Tuesday, March 13, 2012

తెలుగుకు మంత్రిత్వ శాఖ కావాలి-తెలుగు భాషోద్యమ సమాఖ్య

తెలుగు పతాకం
హైదరాబాద్, మార్చి 11: తెలుగు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తెలుగు భాషోద్యమ సమాఖ్య కోరింది. సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సామల రమేశ్ బాబు, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి తొమ్మిది డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఆంగ్లం మాధ్యమంగా ఉన్న పాఠశాలల్లో తెలుగులో మాట్లాడిన పిల్లలను శిక్షించడం అంతులేని దురాచారంగా మారడాన్ని వారు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సంఘటనను వారు గుర్తుచేస్తూ, ఇలాంటి సంఘటలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రాచీన తెలుగు భాషా పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడానికి కేంద్రం నిధులను విడుదల చేసినా దానికోసం ప్రభుత్వం ఒక భవనాన్ని చూపించకపోవడాన్ని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మనతోపాటే అనుమతి పొందిన ‘కన్నడ పరిశోధనా కేంద్రం’ మూడు నెలల క్రితమే ప్రారంభమైందని, కానీ మనం ఇప్పటికీ కేంద్రాన్ని ప్రారంభించకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన 60లక్షల సొమ్ము మురిగిపోయిందని పేర్కొన్నారు. వెంటనే తెలుగు భాషా పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించకపోతే, రానున్న ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన కోట్లాది సొమ్ము వట్టిపోతుందని తెలిపారు.
ప్రభుత్వంలో తెలుగు గురించి పట్టించుకునే పాలనా విభాగం లేనందువల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని సమాఖ్య ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. పోటీ పరీక్షలతోసహా అన్ని రకాలుగా తెలుగు అవమానాల పాలవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దయిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, ఇతర అకాడమీలను తిరిగి ప్రారంభించాలని కోరారు. రెండేళ్లుగా మూసివుంచిన అధికార భాషా సంఘాన్ని వెంటనే తెరిపించాలని అన్నారు. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా అన్ని రాజకీయ పక్షాలు ‘తెలుగు భాషోద్యమ సమాఖ్య’ డిమాండ్లను సమర్ధించడాన్ని కూడా వారు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఆ సందర్భంగా ఊరేగింపులు, ధర్నాలు జరిగిన విషయాన్ని గమనించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి తెలుగు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, సమాఖ్య ప్రతినిధుల సూచనలను, డిమాండ్లను సావకాశంగా విన్న ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment