ReplyDelete
  4. దండాలు ఓబుల్ గారూ..

    మీ బ్లాగులో చక్కని వ్యాసాలు వస్తున్నాయి. మీ బ్లాగు పేరులో 'హృదయాల చప్పుడు ' అనే కంటే 'గుండెల చప్పుడు ' అంటే బాగుంటుందేమో, ఒక్క సారి తలంచండి. నా తెలుగు మరుగున పడిపోతున్నదే అని దిగులుపడే వారు ఇందరున్నందుకు ఎలమి(సంతోషంగా)గా ఉంది. నేను ఒంటరిని కాదన్నమాట. తెలుగు పేరు చెప్పి ఆ ముసుగులో మళ్ళీ సంస్కృతపు గాలివాన కురవదని అనుకుంటున్నాను.

    ReplyDelete