మహాసభల్లో తెలుగుదనం |
తెలుగు భాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ చక్రపాణి పిలుపు ఇచ్చారు. లుగు భాష, సాహిత్యాలు, సంస్కృతిని పరిరక్షించేందుకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసే విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని చక్రపాణి చెప్పారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మరోసారి చర్చిస్తానని ఆయన అన్నారు. వివిధ రాష్ట్రాల్లోని తెలుగు సంఘాలు జాతీయ సమాఖ్యగా ఏర్పడితే, దేశవ్యాప్తంగా తెలుగువారి కోసం ఒకే విధమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. బరంపురంలో 'ఆరవ అఖిల భారత తెలుగు మహాసభ'ల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆదివారం బరంపురం విచ్చేసిన చక్రపాణి సర్క్యూట్ భవనంలో 'న్యూస్‌టుడే'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 2008లో ఆంధ్రప్రదేశ్ సంయుక్త సభాసంఘం అధ్యక్షునిగా తాను ఒరిస్సాలో పర్యటించి, ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేస్తూ నివేదిక సమర్పించానని గుర్తు చేశారు. ఈ సభాసంఘం రావడానికి అప్పట్లో చీఫ్‌విప్‌గా పనిచేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ సిఫార్సుల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. చికిటి, పర్లాకిమిడిలలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ఒరిస్సా ముందుకు రావడం ఈ సిఫార్సుల్లో ఒక భాగమేనని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ కోసం ఉభయ రాష్ట్రాలు దామాషా పద్ధతిని పాటించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చిస్తానని చెప్పారు. ఒరిస్సాలో 40 లక్షల మంది తెలుగువారు ఉన్నట్లు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. తెలుగు అకాడమీని నెలకొల్పేందుకు ఒరిస్సా ప్రభుత్వం కూడా సహకరిస్తే తాము వెంటనే ముందుకు వస్తామని ఆయన వెల్లడించారు. బరంపురంలో జరుగుతున్న అఖిల భారత తెలుగు మహాసభలకు ఆంధ్ర మంత్రులు ఎందుకు రాలేదన్న ప్రశ్నకు చక్రపాణి స్పందిస్తూ 'మేం క్రియాశీలత, ఫలితాలకు కట్టుబడి ఉన్నాం. ఈ సభల్లో తీసుకునే తీర్మానాలను చిత్తశుద్ధితో అమలు జరిగేలా పూర్తి సహకారం అందిస్తాన'ని తన మాటగా ముఖ్యమంత్రి చెప్పమన్నారని చక్రపాణి పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల మంత్రులు రాలేకపోయారని, అయితే పూర్తిస్థాయిలో అధికారులను ఇక్కడకు పంపామని గుర్తు చేశారు. సభలకు సంబంధించి ప్రతీ క్షణం వివరాలు తెలుసుకుంటున్నామని చక్రపాణి చెప్పారు. రాష్ట్రేతర తెలుగు ప్రజలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉదాశీనత, నిర్లక్ష్యం లేవని స్పష్టం చేశారు. గతంలో తాను సభాసంఘం అధ్యక్షునిగా వచ్చినప్పుడు శాసనసభ్యులు సుజ్ఞానికుమారి దేవ్, ఉషాదేవిలతో తెలుగువారి సమస్యలను కూలంకషంగా చర్చించానన్నారు. ఇక్కడి తెలుగు వారు తమ భాష, సంస్కృతులను పరిరక్షించుకుంటూనే 'పాలు-నీళ్ల'లా ఒరియా భాషా, సంస్కృతులతో కలిసిపోవడం గొప్ప విషయమన్నారు. గతంలో తాను సభాసంఘం అధ్యక్షుని హోదాలో నవీన్ పట్నాయక్‌తో చర్చించానని, మా విజ్ఞప్తి మేరకు బరంపురం ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం అభివృద్ధికి నిధులు అందజేయడం ఆయన సుహృద్భావానికి నిదర్శనమని చెప్పారు. ఒరియా ప్రజల అభిమాన నాయకుడు బిజు పట్నాయక్, ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి నవీన్‌పై తమకు ప్రత్యేకమైన అభిమానం ఉందని పేర్కొన్నారు. వారి కుటుంబంతో ముందు నుంచి మా ముఖ్యమంత్రి కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయని చక్రపాణి చెప్పుకొచ్చారు. ఈ సభల వల్ల తెలుగు ప్రజలకు తప్పకుండా మేలు కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సభలో అతిథులుగా పాల్గొన్న ఒరిస్సాలోని కవిసూర్యనగర్ శాసనసభ్యురాలు వి.సుజ్ఞానికుమారి దేవ్, బరంపురం శాసనసభ్యుడు డాక్టర్ రమేష్‌చంద్ర చ్యవుపట్నాయక్‌లు మాట్లాడుతూ తెలుగువారి విద్యా సమస్యల పరిష్కారానికి తాము కూడా ఒరిస్సా ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని ప్రకటించడం గమనార్హం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య భూమయ్య, ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ ఎస్.చెల్లప్ప, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం సభ్యుడు ఆచార్య కె.రామమూర్తి నాయుడు, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఇన్‌ఛార్జి సంచాలకుడు డాక్టర్ మునిరత్నం నాయుడు, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్, ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం అధ్యక్షుడు శ్రీపాద రాంకుమార్, కార్యదర్శి పి.వి.రమణ, నిర్వాహక అధ్యక్షుడు పి.సత్యనారాయణలు సభల నిర్వహణలో ప్రధానభూమిక పోషించారు. ముగింపు రోజు భాషా సాహిత్యాలు, ప్రాచీన ఆధునిక సాహిత్యాలు, ఆధునిక సాహిత్యంలో ధోరణులు, ఎందరో మహానుభావులు పేరిట సదస్సులు, కవి సమ్మేళనం జరిగాయి. ఆయా అంశాలపై పరిశోధకులు సమర్పించిన పరిశోధన పత్రాలు ఇటీవల వస్తున్న కొత్త పోకడలను అర్థం చేసుకునేందుకు, పరిశోధకుల మేథకు మరింత పదును పెట్టేందుకు దోహదపడ్డాయని పలువురు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ముగింపోత్సవాలలో ప్రదర్శించిన జానపద కార్యక్రమాలు, సంక్రాంతి కూచిపూడి నృత్యరూపకం, పేరిణి నృత్యం, కూచిపూడి నృత్యాలు, శ్రీనివాస కల్యాణ నాటకం, సినీ సంగీత విభావరి కార్యక్రమం అందరినీ ఆహ్లాదపరిచాయి.
ఒరిస్సా ఎమ్మెల్యేలు, తెలుగు ప్రతినిధులతో మంత్రి డాక్టర్ శైలజానాథ్ భేటీ
తీపిగుర్తులతో తెలుగు బాట |
బరంపురంలో తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనమండలి అధ్యక్షుడు డాక్టర్ ఎ.చక్రపాణి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎస్.శైలజానాథ్‌లు ఆదివారం విచ్చేశారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని ప్రత్యేక సర్క్యూట్ భవనంలో వీరు ముందుగా కవిసూర్యనగర్, బరంపురం శాసనసభ్యులు వి.సుజ్ఞానికుమారి దేవ్, డాక్టర్ రమేష్‌చంద్ర చ్యవుపట్నాయక్, ఒరిస్సాలోని తెలుగు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒరిస్సాలో తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చక్రపాణి, శైలజానాథ్‌ల దృష్టికి తెచ్చారు. ఒరిస్సా ఉపాధ్యాయ విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్‌లో బి.ఇడి.లో ముప్ఫై సీట్లు, సి.టి.లో అరవై సీట్లు కేటాయించాలని కోరారు. ఒరిస్సా ప్రభుత్వం ఆంధ్రలోని ఒరియా విద్యార్థుల కోసం ఏటా రూ.కోటి మంజూరు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒరిస్సాలోని తెలుగు విద్యార్థుల కోసం అంతే సొమ్మును కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి తెలుగు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేయాలని, తెలుగు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. వీటిపై డాక్టర్ చక్రపాణి, డాక్టర్ శైలజానాథ్‌లు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమైన సమస్యలపై తమకు వివరాలు పంపిస్తే పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు మంత్రి శైలజానాథ్ సర్క్యూట్ భవనం ఆవరణలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
No comments:
Post a Comment