Tuesday, December 18, 2012

తెలుగు భాష గురించి ఎవరేం చెప్పారు?

తిరుపతిలో డిసెంబర్ 27, 28, 29 తేదీలలో ‘4వ ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత పరమోన్నతంగా నిర్వహించబోతున్న విషయం జగద్వితమే. ఈ సందర్భమున మన తెలుగు భాషా ప్రశస్తి’’ గురించి చర్చించుకోవడం సందర్భోచితం. దేశీయులు, విదేశీయులు, సంగీతకారులు, సాహితీవేత్తలు, భాషావేత్తలు, రాజకీయ నేతలు మన తెలుగు భాషను శ్లాఘించిన తీరు, మెచ్చుకొన్న మాటలు చదివితే, తెలుగువారి తనువు అణువణువునా పులకిస్తుంది.

1. ద్రావిడ భాషలన్నింటిలోకి తెలుగు మధురాతి మధురమైన భాష

-హెన్రీ మోరీస్ (1890)

2.తెలంగా, తెలింగా, తెలాంగ్ అనేవి జాతికి, భాషకి, లిపికీ పేర్లు. తెలుంగులు వ్రాసే లిపిని ఆంధ్రీ లిపి అంటారు.

అల్ బెరూని (కీ.శ.1014)

3.తెలుగు భాష తూర్పు దేశాలలో ఇటలీ లాంటిది.                                                   -(నికొలా కాంటె - 1420)
4. తెలుగు లిపి ఒరియా లిపి లాగా గుండ్రంగా వుంటుంది. గంటంతో అడ్డగీతలు గీస్తే తాటాకు చినిగిపోతుంది కాబట్టి గుండ్రంగా రాసేవాళ్ళు.                                                                                          - జె.డి.అండర్‌సన్ (1913)
5.దేశ భాషలందు తెలుగు లెస్స
-శ్రీకృష్ణదేవరాయలు
6.తెలుగు కష్టమయిన భాషేకానీ, సంస్కారయుతమైన భాష. భావాలను సొంపుగా, సౌలభ్యంతో చక్కగా వ్యక్తం చేయవచ్చు.
- విలియం కేరీ (1814)
7.శబ్ద సంపదలో, శబ్ద సౌష్టవంలో, భావ వ్యక్తీకరణలో, శ్రావ్యతలో తెలుగుతో మిగతా దేశ భాషలు సాటి రావు. వీనుల విందుగా వుండబట్టే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్అన్నారు. తెలుగు భాష అభివృద్ధి చెందుతున్న కొద్దీ తనకు దగ్గరగా వచ్చే చాలా శబ్దాలను ఆయా ప్రాచీన కావ్య భాషలనుండి గ్రహించింది కాబట్టి ఇంగ్లీష్ ఆఫ్ ద ఈస్ట్అనవచ్చు. సంస్కృతం తనంతట తానుగా వాడుక భాష కాలేకపోయింది. కానీ సరళమైన, సులభమైన తెలుగు భాష ద్వారా సంస్కృతం వాడుకలోకి వచ్చింది.                                                                                -ఎ.ది.క్యాంప్‌బెల్ (1816)
8. అన్ని ప్రాంతీయ భాషల కంటె తెలుగు భాష మధురమైనది.                                      - మూల్ బెర్నెల్ (1837)
9.తెలుగు భాషలో అచ్చులు ఎక్కువగా వుండటంవలన ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్అనే పేరు వచ్చింది.
                                                                                              - మోనియల్ విలియమ్స్ (1878)
10.ద్రావిడ భాషల్లో తెలుగే అతిమధురమైనది, ప్రాచీనతలో రెండవది.
-రెవరెండ్ రాబర్ట్ కాల్‌వెల్ (1857)
11.తెలుగు వీనులకు విందు. ద్రావిడ భాషలన్నింటిలోకి మధురాతి మధురమైనది. చదువురానివాడు మాట్లాడినా చెవులకింపుగా వుంటుంది. దీనిని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్అనడం ఎంతో సమంజసం.
-హెన్రీ మోరీస్ (1890)
12. తూర్పు దేశాలలో తెలుగు భాష అతి మృదువైన భాష. తెలుగువారి సంస్కృతోచ్ఛారణ కాశీవాసుల సంస్కృతోచ్ఛారణలాగా వుంటుంది.
-మాన్యువల్ ఆఫ్ ఎడ్మినిస్ట్రేషన్మద్రాసు (1893)
13. ద్రావిడ భాషల్లోకెల్లా తెలుగే శ్రావ్యమైనది. ప్రతి పదం అజంతం. అందుకే అది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్అనిపించుకుంది.
-జి.ఎ.గారిసన్ (1906)
14.తెలుగు ద్రావిడ భాషా కుటుంబంలో ఉత్తరాదిది, ఆర్యభాషా కుటుంబంలో దక్షిణాదిది. రెంటి లక్షణాలు కొద్దిగా దీనిలో వున్నాయి. పొందికగల శక్తివంతమైన భాష, వ్యాకరణ సౌలభ్యం గల భాష. ఇతర భాషల్ని తేలికగా తనలో కలుపుకుంటుంది. సహజంగా శ్రవణానందకరంగా వుంటుంది. పరభాషా పదాలను ఉపయోగించినా ఔదార్యంతో అన్ని భాషలను స్వీకరిస్తుంది. దానికి సంకుచితత్వం లేదు.
-జి.హోమ్ ఫీల్డ్ మెక్‌లాయిడ్ (1958)
15. బ్రిటిష్ పరిపాలన అంతమయి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డనాడు వారి భాషలోనే వారి పరిపాలనా వ్యవహారాలు సాగించడానికి తప్పక ప్రయత్నం చేయాలి.
-ఆర్.కాల్‌ట్టెల్ (1935)
16. భారతీయ భాషలన్నింటిలోకి పరభాషా పదాలను తెలుగు గ్రహించినంత సులభంగా మరే భాషా స్వీకరించలేదు. కాబట్టి ఎప్పటికైనా సైన్సు, మెడిసిన్, ఇంజనీరింగ్‌ల బోధనలో హిందీకి తెలుగే ధీటైన ప్రత్యర్థి అవుతుంది. జాతీయ భాషకు కావాల్సిన అన్ని లక్షణాలు తెలుగుకు వున్నాయి.
-జె.బి.ఎస్.హాల్‌దెన్ (1958)
17.తెలుగువారు ఐరోపా ఖండవాసులవలే నాగరికులు. వారి భాష ఇటలీలాగా వుంటుంది.
-ఛర్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ (1857)
18.సుందరమైన తెలుగు పాట పాడుతూ సింధూ నదిలో పడవ నడుపుదాం.
-సుబ్రమణ్యం భారతి
19. ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ నాల్పస్య తప్యఫలమ్                                                   - అప్పయ్య దీక్షితులు
ఎంతో తపస్సు చేస్తేగానీ, ఆంధ్రదేశంలో పుట్టే అదృష్టంగానీ, ఆంధ్ర భాష నేర్చుకునే అదృష్టం గానీ లభించదు.
20.ఏ భాష చెణుకైనా, ఏ యాస చినుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగు
-డా సి.నారాయణరెడ్డి
21.దేశభక్తి అంటే మాతృభాష మీద అభిమానమే. మాట్లాడుతున్న భాషను కాదని పరభాషను పూజించటం ఎలాంటిదంటే, ఆకలితో అలమటిస్తున్న సాటి మనిషికి అన్నం పెట్టకుండా చనిపోయిన వారి పేరుతో శ్రాద్ధా భోజనం పెట్టడం లాంటిది. 
-గిడుగు వేంకట రామమూర్తి
22.‘తెలుగుశబ్దానికి సంస్కృతీకృత రూపమే త్రిలింగం’.                                                          -కొమ్మర్రాజు లక్ష్మణరావు
23. ద్విభాషా నాణాలపైన గౌతమీపుత్ర శాతకర్ణి ప్రాకృతంతోపాటు తెలుగును వాడాడు.
-డి.సి.సర్కార్
24.ఒక్క సంగీతమేదో పాడునట్లు, మాట్లాడునప్పుడు విన్పించు భాష తెలుగు భాష. భాషలొక పది తెలిసిన ప్రభువు చేత భాషయన యిద్దియని అనిపించుకున్న భాష.
-విశ్వనాధ సత్యనారాయణ
25.క్రీ.శ. ఒకటో శతాబ్ది నాటి ప్రాకృతంలో వచ్చిన గాథాసప్తశతిలోని 700 పద్యాలలో తెలుగు మూల పదాలున్నాయి.
-డా. సి.నారాయణరెడ్డి
26.పూలలోని మధువు, పున్నమి వెనె్నల, చిట్టిపాప నవ్వు, పుట్ట తేనె కలిపి చూడు. తెలుగు పలుకులై భాసించు.
-డా ఆచార్య తిరుమల రామచంద్ర
27.తెనుగుదనము వంటి తియ్యదనము లేదు, తెలుగు కవులువంటి ఘనులు లేరు.
-డా కరుణశ్రీ
28.కలదయేని పునర్జన్మ కలుగుగాక
మధుర మధురంబయిన తెల్గు మాతృభాష
-విశ్వనాధ సత్యనారాయణ
29.తెలుగు పదార్చన చేసినందుకు
ధన్యుడనైతిని                                                                                        -తుమ్మల సీతారామ్మూర్తి
30.తెనుగుం జేయరు మున్ను భాగవతమున్
దీనిం దెనిగించి నా జననంబున్
సఫలంబు జేసెద పునర్జన్మంబు లేకుండగన్
-బమ్మెర పోతన
31.దాదాపు తొమ్మిది వేల సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశానికి వలసవచ్చి స్థానికులైన తెలుగు జాతులతో కలిసిపోయిన తమిళుల భాష కంటే, క్రీ.పూ.12వ శతాబ్దంలో ఆర్య బ్రాహ్మణులు రూపొందించుకున్న సంస్కృతం కంటే ఎంతో ప్రాచీనమైనది మన తెలుగు భాష
-భపతి నారాయణమూర్తి
32.తెలుగు పతాకం యెరుగని దేశమే లేదు
తెలుగు దివ్వె వెలుగునట్టి దిశయే లేదు
-శ్రీ దాశరథి రంగాచార్య
33.తెలుగు దీప్తి సహస్ర కళలతో సాగినది
తెలుగు గీతి సహస్ర దిశలయందు మ్రోగినది
-డా సి.నారాయణరెడ్డి
34.తెలుగువాడు ఏడనున్నా తెలుగువాడే
తెలుగు భాషనే సొంపుగా పలుకుతాడు
-కొసరాజు రాఘవయ్య
35.తెలుగు బిడ్డవయుండి, తెలుగు రాదంచు
సిగ్గులేకా ఇంక చెప్పడమెందుకురా?
అన్య భాషలు నేర్చి, ఆంధ్రమ్ము రాదంచు
సకలించు ఆంధ్రుడా చావవెందుకురా
-శ్రీ కాళోజీ నారాయణరావు
36.తెలుగుదనం మనకు ధనం
తెలుగు భాష చరిత ఘనం
-ఎలమర్తి రమణయ్య
37.దేశ భాషలలోన
 దేదీప్యమానమైన
నిత్యమై - సత్యమై
 నిలిచి గెలిచిన భాష
ఎంత కమ్మని భాష మనది
ఎదను కదిపే భాష మనది 
-డా మల్లెమాల
38.చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడుపెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల తెలుగు 
-జొన్నవిత్తుల
39.ఆ సరస్వతి రూపు ప్రత్యక్ష మొనరించు ప్రథమ భాష
నన్నయాదుల నుం నవయుగ కవి దాకా ఆత్మశక్తిని గూర్చు అమృత భాష
-విశ్వనాథ సత్యనారాయణ
40.తెలుగు భాష మధురమైనది. ఆ భాష నేర్చుకోవాలని నేను చేసిన ప్రయత్నం అక్షరక్రమంతోనే ఆగిపోయింది. తెలుగువారు అమాయకులు, మధుర స్వభావులు, త్యాగనిరతులు.
-మహాత్మా గాంధీ
41. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు దెనుగు లెస్స, జగతి దల్లికంటె సౌభాగ్య సంపద మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? ----శ్రీనాధ కవి
ఈ విధంగా మన తెలుగు భాషను వేనోళ్ళుగా పండితులు, ప్రముఖులు ప్రస్తుతించారు. అంతటి ఘనకీర్తి కల్గిన మన తెలుగులో మాట్లాడుదాం, తెలుగులో రాద్దాం, తెలుగులో జీవిద్దాం. తెలుగు భాషా పునాదులపై మన మేధోవికాసం, జీవన వికాసం పెంపొందించుకుందాం.

-మొగిలిచెండు సురేశ్ 
"ఆంధ్రభూమి" దినపత్రిక సౌజన్యంతో..



Thursday, December 6, 2012

తెలుగు భాషకు శాశ్వత నిఘంటువు, పదాన్వేషణ జరగాలి

గుంటూరు, డిసెంబర్ 1 : సామాన్యులు, శ్రమ జీవులు ఉన్నంత కాలం తెలుగుభాష అంతరించిపోయే ప్రమాదమేమీ లేదని భాషావేత్తలు భరోసా ఇచ్చారు. అయితే... ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల అవసరాల మేరకు భాష సంసిద్ధం కాలేదని పేర్కొన్నారు. శనివారం ఉదయం గుంటూరులో తెలుగు భాషోద్యమ సమాఖ్య 9వ మహాసభలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న 'ఆంధ్రజ్యోతి' సంపాదకుడు కె.శ్రీనివాస్, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తదితరులు ప్రసంగించారు. 
తెలుగు భాషను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో భాషా సాహిత్యాలతో సన్నిహితంగా ఉన్న తరం, తమ సంతానం తెలుగుకు దూరం కావడం చూసి భాషకే ప్రమాదం వాటిల్లిందని భయపడుతున్నారని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి తెలుగుకు వారు భయపడుతున్నంత ప్రమాదం ఏమీలేదన్నారు. "ఇంకా రాష్ట్రంలో 50 శాతం మంది నిరక్షరాస్యులున్నారని చెప్పారు. ఇంగ్లీష్ స్పర్శకు దూరంగా ఉన్న వీళ్లతో తెలుగు భాష పదిలంగా ఉంటుంది'' అన్నారు. ఆధునిక అవసరాలకు తగట్టుగా భాషను సంసిద్ధం చేయకపోవడం సమస్యలకు మూలం అవుతోందని పేర్కొన్నారు. తెలుగు సమాజానికి ఒక శాశ్వత నిఘంటువు ఉండాలని., కొత్త పదాలను వాడుకలోకి తీసుకొచ్చేందుకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అకడమిక్ వ్యవస్థ ఉండాలని కె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. 
భాష ఒక అధికారం: చుక్కా రామయ్య
భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణకే కాదని, దానికి ఒక అధికారం ఉంటుందన్న విషయాన్ని నైజాం హయాంలోనే గ్రహించానని మహాసభల ప్రారంభోపన్యాసంలో ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పేర్కొన్నారు. తెలుగు భాషపై చర్చించడానికి ఏర్పడిన ఆంధ్ర మహాసభ వెట్టి చాకిరీని పారదోలిందని, దున్నే వాడిదే భూమి నినాదాన్ని కూడా తీసుకొచ్చిందని గుర్తు చేశారు. భూసంస్కరణలు, తెలంగాణలో సాయుధ పోరాటానికి ఊపిరి పోసిందని చెప్పారు.

"ప్రజా సమస్యలపై తెలుగు భాష చర్చించిన రోజే అందరూ ఇందులో భాగస్వామ్యులు అవుతారు. భాష పండితుల గుప్పిట్లో నుంచి గుడిసెల్లోకి పోవాలి. అధికారిక ముద్రపడిన భాష నిరంకుశత్వానికి దారి తీస్తుంది తప్ప ప్రజల సమస్యల్ని పరిష్కరించదు. శ్రమ జీవి బతికున్నంత వరకు తెలుగు భాష పదిలంగా ఉంటుంది'' అని చుక్కా రామయ్య చెప్పారు. తెలుగు భాష వికాసం కావాలంటే కనీసం పదో తరగతి వరకైనా తెలుగు మాధ్యమాన్ని అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఒక కారణం కోసం వెయ్యి మందికి పైగా ఆత్మహత్య చేసుకొన్నారని, ఏ రోజు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి కొనసాగుతోన్న తరుణంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం శోచనీయమన్నారు. 
తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ: రమేశ్
తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు సామల రమేశ్ బాబు కోరారు. పాలనాపరమైన ఉత్తర్వులు తెలుగులోనే వెలువడేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేడు తెలుగు భాషను అభిమానించే వారున్నారు కానీ, అది అన్నం పెడుతుందని నమ్మే వారు కరువయ్యారని సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. 

భాష ఉపాధి కల్పిస్తుందన్న భరోసా కలిగినప్పుడే అభివృద్ధి చెందుతుందన్నారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాల్సిన తెలుగు యూనివర్సిటీ ఏం చేస్తోందని వేమన ఫౌండేషన్ అధ్యక్షుడు, మిసిమి సంపాదకుడు సి.ఆంజనేయ రెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కె.సుబ్బారెడ్డి, కవి, పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, November 27, 2012

గుంటూరులో 1,2 తేదీల్లో తెలుగు భాషోద్యమ సమాఖ్య మహాసభలు

 తెలుగు భాషోద్యమ సమాఖ్య పతాకం
డిసెంబర్ 1,2 తేదీల్లో గుంటూరులో తెలుగు భాషోద్యమ సమాఖ్య వార్షిక సభలను నిర్వహించబోతోంది.  గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలోని బాలాజీ కల్యాణమండపంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి.  దాదాపు 300 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సభలకు సమాఖ్య అధ్యక్షుడు సామల రమేశ్‌బాబు అధ్యక్షత వహిస్తారు. డిసెంబర్ 1వ తేదీన 10 గంటలకు సభలను శాసనమండలి సభ్యులు డాక్టర్ చుక్కారామయ్య ప్రారంభిస్తారు. ముఖ్య అతిథిగా అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, విశిష్ట అతిధిగా మాజీ డిజిపి సి.ఆంజనేయ రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక మండలి సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి పాల్గొంటారు. ప్రత్యేక అతిథిగా డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, ఆత్మీయ అతిధిగా కె.ఎస్.లక్ష్మణ్‌రావు, ఆంధ్రజ్యోతి సంపాదకుడు డాక్టర్ కె.శ్రీనివాస్ పాల్గొంటారని సమాఖ్య అధ్యక్షుడు సామల రమేష్‌బాబు, ప్రధానకార్యదర్శి వెన్నిశెట్టి సింగారావులు తెలిపారు. సాయంత్రం 3 గంటలకు ప్రతినిధుల సభలను డాక్టర్ జయధీర్ తిరుమల రావు ప్రారంభిస్తారని, తెలుగుభాషోద్యమ సమాఖ్య ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లపై మూడు గంటల పాటు జరిగే చర్చలో ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెబుతారని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల పట్ల సమాఖ్య వైఖరిని, చేపట్టదలచుకున్న కార్యక్రమాన్ని నిర్ణయించి తీర్మానాలు చేస్తామని వారు చెప్పారు. డిసెంబర్ 2వ తేదీన ప్రభుత్వానికి భాషా విధానం- ప్రజల్లోకి భాషోద్యమం అనే అంశంపై సదస్సులను నిర్వహిస్తామని సమాఖ్య ఉపాధ్యక్షురాలు డాక్టర్ పోలవరపు హైమావతి కీలక ఉపన్యాసం చేస్తారని అన్నారు. రాజకీయ రంగం నుండి ఎస్ తులసిరెడ్డి, దాడి వీరభద్రరావు, జూలకంటి రంగారెడ్డి, డాక్టర్ కె.నారాయణ, బండారు దత్తాత్రేయ, భూమన కరుణాకర్‌రెడ్డి, డివిఎస్ వర్మ పాల్గొంటారని, ఉపాధ్యాయ రంగం నుండి ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయ సంఘం నాయకులు కె.సుబ్బారెడ్డి, పి.పాండురంగవరప్రసాద్, చామర్తి శంకరశాస్ర్తీ పాల్గొంటారని అన్నారు. ముగింపు సభలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కోదాటి వియన్నారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని వారు వివరించారు.

Wednesday, August 29, 2012

దేశభాషలందు తెలుగు లెస్స!

తెలుగువారందరికి తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు! 

Tuesday, July 31, 2012

కళాస్రష్టలు కొండపల్లి శేషగిరి రావు, వెంపటి చినసత్యం లకు నివాళి


తెలుగు కళామతల్లి నాల్గురోజుల వ్యవధిలో ఇద్దరు ఉత్తమ పుత్రులను కోల్పోయి విషణ్ణవదన అయింది. ఒక జాతి సాంస్కృతిక వారసత్వానికి, ఔన్నత్యానికి నిలువుటద్దం దాని కళా సంపద, ప్రాభ వం. శిల్పసంపదతో పాటు చిత్రలేఖనం, నాట్యం పరంపరాగత కళలేగాక కళోపాసకుల సృజనశీలతతో కొత్త పుంతలు తొక్కుతుం టాయి. ఆధునికతను, సమకాలీనతను సంతరించుకుంటూ వుం టాయి. సాంప్రదాయకతను స్వీకరిస్తూనే ఆధునికరీతుల రంగులద్ది వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్‌తరాల సాంస్కృతిక, ఆత్మిక వికాసా నికి, మానసికోల్లాసానికి ప్రాతిపదికలు నిర్మిస్తాయి. అటువంటి రెండు కళారూపాలకు జీవంపోసి, జీవనాధారం చేసుకుని శిష్యప్రశి ష్యులతో అజరామర కీర్తినార్జించిన కళాస్రష్టలు కొండపల్లి శేషగిరి రావు, వెంపటి చినసత్యం. ఇరువురూ వారు ఎంచుకున్న మార్గంలో సిద్ధహస్తులు, లబ్ద ప్రతిష్టులు. శేషగిరిరావు చేతిలోని కుంచె అద్భుత కళాఖండాలు సృష్టించగా, వెంపటివారి నర్తనం తెలుగువారి 'కూచి పూడి' నాట్యానికి ఖండాతర ఖ్యాతి ఆర్జించింది. ఇరువురూ ఎనభై పదులు పైబడిన నిండు జీవితం జీవించినవారే. వారు ఆ జీవితాన్ని సార్థకం చేసుకున్న సృజనశీలురు, మట్టిలో మాణిక్యాలు, చిరం జీవులు. గురువారం తెల్లవారుఝామున కన్నుమూసిన కొండపల్లి శేషగిరిరావు (89సం||) జన్మస్థలం వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలం పెనుకొండ గ్రామం. ఆంధ్రాయూనివర్శిటీ, రాజస్థాన్‌ బనస్థలి విద్యాపీఠ్‌, హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాప్ట్స్‌లో విద్యాభ్యాసం చేసిన శేషగిరిరావు శాంతినికేతన్‌లో నందలాల్‌బోస్‌ శిష్యరికంలో చిత్రకళను ఔపోసనపట్టారు. ప్రకృతిని ప్రేమించే చిత్ర కారునిగా ఆరంభమైన ఆయన జీవితం పౌరాణిక, ఇతిహాస ముద్రల గుండా ప్రయాణించి సమకాలీన జీవిత చిత్రణవైపు మరలింది. నిజాం నిరంకుశ పాలనలో జీవించిన ఆయన ఆ కర్కశపాలనకు వ్యతిరేకంగా ప్రజాతిరుగుబాటును సైతం కళ్లకుగట్టినట్లు చిత్రించారు. రైతాంగ సాయుధ పోరాటంతోపాటు ఆర్యసమాజ్‌ మొదలు కాంగ్రెస్‌ వరకు నిజాం వ్యతిరేక ప్రజాపోరాటంలోని భిన్నపార్శ్యాలను ఎంతో సృజనాత్మకంగా చిత్రించారు. తెలంగాణ కాకిపడగలు, రామ ప్పదేవాలయం విశిష్టతను తనకుంచెతో హృద్యమంగా చిత్రించిన తొలి చిత్రకారుడు ఆయనే. తెలుగు చిత్రకళను, అంతర్జాతీయవేదిక మీద సగౌరవంగా ఆవిష్కరించిన కొద్దిమంది చిత్రకారులలో గణ్యుడు శేషగిరిరావు. 1975లో రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతికశాఖ హైదరా బాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలో చూపరులను ఇట్టే ఆకట్టుకున్న ''తెలుగుతల్లి'' చిత్రపటం ఆయన సృజనకు దర్పణంగా నిలిచింది. ఎన్నో పురస్కారాలు ఆయన్ను వెదుక్కుంటూ వచ్చాయి. 1988లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రదానం చేసిన ఎమిరిటస్‌ ఫెలోషిప్‌, తెలుగు విశ్వవిద్యా లయం వారి గౌరవ పురస్కారం డాక్టరేట్‌, ప్రతిష్టాత్మక హంస అవార్డు ఎన్నదగినవి. సాంకేతిక, వృత్తివిద్యల వైపు పరుగుతో సాంప్రదాయ కళలు కనుమరుగయ్యే నేటి పరిస్థితుల్లో ప్రతి జిల్లాలో ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలను ప్రారంభించి కళాకారులను ప్రోత్సహించడంతో పాటు మన కళలను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది.
ఆదివారం తెల్లవారుజామున చెన్నైలో కన్నుమూసిన నాట్యా చార్యులు, పద్మభూషణ్‌ వెంపటి చినసత్యం (82సం||) పేరువినని వారుండరు. కృష్ణా జిల్లా దివితాలుకాలోని కూచిపూడి గ్రామం సిద్ధేంద్రయోగి ఆవిష్కృ తంగా చెప్పబడే నాట్యరీతికి పుట్టినిల్లు. అదే కూచిపూడి నాట్యరీతిగా ప్రసిద్ధమైంది. భాగవతులు వంశపారం పర్యంగా సాధనచేస్తూ బతికించుకుంటూవస్తున్న ఆ నాట్యానికి ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిపెట్టినవారు చిన సత్యం. ఈ నాట్యంలో ఒకప్పుడు ఆడవారికి ప్రవేశం లేదంటే ఆధునిక తరాలు నమ్మలేరు. సాంప్రదాయక పౌరాణిక కథావస్తువులతో సాగే ప్రదర్శనలో మగవారే స్త్రీపాత్రలు పోషించే వారు. అటువంటి ఛాందసాలను వదిలించి, సరికొత్త నృత్యనాటికలను రూపొందించి ' కూచిపూడి ' నాట్యానికి కొత్త రక్తం ఎక్కించి, ఆకర్షణీయం చేసి బహుళ ప్రాచుర్యం కలిగించిన వారు సత్యం. ఆంధ్రుల పారంపర్య నృత్యమైన ' కూచి పూడి' కనుమరుగయ్యే దశలో దాన్ని పునరుజ్జీవింపజేసేందుకు చిన సత్యం కృషి నిరుపమానం, అనితరసాధ్యం. అదొక అశిధారావ్రతం. భారతీయ శాస్త్రీయ నృత్యాల్లో చిన్నచూపుకు గురవుతున్న ' కూచిపూడి' రీతి సశాస్త్రీయతను నిరూపించి దానికి భారతప్రభుత్వ గుర్తింపు పొందటంలో ఆయన చేసిన కృషి ఆధునిక నాట్యాచార్యుల్లో అగ్రతాంబూలానికి అర్హుణ్ణిగావించింది. 1947లో మద్రాసు చేరి సోదరుడు పెదసత్యం వద్ద సినిమాలలో నృత్యదర్శకత్వంలో సహా యకునిగా, తదుపరి పలు చిత్రాలకు నృత్యదర్శకునిగా పనిచేసిన ప్పటికీ ఆయన దృష్టి అంతా 'కూచిపూడి' నాట్య విశిష్టతమిదే లగమైంది. '1963లో మద్రాసు టీనగర్‌లో ఆయన నెలకొల్పిన కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ' ఆయన జీవిత లక్ష్య సాధనకు సోపాన మైంది. భరతనాట్యం ప్రభావం ఎక్కువగా ఉన్న మద్రాసులో 'కూచిపూడి 'కి సముచితస్థానం సంపాదించేందుకు నడుంకట్టారు. పాతికేళ్ల కృషి 'కూచిపూడి'ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆయన వద్ద శిక్షణ పొందినవారిలో విదేశీయుల సంఖ్య కూడా గణనీయం.
పురాణ ఘట్టాలకు సృజనాత్మకతను జోడించి ఎంతో హృద్య మంగా చినసత్యం రూపొందించిన నృత్యరూపకాలలో శ్రీకృష్ణపారి జాతం, శ్రీనివాస కళ్యాణం, రుక్మిణి కళ్యాణం, చండాలిక, అర్థనారీ శ్వరం, హరవిలాసం, రామాయణం, క్షీరసాగరమథనం, కిరాతార్జు నీయం రసజ్ఞుల ప్రశంసలు పొందాయి. దేశవిదేశాల్లో అసంఖ్యా కంగా ప్రదర్శనలిచ్చారు. 2011లో హైదరాబాద్‌లో 2800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నృత్యకార్యక్రమంతో గిన్నీస్‌ రికార్డు నెలకొల్పారు. చినసత్యంగారికి ఆంధ్రవిశ్వవిద్యాలయం 1980లో గౌరవ డాక్టరేట్‌, కళాప్రపూర్ణ బిరుదు ప్రదానం చేయగా, భారతప్రభుత్వం 1998లో ' పద్మభూషణ్‌ 'తో సత్కరించింది. 'భరణి కళాప్రపూర్ణ' సహా నాట్యరంగంలో అందు కున్న పురస్కారాలు మరెన్నో. కూచిపూడి నృత్యమే తన శ్వాసగా జీవితాంతం శ్రమించి ఎందరో నర్తక, నర్తకీమణులను తయారుచేసి, ఆ నాట్యరీతికి భారతీయ నాట్యరీతుల్లో సముచితస్థానం ఆర్జించి పెట్టిన వెంపటి చినసత్యం సృృతి శాశ్వతం. ఆయన శిష్యకోటి ఆయన కృషికి సజీవ దర్పణాలు. కూచిపూడి నాట్యం సజీవంగా వున్నంతవరకు వెంపటి చినసత్యం చిరంజీవి.

-విశాలాంధ్ర దినపత్రిక సౌజన్యం తో .

Tuesday, June 19, 2012

బుద్ధుని పాదముద్రికలు స్వాధీనం : మ్యూజియానికి తరలింపు

కడప జిల్లా ఖాజీపేట మండలపరిధిలోని పుల్లూరు చెరువులో, గ్రామ పరిసరాల్లో బుద్ధుడి పాదముద్రికలతో కూడిన శిలావిగ్రహాలు బయటపడ్డాయి. తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ గౌరవాధ్యక్షుడు తవ్వా ఓబుల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ధర్మిశెట్టి రమణ శనివారం ఈ శిలావిగ్రహాలను పరిశీలించి విలేకర్లకు వెల్లడించారు. క్రీస్తు పూర్వం 5, 6 శతాబ్దాలలో జీవించిన బుద్ధ భగవానునికి సంబంధించిన అవశేషాలు, కీస్తుశకం 16వ శతాబ్దానికి చెందిన హాస్యకవి చౌడప్ప ఉనికికి సంబంధించిన ఆధారాలు, అనేక వీరగల్లులు,  శ్రీకృష్ణదేవదేవరాయలు, వేణుగోపాలస్వామి  శిల్పాలు పుల్లూరు, ఆంజనేయకొట్టాల ప్రాంతాల్లో కనుగొన్నామని తవ్వాఓబుల్‌రెడ్డి తెలిపారు. సిద్దవటాన్ని రాజధానిగా చేసుకుని క్రీ.శ. 16, 17 శతాబ్ధాలలో పాలన సాగించిన మట్లి అనంత భూపాలుని కొలువులో హాస్యకవిగా వెలుగొందిన కవి చౌడప్ప పుల్లూరి వాసి అని చెప్పడానికి తగు ఆధారాలు లభించాయని ఓబుల్‌రెడ్డి వెల్లడించారు. తాను వేణుగోపాలస్వామి భక్తుడిగా కవిచౌడప్ప  తన పద్యాలలో చెప్పుకొన్నారు. ఆంజనేయులుకొట్టాలు గ్రామానికి దక్షిణంగా వేణుగోపాలస్వామి గుడి ఉన్నట్లు ,కాలక్రమంలో దారు మండపం క్షయమై పోవడంతో స్వామి శిల అక్కడే ఉన్న ఒక బావిలో పడవేశారని గ్రామస్తులు చెప్పారు. గ్రామలోని వేణుగొపాలస్వామి గుడికి ప్రతీకగా గ్రామ సమీపంలోని చెరువులోని తూము రాతి దిమ్మెపై కూడా వేణుగోపాలస్వామి శిల్పాన్ని చెక్కారని తవ్వా ఓబుల్ రెడ్డి తెలిపారు.





బుద్ధుని పాదముద్రికలు స్వాధీనం : పురావస్తు మ్యూజియానికి తరలింపు 

పుల్లూరు, ఆంజనేయకొట్టాలు గ్రామ పరిధిలోని చెరువు వద్ద వెలుగు చూసిన బుద్ధుని పాదముద్రికలను సోమవారం (18.06.2012) పురావస్తుశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడపలోని శ్రీభగవాన్‌ మహావీర్‌ ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాలకు తరలించారు. పురావస్తుశాఖ కడప, చిత్తూరు జిల్లాల అసిస్టెంటు డైరెక్టర్‌ రమణ ఆంజనేయకొట్టాలు గ్రామానికి తన సిబ్బందితో తరలివచ్చి గ్రామ పరిసరాల్లోని బుద్ధుని పాదముద్రికలను, వేణుగోపాల్‌స్వామి, శ్రీకృష్ణ దేవరాయులు, మరో ఆరు వీరగల్లులను పరిశీలించారు. గ్రామ సమీపంలోని వెంకటరామాపురం వద్ద ఉన్న బుద్ధుని మరో పాదముద్రికల శిలాఫలకాన్ని కూడా పరిశీలించారు. దీంతోపాటు వేణుగోపాల స్వామి శిల్పాన్ని కూడా మ్యూజియంకు తరలించారు. ఈ సందర్భంగా ఏడీ రమణ మాట్లాడుతూ ఇక్కడ వెలుగు చూపిన బుద్ధుడి పాదముద్రికలు ఎంతో చారిత్రక, పరిశోధన ప్రాధాన్యం కలిగిన, అరుదైనవని పేర్కొన్నారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య, రాయలసీమ ప్రాంత కార్యదర్శి,కథా రచయిత తవ్వా ఓబుల్‌రెడ్డి, తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్థి ప్రతినిధి   ధర్మశెట్టి రమణ, పురావస్తుశాఖకు సమాచారం అందించడంతో విలువైన పూర్వపు శిలాశాసనాలను ప్రభుత్వ మ్యూజియంకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పురాతన శిలలు, శాసనాలను గుర్తిస్తే ప్రజలు తమ దృష్టికి తేవాలని కోరారు. వీటన్నింటి చూస్తుంటే పుల్లూరికి ఎంతో చరిత్ర ఉన్నట్లుందన్నారు. పురావస్తు సిబ్బంది గంగాధర్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Saturday, April 28, 2012

తంజావూరు నాటకాలు - తెలుగువారి సేవలు

మేలత్తూరు భాగవతుల ప్రదర్శన  
తమిళనాడు లోని తంజావూరునేలిన చోళులు విజయనగర రాజుల చేతిలో ఓడిపోయిన తరువాత  తంజావూరు రాజ్యాన్ని విజయనగర పాలకులు పాలించారు. అక్కడ విజయనగర రాజుల పాలనలో తెలుగు సంస్కృతి, వైష్ణవ మతం బలపడింది. భాగవత మేళా నాటకాల పోషకులు తంజావూరునేలిన చోళులు, నాయక రాజులు, మరాఠాలు. చోళులు తమిళ సంస్కృతిని, తమిళ సాహిత్యాన్ని పోషించారు.  తరువాత తంజావూరు నాయక రాజుల కాలంలో వారి పాలన తెలుగు, సంస్కృతాలకు స్వర్ణ యుగంగా మారింది. నాయక రాజులే కాక, వారి సభలోని అధికారులు, ఉద్యోగులు కూడా సంస్కృతం. తెలుగులో మంచి పండితులు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఎందరో కవులు, పండితులు, కళాకారులు ఆంధ్రప్రాంతంనుండి తంజావూరు వలస వచ్చినప్పుడు అక్కడ ఆంధ్రత్వం, ఆంధ్ర సంస్కృతి వేళ్లూని క్రమక్రమాభివృద్ధి చెందింది.
ఆ విధంగా వలస వచ్చిన వారికి నాయక రాజైన అచ్యుతప్ప నాయకుడు (క్రీ.శ. 1560-1600) ఆశ్రయం కల్పించాడు. ప్రతి కుటుంబానికి ఒక ఇంటిని, కొంత వ్యవసాయభూమిని ఇచ్చిన గొప్ప దాత. ఆ విధంగా ఏర్పడిన ఊరిని అచ్యుతప్ప నాయకుని పేరు మీద అచ్యుతాబ్ది అని, అచ్యుతపురమని పిలిచినప్పటికీ దానికి స్థిరనామం మెలట్టూరు (మేళా+ఊరు)గా నిలిచిపోయింది.
తంజావూరునేలిన రఘునాథ నాయకుడు స్వయంగా గొప్ప కవి, పండితుడు. కవి పోషకుడు. అతని కాలంలో ఆ ప్రాంతం కళలకు, సంస్కృతికి, కర్ణాటక సంగీతానికి, నాట్యానికి, నాటకాలకు ఆలవాలమయింది. అతని చివరిదశ వరకూ కవిపండితులు అతనిని ఆశ్రయిస్తూనే వచ్చారు. ఈ కాలంలోనే ఇతని సభలో ఒక పండిత పరిషత్తు ఏర్పాటు చేయబడింది. అప్పటి తెలుగు సాహిత్య విద్యాలయం కూడా ఎంతో గుర్తింపు పొందింది. ఇతని కుమారుడు విజయరాఘవ నాయకుడు కూడా తండ్రి బాటలోనే నడిచిన రాజు. ఇతరు సమారుగా 57 రచనలు చేసినప్పటికీ, వాటిలో 12 ఒపెరాలు. వీటిలో అత్యంత ప్రసిద్ధి పొందినది 'ప్రహ్లాద మహానాటకమే. వీరి తరువాత రాజ్యాధిపత్యాన్ని పొందిన మరాఠా రాజులు శహాజి, తులజాజీలు. శరభోజి కూడా తెలుగు సంస్కృతాలను ఎతో ప్రోత్సహించడమే కాక, స్వయంగా యక్షగానాలు, ప్రబంధాలు రచించారు.
పైన పేర్కొన్నట్లు రాజులు తెలుగు సంస్కృతాలకు ఎనలేని ఏవ చేస్తే, వీరి ఏలుబడిలోని కవిపండితులు చేసిన సేవ కూడా గణనీయమైనదే. తెలుగులో నృత్య నాటకాలు రాయడం నాయక రాజుల కాలంలోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. విజయరాఘవు రచించిన పన్నెండు నాటకాలలో ప్రహ్లాద మహానాటకమే చాలా ప్రసిద్ధి  చెందింది. 'కృష్ణలీలా తరంగిణి రచించి, సంగీతజ్ఞుల చేత, నాట్యాచార్యుల చేత నేటికీ నీరాజనాలందుకుంటున్న నారాయణ తీర్థులకు, మెలట్టూరు వారికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇతడే 'పారిజాతాపహరణమ్‌ అనే నృత్య నాటకాన్ని కూడా రచించినట్లు తెలుస్తున్నది. అందువల్లనే మెలట్టూరు వారు నారాయణతీర్థుల జ్ఞాపకార్థం ఇప్పటికీ ఆశ్వీయుజ మాసం నెలరోజులు వారి తరంగాలను పారాయణం చేస్తారు. భజన సాంప్రదాయం కూడా నారాయణతీర్థుల కాలంలోనే ప్రారంభమైంది.
నారాయణతీర్థుల శిష్యుడు గోపాలకృష్ణశాస్త్రి ధృవ, గౌరీ కల్యాణం, సీతా కల్యాణం, రుక్మిణీ కల్యాణం అనే నాలుగు నాటకాలు రాసినట్లు చెబుతారు. వాటిని మెలట్టూరులోను, ఇతర ప్రాంతాలలోను హరికథలు చెప్పడానికి వాడారని కూడా చెబుతారు. గోపాలకృష్ణశాస్త్రి కుమారుడే మెలట్టూరు నాట్య, నాటకాల పితామహుడుగా పేరొందిన మెలట్టూరు వెంకటరామశాస్త్రి. ఇతడే మెలట్టూరు నాట్య నాటకాల రచనకు, ప్రదర్శనకు, వ్యాప్తికి ఆద్యుడని అందరి విశ్వాసం. ఆయన పేరు మెలట్టూరులోనే కాక భారతదేశమంతటా మార్మోగుతూనే ఉంటుంది. కర్ణాటక సంగీతానికి మణికిరీటమైన త్యాగరాజస్వామి వెంకటరామశాస్త్రి సమకాలికుడే. వెంకటరామశాస్త్రి రచించిన ప్రహ్లాద చరిత్ర నాటకం వల్ల ప్రభావితుడైన త్యాగరాజస్వామి స్వయంగా ' ప్రహ్లాద భక్త విజయమ్‌ ' అనే గీత నాటకాన్ని ఇదే కథ ఆధారంగా రచించారు. కృష్ణలీలా తరంగిణి రచించిన నారాయణతీర్థులు, కర్ణాటక సంగీత పితామహుడైన త్యాగరాజస్వామి, మెలట్టూరు భాగవత మేళా సంప్రదాయ పితామహుడైన వెంకటరామశాస్త్రి తెలుగువారు కావడం మనకెంతో గర్వకారణం.
వెంకటరామశాస్త్రి రచించిన పన్నెండు నృత్యనాటకాలు - ప్రహ్లాద చరిత్ర, మార్కండేయ చరిత్ర, ఉషాపరిణయం, హరిశ్చంద్ర నాటకం, రుక్మాంగద నాటకం, హరిహరవిలాసం, సీతాపరిణయం, రుక్మిణీ వివాహం, కంస వధ, సతీసావిత్రి నాటకం, గొల్లభామ నాటకం ఎంతో ప్రసిద్ధి చెందాయి. వీటిలో ప్రహ్లాద చరిత్ర ఎంతో ఉత్కృష్ట రచన అని అందరూ అంగీకరించిందే. దీనిని ఈనాటికీ లక్ష్మీనృసింహ జయంతినాడు ప్రదర్శిస్తూ ఉంటారు. మెలట్టూరు వెంకటరామశాస్త్రి రచించిన నాటకాల రచనకు సంబంధించి 1990లో ఒక కమిటీని వేసినప్పుడు ఆరుద్ర కూడా అందులో ఒక సభ్యుడు. దీని ఉద్దేశ్యం వెంకటరామశాస్త్రి రచించిన నాటకాలను ఎడిట్‌ చేసి స్వరపరిచి సాంకేతికంగా తయారు చేసి వీడియో తీసి పరిరక్షించడానికి కావలసిన చర్యలు సూచించడమే.
మెలట్టూరు వెంకటరామశాస్త్రి తరువాత చెప్పుకోదగిన గొప్ప రచయిత కాశీనాథయ్య. ఇతడు గొప్ప నాట్యాచార్యుడే కాక, అలరిప్పు, శబ్దం, సలామ్‌ జతుల ప్రథమ రచయితగా పేరుగాంచిన వాడు. ఇతడు తన రచనలను శహాజీ, శరభోజి, తులజాజీ మహరాజులకు, ప్రతాపసింహునికి అంకితమిచ్చినాడు కనుక ఇతని కాలం 1684నుండి 1735గా చెప్పుకోవచ్చు. ఇతనికాలం 1700నుంచి 1769గా చెప్పడం జరిగింది. మెలట్టూరు వీరభద్రయ్య కాశీనాథయ్యకు శిష్యుడు. ఇతని రచనలన్నీ బుద్ధికుశలతతో, విస్తృతమైన విషయ పరిజ్ఞానంతో కూడుకున్నవే. ఇతడెన్నో సంగీతకృతులను రచించి కర్ణాటక సంగీతానికెంతో సేవ చేసినాడు. ఇతడు కూడా శరభోజి, తులజాజీ, ప్రతాపసింహులకు సమకాలికుడు. దక్షిణ భారతావనికి చెందిన ప్రతి సంగీత విద్వాంసుడు తన మొదటి స్వరజతి, రాగమాలిక, వర్ణం, తిల్లానా వీరభద్రయ్యకే చెందేట్లు పాడతారు. ఇతడు రామస్వామి దీక్షితార్‌కు గురువు . తంజావూరు త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్‌ రామస్వామి దీక్షితార్‌ కుమారుడు.
పైన పేర్కొన్న తెలుగువారిలో కొందరు ప్రముఖులైతే, కనిపించ కుండా సేవ చేసినవారు ఎందరో. అచ్యుతప్ప నాయకుని పాలనా కాలంలో ఆంధ్రప్రాంతమైన పాకనాడు, వెలనాడుకు చెందిన తెలుగు కుటుంబాలు ఆ రాజు ఆశ్రయం కోరి తంజావూరుకు వచ్చినప్పుడు ఆ రాజు వారికి వివిధ ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసినప్పుడు ఆ రాజుకు కళలపట్ల ఉన్న అభిమానం తెలియవచ్చింది. ఇట్లా ఏర్పాటు చేసిన గ్రామాలలో మెలట్టూరు ఒకటి. నెల్లూరు మండలంలోని ఇసు పాటి గ్రామంనుండి వచ్చినవారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ విధంగా ఆశ్రయం పొందినవారు సుమారు ఐదు వందల బ్రాహ్మణ కుటుంబాల వారు ఎదురెదురుగా ఉన్న ఇండ్లలో నివసించేవారు. వీరందరూ వేద పండితులు, కవులు, కళాకారులే కావడం విశేషం. మెలట్టూరు నాట్య నాటకాలు, భాగవత మేళా సంప్రదాయం తెలుగువారు పెట్టిన భిక్షేననేది నిర్వివాదాంశం. దీనిపైన కూచిపూడి ప్రభావం ఉందనేది కూడా నిర్వివాదాంశమే. ఈ విధంగా తెలుగువారు రెండు సంప్రదాయాలను నిలబెట్టినవారైనారు. కూచిపూడి ప్రపంచ ప్రఖ్యాతిని పొందితే మెలట్టూరు ఊరుదాటి ప్రదర్శించడానికి ఇష్టపడరు కనుక అది ఊరుదాటి బైటికి రాక, చాలామంది దృష్టిలోకి రాలేదు.

-డాక్టర్‌ కె. రత్నశ్రీ
( వార్త దినపత్రిక సౌజన్యంతో..)

Monday, April 2, 2012

బంగ్లాదేశ్‌లో తెలుగువారి గోడు

తెలుగు ప్రజలు అన్ని ప్రాంతాలకు వలసపోయినట్లే స్వాతంత్య్రానికి పూర్వమే ఉమ్మడి భారతదేశంలో ఉన్న (తూర్పు బెంగాలు) బంగ్లాదేశానికి వలస వెళ్ళారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, వడ్డాది, కె.కోటపాడు, సబ్బవరం, పెందుర్తి ప్రాంతాలకు చెందినవారున్నారు.
వలసవెళ్లిన తెలుగువారిలో ఈ ప్రాంతాలలోని దళిత కులాలైన మాల, మాదిగ, చచ్చడి (రెల్లి) కులాలకు చెందినవారు అధిక సంఖ్యలోను, కాపు, చాకలి (రజక), వెలమ కులానికి చెందినవారు అతి తక్కువలో ఉన్నారు. వీరంతా తాత ముత్తాతల కాలం నుండి పొట్టకూటి కోసం వచ్చినవారే. బంగ్లాదేశ్‌లోని హాట్‌పూల్, వారీ, గోబీబాగ్ ప్రాంతాలలో ఎక్కువ తెలుగు జనాభా ఉంది. ఇక్కడి తెలుగు జనాభా సుమారు 50 వేల వరకు ఉంటుందని అంచనా. బ్రిటీష్ పరిపాలనా పోయింది. పాకిస్తాన్ ప్రభుత్వపాలనా పోయింది. ప్రస్తుత బంగ్లాదేశ్ పాలనలోనూ వీరి జీవితాలకు వెలుగు లేదు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇటు స్వదేశానికి రాలేక అటు బంగ్లాదేశ్‌లో స్థిరపడలేక రెండింటికి చెడిన రేవడిలా తయారైంది వీళ్ళ జీవితం. వీరిలో కొంతమంది మున్సిపాలిటీలలో నాల్గవతరగతి ఉద్యోగాలు చేస్తుండగా మిగతా ఎక్కువమంది చిన్న చిన్న వ్యాపారాలు, ప్రైవేటు కంపెనీలలోను, కూలీ పనులు చేస్తూ పూటగడవని స్థితిలో ఉన్నారు. ఎక్కువమంది మురికి వాడల్లో జీవనం సాగిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో కొంతమంది స్థిరపడిపోగా, మరికొంతమంది ఆంధ్రప్రదేశ్‌లో స్వగ్రామాలలో కుటుంబాలను విడచి నాలుగైదేళ్లకు ఒకసారి వెళ్లి వస్తుంటారు. పుట్టిన ఊర్లో ఉపాధి లేకపోవడం చేత వలస వచ్చినా వీరి జీవితాలలో వెలుగులేదు. మాతృభూమికి దూరంగా వున్నా వీరు ఎక్కువగా హిందూ సంప్రదాయాలను పాటిస్తూ తెలుగు సంఘాలను ఏర్పాటుచేసుకొని తెలుగు పండుగలైన వినాయక చవితి, నాగుల చవితి, దీపావళి, దుర్గాలమ్మ పండుగ, కొత్తామావస్య (ఉగాది) జరుపుకుంటూ తెలుగు సంస్కృతిని పరిరక్షించుకుంటున్నారు. తెలుగువారు వారానికి ఒకసారి కలిసి భజనలు, కీర్తనలు పాడుకుంటారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం స్థాపించిన పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ తెలుగు భాష వచ్చిన వారి వద్దకు పంపిస్తూ తెలుగు నేర్పిస్తారు. ఇంటిల్లిపాది అందరూ తెలుగులోనే మాట్లాడుకుంటారు.
కొంతమంది ఆర్థిక పరిస్థితి గ్రామాలలోకంటె కొద్దిగా మెరుగుగా ఉన్నా మిగతా వారికి నివసించడానికి సరియైన ఇళ్లు లేవు. తినడానికి ఇబ్బందే. మురికివాడల్లో నివాసం. ఎప్పటికప్పుడు ప్రభుత్వాధికారులు వచ్చి ఇల్లు ఖాళీ చేయమని చెప్పి వెళ్తుంటారు. ధరలు చాలాఎక్కువ. వీరికి వచ్చే టాకా చాలడంలేదు. వీరి సమస్యలను అక్కడ ప్రభుత్వంగాని, ఆంధ్రప్రదేశ్ (్భరత) ప్రభుత్వంగాని పట్టించుకోవడంలేదు. పాస్‌పోర్టు మొదలగు విషయాలలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. పూర్తిగా బంగ్లాదేశ్‌లో ఉండలేక అలాగని ఆంధ్రప్రదేశ్ రాలేక కాలం గడుపుతున్నారు. వీరి పిల్లలు కొంతమంది విశాఖ జిల్లా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుచున్నారు. వీరు ఎక్కువగా నిరక్షరాస్యులగుటచే సంఘటితంగా ఉండి తమ సమస్యలు విన్నవించుకోవడం తెలియకపోవడం చేత వీరి జీవితాలలో పెద్ద అభివృద్ధి లేదు.
బర్మా వలసవాసులకు విశాఖపట్నం తదితర ప్రాంతాలలో బర్మాకాలనీలు నిర్మించి పునరావాసం కల్పించినట్లే తమకు కూడా ఉపాధి చూపి పునరావాసం కల్పించాలని బంగ్లాదేశ్‌లోని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. తెలుగు భాషాభివృద్ధి, తెలుగు సంఘాల పటిష్టతకు చర్యలు తీసుకొని తమ జీవితాలలో వెలుగు నింపాలని ఇచ్చటి ప్రజలు కోరుకుంటున్నారు.
 -బద్రి కూర్మారావు
అంధ్రభూమి దినపత్రిక సౌజన్యంతో..  

Monday, March 26, 2012

సామాజిక రుగ్మతల నిర్మూలను కలాలే అస్త్రాలు-తెలుగు భాషోద్యమ సమాఖ్య

మైదుకూరు : సమాజంలో చోటు చేసుకుంటున్న సాంస్కృతిక విధ్వంసాలు, సామాజిక రుగ్మతలపై కలాలను అస్త్రాలుగా ప్రయోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కవులు, కవయిత్రులు, రచయితలు పేర్కొన్నారు. ఉగాది సంద ర్భంగా తెలుగుభాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వ హించిన రచనల పోటీల్లో విజేతలకు ఆదివారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో బహుమతులు ప్రదా నం చేశారు. కథా రచయిత తవ్వాఓబుల్‌రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అందులో కవి లెక్కల వెంకటరెడ్డి మాట్లాడుతూ భారతీయ భాషా సంస్కృతులు విచ్ఛినమవుతున్న తరుణంలో ప్రజల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం పై ఆలోచన పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
తెలుగు భాషోధ్యమ సమాఖ్య తెలుగునాట భాషా సంస్కృతి వికాసానికి చేస్తున్న కృషిని కొనియాడారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన కవితలు, కథలు, వ్యాసరచన పోటీల్లో ఎంపికైన రచనల్లో రచయితలు సామాజిక స్పృహను బాధ్యతతో జోడించారని, కథల్లో కవితల్లో నేటి సమాజంలోని లింగవివక్ష, గ్రామీణ రాజకీయాలు, బాల్యం, భాష, సంస్కృతుల విధ్వంసం తదితర అంశాలను ప్రస్తావించారని పేర్కొన్నారు. కథా రచయిత తవ్వా ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ సాహిత్య వారసత్వాన్ని, సంస్కృతిని ముందు తరాలకు అప్పగించాల్సిన బాధ్యత రచయితలపై ఉందన్నారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ సామల రమేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగు భాషొద్యమం జరుగుతున్న తీరును ,చేపడుతున్నా కార్యక్రమాలను ఆయన వివరించారు. బీజేపీ నాయకులు బీపీవీ ప్రతాప్‌రెడ్డి, అందె సుబ్బన్న, జీవిత భీమా సంస్థ (ఎల్.ఐ.సి. ) అభివృద్ధి అధికారి ఎస్.సాదక్, రాటా అధ్యక్షుడు కొండపల్లి శేషగిరి, రైతు సేవా సంఘం అధ్యక్షుడు డీఎన్ నారాయణ, రైతు నాయకుడు పోలు కొండారెడ్డి, మైదుకూరు శాఖ అధ్యక్షుడు వీరస్వామి, సీపీఐ నాయకులు ఏవీ రమణ, రచయితలు, కవులు తదితరులు తమ రచనలు చదివి వినిపించారు.
బహుమతుల ప్రదానం
కథల పోటీలో మొదటి బహుమతి పొందిన శాంతి
ఉగాది సందర్భంగా తెలుగుభాషోద్యమ సమాఖ్య నిర్వహించిన కవితల పోటీలో పి. నీలవేణి (రామాపురం), లెక్కల వెంకట్రామిరెడ్డి(లెక్కలవారిపల్లె), ఎస్‌ఆర్ ప్రతాప్‌రెడ్డి(చల్లబసాయపల్లె) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. మాబుజాన్, డీబీ దేవి, బేబీ సునీత, ఎస్.ఆలియా, కె.శ్రీనివాసులు, ఓ.సుధాకర్ విశేష బహుమతులు పొందారు. కథల పోటీల్లో ఎన్.శాంతి(కడప), కె. రామమోహన్(కామనూరు), ఎల్ కళారెడ్డి(సంబేపల్లి) మొదటి మూడు బహుమతులు సాధించగా, సయ్యద్ సంధాన్‌బాషా, కె.నాగమ్మ, పెరుగు సాయికృష్ణ, వై.రాజశేఖర్, వై.రాజేష్‌కుమార్ విశేష బహుమతులు పొందారు. వ్యాసరచన పోటీల్లో సగిలి విజయరామారావు(మార్కాపురం), గంగనపల్లి వెంకటరమణ(ఆకేపాడు), లక్ష్మినారాయణ(వనిపెంట) మొదటి మూడు బహుమతులు గెలుచుకోగా, ఎన్.శాంతి, పి.మురళి, ఈరి మాధురి, బీవీ నరసింహులు విశేష బహుమతులు పొందారు.

Tuesday, March 13, 2012

బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ తిరుమల రామచంద్ర

డాక్టర్ తిరుమల రామచంద్ర 
తిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవి తంలో అర్ధ శతాబ్ది పత్రికా రచనకే అంకి తమైనారు. ప్రసిద్ధ కవిపండితులు, కళా కారులు, భాషావేత్తలు, తత్త్వ చింతకులు అయిన ప్రతిభాశాలురతో వందమందిని పైగానే ఆయన ఇంట ర్వ్యూ చేసి ఉంటారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచ్చైనాయి. ఆయన చూసినంత దేశమూ, ఆయనకు లభించినన్ని జీవితానుభవాలు, దేశమం తటా ఆయనకు లభించిన విశిష్ట వ్యక్తుల పరిచయా లూ మరెవరి విషయంలోనూ ప్రస్తావించలేము. ఆయన స్వీయ చరిత్ర ఒక గొప్ప నవలకన్నా ఆసక్తికరంగా చదివిస్తుంది. ఉత్కంఠ భరితంగా సాగుతుంది. వారికి తెలిసినన్ని భాషలు కూడా సమకాలీనులైన సాహితీ వేత్తలకు తెలియవనే చెప్పాలి.

ఆయన లాహోర్‌లో మూడేళ్ళున్నారు. అక్కడ పంజాబీ విశ్వవిద్యాలయం అనుబంధ విద్యాసంస్థ అయిన ప్రాచ్య లిఖిత తాళపత్ర గ్రంథాలయంలో వివరణాత్మక సూచీ కర్త (డిస్క్రిప్టివ్‌ కాటలాగర్‌)గా పని చేశారు. ఆ తర్వాత లక్నోలో కొద్దిగా హిందీ ఉపాధ్యాయత్వం నెరిపారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో సైన్యంలో హవల్దార్‌ క్లర్క్‌గా పనిచేశారు. సైనిక విన్యాస గౌరవాభినందనలు అందుకోవటానికి వచ్చిన విన్‌స్టన్‌ చర్చిల్‌ను దగ్గరగా చూశారు. ఇరాన్‌ సరిహద్దు అయిన చమన్‌లో సైనిక విధులు నిర్వహించారు.

రాహుల్‌ సాంకృత్యాయన్‌ కాన్పూర్‌లో ఒక సాహితీ సమావేశంలో ప్రసంగించగా ఆయన ప్రసంగ పాఠాన్ని కాన్పూర్‌ నుంచే అప్పు డే ప్రారంభమైన డెయిలీ టెలిగ్రా్‌ఫ్‌ పత్రికకు విలేఖ త్వం వహించి వృత్తాంత కథనం రూపొందించారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ను స్వయంగా కలుసుకు న్నారు. లక్ష్మ్‌ణ్‌ స్వరూప్‌, కె.పి. జయస్వాల్‌ వంటి గొప్ప సాహితీ వేత్తలను కలుసుకున్నారు. బహు భాషా కోవి=దుడైన రఘువీర తన ప్రపంచ భాషా నిఘంటు నిర్మాణంలో తనతో కలిసి పనిచేయవలసిందిగా సహాయ సహకారాలు అర్ధించగా, జీవనోపాధికి ఆ పని కలిసిరాదని ఉత్సుకత చూప లేకపోయానని, అటువంటి గొప్ప అవకాశం వదులుకోవలసినదికాదనీ పశ్చాత్తాపం చెందినట్లు స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.

లాహోర్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా ప్రసిద్ధకవి మహమ్మద్‌ ఇక్బాల్‌ విశ్వవిద్యాలయంలో సర్వేపల్లి రాధా కృష్ణ వాట్‌ ఈజ్‌ ఫెయిత్‌ (అంటే ఏమిటి?) అని రెండు గంటలపాటు శ్రోతలు అంద రూ సమ్మోహితులైనట్లు ప్రసంగించగా, రాధాకృష్ణన్‌ను ఇక్బాల్‌ ప్రశంసించడం మరి చిపోలేని సంఘటనగా స్వీయచరిత్రలో ప్రసక్తం చేశారు. ఆ విశ్వవిద్యాలయ ఓరి యంటల్‌ కాలేజి ప్రిన్సిపల్‌ మహమ్మద్‌ ఖురేషీ అక్కడ సంస్కృత విభాగంలో పని చేస్తున్న మహామహోపాధ్యాయ మాధవ శాస్ర్తి భండారేను ఎంత గౌరవించిందీ వివరించారు.

లాహోర్‌ విశ్వవిద్యాలయ ప్రాచ్య లిఖిత తాళ పత్ర గ్రంథ సంచయంలో తెలుగు లిపిలో ఉన్న గ్రంథాలెన్నో ఉన్నాయని, తంత్ర శాస్త్రం, వేదాంతం, సాహిత్య గ్రంథా లకు తాను వివరణాత్మక సూచిక తయారు చేశానని చెప్పారు. అక్కడ పనిచేస్తు న్నపుడు ఇప్పటి పాకిస్థాన్‌లోని సింధు ప్రాంతాన్ని పర్యటించారు.హరప్పా, మొహంజదారో శిథిలావశేష చారిత్రక ప్రాముఖ్య ప్రాంతాలను దర్శించారు. వీటిని గూర్చి స్వీయ చరిత్రలో వివరించారు. అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయన్ని దర్శించి ము రిసి పోవడమేకాక జలియన్‌వాలాబాగ్‌ దురంతాలు జరిగిన ప్రదేశాన్ని చూసి కన్నీ రు విడిచారు. అక్కడి ఆవరణ ప్రాకార కుడ్యాలకు తుపాకి గుళ్ళు తగిలినప్పుడు ఏర్పడిన రంధ్రాలను తడిమి కళ్ళు మూసు కుని ఉద్వేగభరిత చిత్తంతో మృతవీరుల దేశభక్తిని స్మరించి నివాళించారు.

దేశ విభజన జరిగి లాహోర్‌ పాకిస్థాన్‌కు దక్కినప్పుడు, ఒక గూఢ ప్రణాళికా బద్ధంగా దానిని పాకిస్థాన్‌లో సంలీనం చేసినందుకు పైతృకమైన ఆస్తి అన్యాక్రాంతం దురాక్రాం తమైనంత దుఃఖం అనుభవించానని చెప్పుకున్నారు. లాహోర్‌లో దక్షిణాది కుటుం బాలు ఒకప్పుడు గణనీయంగా ఉండేవని, అక్కడ పాఠశాలల్లో భారతీయ భాషల పఠన పాఠనాలు ఉండేవని ప్రస్తావించి ఎంతో ఖేదం చెందారు. ఇదీ రామ చంద్రగారి విశిష్ట వ్యక్తిత్వం.ఆరోజుల్లో పత్రికా రంగంలో పనిచేయడం గొప్ప దేశభక్తికి తార్కాణంగా ఉండేదనీ, తాను పత్రికా రంగాన్నే తన జీవిత ధ్యేయంగావించుకున్నానీ, అందువల్లనే కాన్పూర్‌లో స్వాతంత్య్రోద్యమ ప్రచార సాధనంగా కొత్తగా స్థాపితమైన దినపత్రికలో చేరానని, అనంతపురంలోని తన తండ్రిగారికి రాయగా, అట్లా అయితే తెలుగు పత్రికలో పనిచేయవచ్చు కదా అని తండ్రిగారు ఉద్బోధించారనీ, ఆ ప్రోత్సాహంతో తెలుగు నాడుకు తరలివచ్చాననీ ఆయన స్వీయ చరిత్రోదంతం.

డెభె్భై ఏళ్ళ కిందనే  తెలంగాణ  అనే పత్రిక వెలువడిందని, దాని కార్యస్థానం హైదరాబాద్‌ అనీ, అది కొన్ని నెలలకే ఆగిపోయిందనీ- ఈ సంస్మరణ వ్యాసరచయితకు రామచంద్ర ఒక ఇంటర్వూలో చెప్పారు.ఇది ఆయనస్వీయ చరిత్రలో ప్రసక్తం కాలేదు.ఇప్పుడు ఈ స్మరణ నివాళి ముఖ్యోద్దేశం ఏమంటే, తెలుగువారి అతి ప్రముఖ దినపత్రికలలో ఆయన పనిచేసినపుడు కొన్ని పదుల ఇంటర్వ్యూలు ఆయన నిర్వహించినా, అన్ని రంగాల ప్రముఖులను కలిసి వాళ్ళ అభిప్రాయాలు అక్షరీ కరించినా ఆయనతో మొట్టమొదటి ఇంటర్వ్యూ, చిట్టచివరి ఇంటర్వ్యూ చేయడం ఈ వ్యాస రచయితకే దక్కిందని ఇతడి అభిప్రాయం. ఆయన స్వీయ చరిత్ర రాయడం ఇంకా పన్నెండు సంవత్సరాలకు మొదలు పెడతారనగా 1984లో ఈ వ్యాసరచయిత ఎంతో విపులంగా ఆయన జీవిత వృత్తాంతం సేకరించాడు. తాను అభిలషిస్తున్న స్వీయ చరిత్ర పేరు  కమలాపురం నుంచి క్వెట్టాదాకా  లేదా  హంపీ నుంచి హరప్పా దాకా  అని ఉం టే- ఏది ఎక్కువ బాగుంటుందని ఆయన ప్రసక్తం చేయ గా- రెండోపేరు ఆకర్షకంగా ఉంటుందని చెప్పడం జరిగింది.

1997లో ఆయన ఇంకో నెల రోజుల్లో కీర్తిశేషులవుతారనగా, ఆయనతో ఇంకొక విపులమైన ఇంటర్వ్యూ ఈ వ్యాస రచయితే నిర్వహించడం జరి గింది. ఆ సందర్భం ఏమంటే- అప్పుడు భారత స్వాతంత్య్రోత్సవ స్వర్ణోత్సవం తటస్థించింది. రామచం ద్రగారి జైలు జీవితం, ఆనాటి స్వాతంత్య్రోద్యమ విశే షాలు, తనను ప్రభావితం చేసిన పెద్దలు, తన ఆదర్శాలు, ఆశయాలు, తన భవిష్యదర్శనం, తానింకా చేయదలుచు కున్న రచనలు మొదలైన వివరాలు తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. ఆయన  మూడు వా ఞ్మయ శిఖరాలు  అనే గొప్ప- సాహి తీ వేత్తల- జీవిత చరిత్రలు కూర్చారు.

మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన సాహితీవేత్తలు, మీరు ఆదర్శీకరించుకున్న సాహి త్య వ్యక్తిత్వాలు ఎవరివి? అని అడగగా ఆయన  మానవల్లి రామకృష్ణ కవి, సురవ రం ప్రతాప రెడ్డి  అని చెప్పారు. అడవి బాపిరాజు విశిష్ట వ్యక్తిత్వం తనను తీర్చి దిద్దింది అని కూడా ఆయన స్మరించుకున్నారు. పద పాఠ నిర్ణయంలో, పరిశోధనలో వేటూరి ప్రభాకర శాస్ర్తి తనకు ఒరవడి దిద్దారని గుర్తు చేసుకున్నారు.
తిరుమల రామచంద్ర తెలుగు వారికిచ్చిన రచనలు చాలా విలువైనవి. ఇంకొక ఏడాదిలో ఆయన శతజయంతి వత్సరంకూడా రాబోతున్నది.

ఆయన గ్రంథాలు  మన లిపి, పుట్టుపూర్వోత్తరాలు, సాహితీ సుగతుని స్వగతం, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, హిందువుల పండుగలు, మరపురాని మనీషి, తెలుగు వెలుగులు, హంపీ నుంచి హరప్పాదాకా ఆయనను ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటాయి.వారిది గొప్ప విద్వక్కుటుంబం. తండ్రిగారికి బంగారం చేయడం పట్ల భ్రాంతి ఉండే దని, అందుకుగాను నూరు తులాల బంగారం వారు ప్రయోగ వ్యగ్రతలో వినియో గించారనీ, ఆయన కాలి నడకన బదరీ క్షేత్రాన్ని రెండు సార్లు దర్శించారనీ, జగదేక మల్లుడు కోడి రామమూర్తితో తమ తండ్రి గారికి స్నేహం ఉండేదనీ, 1922లో గాంధీజీ బళ్ళారి వచ్చినపుడు తాను ఎనిమిదేళ్ళ పిల్లవాడిగా దర్శించాననీ, తమది స్వాతంత్య్రోద్యమ నిమగ్న కుటుంబమనీ, తన తాత తండ్రులు బల్గాం కాంగ్రెస్‌కు హాజరైనారనీ, ఇటువంటి ఎన్నో విశేషాలు, ఉత్సుకతా పాదక మైనవని ఈ వ్యాస రచ యిత ఆయనతో చేసిన రెండు ఇంటర్య్వూల్లో, ఆయన చెప్పారు. ఈ రచయిత వాటి ఆధారంగా ఆయన గూర్చి రెండు జీవిత చరిత్రలు, ఇరవై దాకా వ్యాసాలు ప్రచురిం చడం తన సాహిత్యాభిరుచి సార్థకతగా భావిస్తున్నాడు. ఆయనతో తానే మొదటిదీ, చివరిదీ అయిన ఇంటర్వ్యూ చేసినట్లు గుర్తు చేసుకుంటున్నాడు.
                                                                                                                              -అక్కిరాజు రమాపతిరాజు
                                                                                                                         సూర్య దినపత్రిక సౌజన్యంతో..