Saturday, December 10, 2011

మాతృభాషా సంస్కృతుల పరిరక్షణకే తెలుగు విశ్వవిద్యాలయం-మారిషస్ లో విసి

పోర్ట్‌లూయిస్(మారిషస్), డిసెంబర్ 9 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి భావ సమైక్యతకూ, మాతృభాషా సంస్కృతుల పరిరక్షణకే తెలుగు విశ్వవిద్యాలయం పాటుపడుతోందని ఉపాధ్యక్షుడు ఆచార్య యాదగిరి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల వల్ల తెలుగువారంతా ఒకే వేదిక మీదకు వచ్చి మాతృభాషా సంస్కృతుల గురించి చర్చించుకోవడం వల్ల సమైక్య చైతన్యాన్ని పొందుతారని ఆయన చెప్పారు. మారిషస్ ప్రపంచ తెలుగు మహాసభల రెండో రోజున ముఖ్యఅతిథిగా యాదగిరి ప్రసంగించారు. మహాభారత, రామయాణాది ఇతిహాసాల వల్ల ధర్మాధర్మ సంఘర్షణ గురించి తెలుసుకోవచ్చని ఆచార్య సి మృణాళిని అన్నారు. ప్రాచీన సాహిత్యపు చివరి రోజుల్లో వచ్చిన తరిగొండ వెంగమాంబ తిరుగుబాటు, సంస్కరణ భావాలను తమ జీవితంలోనూ, రచనల్లోనూ పొందుపరచి, ఆధునికతకు నాంది పలికారని అన్నారు. : ప్రాచీన సాహిత్యంలో పదాలను అధ్యయనం చేయడం వల్ల భాషా సంపద పెంచుకోవచ్చని మృణాళిని అన్నారు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మారిషస్‌లోని తెలుగువారిపై రచించిన కవితను చదివి అలరించారు. ఆచార్య ప్రీతి ఆర్ కుమార్ జాతీయోద్యమ కవి గరిమెళ్ల ఆంగ్లకవిత హార్ట్ ఆఫ్ ఇండియాను గుర్తుచేశారు. న్యూయార్క్ నుండి వచ్చిన డాక్టర్ సముద్రాల బాబూరావు తెలుగు భాషకు తెలుగేతరులు చేసిన సేవ అనే అంశంపై మాట్లాడారు. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం , శిల్పం తదితర కళలను పాఠ్యాంశంగా చేర్చాలని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభోట్ల ఆనంద్ కోరారు. నృత్యకళను ప్రాధమిక స్థాయి నుండే పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని డాక్టర్ పి. అలేఖ్య కోరారు. కర్ణాటక సంగీతానికి తమ దేశంలో ప్రాచుర్యం పెరుగుతోందని మారిషస్ నుండి వచ్చిన గురుమూర్తి పాపయ్య తెలిపారు. ఈ సందర్భంగా మారిషస్‌లో ఆంధ్రమహాసభ ఆవిర్భావానికి, తెలుగుభాషా వికాసానికి కృషి చేసిన సోమన్న సోమయ్యకు మండలి వెంకటకృష్ణారావు స్మారక పురస్కారాన్ని అందజేసి మండలి బుద్ధప్రసాద్ సత్కరించారు.

Friday, December 9, 2011

తెలుగు సాంస్కృతిక వికాసానికి కృషి చేస్తున్నాం - మారిషస్ మంత్రి

పోర్ట్‌లూయా (మారిషస్), డిసెంబర్ 8: ఎన్నో కష్టాలు పడి, మారిషస్‌లో నిలదొక్కుకున్న 150 ఏళ్ల నాటి కూలీల సంతతికి చెందిన తాము తెలుగుభాషా సంస్కృతుల వికాసానికి పాటు పడుతున్నామని మారిషస్ ప్రభుత్వంలో తెలుగు మంత్రి తొలితరం మంత్రి అయిన వీరాస్వామి సింహాద్రి కుమారుడు, ప్రస్తుత పర్యావరణ మంత్రి దేవా వీరాస్వామి అన్నారు. మంత్రి మాట్లాడుతూ మహాసభలను ప్రారంభించాలని మారిషస్ ప్రధాని చంద్రరాంగులామ్‌ను ఆహ్వానించామని చెప్పారు. తాను ఆయన ప్రతినిధిగా పాల్గొంటున్నట్టు తెలిపారు. మారిషస్ సాంస్కృతిక మంత్రి ముకేశ్వర్ చునీ మాట్లాడుతూ మారిషస్ ఒక సూక్ష్మ భారతదేశమని అన్నారు. మారిషస్‌లో తెలుగువారి పరిణామక్రమాన్ని వివరిస్తూ ప్రదర్శించిన నాటకం అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచంలోని తెలుగు వారందరికీ వేదికగా మారిషస్‌లో తెలుగు పీఠాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సాంస్కృతిక మంత్రి వట్టి వసంతకుమార్ ప్రకటించారు. మారిషస్‌లో జరుగుతున్న మూడు రోజుల ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీఠానికి ఏటా పది లక్షల రూపాయిలు నిధులు కేటాయిస్తామన్నారు. తెలుగు సంస్కృతీ పరిరక్షణకు, పరిశోధనకు మారిషస్ సహా ప్రపంచమంతా వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం 40 కోట్ల రూపాయిలు వెచ్చించి తెలుగు జానపద కళారూపాల డిజిటలైజేషన్‌కు, సంగీత, నృత్య కళల విస్తరణ తదితర కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. 
ప్రాథమిక విద్యామంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ ప్రపంచీకరణ ఫలితంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని నిలబడటానికి భాషను అభివృద్ధి పర్చుకోవాలని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రవాణా ఖర్చులు కూడా భరించి పాఠ్య పుస్తకాలను అందజేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేయమన్నారని తెలిపారు. భారత్‌తోపాటు అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, ఫిజి, యుకె, మారిషస్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.  మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, హిందీ అకాడమి చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలుగు యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ కె యాదగిరి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకుడు ఆచార్య డి మునిరత్నం నాయుడు, మారిషస్‌లో భారత రాయబారి టిపి సీతారాం, ఆంధ్రమహాసభ అధ్యక్షుడు కోడి రమణ, తెలుగు మాట్లాడేవారి సంఘం అధ్యక్షుడు రామస్వామి అప్పడు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన భాషా సదస్సులో లిపి సమస్యలపై మునిరత్నం నాయుడు, భాషా బోధనపై డాక్టర్ రెడ్డి శ్యామల, నూతన పదకల్పనలపై డాక్టర్ జె చెన్నయ్య పత్ర సమర్పణ చేశారు. వీరితోపాటు ఆచార్య పి అప్పారావు, ఆచార్య పి చెన్నారెడ్డి తదితరులు తమ పత్రాలు సమర్పించారు.
(చిత్రం - మారిషస్‌లో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించిన పర్యావరణ మంత్రి దేవా వీరాస్వామి, సాంస్కృతిక మంత్రి ముకేశ్వర్ చునీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మంత్రి వట్టి వసంతకుమార్, ప్రాథమిక విద్యా మంత్రి శైలజానాథ్ తదితరులు)

Thursday, December 8, 2011

నేటి నుంచి మారిషస్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు

 ప్రపంచ తెలుగు మహాసభలను మారిషస్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజధాని పోర్టులూయిస్‌లోని ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు సభలు జరగనున్నాయి. మారిషస్‌లోని భారత హైకమిషనర్‌ తీప్తి సితార మహాసభలను ప్రారంభిస్తారు. మహాసభలకు హాజరయ్యేందుకు వివిధ దేశాలకు చెందిన సుమారు 500 మంది ప్రతినిధులు బుధవారం సాయంత్రానికి ఇక్కడికి చేరుకున్నారు. వీరిలో రాష్ట్ర మంత్రులు శైలజానాథ్‌, వట్టి వసంతకుమార్‌, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, తెలుగు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఉన్నారు. మారిషస్‌ తెలుగు సంఘం నిర్వాహకులు ఆత్మ ఆదినారాయణ, సతీశ్‌ అప్పడు, రామస్వామి తదితరుల ఆధ్వర్యంలో సభల ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10న జరిగే ముగింపు ఉత్సవాలకు మారిషస్‌ దేశ ప్రధాని నవీన్‌ చంద్ర రాంగులాం, రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్‌ ఎ చక్రపాణి ముఖ్య అతిధిలుగా హాజరవుతారు. మారిషస్‌ తెలుగు సంఘం నిర్వహకులు ఆత్మ నారాయణ, సతీష్‌ అప్పడు, రామస్వామి తదితరులు ఈ సభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
జనవరి 5 నుంచి తెలుగు మహోత్సవాలు
 ఒంగోలులో ప్రపంచ తెలుగు మహోత్సవాలు జనవరి 5 నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి.  మహోత్సవాలకు సంబంధించిన బ్రోచర్‌ను ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ వేడుకలను 'రామ్‌కీ ఫౌండేషన్‌' నిర్వహించడం అభినందనీయమని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.భాషా పరంగా మాత్రమే కాకుండా సంస్కృతులు, వాటి విశిష్టతను ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహిస్తుండటం గర్వకారణమంటూ సీఎం ప్రశంసించారు. మూడురోజుల పాటు జరిగే ఉత్సవాల వివరాలను ముఖ్యమంత్రికి రామ్‌కీ మేనేజింగ్‌ ట్రస్టీ ఆళ్ల దాక్షాయణి వివరించారు. మొత్తం పదకొండు దేశాల నుంచి తెలుగు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఫౌండేషన్‌ ప్రచురించిన 'ప్రకాశం జిల్లా వైభవం' పుస్తక ప్రతిని ఆమె సీఎంకు అందించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న వేడుకలను విలక్షణంగా తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు ఫౌండేషన్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ ఎమ్వీ.రామిరెడ్డి పేర్కొన్నారు. ఉత్సవాల్లో దేశంలోని ప్రఖ్యాతి గాంచిన జానపద నృత్యరూపాలతో పాటు, రాష్ట్రంలో మరుగున పడిన జానపద కళా ప్రదర్శనలూ ఉంటాయన్నారు. కార్యక్రమంలో రామ్‌కీ ప్రతినిధులు సర్ణ విజయరామిరెడ్డి, పి.వినయ్‌కుమార్‌, కె.వి.ఆర్‌.ఎల్‌.ఎన్‌.శర్మ, వి.నారాయణరెడ్డి, కె.రాజశేఖర్‌ తదితరులు ఉన్నారు. 
-ఈనాడు 

Sunday, November 20, 2011

బర్మాలో తెలుగుభాషా వికాసానికి కంకణం కట్టుకున్న నాయుడు

మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని ఎలుగెత్తి పాడుతుంటాం. కానీ ఆ అమ్మ బిడ్డలుగా తెలుగు పలుకుబడిని ఎంతవరకూ పెంచగలుగుతున్నాం! ఇదే ప్రశ్నను తనకు తానే సంధించుకున్నాడు నాయుడు. ఆయన పుట్టింది బర్మా (మయన్మార్ దేశం) లో. స్థిరపడింది ఏపీలో. జన్మించిన విదేశీ గడ్డమీదయినా తెలుగును బతికించాలని కంకణం కట్టుకున్నాడు. మహోద్యమాన్ని మొదలెట్టాడు. మొదటిమెట్టుగా తెలుగు-బర్మీస్ నిఘంటువును రూపొందించాడు. ఇప్పుడు బర్మా పిల్లల కోసం పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీమజిలీ కథల్ని అక్కడి భాషలోకి తర్జుమా చేస్తున్నాడు.
ఇది అరవై డెబ్భయ్యేళ్ల నాటి మాట. కరువుకాటకాలతో ఉత్తరాంధ్ర తల్లడిల్లిపోతుండేది. కలిగినవారి కంచాల్లోనే వరి మెతుకులు కళకళలాడేవి. అలాంటి సమయంలో పొట్ట చేతపట్టుకుని వ్యవసాయ కూలీలు వేల సంఖ్యలో బర్మా వెళ్లిపోయేవారు. బర్మాలోనూ తెల్లదొరల పాలనే గనుక వలసలకు ఇబ్బందులు లేవు. రంగూన్ (దీన్నే రంగం అనేవారు) వెళితే ఎలాగయినా బతికేయొచ్చన్న ధీమాతో విశాఖపట్నానికి చెందిన ఎర్ర నూకాలు కుటుంబం ఆ దారి పట్టింది. రంగూన్‌కి కాస్తంత దూరంలోని మోల్‌మేన్ ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. నూకాలు అక్కడే ఉంటున్న తెలుగమ్మాయి సముద్రాన్ని వివాహం చేసుకున్నాడు. 1950లో వారికి మగపిల్లాడు పుట్టాడు. నాయుడు అని పేరుపెట్టుకున్నారు.

పెద్దబాలశిక్షకు నమోనమో...
నాయుడి తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని సంసారాన్ని లాక్కొచ్చేవారు. పిల్లాణ్ణి మోల్‌మేన్‌లో ఉన్న తెలుగుబడిలో వేశారు. రెండు క్లాసులు పూర్తయ్యాక బర్మా బడికి మారిపోవాల్సి వచ్చింది.నేను రెండో క్లాసువరకూ చదివిందే తెలుగు చదువండీ. పెద్ద బాలశిక్ష చెప్పుకున్నాం. అది మన భాష తియ్యందనాన్ని రుచిచూపింది. వేమన, సుమతీ పద్యాలు, నక్షత్రాలు, నెలలు, సంవత్సరాల తెలుగు పేర్లు నేర్పింది. వట్రసుడి, కరారావుడు లాంటివన్నీ బోధించడం వల్లనే ఇప్పటికీ తప్పులు లేకుండా రాయగలుగుతున్నాను.

దురదృష్టం కొద్దీ బర్మాలో మూడోతరగతి చెప్పే తెలుగు స్కూలే లేదు. బర్మా బడిలో ఆరో తరగతి వరకూ లాగించాను. మాతృభాషను వదిలిపెట్టి మరో భాషను బుర్రకెక్కించుకోవడం అంత సులువుకాదు. అందుకే ఫస్ట్ ఫారంతోనే చదువుకు స్వస్తి చెప్పేశానుఅంటూ నాయుడు తన బర్మా చదువును వివరించారు. 1966 నాటికి అక్కడ బ్రిటిషర్ల రాజ్యం పోయి, స్వదేశీ మిలిటరీ రూల్ వచ్చేసింది. బర్మీస్ కానివారికి ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో నూకాలు భార్యాపిల్లలతో వైజాగ్ వచ్చేశారు.

కూలీనాలీ చేసి...
అలా విశాఖ చేరుకున్న పదహారేళ్ల నాయుడు విశాఖ వన్‌టౌన్ ప్రాంతంలో కూలిపనులు చేశాడు. హోటళ్లలో పనిచేశాడు. మరోవైపు పూర్ణామార్కెట్ సమీపంలోని సెంట్రల్ లైబ్రరీలో తెలుగు కథలు, పత్రికలు చదువుతుండేవాడు. మలేషియా, హాంకాంగ్, బర్మా తెలుగు సంఘాలతో ఉత్తరప్రత్యుత్తరాలు చేస్తూ అక్కడి తెలుగువారి విశేషాలను తెలుసుకుంటుండేవాడు. ‘1973లో యారాడ కొండమీద ఉండే వాతావరణ హెచ్చరిక కేంద్రం వాటర్ వర్క్స్‌లో క్లాస్‌ఫోర్ ఉద్యోగం దొరికింది. వివాహమైంది. జీవితం దార్లో పడ్డట్టయింది. కొన్ని జీతం రాళ్లు వస్తుంటాయి గనుక తెలుగు పుస్తకాలు కొనడం చదవడం, పంచడం మొదలెట్టాను. చందమామలయితే ఎన్ని కాపీలు కొనేవాణ్ణో.

యాంగో అనే బర్మా పదానికి రూపాంతరమే రంగూన్. యాం అంటే ఆయుధాలు. కో అంటే విడిచిన చోటు. ఎక్కడయితే అప్పటి సైన్యాలు ఆయుధాలు విడిచిపెట్టారో ఆ ప్రాంతంలోనే నేను తెలుగు అక్షరాయుధాలను అందుకున్నాననే ఊహ మెరిసేసరికి నా మనసు నిండుపున్నమి అయ్యేది. నేను పుట్టిన బర్మాలో తెలుగు భాషాభివృద్ధికి ఏదయినా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నాడే భావించాను. నేనేం తెలుగులో నిష్ణాతుణ్ణి కాను. నా ముగ్గురు పిల్లలూ సెటిలయ్యారు. నా భార్య రోజా సహకారం ఉండనే ఉంది. అందుకే మరొకసారి బర్మా వెళ్లొచ్చి అప్పుడు నిర్ణయించుకోవాలనుకున్నానునాయుడు తెలియజేశారు.
ఘన నిఘంటువు...
సరిగ్గా పదేళ్ల కిందట నాయుడు రెండోసారి రంగూన్ వెళ్లివచ్చారు. అక్కడి తెలుగువారిని కలిశారు. వారానికి రెండు రోజులే నడుస్తున్న తెలుగు బడిని చూశారు. అక్కడున్న మనవారికి తెలుగు నేర్చుకోవాలన్న కోరిక బలంగా ఉంది. కానీ పుస్తకాల్లేవు, ప్రోత్సాహం లేదు. డో లుమ్యూ డో బాద డోటి’ (మా జాతి భాష నేర్చుకోవాలని ఉంది) అంటూ నా చుట్టూ చేరి కేరింతలు కొడుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయిఅంటూ కళ్లు తుడుచుకున్నారు నాయుడు.
మయన్మార్ నుంచి వైజాగ్ తిరిగి వచ్చాక, బర్మా పిల్లలు తెలుగును ఇష్టపడుతున్నారు గనుక వారికో నిఘంటువును రూపొందించాలను కున్నారు నాయుడు. అందుకే పలు భాషా నిఘంటువులను సేకరించి, అధ్యయనం మొదలెట్టారు. అటు తన మాతృ భాష తెలుగు పదం... ఇటు దానికి సమానమైన తను పుట్టిన బర్మా దేశపు పదం వెతకడం. రెండేళ్ల కిందట ఆయన ఉద్యోగం నుంచి రిటైరయ్యాక పూర్తికాలం ఈ పని మీదనే ఉన్నారు. దాదాపు పదివేల తెలుగు పదాలను నిఘంటువులో చేర్చారు.
రుణానుబంధం...
ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మూడురోజులపాటు మయన్మార్ వాకిట ఆంధ్ర మహాజనసంఘం శతజయంతి ఉత్సవాలు జరిగాయి. 1911లో అక్కడ తెలుగు సంఘం నెలకొని నేటికీ అద్భుతంగా పనిచేస్తోంది. దీనికి నాయుడు హాజరయ్యారు. మన జానపద నృత్యాలు, పద్యనాటకాలు ఎవరైనా కళాకారులు పిల్లలకు నేర్పిస్తుంటే ఆ క్లాసులన్నీ వీడియో తీసి సీడీలు బర్మాకు పంపాలని ఉంది.

అలాగే తెలుగులో నీతి కథలను క్యాసెట్లు, సీడీలుగా అక్కడికి తరలించదలిచాను. నా డిక్షనరీ అచ్చువేయిస్తామని కొందరు బర్మా వెళ్లొచ్చిన తెలుగు పెద్దలు చెబుతున్నారు. దీనికోసం అక్కడ చాలా మంది వేచి చూస్తున్నారు. ఈ పని పూర్తయితే నా జీవితానికో అర్థం ఉందని భావిస్తానుఅని నాయుడు చెబుతుంటేఆంధ్రమాత చేతిలో అలరారే పూర్ణకుంభం ఇతడేననిపించింది.
- డాచింతకింది శ్రీనివాసరావు
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విశాఖపట్నం
-సాక్షి దినపత్రిక సౌజన్యంతో..  

Sunday, October 2, 2011

వచ్చే ఏడాది విశాఖలో సెప్టెంబర్‌ 21, 22, 23 తేదీలలోతెలుగు అంతర్జాల సదస్సు

   international
కాలిఫోర్నియా : తెలుగుభాషకు ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రపంచ భాషగా చేసే కృషిని ఒక ఉద్యమంలా చేపట్టాలని అంతర్జాతీయ తెలుగు అంత ర్జాల సదస్సు నినాదమిచ్చింది. అమెరికాలో కాలిఫోర్ని యాలోని మిల్పిటాస్‌ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం, సిలికానాంధ్ర సంయుక్తంగా నిర్వహించిన సదస్సు శుక్రవారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం శని వారం) ముగిసింది. సమాచార సాంకేతిక శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన ఆ శాఖలోని అంతర్జాల సలహామండలి సభ్యులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణకు తుది రూపమిచ్చారు. అంతర్జాలంలో తెలుగు భాష అభివృ ద్ధికి తగిన సాంకేతిక ఉపకరణాలను సిద్ధం చేయాలని, కంప్యూటర్‌లలో అందు బాటులో ఉన్న ప్రామాణిక ఉపకరణాలను మన స్థానిక భాషకు అనువుగా మలచుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవ డానికి అవ సరమైన బోధన, శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలని, తెలుగు కోసం వివిధ రకాలైన అనువర్తనాలను రూపొందించాలని తీర్మానించారు. వీటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందు నిలుస్తుందని ఈ రంగంలో చైత న్యం తీసుకురావాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ముగింపు సభకు మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షత వహించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌ మాట్లాడుతూ, ఈ సదస్సు విజయవంతమైందని, ఈ సదస్సులో చర్చించిన అంశాలపై రాబోయే రోజులలో విస్తృతమైన అభిప్రాయాలను సేకరిస్తామని అన్నారు. వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌ 21, 22, 23 తేదీలలో విశాఖపట్టణంలో రెండవ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు జరిగే నాటికి చాలా పురోగతి సాధించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సదస్సు అధ్యక్షులు టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పేరి భాస్కరరావు, హైదరాబాద్‌ కేంద్రీ య విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య ఆవుల మంజులత, శాసనమండలి సభ్యుడు ఐలాపురం వెంకయ్య, సమా చార సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌ జాజు, ఆంధ్రప్రభ దినప త్రిక సంపాదకులు పి.విజయబాబు, నాలెడ్జ్‌ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణా ధికారి అమర్‌నాథ్‌ రెడ్డి, అంతర్జాల సలహా మండలి సభ్యులు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, వీవెన్‌, సిలికానాంధ్ర అధ్యక్షుడు కొండుభొట్ల దీన బాబు, సమన్వయ కర్త చామర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వైభవాన్ని చాటిన 'మనబడి' స్నాతకోత్సవం
అమెరికాలోని పదహారు రాష్ట్రాల్లో సిలికానాంధ్ర నడుపుతున్న 'మన బడి' కార్యక్రమం ప్రపంచంలోని తెలుగు వారందరికీ ఆదర్శప్రాయమని సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశంసిం చారు. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌ నగరంలో జరిగిన మనబడి స్నాత కోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్‌ మాట్లాడుతూ, అమెరికాలో పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలుగు నేర్పించేందుకు నాలుగేళ్ళ కిందట మనబడిని ప్రారంభించామని చెప్పారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షోపన్యాసం చేస్తూ భాష నశిస్తే జాతి కూడా అంతరిస్తుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించి సిలికానాంధ్రను స్ఫూర్తిగా తీసుకుని భాషను కాపాడుకోవాలని కోరారు. ఈ స్నాతకోత్సవంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అమలు జరుగుతున్న మనబడిలో నాలుగో సంవత్సరం కోర్సు పూర్తి చేసుకున్న సుమారు 150 మంది విద్యార్థులకు పొన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలను అందచేశారు. మనబడి డీన్‌ తూములూరి శంకర్‌ తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య, డాక్టర్‌ ఆవుల మంజులత, అధ్యాపకుడు జె.చెన్నయ్య, సిలికానాంధ్ర అధ్యక్షుడు కొండుభొట్ల దీనబాబు, పూర్వ అధ్యక్షుడు చామర్తిరాజు తదితరులు పాల్గొన్నారు.
-ఆంధ్రప్రభ 

Friday, September 30, 2011

అంతర్జాలంలో తెలుగు వైభవానికి చర్యలు: మంత్రి పొన్నాల

ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అనే విధంగా తెలుగు భాష ఖ్యాతిని నలుదిశలా విస్తరింపజేయడానికి అందరూ కృషి చేయాలని న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, ప్రవాసాంధ్ర ప్రముఖుడు చివుకుల ఉపేంద్ర పిలుపునిచ్చారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మిల్పిటాస్‌లో జరుగుతున్న 'అంతర్జాలంలో తెలుగు ఆంతర్జాతీయ సదస్సు' సందర్భంగా ఏర్పాటైన విందు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమెరికాలో తెలుగు భాషాభివృద్ధికి ఇక్కడి ప్రవాసాంధ్ర తెలుగు సంఘాలు ఎంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. భాషా సంస్కృతులను పరిరక్షించడానికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. అంతర్జాలం(ఇంటర్నెట్‌)లో తెలుగు వైభవాన్ని చాటడం కోసం తొలిసారి సదస్సును అమెరికాలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. భాషాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ..
ఇకనుంచి అంతర్జాలంలో తెలుగు వైభవం కనిపించనుందని, దీనికోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తొలి సదస్సును నిర్వహించడానికి చొరవ చూపిన సిలికానాంధ్ర సంస్థను ఆయన అభినందించారు. రెండో అంతర్జాతీయ సదస్సును వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించడానికి గీతమ్‌ విశ్వవిద్యాలయం ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.

కూచిపూడి నాట్య విశిష్టతను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌ చెప్పారు. ఈ నాట్యానికి పుట్టినిల్లయిన కృష్ణాజిల్లా కూచిపూడిలో రెండెకరాల విస్తీర్ణంలో కూచిపూడి వారసత్వకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలుగులో అందమైన ఫాంట్ల(అక్షరశైలి)ను రూపొందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తెలుగు అభివృద్ధికి, ఈ భాషను అభ్యసించిన వారికి ఉపాధి కల్పించడంకోసం రానున్న రెండేళ్లలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. సమాజ సేవా కార్యక్రమాల కోసం తాను ఇప్పటివరకు దాదాపు రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చానని ప్రవాసాంధ్ర ప్రముఖుడు లక్కిరెడ్డి హనిమిరెడ్డి చెప్పారు. రెండు తెలుగు ఫాంట్లను రూపొందించడానికి అయ్యే ఖర్చు రూ.12 లక్షలను విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, రాష్ట్రేతరుడు సంజయ్‌జాజు 'నా అటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌' సినిమాలోని గుర్తుకొస్తున్నాయి.. అనే పాటను పాడి సభికులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, ఈనాడు జర్నలిజం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఎం.నాగేశ్వరరావు, టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌, ఆవుల మంజులత, అనుమాండ్ల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
-ఈనాడు 

Tuesday, September 13, 2011

విశాఖలోతెలుగు సాంస్కృతిక మ్యూజియం

విశాఖపట్నం: తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచే ఓ మ్యూజియం విశాఖలో రూపుదిద్దుకోబోతోంది. తెలుగు సాంస్కృతిక నికేతనం పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ మ్యూజియంలో జాతి సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి వివిధ ఘట్టాలను ఉంచబోతున్నారు. శాతవాహనుల కాలం నుంచి ఇప్పటి వరకూ ఉన్న తెలుగు వారి ప్రాభవం ప్రజలకు తేలికగా అర్థమయ్యే విధంగా వివరించబోతున్నారు. స్థానిక కైలాసగిరిపై ఈ మ్యూజియం నిర్మాణానికి 2005లోనే శంకుస్థాపన చేశారు. ఐదు కోట్ల రూపాయలతో ఈ మ్యూజియం నిర్మించడానికి వరల్డ్ తెలుగు ఫెడరేషన్ (డబ్ల్యుటిఎఫ్), విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఎంఓయును కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కైలాసగిరిపై సుమారు 1.20 కోట్ల రూపాయల విలువైన భూమిని వుడా ఈ మ్యూజియం కోసం కేటాయించింది. మిగిలిన 3.80 కోట్ల రూపాయలను డబ్ల్యుటిఎఫ్ ఇచ్చేందుకు నిర్ణయించింది. పర్యాటకంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరంలో ఈ మ్యూజియంను నిర్మిస్తే, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి తెలుగు భాషా ప్రాచుర్యాన్ని, తెలుగు వారి వైభవాన్ని వివరించడానికి వీలవుతుందని నిర్ణయించి ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. తొలుత ఐదు కోట్ల రూపాయలతో ఈ మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేయాలనుకున్నారు., కానీ ఈ వ్యయం సుమారు 10 కోట్ల రూపాయల వరకూ పెరిగింది. అత్యంత కళాత్మంగా ఈ మ్యూజియం నిర్మాణం సాగుతోంది. భవన నిర్మాణం దాదాపూ పూర్తికావచ్చింది. ఈ మ్యూజియంలో తెలుగు జాతి చరిత్రను వివరించేందుకు 35 ఎపిసోడ్‌లను రూపొందిస్తున్నారు. సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ హాల్‌లో సుమారు గంటసేపు సాగే ఒక్కో ప్రదర్శనలో తెలుగు చరిత్రను శిల్పాలు, సౌండ్ షో ద్వారా ప్రేక్షకులకు వివరించబోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి అర్థమయ్యే రీతిలో ఆంగ్ల భాషలో కూడా వివరించనున్నారు. ఇందులో మొత్తం 35 ఘట్టాలు ఉంటాయి. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి శిల్పాలను రూపొందించే బాధ్యతలను సోమవారం అప్పగించారు. అలాగే సి.నారాయణరెడ్డి అధ్యక్షతన నలుగురు నిష్ణాతులైన తెలుగు కవులకు స్క్రిప్ట్ రాసే బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఈ మ్యూజియంను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ధృడ సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. కేరళలో కన్నడ మ్యూజియంను కూడా ఇక్కడి అధికారులు సందర్శించి వచ్చారు. దానికి పది రెట్లు మన మ్యూజియం ఉంటుందని ఈ మ్యూజియం నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న డబ్ల్యుటిఎఫ్ ప్రాంతీయ చైర్మన్ యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఆయా ప్రాంతాల చరిత్రకు సంబంధించి ఇంత పెద్ద మ్యూజియంలు లేవని ఆయన చెప్పారు.

-ఆంధ్రభూమి దినపత్రిక  

Tuesday, August 30, 2011

మైదుకూరులో ఘనంగా తెలుగు భాషాదినొత్సవం!

కడప జిల్లా మైదుకూరులో తెలుగుభాషా దినోత్సవం ఘనంగా జరిగింది . మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత   పాఠశాల ఆవరణంలో తెలుగు భాషాభిమానులు , ఉపాధ్యాయులూ ,విద్యార్థుల మధ్య సమక్షం లో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష ఉనికికి విఘాతం కల్గిస్తున్న పరిస్థితులను సభికులకు వివరించారు. ప్రపంచం లో అంతరించిపోనున్న అనేక భాషల వివరాలను ఓబుల్ రెడ్డి వివరిస్తూ అండమాన్ దీవుల్లో " బో " అనే భాష ఇటీవల అంతరించిన ఉదంతాన్ని ఉదహరించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గిడుగు రామ మూర్తి పంతులుకు నివాళి అర్పించారు. డాక్టర్ సామల రమేష్ బాబు నాయకత్వం లో ముందుకు సాగుతున్న తెలుగు భాషోద్యమ వివరాలను ఓబుల్ రెడ్డి ఈ సందర్భంగా సభికులకు తెలిపారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొన్నసాహితీవేత్త జింకా సుబ్రమణ్యం మా ట్లాడుతూ విద్యార్థులు శతక సాహిత్యన్ని ఔపోసన పడితే తెలుగు భాషపై పట్టు పెరుగుతుందని సూచించారు.  తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తనకు సత్కారం చేసినందులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తనకు సత్కారం చేసినందులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కస్తుర్బా విద్యాలయం   విశ్రాంత ప్రిన్సిపాల్  మిరియాల వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా సౌరభమంతా ప్రాచీన తెలుగు సాహిత్యం లో దాగుందని పద్యసహితంగా పేర్కొన్నారు. పద్య కవి లెక్కల వెంకట రెడ్డి మాట్లాడుతూ అచ్చతెలుగులో ఎవరైనా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే  వారిని చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ అధ్యక్షుడు ఎ . వీరస్వామి , బాల సాహిత్య రచయిత టి. మహానందప్ప, అధ్యక్షుడు ఎ . వీరస్వామి , యువకవి కృష్ణమూర్తి యాదవ్ , గేయ రచయిత ఖాజహుస్సైన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రముఖుల చిత్రాలు జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన తెలుగు భాషాభిమానులను , విద్యార్థులను ఆకట్టుకుంది.

Monday, August 29, 2011

మా తెలుగు తల్లికి మల్లె పూదండ !

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!


తెలుగువారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు ! 

అమెరికాలో తెలుగు భాషా శిక్షణకు పెరుగుతున్న ఆదరణ

మెరికాలోని ప్రవాసాంధ్రుల కుటుంబాలకు చెందిన పిల్లలు తెలుగు భాష మాధుర్యాన్ని అనుభవించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న హిందూ దేవాలయాల్లో శని, ఆది వారాల్లో తెలుగు భాష నేర్పడం కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులుకు మంచి ఆదరణ లభిస్తోంది. 2008లో 'సిలికానాంధ్ర' సంస్థ చేపట్టిన మనబడి కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోంది. తొలుత కాలిఫోర్నియా రాష్ట్రంలోని 19 ప్రాంతాల్లో తెలుగు నేర్పే 'మనబడి' పాఠశాలలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో ఈ తరహా పాఠశాలలు పనిచేస్తున్నాయి. వీటిలో ఓనమాలు నుంచి వ్యాకరణం వరకు భాషపై పూర్తి అవగాహన కల్పించేందుకు నాలుగేళ్ల కోర్సు ఒకటి రూపొందించారు. ఈ కోర్సు నిర్వహణకు హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం సహకారం అందిస్తోంది. కోర్సు పూర్తిచేసిన వారికి ధ్రువపత్రాలు అందిస్తున్నారు.
వర్సిటీల్లోనూ తెలుగు వెలుగు: అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తప్పనిసరిగా ఓ విదేశీ భాష నేర్చుకోవాలి. దీనికి సంబంధించి ధ్రువపత్రం పొందాలి. దీన్ని గుర్తించిన ప్రవాసాంధ్ర ప్రముఖులు తొలిసారిగా 'విస్కాన్సిన్‌' విశ్వవిద్యాలయంలో తెలుగు కోర్సును ప్రవేశపెట్టేలా కృషి చేశారు. టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో అందిస్తున్న తెలుగు భాషలో శిక్షణకూ మంచి స్పందన లభిస్తోంది. ఐదేళ్లపాటు శిక్షణ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు లక్ష డాలర్లను 'తానా' ఈ వర్సిటీకి విరాళంగా అందజేస్తోంది. ప్రవాసాంధ్ర పిల్లలు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు వారి మాటలు అర్థంకాక ఇక్కడి బంధువులు ఇబ్బందిపడేవారు. ఇకపై ఈ సమస్య తప్పనుంది.
-ఈనాడు   

Sunday, August 28, 2011

ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం: 'శిష్ట వ్యవహారిక' రూప శిల్పి " గిడుగు " జయంతి

హైదరాబాద్: గిడుగు రామ్మూర్తి పంతులు 148వ జయంతిని రాష్ట్ర ప్రజలు మాతృభాషా దినోత్సవంగా సోమవారం జరుపుకోనున్నారు. శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు జన్మించారు. 1875లో తండ్రి మరణించేవరకూ పర్వతాల పేటలో చదువుకున్న రామమూర్తి ఆ తరువాత విశాఖలోని తన మేనమామ ఇంటికి చేరుకున్నారు. అక్కడ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ముఖలింగ దేవాలయం శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకున్నారు. 1879లో మెట్రిక్యులేషన్ పాసయిన తరువాత టీచరుగా పని చేస్తూ, చదువు కొనసాగించారు. 1886లో ఎఫ్.ఎను, 1896లో బి.ఎను డిస్టింక్షన్‌లో పూర్తి చేశారు. గజపతి మహారాజు స్కూలు కాలేజీలో అధ్యాపకుడిగా పని చేశారు. తెలుగు భాషా బోధనను వ్యావహారికంలో చేయాలన్న ఆయన ఆలోచనకు 1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయుడి నుంచి మద్దతు లభించింది. అప్పటి ఏ వీఎన్ కాలేజీ ప్రధానాధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, యేట్స్, గిడుగు రామమూర్తి పంతులు కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుటా ్టరు. అప్పటికే రామమూర్తి వ్యావహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం 'తెలుగు' అనే పత్రికను గిడుగు ప్రా రంభించారు. వీరి కృషి కారణంగా 19 12-13లో స్కూల్ ఫైనల్ బోర్డు తె లుగు వ్యాస పరీక్షను గద్యంలో లేదా వ్యావహారిక భాషలో రాయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. అప్ప టి నుంచి స్కూలు, కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో వెలువడడం మొదలుపెట్టాయి. ఆ తరువాత ప్రభుత్వం వేసిన ఒ క కమిటీలో గ్రాంథిక వాదులు ఆధిపత్యంతో వ్యావహారిక భా ష లో బోధనను రద్దు చేసినా అనంతర కాలంలో పున రు ద్ధరించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆ యన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉత్తరాంధ్ర అడవుల్లో సవరులు అనే తెగ భా షను నేర్చుకుని అందులో వారికి బోధించారు. దీంతో మద్రాసు ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదునివ్వగా ఆ తరువాత కైజర్ ఈ హింద్ బిరుదు ఆయనకు లభించింది. వ్యావహారిక భాషకు ఇంత సేవ చేసిన గిడుగు రామమూర్తి 1940, జనవరి 22న మరణించారు.
-తెలుగు సాహిత్య వేదిక  
 

సెప్టెంబరులో అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం

మచిలీపట్నం: ఆధునిక సాంకేతిక తోడ్పాటుతో మన తెలుగు భాషను విశ్వవాప్తం చేసే దిశగా కృషి సాగుతోందని సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిబొట్ల ఆనంద్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ తెలుగు భాషా వినియోగంలో ఆధునిక ఉపకరణాల తోడ్పాటు అంశమై సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్‌వ్యాలీలో అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.

మాతృభాషను మరవొద్దు - మంత్రి గల్లా అరుణకుమారి


కోయంబత్తూరు: ఇతరుల భాషలను గౌరవించి వారితో వారిభాషలోనే మాట్లాడే గొప్ప సంప్రదాయం తెలుగువారిది. దీని కోసం పరభాషలను నేర్చుకుంటున్నారు. వారి భాషను నేర్చుకుని వారి సంస్కృతిలో భాగమవుతున్నారు. కానీ ఈ తరుణంలో మాతృభాషను మరుస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ గనులు, భూగర్భ వనరులశాఖ మంత్రి గల్లా అరుణకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇతర భాషల్లోనూ ప్రావీణ్యం సాధించడం తప్పనిసరి. దీనిని నేను వ్యతిరేకించను. కాని మాతృభాషను ఎట్టి పరిస్థితుల్లోనూ మరువరాదని ఆమె తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు సమాఖ్య(డబ్ల్యుటీఎఫ్‌) ప్రాంతీయ సమావేశం శనివారం కోయంబత్తూరులోని రామక్రిష్ణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అరుణ కుమారి మాట్లాడుతూ.. ప్రముఖ స్థానాల్లో ఉన్నవారు తెలుగు రాష్ట్రాన్ని మరువద్దని, ముఖ్యంగా వారి సొంత గ్రామాలకు సేవా కార్యక్రమాలను అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. గత 20 రోజుల నుంచి దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తనకు భయమేస్తుందని ఆంధ్రప్రదేశ్‌ న్యాయమూర్తి జస్టీస్‌ జి.రఘురాం తీవ్ర అసంతృప్తితో పేర్కొన్నారు. యార్లగడ్డ ప్రభావతి స్మారక పురస్కారాన్ని ప్రముఖ బుల్లితెర, వెండితెర దర్శకురాలు మంజులా నాయుడు అందుకున్నారు

'తెలుగు ఇంటర్నెట్‌' కమిటీ సభ్యుడిగా యార్లగడ్డ



న్యూఢిల్లీ: రాష్ట్ర హిందీ అకాడమీ ఛైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఇంటర్నెట్‌లో తెలుగు వాడకం పురోగతిపై ఏర్పాటుచేసిన కమిటీలో తొమ్మిదో సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు శనివారమిక్కడ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఐటీ విభాగం ఓ ఉత్తర్వు జారీ చేసింది.

Friday, August 26, 2011

తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!

తెలుగు బాట
 తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!
★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★
హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు.

	తెలుగు బాటకి నేను వెళ్తున్నాను!

Thursday, August 25, 2011

సింగపూర్‌ తెలుగు సమాజం నూతన కార్యవర్గం ఎన్నిక

సింగపూర్‌: సింగపూర్‌ తెలుగు సమాజం 2011-13కి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆగస్టు 7వ తేదీ కార్యనిర్వాహక కమిటీ సమావేశమై ఈ ఎన్నిక చేపట్టారు. అధ్యక్షడుగా జవహర్‌ చౌదరి యడ్లపల్లిని ఎన్నికవగా, ఉమారావు తెలిదేవర, దుర్గాప్రసాద్‌ కేసాని, శంకర్‌ వీర, కే.ఆర్‌. భాస్కర చౌదరిను ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. బంగారు రాజు పేరించర్ల గౌరవ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

Tuesday, August 16, 2011

తేనెలొలికిన ‘తెలుగు’ రచయితల సభలు

సాంస్కృతిక శాఖ, హిందీ అకాడమీ, భారతీయ భాషా కేంద్రం (మైసూర్), సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) సౌజన్యంతో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాలు కవులు, రచయితల్లో భాషా స్ఫూర్తిని నింపాయి. బెంజిసర్కిల్ వద్ద ఉన్న ఎస్వీఎస్ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమాల ముగింపు సభకు హైకోర్టు న్యాయమూర్తి గ్రంధి భవానీప్రసాద్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ సారథ్యంలో రెండో మహాసభలు కూడా విజయవాడలోనే జరగడం విశేషమన్నారు. లోక్‌సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ తాను భాషా ప్రియుడినన్నారు. ఫ్రెంచ్, బెల్జియంలో రెండు భాషలు ఉన్న కారణంగా ప్రభుత్వం ఏర్పడలేదన్నారు. బెంగాలీ, పంజాబీ భాషల కారణంగా పాకిస్తాన్ విడిపోయిందన్నారు. భాషను విద్యా అంశంగా తీసుకోవాలని ఆయన సూచించారు. హెచ్‌ఎం టీవీ సీఈవో శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ పత్రికల ద్వారా భాషా సేవచేసే అవకాశం ఉందన్నారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్ కల్లూరి భాస్కరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రభ సంపాదకుడు విజయబాబు మాట్లాడుతూ అతి తక్కువ వయసున్న భాష ఇంగ్లిష్ అన్నారు. దానిని అంటరానిదానిగా, పరాయి భాషగా చూడాల్సిన అవసరం లేదన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ మాట్లాడుతూ తెలుగును ఆధునిక భాషగా గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఎమెస్కో ప్రచురణ సంస్థ అధినేత విజయకుమార్ మాట్లాడుతూ రచనలు సార్వజనీన స్థాయికి చేరుకుంటే పత్రికలు, ప్రచురణ సంస్థలు ముద్రించడానికి అవకాశముందన్నారు.ప్రముఖ హిందీ, బెంగాలీ రచయిత ప్రొఫెసర్ ఇంద్రనాథ్‌చౌదరి మాట్లాడుతూ ప్రాథమిక విద్య పూర్తిగా తెలుగు భాషలో ఉన్నపుడే పిల్లలు అర్థం చేసుకోవడానికి అవకాశముంటుందన్నారు. విశ్వనాథ, గురజాడ, శ్రీశ్రీ లాంటివారు మళ్లీ పుట్టాలని ఆకాంక్షించారు. హిందీ నవలా రచయిత్రి ప్రతిభారాయ్ మాట్లాడుతూ భాషాభివృద్ధిపైనే ఆయా దేశాల అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ తుర్లపాటి కుటుంబరావు, ప్రచురణకర్త ఇమ్మిడిశెట్టి రామ్‌కుమార్, ప్రొఫెసర్ ఉషాచౌదరి, సన్‌ఫ్లవర్ విద్యాసంస్థల అధినేత ఎంవీఎస్‌ఆర్ పున్నంరాజు, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, చిగురుపాటి వరప్రసాద్, హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి.సుబ్బారావు, జీవీ పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు.

‘సమాజాన్ని సమైక్యపరిచే తెలుగు’
సమాజాన్ని సమైక్య పరిచే శక్తి భాషా సంస్కృతులకే ఉందని రచయితల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మహాసభల్లో భాగంగా సోమవారం ఎస్వీఎస్ కల్యాణ మండపంలో ‘జాతీయతా భావం-రచయితల పాత్ర’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకోత్తర, మహత్తర త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామన్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ నేటి తరానికి తెలుగు మాట్లాడడమేగానీ చదవడం, రాయడం రావట్లేదన్నారు.

కలకత్తాకు చెందిన సంస్కృతాచార్యులు ఆచార్య ఉషాచౌదరి మాట్లాడుతూ జాతీయ భావాలకు, పరమత సహనం, వారసత్వానికి ఆది నుంచి భారతదేశం పెట్టింది పేరన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ నల్లవారి హక్కుల కోసం పోరాడి తెల్లవారి తుపాకులకు బలైన మార్టిన్ లూధర్ కింగ్ ఇంట్లో మహాత్మాగాంధీ విగ్రహం ఉన్న చరిత్ర భారతదేశానిదన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకుడు హర్షవర్థన్ మాట్లాడుతూ ఏ భాషనైనా కాలానుగుణంగా మార్చుకున్నప్పుడే మనుగడ సాధ్యమవుతుందని, మాతృభాష మృతభాషగా మారకుండా ఉంటుందన్నారు. సదస్సుకు సమన్వయకర్తగా వ్యవహరించిన సిలికాన్ ఆంధ్రా కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ తెలుగు భాషను ప్రపంచ భాషగా గుర్తింపు తెచ్చేందుకు కృషిచేద్దామన్నారు. కృష్ణా యూనివర్సిటీ మాజీ ఉపకులపతి మైనేని కేశవదుర్గాప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషను ఆధునికీకరించపోతే మనుగడ ఉండదన్నారు.అనంతరం తెలుగులో అంతర్జాల అన్వేషణ, ముద్రణారంగంలో సాంకేతిక తోడ్పాటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అలాగే ఇ-పుస్తకాల గురించి వెంకట్రామ్, వికీపీడియా గురించి చావా కిరణ్, లిపి ఎలా రూపుదిద్దుకుంటుందో శివరావ్ వివరించారు. సీపీ బ్రౌన్ వేదికపై జరిగిన ఈ సదస్సులో తెలుగు ఫాంట్ అభివృద్ధి కమిటీ సభ్యుడు అమర్‌నాథ్‌రెడ్డి, ఆచార్య జి.ఉమామహేశ్వరరావు, డి.అంబరీష్, వి.వెంకటరమణ, కళాసాగర్, కొత్తపల్లి నారాయణస్వామి, పెద్ది సాంబశివరావు, సలాక రఘునాథశర్మ, రహిమానుద్దీన్, కె.వీరభద్రశాస్త్రి పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. ఆ వివరాలు.. 
* పల్లె నుంచి నగరాల వరకు అంతా తెలుగే మాట్లాడాలి. ఇంట్లో, బయట అమ్మ భాషే మాట్లాడాలి.
* రాష్ట్రంలో తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖను వెంటనే ఏర్పాటు చేయాలని, దీనివల్ల భాషా సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి.
* రెండేళ్లుగా అధికార భాషా సంఘ కార్యవర్గాన్ని నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం విచారకరం. వెంటనే నియామకాలు జరపాలి.
* ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ'ని పునరుద్ధరించాలి.
* ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగులో బోధన తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల నెంబరు 86 విడుదల చేసినా దాన్ని ఇప్పటి వరకు అమలు చేయకపోవడాన్ని సమావేశాలు తప్పుపట్టాయి. (ఈ ఉత్తర్వు విడుదలయిన మూడు సంవత్సరాల తరువాత తమిళమాధ్యమంపై అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.) తెలుగు బోధించని ప్రభుత్వేతర పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి. గ్రామ స్థాయి నుంచి తెలుగు బోధన కోసం ఉద్యమాలు చేపట్టాలి.
* వచ్చే 'నందన'నామ సంవత్సరాన్ని తెలుగు భాషా సంస్కృతుల సంవత్సరంగా ప్రకటించి గ్రామస్థాయి నుంచి తెలుగుపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి.
* పాలన, బోధన భాషగా తెలుగు అమలుపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి.
* తెలుగు మాట్లాడే విద్యార్థులపై చర్యలు తీసుకునే విద్యా సంస్థలు ఉంటే నిరసనలు, ఆందోళనలు చేయాలి.
* తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ప్రోత్సాహంగా ఉద్యోగాల మౌఖిక పరీక్షల్లో అయిదు మార్కులు అదనంగా కేటాయించాలి

Sunday, August 14, 2011

తెలుగుకు మళ్లీ వెలుగు- 'ఈనాడు' సంపాదకులు రామోజీరావు

తల్లిపాల మాధుర్యాన్ని తలపించేదే అమ్మభాష. అలాంటి మన తెలుగు, నేడు ఆంగ్ల ప్రభావంవల్ల చిక్కిశల్యమైపోతోంది. తెలుగు భాషావికాసోద్యమం మళ్ళీ మొదలైతే తప్ప, పరిస్థితి చక్కబడదు. విజయవాడలో నిన్న ప్రారంభమైన 'ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభ'లో పాల్గొన్న వక్తల ప్రసంగాల సారాంశమిదే. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 'ఈనాడు' సంపాదకులు రామోజీరావు- భాషోద్ధరణ పాఠశాలనుంచి మొదలుకావాలన్నారు. వాడుకే భాషకు వేడుక అవుతుందని స్పష్టంచేశారు. తెలుగు భాష పునరుజ్జీవానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ కృషికి 'తెలుగు రచయితల మహాసభ' నాంది పలకాలన్నారు. రామోజీరావు ప్రసంగం పూర్తిపాఠమిది...

 " మాతృభాష మీద మమకారంతో, ప్రేమతో మీరందరూ ఎంతో దూరాలనుంచి వచ్చారు. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇదొక బృహత్‌ యజ్ఞం. దీన్ని నిర్వహిస్తున్న కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అమ్మభాష గురించి మాట్లాడటం అంటే తల్లిపాల మాధుర్యాన్ని తనివితీరా మననం చేసుకోవడమే. తెలుగు గడ్డపై పుట్టడం ఎన్నో జన్మల తపోఫలమని కొందరు మహాత్ములన్నారు. అంతెందుకు- జాతీయభాష కాగల అర్హత తెలుగుకు మాత్రమే ఉందని జేబీ హేల్డెన్‌ లాంటి విదేశీయుడే మెచ్చుకున్నాడు. తెలుగు ఒక భాష మాత్రమే కాదు. ఒక సంస్కృతి... ఒక సంప్రదాయం... ఒక జీవన విధానం. ఆ మాటకొస్తే, ఏ జాతికైనా చైతన్యం కలిగించేది భాషే. ఒక జాతి ప్రజల కట్టుబాటును మతంకన్నా భాషే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. బంగ్లాదేశ్‌ అనుభవమే ఇందుకు ఉదాహరణ. భాషను, సంస్కృతిని నిలబెట్టుకుంటేనే తెలుగుజాతి కలకాలం వర్ధిల్లుతుంది. నిజానికి మన భాషకేం తక్కువ? దేశంలో హిందీ తరవాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగే. అయితే... ఆంగ్ల ప్రభావంవల్ల మన భాష చిక్కి శల్యమైపోతోంది. మన ఆలోచనల్లో, ఆచార వ్యవహారాల్లో తెలుగుదనం కరిగిపోతోంది... తరిగిపోతోంది. ఇందువల్ల మన సంస్కృతి, సంప్రదాయం, మానవ సంబంధాలు... అన్నీ దెబ్బతింటున్నాయి. రానురాను తెలుగుదనం ఉనికే పోతుందా అన్న భయం కలుగుతోంది. 30శాతం ప్రజలకు సొంత భాష చదవడం, రాయడం రాకపోతే ఆ భాష అంతరించిపోతుందని యునెస్కో చెప్పింది. ఈ కష్టం... ఈ నష్టం తెలుగుకు రాకూడదు. ఈ బాధ్యత మన భుజస్కంధాలమీద ఉంది. ఇందుకు ఎవరికి వాళ్లు ముందుకు రావాలి. మనరాష్ట్రంలో పిల్లల్ని గమనించండి... ఆంగ్లపదం రాకుండా ఒక్క నిమిషం కూడా తెలుగులో మాట్లాడలేరు. కారణాలేమైనా చక్కటి తెలుగు రాయడం, మాట్లాడటం, చదవటం అపురూపమైపోతోంది.
వాడుక... భాషకు వేడుక
ఏదైనా మాతృభాషలో నేర్చుకుంటేనే పిల్లలకు బాగా ఒంటపడుతుంది. అది తెలిసినా తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోతున్నారు. అది వాళ్ల తప్పు కాదు. ఎవరికైనా పిల్లల భవిష్యత్తే ముఖ్యం కదా? పిల్లల చదువుసంధ్యలు, వాళ్ల భవిష్యత్తు ఒకపక్క- మాతృభాష అయిన తెలుగు భవిష్యత్తు ఒకపక్క. ఈ రెండూ ఒకదాంతో ఒకటి ముడివడి ఉన్నాయి. తెలుగు భాషమీద మొహంమొత్తి ఇంగ్లిషు వ్యామోహం పెరిగిందా అంటే, అదీ కాదు. ఏ భాషకైనా తప్పకుండా బహుముఖ ప్రయోజనం ఉండాలి. మొదటిది... చెప్పిన మాట ఎదుటివారికి స్పష్టంగా అర్థం కావాలి. ఇది సామాజిక ప్రయోజనం. భాష ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడాలి. ఇది ఆర్థిక ప్రయోజనం. ఈ ప్రయోజనాలు నెరవేర్చినప్పుడే భాష రోజువారీ వ్యవహారంలో ఉంటుంది. భాషా సంస్కృతులు బాగున్న జాతి జీవకళతో ఉప్పొంగుతుంటుంది. ఇది ఎక్కడి విషయమో కాదు... మన ఇరుగు పొరుగును చూడండి. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మరాఠీలు ఉన్నారు కదా! భాషా సంస్కృతుల్ని ప్రాణంగా చూసుకుంటారు. వాటిని ఆత్మగౌరవ చిహ్నాలుగా చేసుకున్నారు. రేడియో, టీవీ, సెల్‌ఫోన్‌ వంటి ఇంగ్లిషు మాటల్ని కూడా వెంటనే తమిళ భాషలోకి అనువాదం చేసుకున్నారు. చివరికి డెంగీ, స్వైన్‌ ఫ్లూ లాంటి కొత్త వ్యాధులకూ తమిళ పేర్లున్నాయి. ఎక్కడో తప్ప ఆంగ్ల పదజాలానికి వారు దాసోహం కాలేదు. తమిళుల ధోరణి మిగతా భాషల వారందరికీ ఆదర్శం. ఒకటినుంచి పదో తరగతి దాకా ప్రతి విద్యార్థీ తమిళం నేర్చుకోవాలని అక్కడ నిబంధన పెట్టారు. తమిళంలో చదివినవారికే అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలిస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమిళ భాషపై పరిశోధనలను బాగా ప్రోత్సహిస్తుంది. ఎప్పటికప్పుడు ఆంగ్ల పదాలకు తమిళ సమానార్థకాలను రూపొందించడంలో వాళ్లు తలమునకలవుతుంటారు. పొరుగు దేశాల సంగతి తీసుకుందాం... చైనా రెండు భాషల పద్ధతి పాటిస్తుంది. అందువల్ల ఆ దేశ ప్రజలు స్థానిక సంస్కృతిని, సంప్రదాయాన్ని, అస్తిత్వాన్నీ ఏ మాత్రం పోగొట్టుకోకుండానే అంతర్జాతీయ స్థాయిని అందుకుంటున్నారు. సమకాలీన పరిస్థితులనుబట్టి అక్కడి పాఠశాలల్లో బోధించే మాతృభాషను నిత్యనూతనంగా మలచుకుంటున్నారు. ఫ్రెంచ్‌ ప్రభుత్వమూ ఇలాంటి కృషే చేస్తోంది. మరి అలాంటి భాషాచైతన్యం, కట్టుబాట్లు మనకెందుకు లేవు? మనరాష్ట్రంలో అధికార భాష తెలుగు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఉత్తరప్రత్యురాలు... అన్నీ తెలుగులో ఉండాలన్న నిబంధనలకు లోటు లేదు. అయితేనేం... రాజ్యమేలుతున్నది ఇంగ్లిషే!
ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంగా మన తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పారు... ప్రతి రాష్ట్రానికి మాతృభాషే అధికార భాషగా ఉండాలని... పరిపాలన వ్యవహారాలన్నీ మాతృభాషలోనే జరగాలని. ఇప్పటికి అయిదున్నర దశాబ్దాలైంది. ఆంధ్రప్రదేశ్‌ ఆంగ్లప్రదేశ్‌ అయింది తప్ప- తెలుగు వాడకం పెరగలేదు. ఇతరులను చూసి నేర్చుకోవడం కూడా మనకు కరవైపోయింది. అమెరికా రాయబార కార్యాలయ సిబ్బంది రోజుకు ఎనిమిది గంటల చొప్పున, ఎనిమిది నెలలపాటు కష్టపడి తెలుగు నేర్చుకున్నారట. మరి మనమో? తెలుగులో మాట్లాడటం, రాయడం నామోషీ అనుకుంటున్నాం. భాషా ప్రేమికులైన ఒకరిద్దరు అధికారులో, న్యాయమూర్తులో తెలుగులో ఉత్తర్వులు జారీచేస్తే దాన్నే గొప్పగా చెప్పుకొంటున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలుగు భాషా వికాసోద్యమం మళ్లీ మొదలు కావాలి. ఇందుకు రెండు రకాల ప్రయత్నాలు సాగాలి. తెలుగువల్ల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలుండేట్టుగా ప్రభుత్వ విధానాలు రూపుదిద్దుకోవాలి. తెలుగు వస్తేనే తమ బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులకు నమ్మకం కలగాలి. అప్పుడే తమ పిల్లలు తెలుగు నేర్చుకోవడంమీద వాళ్లు సుముఖత చూపిస్తారు. సమాజం పెరిగేకొద్దీ భాష పెరుగుతుంది. విజ్ఞానం పెరిగేకొద్దీ భాష విస్తరిస్తుంది. ఈ క్రమంలో తెలుగు కూడా ఆంగ్లంతో పోటీపడి పెరగాలి. మనం వెనకబడితే భాష కూడా వెనకబడుతుంది. ఇంగ్లిషు మీద విముఖత అక్కర్లేదు. తెలుగు పట్ల సుముఖతను పెంచుకోవాలి. తెలుగులోనే మాట్లాడటం, చదవటం అంటే ఇంగ్లిషుకు వ్యతిరేకం కానే కాదు. ఇది అందరికీ స్పష్టం చెయ్యాలి. మనది అందరి భాష... ఎవరికీ అందని భాష కాకూడదు. ఇందుకు ప్రభుత్వం చెయ్యాల్సినవి కొన్ని... ప్రజలు చెయ్యాల్సినవి ఇంకొన్ని. భాషకు పట్టం కట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఇందుకు సమాజంనుంచి ఒత్తిడి రావాలి. భాషోద్ధరణ పాఠశాలనుంచే మొదలు కావాలి. ఒకటో తరగతినుంచి పట్టభద్రస్థాయి దాకా తెలుగు భాషను తప్పనిసరి పాఠ్యాంశంగా చెయ్యాలి. ఇక్కడ మరో విషయం చెప్పాలి... పాఠ్యపుస్తకాల్లో ఉండే తెలుగు- పిల్లల్ని భయపెట్టేలా ఉండకూడదు. తేనెలొలికే తెలుగుమీద వాళ్లకు ఆసక్తి పెంచేట్టుగా ఉండాలి. ఇందుకోసం పాఠ్యపుస్తకాల్లోని పదజాలాన్ని ఇంకా సరళీకరించాలి. ఆంగ్ల పదాల వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి భాషాప్రియులు నడుం కట్టాలి. మన వ్యవహారంలోకి వచ్చిపడుతున్న ఆంగ్ల శబ్దాలకు ఎప్పటికప్పుడు తెలుగు మాటలను సృష్టించాలి. అయితే ఒక జాగ్రత్త తీసుకోవాలి. సమానార్థకాలు తయారు చేసేటప్పుడు అవి వినడానికి ఇంపుగా, తేలిగ్గా ఉండాలి. కొరుకుడు పడని పదాలైతే నష్టం వాటిల్లుతుంది. తెలుగు అనగానే ఏ తెలుగు అన్న మీమాంస అనవసరం. యాస భాషకు బలం. లక్షలమంది మాట్లాడే మాండలికాలన్నీ భాషకు ఆయువుపట్టులే. అవన్నీ అవసరమే. అసలు సిసలైంది జనభాషే. మంచి మంచి తెలుగు మాటలను ప్రసార సాధనాల్లోకి తెచ్చుకుంటే భాష అందగిస్తుంది. ఈ క్రతువులో పండితులే కాదు... భాష మీద ప్రేమ, అవగాహన ఉన్న సామాన్యులు కూడా పాలుపంచుకోవాలి. నిజమైన భారతదేశం గ్రామాల్లో ఉందంటారు. నా దృష్టిలో నిజమైన భాష పల్లెపట్టుల్లోనే ఉంటుంది. అక్కడ వాడుకలో ఉన్న పదాలను అందరం వాడుకుందాం. ఆ వాడుక తెలుగు భాషకు వేడుక అవుతుంది. డ్రెడ్జర్‌ అనే మాటకు 'తవ్వోడ' అన్న పదాన్ని సృష్టించింది సామాన్యులే. వారి అవసరార్థం దాన్ని కనిపెట్టారు. డ్రిప్‌ ఇరిగేషన్‌కు చుక్కల సాగు కూడా అలా వచ్చిందే. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ అందరి వాడుకలోకి రావాలి. అప్పుడే మన భాష మరింత శక్తిమంతమవుతుంది.
మరో మహోద్యమం
భాష, సంస్కృతి... రెండూ విడదీయరానివి... ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్నవి. అందుకే పిల్లలకు ఇవన్నీ నేర్పాలి. ఒక్క ఆంగ్ల శబ్దం కూడా రాకుండా తెలుగులో మాట్లాడేలా, రాసేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. వక్తృత్వం, వ్యాసరచన, సామెతలు, శతక పద్యాలు, కీర్తనలు వంటివాటిలో పోటీలు పెట్టాలి. విజేతలకు బహుమతులివ్వాలి. పాల్గొన్నవారందరినీ ఏదోరకంగా ప్రోత్సహించాలి. అవకాశం ఉన్నవారు తమ ఇళ్లలో కూడా పిల్లలచేత కసరత్తు చేయించాలి. ప్రోత్సహించాలి. పిల్లల్లో తెలుగు చదవాలన్న ఆసక్తిని, రచనాశక్తిని మనం పెంపొందించాలి. అందమైన తెలుగులో చిన్నారులను ఆకట్టుకునే కథలు, పుస్తకాలు విరివిగా రావాలి. వాటివల్ల భాషమీద, సంస్కృతిమీద మమకారం పెరుగుతుంది. మన భాషాసంస్కృతులు మనకు అమూల్య ఆస్తులు... మన వారసత్వ సంపద. వాటిని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారు? ప్రపంచం మొత్తంమీద ఉన్న 12కోట్లమంది తెలుగువారి ఉనికికి సంబంధించిన విషయం ఇది. దీనికి ఎటువంటి ప్రమాదం రాకుండా అడ్డుకుందాం. 1822లో రాజా రామ్మోహన్‌రాయ్‌ సొంత సొమ్ముతో ఒక పాఠశాలను పెట్టారు. అందులో శాస్త్ర సాంకేతిక విషయాలను కూడా బెంగాలీలోనే బోధించే ఏర్పాట్లు చేశారు. ఆ మహానుభావుడే మనకు స్ఫూర్తి కావాలి. ఫ్రెంచ్‌ దేశస్తులు వాళ్ల కళలు, సంస్కృతిని కాపాడుకోవడానికి రెండు శతాబ్దాలపాటు సాంస్కృతిక పునరుజ్జీవన విప్లవం చేశారు. ఇది చరిత్ర. మన దగ్గర కూడా అలా చరిత్ర సృష్టించాలి. 'తెలుగు భాషా పునరుజ్జీవన ఉద్యమం' సాగాలి. ఈ మహాసభలు ఇందుకు నాందీ ప్రస్తావన చెయ్యాలి. భాషాప్రియులుగా మీరున్నారు. మీకు తోడుగా మేమూ ఉన్నాం. తెలుగు భాషా పునర్వికాసానికి కృషి చేసేందుకు ఈనాడులో 'తెలుగు వెలుగు' పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఆంగ్ల పదాలకు ప్రత్యామ్నాయాలు, సమానార్థకాల అన్వేషణ, పద సేకరణ, నూతన పదాల్ని సృష్టించడం, వాటిని వ్యాప్తిలోకి తేవడం... వంటివాటిపై ఈ విభాగం పనిచేస్తుంది. నా ఆకాంక్ష ఒక్కటే... తెలుగు భాష కొత్త పుంతలు తొక్కాలి. అగ్రగామిగా నిలవాలి. తెలుగు సంస్కృతి, వైభవం ఎప్పటికీ జీవనదిలా ప్రవహించాలి. ఇప్పటికే జాప్యం జరిగి ఉండవచ్చు. ఇక కాలయాపన తగదు. నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేస్తారని ఆశిస్తూ... సెలవు తీసుకుంటున్నాను "

ఒకే తాటిపైకి గల్ఫ్ దేశాల తెలుగువారు !

ఉన్న ఊర్లో ఉపాధి కరవవడంతో నాలుగురాళ్లను వెనకేసుకోవాలని అయినవారికి దూరంగా గల్ఫ్‌దేశాలకు పయనమయ్యారు.. అలావెళ్లినవారికి అవమానాలు.. ఛీత్కారాలు నిత్యకృత్యమయ్యాయి.. కొందరైతే జైళ్లల్లో మగ్గుతున్నారు.. మరి కొందరు చిన్నపాటి విషయాలకే సేఠ్‌ల చేతులలో ప్రాణాలు కోల్పోతున్నారు.. ప్రమాదంలో చనిపోతే రక్తసంబంధీకులకు చివరి చూపుకూడా దక్కడం లేదు.. వీటన్నింటినీ ఇన్నాళ్లు మౌనంగా భరించారు.. వారిలో చైతన్యం వచ్చింది.. చేయిచేయి కలిపారు.. ఫోరంగా ఏర్పడ్డారు.. తెలుగువారికి ఏ అన్యాయం జరిగినా కలసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు.
  గల్ఫ్ దేశాలలో ఉంటున్న తెలుగువారంతా ఒకేతాటిపైకి వచ్చారు. తమకు జరుగుతున్న అన్యాయాలను సంఘటితంగా ఎదుర్కొవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒక ఫోరంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, బద్వేలు ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వేలాది మంది గల్ఫ్‌దేశాలకు వెళ్లారు.. వెళుతున్నారు. అక్కడికి వెళ్లిన వారు వివిధ రకాలుగా బాధలు పడుతున్నారు..జైళ్లల్లో మగ్గుతున్నారు..షేఠ్ చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు..అన్యాయాలకు..అక్రమాలకు..
 బలవుతున్నారు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే మృతదేహాలను రక్తసంబంధీకులు చూసే భాగ్యంకూడా కొన్ని సందర్భాలలో దక్కటం లేదు. ఒక్క కువైట్‌లోనే నాలుగులక్షల మంది తెలుగువారు నివసిస్తున్నారు. దీంతోపాటు దుబాయ్, ఖతర్, మస్కట్, సౌదీ అరేబియా దేశాలలో మూడు లక్షల మంది ఉన్నట్లు అంచనా.

గల్ఫ్‌దేశాల్లో తెలుగువారిని చిన్నచూపు చూడటం సాధారణమైపోయింది. ఫిలిప్పీన్, శ్రీలంక,ఇరాన్, ఇరాక్, చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, పాకిస్తాన్ దేశాలకు చెందిన వారు, అలాగే మన దేశంలోని కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారు ఐక్యంగా తమ వారికి అన్యాయం జరిగితే సమష్టిగా ఆదుకుంటారు. అవసరమైతే తమ దేశ రాయబారి కార్యాలయం నుంచి వత్తిడి తీసుకొస్తారు. అయితే తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలకు స్పందించేవారుగానీ, చేయూత ఇచ్చేవారుగానీ కరువవుతున్నారు. దశాబ్ధాల కాలంలో గల్ఫ్ దేశాలలో తెలుగువారు బాధలు పడుతున్నా పట్టించుకునే నాథుడే ఉండటం లేదు. కనీసం తోటి తెలుగువారు కూడా సహకరించడం లేదు. దీంతో గల్ఫ్ దేశాలలో రోజురోజుకూ తెలుగువారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. చిన్నచిన్న విషయాలకే తెలుగువారు హత్యలకు గురికావడం, ఇతర సంఘటనలతో తొలిసారిగా గల్ఫ్‌దేశాలలో తెలుగుసంఘాలు ఒక్కటిగా నిలవాలని నిర్ణయించాయి. తెలుగువారికి అండగా, చేయూతగా నిలవాలని ఒకేతాటిపైకి వచ్చాయి.
 ఆవిర్భావం ఇలా..
తెలుగువారు పడుతున్న కష్టాలను పరిష్కరించడానికి కువైట్ దేశంలోని అన్ని తెలుగుసంఘాలు ప్రతినిధులు సమావేశమై యునెటైడ్ తెలుగుఫోరం-కువైట్‌గా ఏర్పాటు అయ్యారు. ఈమేరకు శుక్రవారం రాత్రి స్మాలియా ప్రాంతంలో తెలుగుసంఘాల నాయకులు భేటీ అయ్యారు. ఇందులో ఆదర్శ ఆంధ్రాయూత్, తెలుగుకళాసమితి, కళాంజలి, తెలుగులలితకళాసమితి, రాక్‌డ్యాన్స్ అకాడమీ, ప్రవాసాంధ్ర టీడీపీ , ఎన్‌ఆర్‌ఐటీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, మహాత్మాగాంధీవెల్ఫేర్, రియాల్-అరబ్ టు ఏపీ, మయూరి గ్రూప్స్, ప్రవాసాంధ్రకాంగ్రెస్, తెలుగు క్రిష్టియన్ సంఘాలున్నాయి. కోల్లబత్తుల వీర్రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో యడ్ల రవి, యేసురత్నం, దార్ల శ్రీను, త్రిమూర్తులు, ములకల సుబ్బరాయుడు, బలరాంనాయుడు, రాజశేఖర్, రాజేష్, బీపీనాయుడు, మురళీ, భాస్కరరెడ్డి, వెంకటరెడ్డి, వెంకటశివరావు, సత్య పాల్గొన్నారు.
 నిధులు సేకరణకు సమాయత్తం
కువైట్‌లో తెలుగుబాధితులను ఆదుకునేందుకు నిధుల సేకరణకు యునెటైడ్ తెలుగుఫోరం-కువైట్ సమాయత్తమైంది. బాధితులకు త్వరలో ఆర్థిక సహాయం అందచేస్తామని ప్రకటించింది. భారతరాయబారి సతీష్‌చంద్రమోహతాను కలిసి తెలుగువారి సాధకబాధకాలపై వినతిపత్రం సమర్పించారు. ఇటీవల సేఠ్ చేతిలో హత్యకు గురైన గాలివీడుకు చెందిన తోకలనరేష్, అగ్గివారిపల్లెకు చెందిన నల్లగుట్ట రమణయ్య, దుద్వాలకు చెందిన మాసగిరి ఓబులరెడ్డి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

తెలుగువారిని హత్య చేయడం దారుణం
కువైట్‌లో తెలుగువారిని హత్య చేయడందారుణం. వీధిన పడిన గల్ఫ్ బాధిత కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. మావంతు సహాయాన్ని యునెటైడ్ తెలుగుఫోరమ్ ద్వారా అందిస్తాం
- వీర్రాజు, యునెటైడ్‌ఫోరమ్, ఆర్గనైజర్, కువైట్
 హత్యలు విచారకరం
పొట్టి కూటి కోసం వచ్చిన వారు ఇలా హత్యలకు గురికావడం విచారకరం. తెలుగువారంతా ఒక్కటిగానే ఉండాలి. సమష్టిగా పోరాడాలి. అందుకే యునెటైడ్ ఫోరమ్‌ను బలోపేతం చేయాలి -ఆకులప్రభాకరరెడ్డి, కువైట్
 మానవత్వంతో ఆదుకోవాలి
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వచ్చిన ప్రతి ఒక్కరినీ మానవత్వంతో ఆదుకోవాలి. కువైట్‌లో తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటడానికి తెలుగు గొంతులు ఒక్కటికావాలి. - కె.ఈశ్వరబాబు, కువైట్
 ఎట్టకేలకు స్వదేశాలకు మృతదేహాలు
 ఈ నెల 1న కువైట్‌లో వేర్వేరు ప్రాంతాల్లో తుపాకీ తూటాలకు బలైన మూడు మృతదేహాలను స్వదేశాలకు పంపించేందుకు రంగం సిద్ధం చేసినట్లు శనివారం అందిన సమాచారం. ఇందులో వై.ఎస్.ఆర్ జిల్లాలోని గాలివీడు మండలం నాగువారివాండ్లపల్లెకు చెందిన తోకల నరేష్‌కుమార్, చిత్తూరు జిల్లాలోని కంభంవారిపల్లె మండలం ఎంవీపల్లె పంచాయితీ అగ్గివారిపల్లె గ్రామానికి చెందిన నల్లగుట్ట రమణయ్య, నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లెలో ఉంటూ సంబేపల్లె మండలం దుద్యాలలో జన్మించిన ఎం.ఓబులరెడ్డి ఉన్నారు. కాగా జిల్లాకు చెందిన తోకల నరేష్‌కుమార్ మృతదేహంను కువైట్‌లో ఈనెల 16న తరలించనున్నట్లు సమాచారం.
 ఈ మృతదేహాలను స్వదేశానికి చేర్చే క్రమంలో చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి ఉచితంగా స్వగ్రామాలను తరలించేలా అంబులెన్స్‌ను ఏర్పాటుచేయాలని, ఎన్‌ఆర్‌ఐసెల్‌తోపాటు చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లా కలెక్టర్లను కోరుతూ లేఖ రాసినట్లు వలసదారుల హక్కుల మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంబీ రెడ్డి శనివారం న్యూస్‌లైన్కు తెలిపారు. నల్లగుంట రమణయ్య, ఓబులరెడ్డి మృతదేహాలు ఆదివారం కువైట్‌లో తరలిస్తారని సోమవారం తెల్లవారుజామున చెన్నై విమానాశ్రయానికి చేరుతాయని స్పష్టంచేశారు. ఈ రెండు మృతదేహాలు వచ్చిన తర్వాత జిల్లాకు చెందిన నరేష్ మృతదేహం వస్తుందని ఆయన వివరించారు.