Saturday, November 7, 2009

సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాల నిర్వాకంపై ఉద్రిక్తత మధ్య విచారణ

మైదుకూరు సంఘటనపై ఆందోళన 
విద్యార్థులు తెలుగులో మాట్లాడుతున్నారని స్థానిక సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల చేసిన నిర్వాకంపై మంగళవారం ఉద్రిక్తత మధ్య విచారణ కొనసాగింది. ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో తెలుగులో మాట్లాడుతున్నారని 'ఐ నెవర్‌ స్పీక్ ఇన్‌ తెలుగు' (నేను తెలుగులో మాట్లాడను) అని రాసిన బోర్డులను ఇద్దరు విద్యార్థుల మెడలో వేశారు. ఈ విషయం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విధంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ, తెలుగు సామాజిక, సాంస్కృతిక, సాహిత్యాభివృద్ధి సంస్థ, ఎఐఎస్‌ఎఫ్‌ మంగళవారం పాఠశాల గేట్‌ వద్ద ధర్నా చేశారు. వీరికి మద్దతుగా సిపిఐ, బిజెపి, మైదుకూరు రైతు సేవా సంఘం అధ్యక్షుడు డిఎన్‌ నారాయణ, ఎపిటిఎఫ్‌ నాయకులు సివి ప్రసాద్‌, ఎస్టీయు నాయకులు ఎపి శ్రీనివాసులు, కె.పాలకొండయ్య ఆందోళనలో పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు డిప్యూటీ డిఇఓ సుబ్బారెడ్డి సంఘటనపై విచారించేందుకు పాఠశాలకు చేరుకున్నారు. అప్పటికే పాఠశాల గేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐతోపాటు వివిధ పార్టీల నాయకులు, ఉపాధ్యాయ యూనియన్‌లు, రైతు నాయకులు ఆందోళన చేస్తున్నారు. విచారణ బహిరంగంగా చేపట్టాలనీ, నిజాయితీగా సాగాలనీ డిప్యూటీ డిఇఓ సుబ్బారెడ్డిని నిలదీశారు. విచారణలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నా సహించేది లేదని పట్టుబట్టారు. గతంలో కూడా ఈపాఠశాలలో చోటు చేసుకున్న వేధింపులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో విచారణ చేయాలన్నారు.
అంతేకాదు తెలుగు భాషను అవమాన పరిచిన పాఠశాల యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంగళవారం ఉదయమే ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా చీఫ్‌ సెక్రటరీ పి.దస్తగిరిరెడ్డి, ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, ఓబులేస్‌, కొండయ్య, శేఖర్‌, చంద్ర బైఠాయించారు. ఆందోళనలో ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు మద్దిలేటి, ఏరియా కార్యదర్శి ఎస్‌.అబ్దుల్లా, సిపిఐ నాయకులు ఎవి రమణ, పి.శ్రీరాములు, ఎస్‌.రంతుల్లా, ఎఐవైఎఫ్‌ నాయకులు పి.భాస్కర్‌, బిజెపి నాయకులు బిపివి ప్రతాప్‌రెడ్డి, ఎ.రాజమోహన్‌రెడ్డి, పుల్లయ్య, తెలుగు సామాజిక , సాహిత్యాభివృద్ధి సంస్థ ప్రతినిధులు ఎ.వీరాస్వామి, డి.రమణ, వెంకటసుబ్బయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు భాషపై ప్రవర్తించిన తీరు అనాగరికం
తెలుగుభాష అణచివేతను నిరసించాలనీ, మాతృభాషను పరిరక్షించాలనీ నినాదాలను చేశారు. తెలుగు భాష వర్ధిల్లాలంటూ నినదించారు. ఈసందర్భంగా తెలుగు సామాజిక, సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ గౌరవాధ్యక్షులు తవ్వా ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ మాతృభాషలో విద్యను అభ్యసించే వీలు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల పాఠశాల యాజమాన్యం వ్యవహరించిన తీరు అనాగరికమన్నారు. దీన్ని నిరసిస్తున్నామన్నారు. ఈ సంఘటన భాషాభిమానుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొందన్నారు. ఇలాంటి సంఘటన జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకోకూడదన్నారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్టీయు జిల్లా నాయకులు ఎపి శ్రీనివాసులు మాట్లాడుతూ త్రిభాషా సూత్రానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. ఎపిటిఎఫ్‌ ప్రతినిధి సివి ప్రసాద్‌ మాట్లాడారు.
పర్యవేక్షించిన డిఎస్పీ
సెయింట్‌ జోసఫ్‌ పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటనపై విచారణలో ఉద్రిక్తత ఏర్పడడంతో మైదుకూరు డిఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి, అర్బన్‌ సిఐ ఇ.శ్రీనివాసులు సిబ్బందితో పర్యవేక్షించారు. ఉద్రిక్తత, ఆందోళన కారుల చర్చల అనంతరం డిప్యూటీ డిఇఓ సుబ్బారెడ్డి విచారణ చేపట్టారు. విద్యార్థులతో విచారణ చేశారు. ఈనివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈవిచారణలో మండల విద్యాశాఖాధికారి పి.సు కవనం పాల్గొన్నారు.
క్షమాపణ చెప్పిన యాజమాన్యం
సోమవారం తమ పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటనపై పాఠశాల యాజమాన్యం ప్రభాకర్‌ మంగళవారం ఆందోళన కారులకు క్షమాపణ చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూస్తామని తెలిపారు. అయితే దీనికి ఆందోళన కారులు అంగీకరించలేదు.
మీడియాపై దాడి
సోమవారం సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌లో చోటు చేసుకున్న సంఘటనపై చేస్తున్న విచారణలో పాఠశాల యాజమాన్యం మీడియాపై దురుసుగా ప్రవర్తించి, దాడికి దిగింది. విచారణలో పాఠశాల యాజమాన్యం అసహనానికి గురైంది. ఈవిషయాన్ని మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తెలుగుభాషను అవమానపరిచిన సెయింట్‌జోసెఫ్‌ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలనందిస్తూ ఉపాధ్యాయులు ఎంఆర్‌సి భవనం నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుభాషోద్యమ సమైక్య నాయకులు తవ్వా ఓబుల్‌రెడ్డి కూడలిలో
శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుభాషను అణచివేసేందుకు ప్రంపంచీకరణ వాదులు జరుపుతున్న కుట్రలో భాగంగా సెయింట్‌జోసెఫ్‌ పాఠశాలలో జరిగినటువంటి ఉదంతాలు చోటు చేసుకు0టున్నాయ ని అన్నారు. ప్రపంచంలో ని అనేక జాతుల భాషలను తుదముట్టచడమే ఇంగ్లీష్‌ వారి ధ్యేయమని అన్నారు. ఎస్‌టియు జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పాలకొండయ్య మాట్లాడుతున్న తెలుగుభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఎస్‌టియు నాయకులు స్వామినాథ్‌, మల్లేశ్వరరెడ్డి, ఏపిటిఎఫ్‌ నాయకులు వెంకటసుబ్బయ్య, అంకన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలుగుభాష పరిరక్షణ కోసం భాషోధ్యమ సంస్థలు, రాజకీయ, విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలు, పత్రికలు, ప్రసార సాధనాలు ని ర్వహిస్తోన్న ఉద్యమం తెలుగునేలకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ రచయిత సంపాదకుడు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అభినందించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేతు విశ్వనాథరెడ్డి తెలుగుభాష మాట్లాడిన బాలల పట్ల మైదుకూరు సెయింట్‌జోసెఫ్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాల యాజమాన్యం శిక్షలను అమలు చేయడం పట్ల నిరసనలు పెల్లుబికడం రాష్ట్ర వ్యాప్తగా ఉద్యమం తీవ్ర దాల్చడాన్ని తెలుసుకుని అమెరికా నుంచి స్థానిక తెలుగుసాహితీ సాంస్కృతిక వేదిక వారి ద్వారా మాట్లాడారు. ప్రపంచంలో అన్ని జాతుల వారినీ, అన్ని భాషల వారినీ తమ బాసలుగా మార్చుకునేందుకు పాశ్య్చాత్య శక్తులు, సామ్రాజ్య వాదులు ఇంగ్లీషు పెత్తనాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాయనిచెప్పారు. తెలుగుభాషను, జాతిని పరిరక్షించుకోవడానికి తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు.
'మా తెలుగుతల్లి ఉత్తర్వులు హర్షణీయం
మైదుకూరు తెలుగు ఉద్యమంతో నిదురమేల్కున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు, ఇంగ్లీషు మీడియ పాఠశాలలో 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' గేయాన్ని ప్రతి రోజూ తప్పనిసరిగా ఆలపించాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేయడం హర్షణీమని తెలుగుభాషోద్యమ సమాఖ్య ప్రతి ని ధులు తవ్వా ఓబులరెడ్డి, వీరాస్వామి, వెంకసుబ్బయ్య, రమణ ఒక ప్రకటనలో హర్షం వక్తం చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వర ప్రతి పాఠశాలలో తెలుగును తప్పనిసరి చేస్తూ 2003 లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. మా తెలుగు తల్లి గేయాలాపన తప్పనిసరిగా జరిగేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.

No comments:

Post a Comment