Wednesday, December 30, 2009

తెభాస రాయలసీమ ప్రాంతీయ కార్యదర్శి గా తవ్వా ఓబుల్ రెడ్డి

తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంతీయ కార్యదర్శి గా తవ్వా ఓబుల్ రెడ్డి నియమితులయ్యారు.27న గుంటూరులో నిర్వహించిన తెలుగు భాషోద్యమ సమాఖ్య కేంద్ర కార్యవర్గ సమావేశంలో సమాఖ్య అధ్యక్షఁలు డా. సామల రమేష్‌బాబు ఆయనను నియమించారు. ఈ సందర్భంగా తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో తెలుగుభాషాభిమానుల సహకారంతో తెలుగుభాషా పరిరక్షణకూ, వికాసాఁకి కృషి చేస్తానని తెలిపారు. రాయలసీమలోని జిల్లా, మండల స్థాయిల్లో తెలుగు బాషోద్యమ సమాఖ్య శాఖలను విస్తరించేందుకు భాషాభిమానులు, రచయితలు, కవులు ముందు కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయమై సమాచారం కోసం 9440024471 నెంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. మైదుకూరులోని సెయింట్‌జోసెఫ్‌ ఆంగ్లమాధ్యమ పాఠశాలలో తెలుగుభాషకు అవమానం జరిగిన సంఘటనపై ప్రజలు, భాషాభిమానులు, పెద్ద ఎత్తున ఉద్యమించారన్నారు. దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలు ఇంతవరకు తీసుకోలేదని అన్నారు.
ఓబుల్ రెడ్డి నియామకంపై పలువురి హర్షం
తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంతీయ కార్యదర్శిగా తవ్వా ఓబుల్ రెడ్డిని నియమించడం పట్ల తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ ప్రతినిధులు ఎస్‌ సాదక్‌, ఎ.వీరాస్వామి, ముండ్లపాటి వెంకట సుబ్బయ్య, ధర్మిశెట్టి వెంకట రమణయ్య, పి.కృష్ణయాదవ్‌, పి.బాబయ్య భారతీయ సాహిత్య పరిషత్ వ్యవస్థాపకులు, ప్రముఖ సాహితీకారులు టక్కోలు మాచిరెడ్డి, ప్రముఖ కథా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, రచయితలు నూకా రాంప్రసాద్ రెడ్డి, వేంపల్లి రెడ్డి నాగరాజు, టి తిప్పారెడ్డి, ఆన్ లైన్ మీడియా సంపాదకులు ఎం. విజయ భాస్కర రెడ్డి, తవ్వా విజయ భాస్కర రెడ్డి, జె. కోటేశ్వర రెడ్డి, అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా నాయకులు పి. భాస్కర్, అబ్దుల్లా, తెలుగు పండితులు మూలే సాంబశివా రెడ్డి, ప్రముఖ న్యాయవాది బి.ఎన్. శ్రీనివాసులు, యోగా శిక్షకుడు, సంఘసేవకులు నారాయణ రెడ్డి, తెలుగు భాషాభిమానులు విజయ్ , శీర్ల నాగమోహన్, పి. బసయ్య , పిచ్చపాటి వీరా రెడ్డి, కానుగ దానం తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

పక్క చిత్రం: ఈనాడు దినపత్రిక , డిసెంబరు 29, 2009 వార్తాంశం..

Tuesday, December 22, 2009

ఇతర రాష్ట్రాల్లో తెలుగుభాష పై వివక్ష! !

తర రాష్ట్రాల్లో తెలుగుభాష పై వివక్ష దారుణంగా సాగుతోందనడానికి తాజాగా తమిళనాడు లోని కృష్ణగిరి సంఘటన తార్కాణంగా నిలుస్తుంది. తమిళనాడు లో తెలుగు మాతృభాష గా గల జనాభా 42 శాతం ఉన్నట్లు అక్కడి తెలుగు భాషోద్యమ సంఘాల అంచనా! తమిళనాడు లోని కృష్ణగిరి , ధర్మపురి జిల్లాలలో దాదాపు 60 శాతం మంది తెలుగు మాతృభాషగా గలవారు కావడం విశేషం! తిరువళ్ళూర్, వేలూర్, కోయంబత్తూరు జిల్లాలలో కూడా అధిక సంఖ్యలో తెలుగువారున్నారు. ఈనేపథ్యంలో తెలుగు భాషను అక్కడ రెండవ అధికార భాషగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలనే తెలుగు వారి డిమాండ్ ముమ్మాటికీ సముచితమైనది.. ఏ రాష్ట్రంలో నైనా అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషను మొదటి అధికార భాషగా గుర్తిస్తారు. ఆ తర్వాత 12 శాతానికి మించి ఇతర భాషను మాట్లాడే వారు ఉంటే ఆ భాషను రెండవ అధికార భాషగా గుర్తిస్తారు!
ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడే వాళ్ళున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 8.5 కోట్ల మంది, తమిళనాడు లో 2.8కోట్ల మంది(42%), కర్నాటకలో 1.8 కోట్ల మంది(33%), మహారాష్త్రలో 1.5 కోట్ల మంది(16%), ఒరిస్సాలో 90 లక్షల మంది(23%), కేరళ, పాండిచ్చేరి, చత్తీస్ ఘడ్ లలో మరో 60 లక్షల మంది, దేశ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో లక్ష మంది తెలుగు వారుండగా, మిగిలినవారు విదేశాల్లో జీవిస్తున్నారు. అంటే తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, మహారాష్త్ర లలో తెలుగు భాషకు రెండవ అధికార భాషగా గుర్తింపు పొందేందుకు అర్హత ఉంది.
ఇతర మైనారిటీ భాషల పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఉదారతను చూపింది. కేవలం 12 శాతానికి పైగా భాషా వ్యవహర్తలుంటే చాలంటూ దేశంలోనే మొట్టమొదటి సారిగా ఉర్దూ భాషను రెండవ అధికార భాష గా గుర్తించడమే ఇందుకు నిదర్శనం. ఆంధ్ర ప్రదెశ్ లో ఉర్దూ భాషను 13 జిల్లాలలో రెండవ అధికార భాషగా గుర్తించడం జరిగింది. హైదరాబాద్, కడప, రంగా రెడ్డి, మెదక్, నిజామాబాద్, కర్నూలు, అనతపురం, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, వరంగల్, మెహబూబ్ నగర్, మరియు ఆదిలాబాదు జిల్లాలలో ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా గుర్తించారు. ఆయా జిల్లాలలోని మొత్తం జనాభాలో 12 శాతానికి పైగా ఉర్దూ భాషను మాట్లాడే వారు ఉండటమే ఇందుకు కారణం!

Monday, December 21, 2009

తెలుగు వారిపై తమిళ దురహంకారుల దాష్టీకం!

తెలుగు భాషను రెండవ అధికార భాష గా గుర్తించాలంటూ తమిళనాడు లోని కృష్ణగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తున్న తెలుగు వారిపై సోమవారం (21 డిసెంబరు 2009) తమిళులు దాష్టీకం చెశారు. ఈ సంఘటన పోలీసుల లాఠీచార్జీ కి దారి తీసింది. వివరాలివి. తమిళనాడు లో తెలుగు మాతృభాష గా గల జనాభా 42 శాతం ఉన్నట్లు తెలుగు భాషోద్యమ సంఘాల అంచనా! తమిళనాడు లోని కృష్ణగిరి , ధర్మపురి జిల్లాలలో దాదాపు 60 శాతం మంది తెలుగు మాతృభాషగా గలవారు కావడం విశేషం! ఈనేపథ్యంలో తెలుగు భాషను అక్కడ రెండవ అధికార భాషగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలనేది తెలుగు వారి డిమాండ్ . గతంలో కూడా తమ ఉనికి కోసం గళమెత్తిన తెలుగు వారిపై కొందరు ఛాందసులైన తమిళులు అకృత్యాలకు పాల్పడ్డారు కూడా! తాజాగా అక్కడి తెలుగు భాషోద్యమ కార్యకర్తలు సోమవారం కృష్ణగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తున్న తెలుగు వారిపై కొందరు తమిళులు దాడి చేశారు. ఐనప్పటికీ తెలుగు వారు శాంతియుతంగానే ధర్నా కొనసాగించడానికి పూనుకున్నారు. తెలుగు భాషను రెండవ అధికార భాషగా గుర్తించాలంటూ దశాబ్దాలపాటుగా తాము చేస్తున్న ఆందోళననను పరిష్కరించని పక్షంలో అధిక సంఖ్యలో తెలుగు వారున్న తమ కృష్ణగిరి జిల్లాను ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమలో కలపాలని వారు ఈ సందర్భంగా నినదించారు . ఈ నినాదాన్ని సహించలేని కొందరు తమిళ దురహంకారులు ఈ దాడికి పాల్పడ్డారు. తమిళులు సత్యాగ్రహ శిబిరం లో అల్లకల్లోలం సృష్టించడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ సందర్భంగా కొందరు గాయపడ్డారు. ఏ రాష్ట్రంలో నైనా అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషను మొదటి అదికార భాషగా గుర్తిస్తారు. ఆ తర్వాత 12 నుంచి 15 శాతానికి మించి (ఆయా రాష్ట్ర విధానాలకు అనుగుణంగా )ఇతర భాషను మాట్లాడే వారు ఉంటే ఆ భాషను రెండవ అధికార భాషగా గుర్తిస్తారు! ఆంధ్ర ప్రదెశ్ లో ఉర్దూ భాషను 13 జిల్లాలలో రెండవ అధికార భాషగా గుర్తించడం జరిగింది. ఆయా జిల్లాలలోని మొత్తం జనాభాలో 12 శాతానికి పైగా ఉర్దూ భాషను మాట్లాడే వారు ఉండటమే ఇందుకు కారణం! తమిళనాడు తో పాటు ఇతర ప్రాంతాలలోని తెలుగు వారి హక్కులను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
చిత్రం : తమిళనాడు రాష్ట్రం , ఎరుపు వర్ణంలో గుర్తించిన ప్రాంతమే కృష్ణగిరి జిల్లా .

Saturday, December 19, 2009

పొట్టి శ్రీ రాములు గారి ఆమరణ దీక్ష -కొన్ని వాస్తవాలు !

మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందే 1946 లో ఎన్నికల సందర్భంగా కాంగ్రేస్ వెలువరించిన ప్రణాళిక తోనే ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరిక అప్పటి తెలుగు నేతల్లో మొలకెత్తింది. భాషా, సంస్కృతుల ఆధారంగా దేశంలోని రాష్ట్రాలన్నింటినీ పునర్వ్యవస్తీకరిచవలసి వుంటుందని కాంగ్రేస్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించడమే ఇందుకు కారణం. దీనికి తోడు 1947 నవంబరు 27 న భాషా ప్రయుక్త రాష్ట్రాల సూత్రాన్ని తమ ప్రభుత్వం అంగీకరించిందని ప్రధాన మంత్రి నెహ్రూ ప్రకటించారు కూడా!
ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల అనంతరం 1952 అచ్టోబరు 19 న పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు చేపట్టిన ఉద్యమానికి, తెలుగు ప్రజల ఉనికి కోసం జరిగిన ఉద్యమంగానే పేరొచ్చిందిగానీ మరొకటి కాదు. 1952 డిసెంబరు 15 న ప్రాణాలను వదిలారు. దీంతో ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక చేసేది ఏమీ లేక నెహ్రూ 1952 డిసెంబరు 19 న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కొంత ప్రక్రియ తర్వాత 1953 అక్టోబరు 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
తెలంగాణా , కోస్తా, రాయలసీమ మూడూ కలిస్తే విశాలాంధ్ర అవుతుంది. చరిత్ర అలాగే చెబుతొంది. విశాలాంధ్ర ఏర్పాటు కోసం కమ్యూనిస్టులు కృషి చేశారు. అయితే విశాలాంధ్ర కోరిక ఫలించలేదు. 1953 లో అంధ్ర రాష్ట్రం మాత్రమే ఏర్పడింది. 1956 నవంబరు 1 న కోస్తా, రాయసీమ, తెలంగాణా (హైదరాబాదు రాష్ట్రం) ప్రాంతాలను కలుపుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దీంతో విశాలాంధ్ర కోరిక కొంతవరకు ఫలించింది.

Thursday, December 10, 2009

తెలుగు భాష, సాహిత్యం, కళలపై మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి! (మొదటి పరీక్ష) జవాబులు

1. వంతపాట గల కళా రూపం పేరు?
జవాబు: బుర్రకథ
2. జుట్టు పోలిగాడు పాత్ర గల కళా రూపం?
జవాబు: తోలుబొమ్మలాట
3. మహా భారతానికి గల మరొక పేరు?
జవాబు: జయకావ్యం
4. శివ కవులలో మొదటి వారు ?
జవాబు: నన్నెచోడుడు
5. తెలుగులో మొదటి రామాయణం పేరు?
జవాబు: రంగనాథ రామాయణం
6. పోతన గురువు గారి పేరు ?
జవాబు: ఇవటూరి సోమశేఖరుడు
7. తెలుగులో తొలి దండకం పేరు?
జవాబు: భొగినీ దండకం
8. తెలుగులో భాగవతాన్ని పోతనతో పాటు ఎవరు ఏ ఏ స్కంథాలు రచించారు?
జవాబు: పోతన భాగవతంలో 1,2,3,4,7,8,9,10 స్కంథాలను రచించగా,
ఐదవ స్కంథాన్ని బొప్పరాజు గంగయ,
ఆరవ స్కంథాన్ని ఏల్చూరి సింగయ,
11,12 వ స్కంథాలను వెలిగందల నారయ లు రచించారు.

9. ప్రబంధాలలో ముఖ్యమైన రసమేది?
జవాబు: శృంగారం
10. శ్రీ కృష్ణ దేవరాయలు నివసించిన మందిరం పేరు?
జవాబు: మలయకూటం