'దేశ భాషలందు తెలుగు లెస్స ' అంటూ ఘనంగా పలికారు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన ఏలిన రాయలసీమలో ఇప్పుడు 'నేనెప్పుడూ తెలుగు మాట్లాడను' అని ముక్కు పచ్చలారని చిన్నారుల మెడలో ఇంగ్లీషు ప్లకార్డులను వేలాడ దీయడం అత్యంత దుర్మార్గమైన చర్య...తెలుగు జాతి సిగ్గుతో తలవంచుకొనేలా చేసిన ఘటన ఇది. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. మాతృ భాషను అవమానించడం ముమ్మాటికీ నేరమే. మైదుకూరులోని సెయింట్ జోసెఫ్ స్కూలులో జరిగిన ఈ దారుణం లోకానికంతటికీ తెలిసింది. ఇలాంటి ఘటనలు వెల్లడి కాకుండా వివిధ రూపాల్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. మైదుకూరులో కఠిన చర్యలు చేపడితే మిగిలిన వారూ కళ్లు తెరుస్తారు. ఒళ్లు మరిచిపోకుండా వ్యవహరిస్తారు. నిండా ఎనిమిదేళ్లు లేని మధు, శాంతి చేసిన పాపమల్లా క్లాసులో తెలుగు మాటాడడమే. దానికే వారికి ...డీషీటర్ల మాదిరిగా మెడలో ప్లకార్డులు వేలాడ దీయడం పైశాచికమొక్కటే కాదు. తెలుగు భాషపట్ల ఉన్న అలుసు కూడా దీనికి ప్రధాన కారణం. ఇంగ్లీషు మీద లేదా ఇంకేదైనా భాష మీద ఎవరికైనా మోజుంటే దాన్ని తప్పు పట్టలేం. అది వారి వ్యక్తిగతం. కాని మరో భాష పట్ల ద్వేషం లేదా నిర్లక్ష్యం వుండరాదు. అదీ మాతృభాష పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం దారుణం. తెలుగు మాటాడితే ఇంగ్లీషు రాదు లేదా నేర్చుకోలేరని కొందరి దురభిప్రాయం. ఇంకొందరైతే ఏకంగా ఎప్పుడూ అదేపనిగా మాటాడుతుంటే ఇంగ్లీషు తేలికగా వచ్చేస్తుందన్న భ్రమలూ కల్పిస్తుంటారు.ఇవన్నీ అశాస్త్రీయ భావనల ఆధారంగా వచ్చిన అభిప్రాయాలు. ఇలాంటి వాటి పర్యవసానమే మైదుకూరు ఘటన. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అమాత్యవర్యులు సెలవిచ్చారు. ఆ క్లాసు టీచర్ ఉద్యోగం ఊడగొడితే సమస్యకు సరైన పరిష్కారం దొరకదు. ఆ స్కూలులో అనుసరిస్తున్న విధివిధానాలూ పై స్థాయి వారి ఆదేశాలు (అవి రాతమూలకంగా వుండకపోవచ్చు కూడా) వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. సమగ్ర విచారణ ద్వారానే విషయాలన్నీ వెలుగులోకొస్తాయి.
భావాన్ని వ్యక్తీకరించడం కోసమే భాష. మాతృభాషలోనే మనసులోని పూర్తి భావాన్ని వ్యక్తం చేయగలరని అనేక అధ్యయనాలు, పరిశోధనలూ ఘంటాపథంగా చెప్పాయి. మన విద్యావిధానానికి మార్గదర్శనం చేసిన వాటిలో ప్రధానమైనది కొఠారి కమిషన్ సిఫార్సు. పాఠశాల విద్యను తప్పనిసరిగా మాతృభాషలోనే బోధించాలని చెప్పింది. అనంతరం వచ్చిన అనేక కమిషన్లు, నిపుణుల నివేదికలూ దాన్నే పునరుద్ఘాటించాయి. విద్యనందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించిన రోజల్లో ఆ విధానాలు, వైఖరులూ అమలు జరిగాయి. ప్రభుత్వం విద్యను అంగడి సరుకుగా మార్చేశాక ఇలాంటి వెరిత్రలలు పెరిగిపోయాయి. ప్రపంచబ్యాంకు ఆదేశాలకు తలొగ్గిన మన పాలకులు రోజుకో రీతిన విద్యావిధానంలో మార్పులు తెచ్చేస్తున్నారు. తాజాగా మన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సక్సెస్ స్కూలు పథకం ఈ కోవకే వస్తుంది. అందువల్ల చాలా స్కూళ్లు మూతపడ్డం,వేలాది మంది విద్యార్ధులు విద్యకు దూరం కావడమో ప్రైవేటు స్కూళ్లకు చేరువ కావడమో జరిగింది. ఇంగ్లీషు వ్యామోహాన్ని ప్రభుత్వమే పెంచింది. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రజలపై రుద్దింది. అదే విధంగా కొందరు తల్లిదండ్రులకూ ఇంగ్లీషుపై మోజు ఎక్కువగా వున్న మాట నిజం. ఇంకో భాషపట్ల మక్కువ వున్నంత మాత్రాన మన భాషను తక్కువ చేయడం తగని పని.
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా పేరుగాంచిన మన తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి ఇంగ్లీషు వాడైన సిపి బ్రౌన్ విశేష కృషి చేశారు. మరి అలాంటిది మనమెంత జేయాలి? మనలో ఎంతమందిమి తెలుగు భాషాభివృద్ధి గురించి దృష్టి పెడుతున్నాం? కాదు కనీసం ఆ దిశగా ఆలోచిస్తున్నాం అని చూస్తే సమాధానం చాలా నిరాశాజనకంగా వుంటుంది. ఇప్పటి వారిలో చాలా మంది భాషను అభివృద్ధి చేయడానికి కృషి చేయకపోయనా ఫర్వాలేదు కాని మైదుకూరులో మాదిరిగా అవమానించకపోతే చాలనిపిస్తోంది. ఇలాంటి ఘటన మన పొరుగునున్న తమిళనాటో కర్ణాటకలోనో జరిగితే తీవ్ర పరిణమాలు సంభవించేవి అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజం కూడా కావచ్చు. మనతో పోల్చితే వారికి స్వభాషాభిమానం చాలా ఎక్కువ. మాతృభాషను అభిమానించడం అభివృద్ధి చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఐతే అది దురభిమానంగానో పర భాషా ద్వేషంగానో వుండరాదు.
తెలుగుకు ప్రాచీనభాష హోదా సాధించుకోడం కోసం పెద్ద ఉద్యమం సాగింది. వివిధ స్రవంతులకు చెందిన తెలుగు వారంతా అందులో పాల్గొనడమో సహకరించడమో చేశారు. అలాంటి ప్రత్యేక సందర్భాల్లో తప్ప మాతృ భాష పట్ల జాతిని జాగృతం చేసే కార్యక్రమాలు సందర్భాలూ తక్కువగానే వుంటున్నాయి. మైదుకూరు లాంటి ఘటనలు జరిగినపుడు కొంత చర్చ నడిచి తర్వాత చల్లబడిపోతుంది అలా జరగరాదు. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికా బద్ధ కృషి జరపాలి. అధికారభాషా సంఘాన్ని నియమించేయడంతో తన పని ఐపోయిందని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. ప్రజల భాషలో పరిపాలన సంపూర్తిగా జరగడానికి గట్టిగా వ్యవహరించాలి. ప్రజల భాషలో పరిపాలన అన్నది కేవలం భాషాభిమానంతో చేసే డిమాండ్ కాదు. అది ప్రజల హక్కు. పరిపాలన ప్రజల భాషలో జరగకపోతే అది అప్రజాస్వామికమే అవుతుంది. భాషాభిమానులు, భాషా ఉద్యమకారులూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు స్వచ్ఛంద కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహించాలి. అందుకవసరమైన వాతావరణాన్ని రూపొందించాలి. భాషాభివృద్ధికి అన్ని వైపుల నుండి సమైక్య కృషి జరగాలి. బతుకు బాటను మాతృభాషతో అనుసంధానం చేయాలి. అది ఓ నిరంతర స్రవంతిలా నడవాలి. అపుడే భాష సజీవంగా సమున్నతంగా ఎదగడమే గాక ఇలాంటి అవమానాలకు ఆస్కారం కూడా లేకుండా వుంటుంది. తెలుగు భాషను సమున్నతంగా అభివృద్ధి చేసుకోవాలని ప్రతి తెలుగువాడూ ప్రతినబూనడం నేటి అవసరం.
No comments:
Post a Comment