Tuesday, June 19, 2012

బుద్ధుని పాదముద్రికలు స్వాధీనం : మ్యూజియానికి తరలింపు

కడప జిల్లా ఖాజీపేట మండలపరిధిలోని పుల్లూరు చెరువులో, గ్రామ పరిసరాల్లో బుద్ధుడి పాదముద్రికలతో కూడిన శిలావిగ్రహాలు బయటపడ్డాయి. తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ గౌరవాధ్యక్షుడు తవ్వా ఓబుల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ధర్మిశెట్టి రమణ శనివారం ఈ శిలావిగ్రహాలను పరిశీలించి విలేకర్లకు వెల్లడించారు. క్రీస్తు పూర్వం 5, 6 శతాబ్దాలలో జీవించిన బుద్ధ భగవానునికి సంబంధించిన అవశేషాలు, కీస్తుశకం 16వ శతాబ్దానికి చెందిన హాస్యకవి చౌడప్ప ఉనికికి సంబంధించిన ఆధారాలు, అనేక వీరగల్లులు,  శ్రీకృష్ణదేవదేవరాయలు, వేణుగోపాలస్వామి  శిల్పాలు పుల్లూరు, ఆంజనేయకొట్టాల ప్రాంతాల్లో కనుగొన్నామని తవ్వాఓబుల్‌రెడ్డి తెలిపారు. సిద్దవటాన్ని రాజధానిగా చేసుకుని క్రీ.శ. 16, 17 శతాబ్ధాలలో పాలన సాగించిన మట్లి అనంత భూపాలుని కొలువులో హాస్యకవిగా వెలుగొందిన కవి చౌడప్ప పుల్లూరి వాసి అని చెప్పడానికి తగు ఆధారాలు లభించాయని ఓబుల్‌రెడ్డి వెల్లడించారు. తాను వేణుగోపాలస్వామి భక్తుడిగా కవిచౌడప్ప  తన పద్యాలలో చెప్పుకొన్నారు. ఆంజనేయులుకొట్టాలు గ్రామానికి దక్షిణంగా వేణుగోపాలస్వామి గుడి ఉన్నట్లు ,కాలక్రమంలో దారు మండపం క్షయమై పోవడంతో స్వామి శిల అక్కడే ఉన్న ఒక బావిలో పడవేశారని గ్రామస్తులు చెప్పారు. గ్రామలోని వేణుగొపాలస్వామి గుడికి ప్రతీకగా గ్రామ సమీపంలోని చెరువులోని తూము రాతి దిమ్మెపై కూడా వేణుగోపాలస్వామి శిల్పాన్ని చెక్కారని తవ్వా ఓబుల్ రెడ్డి తెలిపారు.





బుద్ధుని పాదముద్రికలు స్వాధీనం : పురావస్తు మ్యూజియానికి తరలింపు 

పుల్లూరు, ఆంజనేయకొట్టాలు గ్రామ పరిధిలోని చెరువు వద్ద వెలుగు చూసిన బుద్ధుని పాదముద్రికలను సోమవారం (18.06.2012) పురావస్తుశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడపలోని శ్రీభగవాన్‌ మహావీర్‌ ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాలకు తరలించారు. పురావస్తుశాఖ కడప, చిత్తూరు జిల్లాల అసిస్టెంటు డైరెక్టర్‌ రమణ ఆంజనేయకొట్టాలు గ్రామానికి తన సిబ్బందితో తరలివచ్చి గ్రామ పరిసరాల్లోని బుద్ధుని పాదముద్రికలను, వేణుగోపాల్‌స్వామి, శ్రీకృష్ణ దేవరాయులు, మరో ఆరు వీరగల్లులను పరిశీలించారు. గ్రామ సమీపంలోని వెంకటరామాపురం వద్ద ఉన్న బుద్ధుని మరో పాదముద్రికల శిలాఫలకాన్ని కూడా పరిశీలించారు. దీంతోపాటు వేణుగోపాల స్వామి శిల్పాన్ని కూడా మ్యూజియంకు తరలించారు. ఈ సందర్భంగా ఏడీ రమణ మాట్లాడుతూ ఇక్కడ వెలుగు చూపిన బుద్ధుడి పాదముద్రికలు ఎంతో చారిత్రక, పరిశోధన ప్రాధాన్యం కలిగిన, అరుదైనవని పేర్కొన్నారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య, రాయలసీమ ప్రాంత కార్యదర్శి,కథా రచయిత తవ్వా ఓబుల్‌రెడ్డి, తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్థి ప్రతినిధి   ధర్మశెట్టి రమణ, పురావస్తుశాఖకు సమాచారం అందించడంతో విలువైన పూర్వపు శిలాశాసనాలను ప్రభుత్వ మ్యూజియంకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పురాతన శిలలు, శాసనాలను గుర్తిస్తే ప్రజలు తమ దృష్టికి తేవాలని కోరారు. వీటన్నింటి చూస్తుంటే పుల్లూరికి ఎంతో చరిత్ర ఉన్నట్లుందన్నారు. పురావస్తు సిబ్బంది గంగాధర్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.