పోర్ట్‌లూయా (మారిషస్), డిసెంబర్ 8: ఎన్నో కష్టాలు పడి, మారిషస్‌లో నిలదొక్కుకున్న 150 ఏళ్ల నాటి కూలీల సంతతికి చెందిన తాము తెలుగుభాషా సంస్కృతుల వికాసానికి పాటు పడుతున్నామని మారిషస్ ప్రభుత్వంలో తెలుగు మంత్రి తొలితరం మంత్రి అయిన వీరాస్వామి సింహాద్రి కుమారుడు, ప్రస్తుత పర్యావరణ మంత్రి దేవా వీరాస్వామి అన్నారు. మంత్రి మాట్లాడుతూ మహాసభలను ప్రారంభించాలని మారిషస్ ప్రధాని చంద్రరాంగులామ్‌ను ఆహ్వానించామని చెప్పారు. తాను ఆయన ప్రతినిధిగా పాల్గొంటున్నట్టు తెలిపారు. మారిషస్ సాంస్కృతిక మంత్రి ముకేశ్వర్ చునీ మాట్లాడుతూ మారిషస్ ఒక సూక్ష్మ భారతదేశమని అన్నారు. మారిషస్‌లో తెలుగువారి పరిణామక్రమాన్ని వివరిస్తూ ప్రదర్శించిన నాటకం అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచంలోని తెలుగు వారందరికీ వేదికగా మారిషస్‌లో తెలుగు పీఠాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సాంస్కృతిక మంత్రి వట్టి వసంతకుమార్ ప్రకటించారు. మారిషస్‌లో జరుగుతున్న మూడు రోజుల ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీఠానికి ఏటా పది లక్షల రూపాయిలు నిధులు కేటాయిస్తామన్నారు. తెలుగు సంస్కృతీ పరిరక్షణకు, పరిశోధనకు మారిషస్ సహా ప్రపంచమంతా వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం 40 కోట్ల రూపాయిలు వెచ్చించి తెలుగు జానపద కళారూపాల డిజిటలైజేషన్‌కు, సంగీత, నృత్య కళల విస్తరణ తదితర కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు.
ప్రాథమిక విద్యామంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ ప్రపంచీకరణ ఫలితంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని నిలబడటానికి భాషను అభివృద్ధి పర్చుకోవాలని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రవాణా ఖర్చులు కూడా భరించి పాఠ్య పుస్తకాలను అందజేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేయమన్నారని తెలిపారు. భారత్‌తోపాటు అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, ఫిజి, యుకె, మారిషస్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, హిందీ అకాడమి చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలుగు యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ కె యాదగిరి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకుడు ఆచార్య డి మునిరత్నం నాయుడు, మారిషస్‌లో భారత రాయబారి టిపి సీతారాం, ఆంధ్రమహాసభ అధ్యక్షుడు కోడి రమణ, తెలుగు మాట్లాడేవారి సంఘం అధ్యక్షుడు రామస్వామి అప్పడు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన భాషా సదస్సులో లిపి సమస్యలపై మునిరత్నం నాయుడు, భాషా బోధనపై డాక్టర్ రెడ్డి శ్యామల, నూతన పదకల్పనలపై డాక్టర్ జె చెన్నయ్య పత్ర సమర్పణ చేశారు. వీరితోపాటు ఆచార్య పి అప్పారావు, ఆచార్య పి చెన్నారెడ్డి తదితరులు తమ పత్రాలు సమర్పించారు.
(చిత్రం - మారిషస్‌లో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించిన పర్యావరణ మంత్రి దేవా వీరాస్వామి, సాంస్కృతిక మంత్రి ముకేశ్వర్ చునీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మంత్రి వట్టి వసంతకుమార్, ప్రాథమిక విద్యా మంత్రి శైలజానాథ్ తదితరులు)
No comments:
Post a Comment