Showing posts with label andhrabhoomi. Show all posts
Showing posts with label andhrabhoomi. Show all posts

Saturday, March 19, 2011

తెలుగు అంకెల్ని సమాధి చేస్తారా?

5వ తరగతి గణితం (కొత్తది)  
5వ తరగతి గణితం (పాతది) 
తెలుగు అంకెలు
దవ తరగతి విద్యార్థులకు  గత విద్యా సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన గణిత పాఠ్యప్రణాళికలో తెలుగు అంకెలకు సంబంధించిన పాఠ్యాంశాన్ని పూర్తిగా తొలగించడంతో భావితరాల వారికి తెలుగు అంకెలు ఎలా ఉంటాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఐదవ తరగతి విద్యార్థులకు 1994-95 విద్యా సంవత్సరం నుండి 2008-09 విద్యా సంవత్సరం వరకు గణితశాస్త్రంలో తెలుగు అంకెల పరిచయం ఒక అధ్యాయంగా ఉండేది. 2009-10 విద్యా సంవత్సరం నుండి ఐదవ తరగతికి కొత్త పాఠ్య ప్రణాళికను అమలులోకి తెచ్చారు. పాత పాఠ్య ప్రణాళికలో ఉండిన తెలుగు అంకెల విభాగాన్ని పూర్తిగా తొలగించారు. ఈ క్రతువులో తెలుగు అంకెల బలి కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేశారు. పాత పాఠ్యపుస్తకాల స్థానంలో కొత్త పాఠ్య పుస్తకాలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం 2009-10 విద్యా సంవత్సరంలో తనదైన క్రతువును ప్రారంభించింది. 2009-10 విద్యాసంవత్సరంలో 1వ తరగతితో పాటు, 3,5 తరగతుల పాఠ్య పుస్తకాలను సమూలంగా మార్పు చేశారు. ఆ తర్వాతి విద్యా సంవత్సరమైన 2010-11లో 2,4,6వ తరగతుల పాఠ్య పుస్తకాలను మార్పు చేశారు. ఆరవతరగతిలోని సంఖ్యామానం అనే అధ్యాయంలో తెలుగు అంకెలను కనీసం పరిచయ అంశంగానైనా పొందుపరచలేదు. తెలుగు భాషపట్ల, తెలుగు సంస్కృతిపట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఈ అనాలోచిత చర్య పరాకాష్టగా చెప్పవచ్చు. పాత పాఠ్య పుస్తకంలో తెలుగు అంకెల పరిచయం ఇలా ఉంది. ‘‘తెలుగు భాషకు చెందిన ప్రాచీన గ్రంథాలు తెలుగులోనున్న జ్యోతిష్య శాస్త్ర పత్రికలు మొదలగు వాటిలో మనకు తెలుగు సంఙ్ఞ విధానంలో గూడా 10 అంకెలు వాడబడినాయి. స్థాన విలువ పద్ధతి కూడా ఉంది. హిందూ, అరబిక్ విధానంలోని స్థానాల్లో తెలుగు సంఙ్ఞ విధానంలో కూడా ఉన్నాయి. కనుక ఆ సంఙ్ఞ విధానంలోని సదుపాయాలు, లాభాలు దీనిలో (తెలుగు సంఙ్ఞ విధానంలో) కూడా ఉన్నాయి’’ అని పాఠ్య గ్రంథ రచయితలు తెలుగు అంకెల ప్రాధాన్యతను స్పష్టంగా పేర్కొన్నారు.
పాత పాఠ్య గ్రంథంలోని మొదటి అధ్యాయం పేరు సంఖ్యామానం-సంఙ్ఞమానం. ఇందులో తెలుగు అంకెల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు 4వ అభ్యాసాన్ని పొందుపరిచారు. ఈ అభ్యాసంలో రెండు సమస్యల్ని కూడా ఇచ్చారు. అయితే తెలుగు అంకెలపై పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఇవ్వరాదని ఒక హెచ్చరికను జారీ చేయడం గమనార్హం.
తెలుగు అంకెలపై ఆంధ్రభూమిలో 19-03-11 తేదీన ప్రచురితమైన వ్యాసం.
తెలుగు అంకెలపై పరీక్షల్లో ప్రశ్నలను ఇవ్వకపోవడం బాధాకరం. కాగా రోమన్ అంకెల బోధనకు మాత్రం పెద్దపీట వేశారు. రోమన్ అంకెల్ని ఆజన్మాంతం మరచిపోకుండా ఉండేందుకు ప్రాజెక్టు పనుల్ని పకడ్బందీగానే పొందుపరిచారు. పాత పాఠ్యాంశం పరిస్థితి అలా ఉంటే కొత్త పాఠ్యాంశంలో తెలుగు అంకెల్ని ఏకంగా సమాధి చేసి రోమన్ అంకెలకు మరొక పేజీని అదనంగా కేటాయించి ఇటాలియన్ సంస్కృతిపట్ల విధేయతను ప్రకటించుకున్నారు. ఈ నిర్వాకాన్ని పునరుద్ఘాటిస్తున్నట్లుగా ‘‘రాష్ట్ర ప్రమాణాలకు అనుగుణంగా గణిత పాఠ్య ప్రణాళికను సమీక్షించి’’ అంటూ కొత్త పాఠ్యపుస్తకానికి రాసిన ముందు మాటలో సంకల్పం చెప్పుకున్నారు. పాత పాఠ్య ప్రణాళికలోని తెలుగు అంకెల పాఠ్యాంశాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం మాత్రం చేయలేదు. తెలుగు అంకెల్ని గణిత పాఠ్య ప్రణాళిక నుండి తొలగించిన విషయమై 15 రోజుల కిందట  ‘‘రాష్ట్ర విద్యా పరిశోధక శిక్షణామండలి’’లో గణిత విభాగం అధిపతి శ్రీ బ్రహ్మయ్య గారిని  సంప్రదిస్తే తాను ఇటీవల బాధ్యతలు చేపట్టానని, గతంలో ఈ నిర్ణయం జరిగి ఉండవచ్చునని వివరించారు. తెలుగు అంకెలు వినియోగంలో లేనందువల్ల ఆ పాఠ్యాంశాన్ని తొలగించి, ఉండొచ్చునని, ఏది ఏమయినా ఈ అంశాన్ని తమ మండలిలో పునఃసమీక్షిస్తామని తెలిపారు. ఎన్.టి. రామారావు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగు భాషాభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యతను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. తెలుగును అధికార భాషగా అమలు చేసేందుకు ఎన్.టి.ఆర్. పట్టుదల వహించారు. తెలుగు అంకెల పరిరక్షణకు ప్రత్యేక ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఆర్టీసీ బస్సులతోపాటు ఇతర వాహనాల నెంబరు ప్లేట్లపై తెలుగు అంకెలతో వాహనాల నెంబర్లను రాయించారు. వావిలాల గోపాలకృష్ణయ్య, నండూరి రామకృష్ణమాచార్య, డాక్టర్ సి. నారాయణ రెడ్డి, ఎ.బి.కె. ప్రసాద్ వంటి వారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా తెలుగు వికాసానికి ఎంతోకొంత పాటు పడ్డారు. ప్రస్తుతానికొస్తే 2009 మే నెల ఐదవ తేదీతో అధికార భాషా సంఘానికి గడువు తీరిపోయింది. ఇంతవరకు మళ్లీ నియామకం జరుగలేదు. తెలుగు భాషా సంస్కృతులకు ప్రపంచీకరణ ముప్పు దాపురించిందని మనం గగ్గోలు పెడుతున్నాం. ఆంగ్ల భాష ఆధిపత్యం కారణంగా తెలుగు భాష కనుమరుగైపోతోందని ఆవేదన చెందుతూ ఉద్యమబాట పడుతున్నాం. మన తెలుగు భాషను పరిరక్షించుకొనేందుకు ప్రపంచీకరణ, ఇంగ్లీషు ఆధిపత్యం లాంటి బయటి శక్తులతో అనేక రీతుల్లో పోరాటం చేస్తున్నాం. అయితే మన రాష్ట్ర ప్రభుత్వ తీరు ‘‘ఇంట్లోవాడే పెట్టే కంట్లో పుల్ల’’ అన్నట్లుగా మారిపోయింది. ప్రపంచానికి సున్నాను అందించింది, ఎంతో విశిష్టమయినది మన భారతీయ సంస్కృతి అని, ఈనాడు ప్రపంచంలో వాడకులో ఉన్న అంకెలు హిందూ అరబిక్ అంకెలని మనకు తెలుసు. భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తికి అనుగుణంగా భిన్న సంస్కృతులకు ఆలవాలమైన మనదేశంలో అనేక వేషభాషలు, కులమతాలు, ఆచారవ్యవహారాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, తమిళం, మరాఠి, గుజరాతి, తదితర భాషల్లో ఒక్కో భాషకు ప్రత్యేకమైన నుడికారాలు, సంఙ్ఞలూ (అంకెలూ) ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆ భాషా సంస్కృతులను ఆయా భాషల్లోని ప్రత్యేకతలను వారు కాపాడుకుంటూ వస్తున్నారు. మన రాష్ట్రంలో తెలుగు భాష కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వశాఖ లేకపోవడంవల్ల ఇలాంటి సందర్భాల్లో ఎవరికితోచినట్లు వారు నిర్ణయాలు చేస్తున్నారు. తెలుగు విషయంలో ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేనందున ఈ పరిస్థితి నెలకొంది. తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, అధికార భాషా సంఘానికి విశేషాధికారాలను కల్పించి, తెలుగును రాష్ట్రంలో అన్ని స్థాయిల్లోనూ అధికార భాషగా పూర్తిగా అమలు చేయాలని, ఉద్యమకారులు ఎంతకోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉంటే పాఠ్య గ్రంథాల విషయంలోగాని, మరేదైనా విషయంలో గానీ తెలుగుకు అన్యాయం జరుక్కుండా జోక్యం చేసుకునేందుకు వీలుండేది. ఇప్పుడు తెలుగు కోసం ఏం కావాలన్నా ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఉంది. అధికార భాషా సంఘాన్ని వెంటనే నియమించడం, తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పర్చడం ఇవి తక్షణావసరాలు.
-తవ్వా ఓబుల్ రెడ్డి
అంధ్రభూమి దినపత్రిక, 19-03-2011