Saturday, November 7, 2009
మాతృభాష తెలుగుకు అవమానం
మైదుకూరు, అక్టోబర్ 26 :మన మాతృభాష తెలుగు అధికార భాష అయినా పలు చోట్లా భాషకు అవమానం తప్పేట్లు లేదు. తాజాగా మైదుకూరులోని ఓ పాఠశాలలో వెలుగు చూసిన సంఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. వివరాలిలా వున్నాయి. స్థానిక మైదుకూరు పట్టణంలో బద్వేల్ రోడ్డులో గల సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తెలుగులో మాట్లాడిన విద్యార్థులకు దండన విధించారు. అదేమిటంటే అలా మాట్లాడిన విద్యార్థులకు మెడలో నేను తెలుగులో మాట్లాడను అని ఆంగ్లంలో ఐ నెవర్ స్పీక్ ఇన్ తెలుగు అని రాసిన అట్ట బోర్డులను మెడకు తగిలించి తరగతి గదుల బయట ఎండలో నిలబెట్టారు. ఇలా ఒక్కో తరగతిలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థుల చొప్పున సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎండలో నిలబెట్టి దండన విధించారు. విషయం తెలుసుకున్న మీడియా, పత్రికా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న మండల విద్యాధికారి సుఖవనం, తాహసీల్దార్ సుబ్బరాయుడు అక్కడకు చేరుకున్నారు. సంఘటనపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎంఇఓ సుఖవనం తెలిపారు. అక్కడ కరస్పాండెంట్, ప్రిన్సిపల్ లేకపోవడం గమనార్హం.
జిల్లాలో ఇలాంటి సంఘటనల్ మరెన్నో...
ఇలాంటి సంఘటన వెలుగు చూసిన నేపథ్యంలో ఇలాంటి దండనలు జిల్లాలో ప్రతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరుగుతున్నాయని, అధికారులు పర్యవేక్షణపై మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని ప్రజలు అంటున్నారు. తెలుగు బాషకు ఇటువంటి అవమానకర సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
'ఐ నెవర్ స్పీక్ తెలుగు'
వేంపల్లి గంగాధర్
రేత్రంతా గిడ్డంగుల దగ్గర న్నుంచి రైలు పట్టాల దగ్గర గూడ్యుబోగీల్లోకి సిమెంటు బస్తాలు మోసిన అంకన్న, కొడుకుకు నిన్ననే కాన్వెంటులో ఫీజు కట్టివచ్చినాడు. వాడు ఇప్పుడిప్పుడే ఎబిసిడి అని పలకలో రాయి చ్చుకొని దిద్దుకుంటావుండాడు. వాడ్నిజూస్తే అంకన్నకు య్యాడ లేని సంతోషమైతాది. ఇంటికిపోయిన కాన్నుంచి సంబరంలో వాడికి బొంకులోని చాక్లెట్లు అన్నీ కొనక్కపోయి తినిపిస్తా వుంటాడు. కొడుకును దొరలాగా కోటు,బూటు, సూటు, నెత్తిన హ్యాటుపెట్టి చూసుకోవాలని కలలు కంటావుండాడు. వాడి నోటి నుంచి ఇంగ్లీషుభాష వరదలాగా పొంగిపొర్లుతా రావాలని ఆశపడ్తావుండాడు. కొడుకును పైచదువులు బాగా చదివించి మంచి ఆఫీసర్‌ను చేస్తానని కనపడినోళ్ళందరి దగ్గర మీసాలు దువ్వుకుంటా చెప్తాండడు. ఈకత ఇట్లా నడుస్తానే వున్నింది.
అదో పడమటి దేవళం ప్రక్కన సందులో ఆటోరిక్షా పడిపే బాబయ్య కొడుకు అనిల్‌గాడు కూడా ఇదే కాన్వెంటులోనే సెకండ్‌క్లాస్ చదువుతాండడు.వాడు తెల్లవార్లూ చదివిన పదాలే చదువతాడు.అయినావాడిపేర్లు, స్పెల్లింగులు గుర్తుండి చావవు. ఏం చేస్తాడు? స్కూల్లో గోడకుర్చీ వేస్తాడు. గుంజిల్లు తీస్తాడు. డెస్క్‌పైకెక్కి ఒక పిరియడ్ నిలబడి శిక్ష అనుభవిస్తాడు. ఇట్లాటి శిక్షలన్నీ మళ్ళా ఇంటి కొచ్చినాంక బాబయ్యకు చెప్తాడు. తాగు బోతు బాబయ్య గాడికత పిల్లోడు అనిల్‌గాడికి ఏం తెలుసు?
'నేను నానా కష్టాలు పడి ఆటో తోలుకుంటా ఇంగ్లీష్ చదువు చదువుకోమని కాన్వెంటులో చేర్పిస్తే నువ్వు నేర్చుకోకుండా దెబ్బలు తినివచ్చి మళ్ళా నాకే వాళ్ళగురించి చాడిలు చెప్తావా? అని కొడుకు అనిల్‌ను నాలుగు గుద్దులు గుద్దాడు. వాడికి జర్వం తగులుకొని కలవరించుకుంటా ముడుక్కొని నులక మంచమెక్కినాడు. వాళ్ళమ్మ లక్షుమ్మ వాడ్ని చంక కెత్తుకొని పోయి ఆదివారం పూట జెండామానుదగ్గర పక్కీరయ్యతో యాపాకు మండలతో దిష్టి తీయించుకొని, తాయత్తు కట్టించు కొని గూడా వచ్చింది.
ఇప్పుడే సైకిల్ షాపు పెట్టుకొని టైర్లకు పంక్చర్ వేస్తాండే సలీం గూడా తన కొడుకు అక్బర్‌ను కాన్వెంటు బడికి పంపిస్తా వుండాడు. వాడు వారానికి రెండుసార్లు మాత్రమే స్కూల్‌కు పోతాడు. వాళ్ళమ్మ అక్బర్‌ను తీసుకొని కాన్వెంట్‌లో కూర్చో బెట్టి వస్తుంది. వాడు వెంటనే పైకి లేచి ఏడ్సుకుంటా వెంట పడ్తా బయటికి పరిగెత్తుకుంటా వచ్చేస్తా వుండాడు. వాడెందుకు స్కూలంటే యింతగా బెదిరిపోతా వుండాడో వాళ్ళమ్మకు ఇప్ప టికీ అర్థం కావడం లేదు. ఇంగ్లీషు భాషలో అమ్మను 'మమ్మీ అని నాన్నను 'డాడీ అని పిలుస్తావుంటే ఇంటిల్లిపాదీ ఎంతగా పొంగిపోయినారో...టౌనుకుపోయి ఫస్ట్‌క్లాస్‌కే కట్టలకట్టల నోటుపుస్తకాలు, రంగురంగుల ఖరీదైన టెక్ట్స్‌బుక్ కొనుకొచ్చి పిల్లోళ్ళకు ఇస్తాండరు.
స్కూల్‌బస్‌లో పిల్లోడిని కాన్వెంటుకు పంపడమంటే పల్లెలో ఇప్పుడొక హోదా అయిపోయింది. పిల్లోడు ఏం నేర్చుకుం టాడు? ఎట్లా చదువుకుంటాడు? వాడికి అర్ధమైతాందా? లేదా? రోజూ ఎందుకు క్లాస్‌లో దెబ్బలు తినాల్సి వస్తోంది? వాడి మానసిక పరిస్థితి ఎలా ఉంది? అనే ప్రశ్నలకు ఎవరూ జవాబిచ్చే తల్లిదండ్రులేలేరు. ఊరంతా పిల్లోడు ఇంగ్లీష్ మాట్లాడితే చాలని కలలుకంటా వుండాది. స్కూల్ బస్ వూర్లోకి రాగానే నీట్‌గా పిల్లోడిని తీర్చిదిద్ది బస్‌లోకి తోసెయ్యడంతో వాడు సాయంత్రానికి 'ఇంగ్లీష్‌దొరలా తయారై వస్తాడనే భ్రమల్లోనే వున్నారు. మున్సిపాలిటీ వాళ్ళ కుక్కల బండికి, స్కూల్ బస్‌కు తేడా ఏముంది?
ఉదయం ఎప్పుడో క్లాస్‌లో రెండు తెలుగు మాటలు మాట్లాడాడని శరభయ్యకొడుకు సాంబుజిని పిలిచి మెడల్ 'ఐ నెవర్ స్పీక్ తెలుగు అనే బోర్డును సాయంత్రం వరకు వేసి టీచర్ పనిష్మంట్ ఇచ్చాడు ఇంగ్లీష్ చదువుకోసం.వాడొక్కడే ఏముంది? అంకన్న కొడుకు పాపోడు, బాబయ్య కొడుకు అనిల్, సలీం కొడుకు అక్బర్, అన్నయ్య కూతురు అమృత...ఇట్లాగే ఇంకా ఎందరో ఈ బోర్డులు ఏదో ఒకసారి మెడకు తగిలించుకొని మోసిన వారేకదా! 'దేశ భాషలెందు తెలుగు లెస్స అని మనం ఎంతపైకి అనుకున్నా లోలోపల ముసుగులోంచి 'ఇంగ్లీష్ రాక్షసి మనల్ని వికృతంగా కవ్విస్తూనే ఉంటోంది.కబళిస్తూనే ఉంటోంది. మనల్ని మన సంస్కృతిని మన మాతృభాషను తల్లి భాషలోని మమతను, మమకారాన్ని భక్షిస్తూనేఉంది. పిల్లోడు తెలుగులో మాట్లాడితే స్కూల్లోనూ, ఇంట్లోనూ మండిపోతా వుండారు. వేలకువేలు పోసి కాన్వెం టుకు పంపిస్తావుండేది ఎందుకు? నువ్వు కూడా మాలాగానే కోడిని, మేకను అట్లాగే పిలుస్తే తేడా ఏముంది? హెన్, గోట్ అనే మాటలు వాడవెందుకని ఒక తండ్రి కొడుకును స్కూల్ న్నుంచి రాగానే ఉతికి ఆరేశాడు కోపంతో ఊగిపోతూ.
అట్నే బస్సు ఎక్కుతూ 'నీళ్ళసీసా మర్చిపోయినానని అనిన వెంటనే అమృతను వాళ్ళమ్మ చెంపకందిపోయేలా చాచి కొట్టింది. 'వాటర్ బాటిల్ అని అను అని నీకెన్నిసార్లు చెప్పా లని గదమాయించింది. ఆ పిల్లఏడుస్తూనే స్కూలుకు వెళ్ళింది. తల్లిదండ్రులు ఇట్లుండారు కాబట్టే కాన్వెంటు స్కూల్ టీచర్లు, మేనేజ్‌మెంట్లు కూడా అదే దార్లోనే నడుస్తున్నాయి. స్కూల్ గేటుదాటి లోపలికి అడుగుపెడ్తానే తెలుగు మాటలు ఆగి పోవాలి. ఓన్లీ ఇంగ్లీష్‌నే స్పీక్ చేయాలి అని ఆర్డర్‌ను జారీ చేశాయి. శిక్షల్ని కఠినతరం చేశారు. నిన్నటికి నిన్న కడపజిల్లా మైదుకూరులోని సెయింట్ జోసఫ్ స్కూల్లో జరిగినట్లుగానే ఇప్పుడు రాష్ట్రంలో అన్నీ చోట్లా 'ఇంగ్లీష్ పిచ్చి వెర్రితలలు వేస్తూనే వుంది. 'ఐ నెవర్ స్పీక్ తెలుగు అని రాసివుంచిన బోర్డులను పిల్లల మెడలో మూర్చబిళ్ళల మాదిరి వేలాడదీసి అవమానిస్తున్నారు. నిజంగా వీళ్ళు అవమానిస్తున్నదెవర్ని? పిల్లల్నా...వారిని పుట్టించిన తల్లిదండ్రుల్రా...మన నరనరాల్లో యింకి మనతోనే ప్రవహిస్తున్న మాతృభాషనా? తల్లి భాషకు పాడెకడ్తున్నదెవరు? ఈ ద్రోహానికి శిక్షఏమిటి? పిల్లల అమాయక ముఖాల్లోని దీనత్వాన్ని మాతృభాష ద్వారా వెలుగు నింపలేమా? మనం నిజంగా యింత నిస్సహాయ స్థితిలోనే వున్నామా? కాన్వెంటు స్కూల్ బస్‌లోని కిటికిల్లోంచి బెదురుగా పిల్లలు చూస్తూనే వున్నారు!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment