Wednesday, March 7, 2012

ఢిల్లీ దర్బార్‌లో వెలిగిన ముంగండ పండితుడు

క్రీ.శ. 17వ శతాబ్దం ప్రథమార్ధంలో దక్షిణాపథం నుండి ప్రౌఢ వాఙ్మయ సంస్కృతంలో అనేక ప్రబంధాలను రచించుటయే గాక పూర్వ మీమాంస తర్కవితర్క వైయాకరణ వేదాంత వైశేషిక వివేషణాన్యాయ శాస్త్రాలంకారీకులుగా ప్రసిద్ది వహించిన వారిలో ఒకరు మహాద్వైత సిద్ధాంతకర్తలైన అప్పయ్య దీక్షితులు కాగా మరొకరు మహా పండిత జగన్నాథ పండితరాయలు ముఖ్యులు.

గీర్వాణాలంకారశాస్త్ర కావ్య లక్షణములను, మౌలిక తత్వ పరిష్కృత నిర్వచనములను అప్రతిహతంగా నిర్వచించి సాహి తీ లోకానికి అందించిన వారు కవిరాజు జగన్నాథ పండిత రాయలు.

పుణ్య గౌతమీ నది తీరాన గల 'ముంగండ' (మునిఖండ) అగ్రహారం నుందు మహా మహోపాధ్యాయ శ్రీఉపద్రష్ట పేరు భట్టు మహలక్ష్మీ దంపతులకు కలిగిన యిద్దరిలో మొదటి సంతానముగా జగన్నాథుడు, రెండవ కుమారునిగా రామచంద్రయ్య జన్మించారు. పసి ప్రాయము నుండి తండ్రి వద్దనే విద్యను అభ్యసించారు. ప్రాథమిక విద్యతో పాటు ఉపనయనం చేశారు. అప్పటి వైదికాచారాల కనుగుణంగా అయిన సంబంధమైన కామేశ్వరి నిచ్చి పదునారు ప్రాయముననే వివాహం గావించారు.

జగన్నాథుడు యుక్త వయసు వచ్చే నాటికే ఋగ్వేదాది చతుర్వేదాలు ఇతిహాస పురాణాలు ఉపనిషత్తు లన్నింటిని పుక్కిట పట్టిన ప్రతిభాశాలి. అంతేకాక కావ్యాలంకార లక్షణాలను నాట్యశాస్త్ర సూత్రాల మెళుకువలను అధ్యయనం చేసినట్లు, తన తండ్రి వద్దనే నేర్చినట్లు- 'రసరంగాధర' గ్రంథ శ్లోకంలో-

'పాషాణాదపి పీయూషం, స్యంద తేయస్యలీలయా తంవందే పేరు భట్టాఖ్యం, లక్ష్మీకాంతం మహాగురుమ్!' (ర.ప్ర- 3వ శ్లోకం)

చెప్పుకొన్నాడు. పాషాణం నుండి అమృతం పిండే ప్రజ్ఞ గల లక్ష్మీకాంతం నాధుడైన పేరుభట్టు మహాగురువు సహచర్యంలో గడిపినానన్నాడు. 'తైలింగాన్వయ మంగళాలయ మహాలక్ష్మీ దయా లాలితః

శ్రీమత్పేర భట్టు సూనురనిశం విద్యుల్లలాటం తపః!' శుభకరమైన త్రిలింగదేశం (తెలుగు నేల) నాది. ప్రేమతో పెంచిన తల్లి మహాలక్ష్మీ, నా తండ్రి పేరమభట్టుల తఫః ఫలంగా నా పాండిత్యంతో విద్యుత్కవులకే వేడి పుట్టిస్తానని- సవాల్ విసిరాడు.

భరతఖండంలో ప్రసిద్ధ పట్టణాలైన వారణాసీ, తక్షశిల, ఉజ్జయినీలు గొప్ప సంస్కృత విద్యాలయాలుగా నాడు పేరు గాంచినాయి. ఉన్నత విద్య కొరకై జగన్నాథుడిని తండ్రి పేరుభట్టుల వారు సకుటుంబంతో సహా ముంగండ నుండి కాశీకి మకాంను మార్చాడు. పేరు భట్టుల చిన్ననాటి సహచర విద్యార్థియైన శ్రీశేష వీరేశ్వర పండితుని వద్ద శిష్యరికంలో పెట్టాడు. జగన్నాథుడు కాశీలో మహా పండితుల వద్ద వేదాంత, జైమినీయం, న్యాయ వైశేషికం, వ్యాకరణ షట్ శాస్త్రాలను, వాగ్విన్యాస శాస్త్రార్థ కావ్యాలంకారాదులను అభ్యసించాడు.

'భామినీ విలాస' కావ్య రచన రాజకీయ సాంఘిక వ్యవహారాల గురించి వివిధ ప్రక్రియల వర్ణనలతో కూడిన 'ముక్తక' కావ్యం. ఈ కావ్యంలో నాలుగు ప్రకరణాలు ఉల్లాసములు (విలాసములు)గా సుదీర్ఘ రచన సాగింది. ఇందు మొత్తం 365 శ్లోకాలతో నిండినదై వున్నది. ముఖ్యముగా శృంగార, కరుణ విలాసములలో ఏ భామినీతో ప్రత్యక్ష సంబంధం వున్నదో తెలియదు. కానీ, ఆ భామిని కామేశ్వరి అని కొందరు. మరికొందరు లవంగి కావచ్చుననే ఊహాగానాలు లేకపోలేదు.

వారణాసీలో కాశీ సంస్కృత విశ్వవిద్యాలయ పండిత పీఠమందు అప్పయ్య దీక్షితులవారి 'చిత్రమీమాంస' అలంకారశాస్త్ర గ్రంథంలోని ప్రథమార్ధంలో శబ్ద, గుణ, ధ్వనియూ, ద్వితీయార్ధంలో తద్భేద, ఉపమాలంకారాదులందు కావ్య స్వరూపములే విరుద్ధములని కావ్య లక్షణాలకు అవి వ్యతిరేకములు కావున కావ్యాలంకృతమైన కృత శబ్దమునకు రమణీయార్ధత లేకపోవుటయే ఇందుకు కారణమంటూ!

'రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్యమ్!' అని సూత్రప్రాయంగా గ్రంథంలోని లోపాల్ని ఎత్తి చూపుతూ కావ్య లక్షణాలను విశదీకరించాడు. 'చిత్ర మీమాంస' గ్రంథంలోని దోషములను ఖండిస్తూ 'చిత్రమీమాంస ఖండనం' అనే ప్రామాణికమైన అలంకార శాస్త్ర గ్రంథాన్నీ, కాశీ సంస్కృత విద్యాలయ ప్రధానాచార్యుడైన భట్టోజీ దీక్షితుల వారి 'ప్రౌఢ మనోరమా' వ్యాకరణ శాస్త్ర గ్రంథాన్ని నిశితంగా విమర్శిస్తూ- మంచి పట్టుపట్టి రాసిన మనోరమా గ్రంథంలో శబ్దాలు లేని అలంకారాలు బరువు లేని తూకం వంటిదని, కావ్య వ్రక్రోక్తి వైవిధ్యంలో తూనిక రాల్లు లేని త్రాసు వంటిదని చమత్కరించాడు. గ్రంథ తప్పులను ఎత్తి చూపుతూ 'మనోరమా కుచమర్ధనం' వ్యాకరణ శాస్త్రాలంకార సిద్ధాంత విమర్శనా గ్రంథాన్ని పండితలోకానికి అందించిన మహాపండితుడు శ్రీజగన్నాథ పండితరాయలు.

జగన్నాధ పండితరాయల రచనలలో ముఖ్యముగా 'రసగంగాధరం' నిత్యనూతనమైన అలంకారశాస్త్ర గ్రంథంగా చెప్పుకోతగ్గది. రసప్లావ ఉపమాలంకృత ముక్తము యీ రసగంగాధరము. ఈ గ్రంథములో నాయకమణి ఒక విరోభూషణంగా విరాజిల్లుతోంది. ఢిల్లీ పాలకులైన మొగల్ చక్రవర్తి శెహబుద్దీన్ షెహన్‌షా శ్రీషాజహాన్ పాదుషా వారి పాలనా కాలం క్రీ.శ. 1628-1658 వరకు నడిచింది.

ఢిల్లీ దర్బారులో మహాపండితులు విద్వాంసులు సామంతరాజుల సమక్షంలో అనితర సాధ్యమైన వివిధ ప్రక్రియల శాస్త్రాపాండిత్యంలో అష్టప్రధాన పండితులలో తన ప్రతిభను చాటి పాదుషా వారి మెప్పు పొందుటయే గాక అర్ధ సింహాసనంపై ఆహ్వానింపబడి భారతదేశ ప్రతిష్ఠాత్మకమైన 'పండితరాజు' బిరుదముతో ఘనంగా సత్కారం పొందాడు. షాజహాన్ చక్రవర్తి కుమారుడైన దారాషికోహ్ యువరాజును తన ప్రియశిష్యునిగా పరిగణించాడు.

పాదుషా వారి కొలువులో తన గాన మాధుర్యంచే సంగీతాన్ని వినిపించి సభికులను ఉర్రూతలూగించిన గాయక శిఖామణిగా పాదుషావారి చేతుల మీదుగా 'సంగీత కళాసుధానిధి' 'సంగీత గానసుధ' 'గాన సముద్ర' బిరుదములతో సత్కారమొందాడు. ఢిల్లీపుర వీధుల్లో ఏనుగు అంబారిపై గజారోహణ ఊరేగింపులతో సత్కార సన్మానములు పొందాడు. ప్రసిద్ధ ఫ్రెంచి వైద్యుడు ప్రాంచెస్ బర్నియర్ తన 'ది ట్రావెల్స్ ఇన్ ది మొగల్ ఎంపైర్ బై బర్నియర్' అనే యాత్రా గ్రంథంలో జగన్నాథ పండితరాయల వారి గురించి వ్రాయబడినది.

జగన్నాథ పండితుల వారి పంచ లహరుల రచనా మాధురి మధురిమలు విలసిల్లుతూ, కమనీయ కవితా రీతులతో విరాజిల్లుతూన్న- అవి 1) అమృత లహరి 11 శ్లోకాలయమునాస్తుతి. 2) కరుణా లహరి 65 శ్లోకాలతో గల విష్ణుస్తుతి. 3) లక్ష్మీలహరి 41 శ్లోకాలు గల బీజాక్షర సహిత లక్ష్మీస్తుతి. 4) సుధాలహరి 30 శ్లోకాలతో కూడిన సూర్య దేవుని స్తుతి. 5) గంగాలహరి 53 శ్లోకాలున్న గంగాస్తుతి. ఇదే పీయూష లహరి అనే నామాంతరం గల ప్రసిద్ధ లఘు కావ్యం.

'ఇమాం పీయూష లహరీం జగన్నాథేన నిర్మితాం యః పఠేత్తస్త సర్వత్ర జాయంతే సర్వ సంపద!' ఇందు మొదటి శ్లోకమిది. జగన్నాథ పండితరాయలు 15 అలంకార శాస్త్ర వ్యాకరణ సిద్ధాంత గ్రంథాలు మరో మూడు సంస్కృత నాటకాలు రచించినట్లు తెలుస్తూంది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'మహాకవి కాళిదాస్ సమ్మాన్' పేర ప్రతి ఏటా పండితులను సన్మానిస్తోంది. మహాపండితుడు, అలంకార శాస్త్ర వ్యాకరణ లాక్షిణుకుడు, అలంకారీకుడు అయిన జగన్నాథుడు షాజహాన్ చక్రవర్తి చేతుల మీదుగా భారతదేశ ప్రతిష్ఠాత్మకమైన 'పండితరాజ' బిరుదంను పొందినందుకు, తెలుగు బిడ్డడై పుట్టినందుకు మనం గర్వపడాలి. ఆ మహాపండితుని పేర పురస్కారం లేకపోవటం రాష్ట్ర ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ నిద్రాణతకు సిగ్గుపడాలి. మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం. శోచనీయం.

                                                                                                                               -కె.వి.యల్.యన్.శర్మ
                                                                                                                            -"ఆంధ్రజ్యొతి" సౌజన్యంతో  .

No comments:

Post a Comment