Tuesday, December 19, 2017

ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై "తెలుగు పౌరుషం" పుస్తకం ఆవిష్కరణ !

2009, అక్టోబరు 26 వ తేదీన కడప జిల్లా మైదుకూరులోని సెయింట్ జోసెఫ్ ఆంగ్లమాధ్యమ పాఠశాలలో తెలుగు
మాట్లాడారని.. మూడవ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలమెడలలో " I NEVER SPEAK TELUGU 'అని రాసిన అట్ట ఫలకాలను తగిలించి శిక్షించిన సంఘటన పత్రికలద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చి తెలుగు భాషాభిమానులలో ఒక తీవ్ర దుమారాన్ని లేపింది. ఆ దాష్టీకాన్ని ఖండిస్తూ, తెలుగు భాషకు జరుగుతున్న అవమానంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. స్థానిక " తెలుగు సమాజం " ప్రతినిధులు రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి నాయకత్వంలో ఈ సంఘటనపై ఉద్యమాన్ని లేవనెత్తారు. మైదుకూరు సంఘటన నేపథ్యంలో తెలుగు పత్రికలలో వచ్చిన వ్యాసాలు, సంపాదకీయాలు, స్పందనలు, అభిప్రాయాలను "తెలుగు పౌరుషం" పేరుతో" సంకలనకర్త , రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మనకు అందిస్తున్నారు . మైదుకూరు తెలుగు ఉద్యమం తాలూకు ఛాయాచిత్రమాలిక కూడా ఈ పుస్తకంలో చేర్చబడింది. అలాగే తెలుగు సమాజం మైదుకూరులో నిర్వహిస్తున్న భాషా వికాస కార్యక్రమాలతో పాటు, తవ్వా ఓబుల్ రెడ్డి జరుపుతున్న చారిత్రక పరిశోధనల వివరాలు, నూతన చారిత్రక ఆవిష్కరణలు కూడా ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఆసక్తికరమైన ముఖ చిత్రం, మంచి ముద్రణతో వెలువడిన ఈ పుస్తకానికి.. సంకలనకర్త తవ్వా ఓబుల్ రెడ్డితో పాటు తెలంగాణా సాహిత్య అకాడెమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి, తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు ,సామల రమేష్‌బాబు, తెలుగు రక్షణ వేదిక అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణల ముందుమాటలున్నాయి. శ్రీయుతులు ఎబికె ప్రసాద్, డాక్టర్ చుక్కా రామయ్య, ప్రముఖ పాత్రికేయులు విశ్లేషకులు తెలకపల్లి రవి, సాహితీవేత్త అక్కిరాజు రమాపతి రాజు, ప్రముఖ పాత్రికేయులు హెబ్బార్ నాగేశ్వర రావు, డాక్టర్ అద్దంకి శ్రీనివాస్, ప్రముఖ రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు, ప్రముఖ రచయితలు డాక్టర్ దుగ్గిరాజు శ్రీనివాస రావు, డాక్టర్ రామకృష్ణ , ప్రముఖ పాత్రికేయులు టి. ఉడయవర్లు , ప్రముఖ రచయిత వీరాజీ, సహజ కవి మల్లెమాల, కాలమిస్ట్ , రచయిత పడాల్ లాంటి వారి వ్యాసాలతో పాటు, చీరాల శ్రీశ్రీ గా పేరుగాంచిన కీ.శే. వెలుగు వెంకట సుబ్బారావు మైదుకూరు ఉదంతంపై రాసిన గేయంతో పాటు సంకలనకర్త పరిచయాన్ని ఈ పుస్తకంలో చదువుకోవచ్చు. సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత , ప్రముఖ రచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, ప్రముఖ కథా రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి , పార్లమెంట్ సభ్యులు ఎస్.పి.వై రెడ్డి, త్రిపురనేని హనుమాన్ చౌదరి, రాజకీయ నాయకులు నల్లు ఇంద్రసేనా రెడ్డి, మాణిక్య వరప్రసాదరావు, పలువురు తెలుగు భాషాభిమానుల అభిప్రాయాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై ఈ "తెలుగు పౌరుషం" పుస్తకం ఆవిష్కరించబడింది.
పుస్తకం పేరు:తెలుగు పౌరుషం
సంకలనం: తవ్వా ఓబుల్ రెడ్డి
ప్రచురణ: తెలుగు సమాజం, మైదుకూరు
ప్రతులకు: తవ్వా పార్వతి, ఇంటి నెం.13/478-1, ఎల్.ఐ.సి ఆఫీసు వీధి, మైదుకూరు, కడపజిల్లా
ఫోన్ : 9440024471
పేజీలు: 104
వెల:రూ 100/-

Saturday, October 14, 2017

తెలుగు పాఠం - ప్రగతికి పీఠం- - డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి

తెలుగుభాష మనుగడ, వినియోగంపై చర్చ మళ్లీ ప్రారంభమైంది. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’, ‘దేశభాషలందు లెస్స’ అనిపించుకుంది తెలుగు. ఇది దక్షిణ భారతంలోని సంస్కృతి, చరిత్ర, సాహిత్యానికి ప్రతీక. ఆసియాలోని వివిధ దేశాలతో పాటు, దక్షిణాఫ్రికాలోని డర్బన్‌ నగర ఉన్నత పాఠశాలలోనూ తెలుగు రెండో భాషగా కొనసాగుతోంది. ఎంతో ఘనత కలిగిన ఈ భాష, భారత్‌లో పలువురు మాట్లాడే రెండో పెద్ద భాషగా ఖ్యాతి పొందింది. తల్లిభాషలో బోధన సాగితే- విద్యార్థులకు పాఠ్యాంశాలు, వాటి ప్రణాళిక పట్ల సరైన అవగాహన కలుగుతుంది. బోధన మొదట ప్రారంభమయ్యేది పాఠశాలలో కాదు, గృహంలో... అదీ మాతృభాషలో! అదే భాష బడిలోనూ కొనసాగితే, విషయ పరిజ్ఞానం విస్తరిస్తుంది. మాతృభాష తల్లిపాల వంటిది. ఇతర భాష పోతపాలతో సమానం. పాఠశాలలో విద్యార్థి మాతృభాష అక్కడ గృహ వాతావరణాన్ని కల్పిస్తుంది. అతడి భావ వ్యక్తీకరణకు అది ఎంతో ఉపయోగపడుతుంది.
స్ఫూర్తిదాయక సేవ 
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7.5 కోట్లమంది పిల్లలకు మాతృభాషలో బోధన కరవవుతోందని ‘యునెస్కో’ వెల్లడించింది. ప్రాథమిక విద్యాబోధన పిల్లల మాతృభాషలోనే సాగితే, అభివృద్ధి తథ్యమని పేర్కొంది. మాతృభాషలోనే బోధనకు వనరులు పెంపొందించుకోవాలని, అటువంటి దేశాలే లక్ష్యాలు చేరుకోగలవని ఆ సంస్థ స్పష్టీకరించింది. మూడు లక్షలమంది మాట్లాడే ‘చెరోకి’ అనే ప్రాంతీయ భాష పరిరక్షణకు అమెరికా ప్రభుత్వం నడుం బిగించింది. దాదాపు 30 లక్షల డాలర్లు కేటాయించి, ఆయా పాఠశాలల్ని ప్రారంభించింది. ఆ నిధుల్ని ఉపాధ్యాయ శిక్షణకు, పాఠ్యప్రణాళికలు సిద్ధం చేయడానికి ఉపయోగించాలని విద్యాశాఖను ఆదేశించింది. అమెరికాలో స్థానిక తెగలు మాట్లాడుకునే ఒక భాష పరిరక్షణకు, అక్కడి ప్రభుత్వం సాగిస్తున్న ఈ తరహా కృషి భారత్‌ సహా అన్ని దేశాలకూ స్ఫూర్తిదాయకం. మాతృభాష పరిరక్షణ కోసం అందులోనే ప్రాథమిక విద్యాభ్యాసం సాగాలన్న సూత్రాన్ని అనేక దేశాలు విశ్వసిస్తున్నాయి. 1997 వరకు బ్రిటిష్‌ పాలనలో ఉన్న హాంకాంగ్‌లోనూ ఆంగ్లభాషతో సమానంగా స్థానిక ‘కెంటోనీస్‌’ భాషలోనూ విద్యాబోధన సాగింది. అత్యధిక సంఖ్యలో విద్యార్థులు కలిగిన చైనాలో మాతృభాషను పరిరక్షిస్తూ, అన్ని పాఠశాలల్లోనూ ఆ భాషలోనే బోధన కొనసాగిస్తున్నారు. హాంకాంగ్‌ బోర్డు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో చైనీస్‌ భాషతో పాటు ఆంగ్లంలోనూ చైనీయులు సమాన ప్రతిభ కనబరిచారు. స్వీడన్‌ వాసులు మాతృభాషలోనే విద్యాబోధన సాగిస్తూ, ఆంగ్లభాషలోని భావాన్ని అనువదించుకుంటూ ముందడుగు వేస్తున్నారు. జపనీస్‌- పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాల్లోనూ బోధనభాషగా ఉంటోంది. ఉత్తర, దక్షిణ కొరియాల్లోనూ ఇదే విధానం ఉంది. ఆనంద సూచికలో మొదటి స్థానం పొందిన ఫిన్‌లాండ్‌ దేశంలో ప్రాథమిక విద్య పూర్తిగా మాతృభాషలోనే సాగుతోంది. ఐస్‌లాండ్‌, నార్వే, రుమేనియా వంటిచోట్లా విద్యాబోధన మాతృభాషల్లోనే! ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, కాంబోడియా, వియత్నాం, థాయ్‌లాండ్‌, మలేసియా దేశాల పాఠశాలల్లో ప్రాథమిక విద్యాబోధన వారివారి తల్లిభాషల్లోనే కొనసాగుతోంది. ఆఫ్రికా దేశాలైన టాంజానియా, జింబాబ్వేలు మాతృభాషల్ని కాపాడుకుంటూ ప్రాథమిక స్థాయుల్లో తమ మాతృభాషల్లోనే బోధనలు సాగిస్తున్నాయి. ఇథియోపియా పాఠశాలల్లో విద్యాబోధనను పూర్తిగా వారి మాతృభాషలోనే నిర్వహిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం అక్కడి మాతృభాషకే బోధనరంగంలో ప్రాధాన్యమిస్తూ ఇటీవల ఓ నూతన విధానం తెచ్చింది.
అందరినోటా అమ్మమాట 
సోక్రటీస్‌, ప్లేటో, అరిస్టాటిల్‌ తమ మాతృభాషల్లోనే గ్రంథాలు రచించారు. నోబెల్‌ సాహిత్య బహుమతులు అందుకున్నవారిలో అనేకులు తల్లిభాషలో రాసినవారే. విశ్వకవి రవీంద్రుడు ప్రాథమికంగా బెంగాలీలో రచించిన అనంతరం ఆంగ్లంలోకి తర్జుమా అయిన ‘గీతాంజలి’కి నోబెల్‌ పురస్కారం లభించింది. విఖ్యాత కవి టాల్‌స్టాయ్‌ రచనలన్నీ మాతృభాషలోనివే. పలువురు సాహితీవేత్తలకు మాతృభాషల్లో అంత పట్టు లేకుంటే, ప్రపంచం అంత గొప్ప గ్రంథాల్ని చూసి ఉండేది కాదు. తల్లిభాషే మనిషి జీవితాన్ని ప్రతిబింబిస్తుందని మహాత్మాగాంధీ విశ్వసించారు. తన పన్నెండో ఏట వరకు మాతృభాష గుజరాతీలోనే చరిత్ర, లెక్కలు, భూగోళ శాస్త్రాలు చదివానని ఆయన ఆత్మకథలో రాసుకున్నారు. ఆ తరవాత పాఠశాల నిబంధనల ప్రకారం ఇతర భాషలు నేర్వాల్సి వచ్చిందని, అందుకు ఎంతో సమయం వృథా అయిందని ఆయన వెల్లడించారు.
ఉభయ రాష్ట్రాల్లో కృషి
పలు ప్రపంచ దేశాలు తమ మాతృభాషల్ని భావి తరాలకు కానుకలుగా అందించాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. కానీ- ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాషలో ఒక్క ముక్కా నేర్చుకోకుండానే విద్యాభ్యాసం పూర్తిచేసే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉంది! దేశంలోని మరి ఏ ఇతర రాష్ట్రంలోనూ తల్లిభాష నేర్వకుండా ఉన్నతవిద్య పూర్తిచేసే అవకాశం లేదు. ఈ ‘ఉపద్రవం’ గమనించిన తెలంగాణ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లోనూ ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు తెలుగును పాఠ్యాంశంగా బోధించాలన్న నిర్ణయం తీసుకొంది. ప్రాథమిక, మాధ్యమిక, ఇంటర్మీడియట్‌ పాఠ్య ప్రణాళికలు తయారుచేయాలని తెలుగు అకాడమీని ఆదేశించింది. ఎటువంటి పరీక్షలకైనా అకాడమీ పుస్తకాలే ప్రామాణికమని తెలియజేస్తూ, మాతృభాష పరిరక్షణకు ప్రభుత్వం సంసిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం- మాతృభాష తెలుగుకానివారైనా, ఇతర మాధ్యమాల్లో అభ్యసించేవారైనా ఇకముందు తెలుగు పాఠ్యాంశాలను తప్పనిసరిగా చదవాలన్న నిబంధన తెస్తోంది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మాతృభాషకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తుందని కర్ణాటక గతంలోనే ప్రకటించింది. మాతృభాషా వికాసానికి ఉపక్రమించిన తమిళులు ఇంజినీరింగ్‌లోని సివిల్‌, మెకానికల్‌ విభాగాల్లో తమ భాషాబోధన ప్రారంభించారు. తమిళ భాషలో పాఠశాల విద్యనభ్యసించినవారు 80 శాతం, ఆంగ్లంలో చదివిన 20 శాతం విద్యార్థులతో అక్కడి ఇంజినీరింగ్‌ సీట్లు భర్తీ కావడం గమనార్హం. డిగ్రీస్థాయిలో పూర్తిగా తమిళ మాధ్యమంలోనే బోధన కొనసాగిస్తామంటూ, ఆ రాష్ట్రంలోని అన్నా విశ్వవిద్యాలయానికి దాని అనుబంధ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆంగ్ల, తమిళ అనువాదాల ప్రత్యేక నిఘంటువుల్ని తమిళ భాషాపండితులు ఇప్పటికే రూపొందించారు. ఇటువంటి వాటిని అంతర్జాలంలో అందుబాటులో ఉంచడం, భాషాసంబంధ సంశయ నివృత్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒడిశాలోనూ ప్రాథమిక పాఠశాల బోధనను మాతృభాషలోనే కొనసాగిస్తున్నారు.
ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లోనూ మాతృభాషను ఒక అంశంగా విధిగా బోధించాల్సిందే. కేంద్రంతో తమిళనాడు ప్రభుత్వం ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించేటప్పుడు, ఆంగ్లంతో పాటు తమిళ ప్రతినీ తప్పనిసరిగా జతచేస్తోంది. తమిళ మాధ్యమ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అయిదు శాతం మార్కుల్ని అదనంగా కలుపుతున్నారు. అక్కడ తమిళ మాధ్యమంలో చదవనివారికి రాష్ట్రస్థాయి ర్యాంకులు ఇవ్వరు. తెలుగు భాషలో బోధనను ఇతర భాషలతో బేరీజు వేసుకుంటే, పరిస్థితి అంత ఆశాజనకంగాలేదు. పదో తరగతిలో మాతృభాషలో రాసేవారు సగానికిపైగా తగ్గిపోయారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. విదేశాల్లో ఉన్న తెలుగువారు మాతృభాషా పరిరక్షణకు శ్రమిస్తున్నారు. అక్కడ తెలుగు సంఘాలు ఏర్పాటుచేసుకొని, ప్రైవేటుగా తెలుగు పాఠశాలల్లో తమ పిల్లలకు మాతృభాష నేర్పిస్తున్నారు. తెలంగాణలో తొమ్మిది లక్షలమంది ఇంటర్‌ చదువుతుండగా, వారిలో మాతృభాషలో బోధన అందుకుంటున్నవారు కేవలం మూడు లక్షలమంది! వారిలో లక్షా 80 వేల మంది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు. ఒకటి నుంచి పదో తరగతి వరకు 60 లక్షలమంది విద్యార్థులుంటే, సగం మందే మాతృభాషలో విద్య అభ్యసిస్తున్నారు. దిల్లీలో ఓ తెలుగు సంస్థ నిర్వహిస్తున్న ఏడు పాఠశాలల్లో ఆ భాషను తప్పనిసరి చేశారు. మారిషస్‌లోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు కోర్సుకు గుర్తింపు లభించింది.
నైపుణ్యాల పెంపుదల 
ఎంసెట్‌లో 25 శాతం, జేఈఈ మెయిన్స్‌లో 40 శాతం ఇంటర్‌ మార్కులకు వెయిటేజి ఉంది. దీంతో, కార్పొరేట్‌ కళాశాలలు తెలుగు బదులు ఇతర భాషలో పరీక్షలు రాయించి, విద్యార్థుల్ని మాతృభాష నుంచి దూరం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని సీబీఎస్‌సీ పాఠశాలల్లో నాలుగో తరగతి వరకు తెలుగు లేదు. అయిదో తరగతి నుంచి ఉన్నా, అది ఐచ్ఛికమే! ఇటువంటి పరిస్థితి ఉండటం వల్ల- ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో చదువు మొత్తాన్నీ తెలుగు రాకుండానే పూర్తిచేయవచ్చు! వాడుక భాషను, అందులో వస్తున్న మార్పులను ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలి. సామాజిక అనుబంధ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ పాఠ్యప్రణాళికలో మార్పులు తేవాలి. అప్పుడే మాతృభాష వైపు పిల్లలు ఆకర్షితులవుతారు. మాతృభాషేతర బోధన ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంటోంది. తరగతి గదిలో నిశ్శబ్దం చోటుచేసుకుంటోంది. ఫలితంగా పిల్లల్లో సృజనాత్మకత, సమయస్ఫూర్తి, చొరవ, భావవ్యక్తీకరణ మందగిస్తున్నాయి. తల్లిభాషలో చదవడం, రాయడం వంటి నైపుణ్యాల్ని పెంపొందించాలి. మాతృభాషలో విద్యాబోధన సాగితే, ఉపాధ్యాయులకు పనిభారం తగ్గుతుంది. వారు తమ విద్యార్థుల నైపుణ్యాల్ని వెలికితీసేందుకు మరింత సమయం కేటాయించగలుగుతారు. తల్లిభాషలో విద్యాబోధన విద్యార్థిని ఉద్దేశించి ఉంటుంది. వారిలో అభ్యాసన నైపుణ్యాలు పెరుగుతాయి. విద్యార్థులకు మానసిక ఒత్తిడి లేకుండా, ఉపాధ్యాయులు సులభ పద్ధతిలో బోధన చేయగలుగుతారు. విద్యార్థులూ తదుపరి పాఠాలకు, తరగతులకు సంసిద్ధులవుతారు. పిల్లలకు విషయ పరిజ్ఞానం, వారి మానసిక పరిణతి తల్లిభాషలో బోధనతోనే సాధ్యపడతాయి. తల్లిభాషలో జ్ఞానాన్ని సంపాదించి, దాన్ని వేరే భాషలోకి మార్పు చేసుకోవడమే అత్యుత్తమ మార్గం. ఆ బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. ఆంగ్లభాష నుంచి పలు ప్రామాణిక గ్రంథాల్ని వ్యావహారిక మాతృభాషలోకి తర్జుమా చేయాలి. ఎందుకంటే- అటు ఆంగ్లం రాక, ఇటు తల్లిభాష చదవలేక నలిగిపోతున్న పిల్లలు లక్షల్లో ఉన్నారు.
ఆంగ్లభాషా గ్రంథాల్ని భారతీయ భాషల్లోకి అనువదించాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలదే. అడపాదడపా ఆయా విభాగాలు నిర్వహిస్తున్న అనువాద కార్యక్రమాలు సరైన ఫలితాల్ని ఇవ్వడం లేదు. మాతృభాషలో ఉపాధ్యాయ విద్యకు సరికొత్త ప్రణాళికల్ని ప్రభుత్వాలు సిద్ధం చేయాలి. విశ్వవిద్యాలయాల్లోని నిపుణులైన ఆచార్యులతో సంఘాన్ని ఏర్పాటుచేసి, మాతృభాషలో బోధనకు అవసరమైన సూచనల్ని ఆహ్వానించి స్వీకరించాలి. సాధ్యమైనంతవరకు మాధ్యమిక, ఇంటర్‌ విద్యనూ తల్లిభాషలోనే కొనసాగించాలి. ఆ జ్ఞానాన్ని తదుపరి విద్యలో వేరే భాషలోకి మార్చుకొనే విధానం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. త్రిభాషా సూత్రాన్ని అనుసరిస్తూనే, మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారిపై ఉంది!
                                                                                                                               
- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి
                                                                                                                       (ఈనాడు సౌజన్యంతో )
 

Thursday, September 14, 2017

అమ్మ భాషకు నీరాజనం

అమ్మ భాష సరిగా రానివారికి ఇతర భాషలు ఒంటపట్టడం కల్ల అన్నది జార్జి బెర్నార్డ్‌ షా చెప్పిన మాట. ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు సైతం ఆ సంగతే వెల్లడించాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో భాషాభిమానం అధికం. వారితో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు–ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మాతృభాషకు ఎంతో అన్యాయం జరుగుతోందని భాషాభిమానులు చాన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీసుకున్న రెండు నిర్ణయాలు ఊరట కలిగిస్తాయి. ఒకటో తరగతి మొదలుకొని పన్నెండో తరగతి వరకూ తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాలన్నది అందులో ఒకటి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలూ ఇకపై బోర్డులన్నిటినీ తెలుగులోనే రాయాలన్నది మరో నిర్ణయం. ఉత్తరాది రాష్ట్రాల్లో, తమిళనాడు, కర్ణాటకల్లో బోర్డులన్నీ అక్కడి భాషల్లో ఉంటాయి. కనీసం ఆ దుకాణాలు లేదా సంస్థలు ఏమిటో తెలుసుకుందామని ప్రయత్నించినా ఇంగ్లిష్‌లో ఒక్క ముక్క కూడా రాసి ఉండదు.

మన దగ్గర మాత్రం సామాన్యులకు అర్ధం కాకుండా ఇంగ్లిష్‌లోనే బోర్డులుంటాయి. ఆమధ్య తెలుగులో కూడా ఉండాలన్న నిబంధన పెట్టడం వల్ల ఏదో ఒక మూల దాన్ని రాయడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్‌ చెబుతున్న ప్రకారం బోర్డులు ఇకపై తెలుగులో తప్పనిసరిగా ఉండాలి. ఇతర భాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టం. తెలుగు పాఠ్యాంశాన్ని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతున్నది. దాన్ని పాటించే విద్యా సంస్థలకు మాత్రమే మాత్రమే రాష్ట్రంలో అనుమతులుంటాయని కూడా కేసీఆర్‌ చెప్పారు. దీనికి కొనసాగింపుగా మరో కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ తెలుగు పాఠ్యాంశాలకు తెలంగాణ సాహిత్య అకాడమీ పాఠ్య ప్రణాళికలను రూపొందించి పుస్తకాలు ముద్రించాలని, వాటిని మాత్రమే అన్ని విద్యా సంస్థలూ అనుసరించవ లసి ఉంటుందని కూడా నిర్దేశించారు.

భాషా వికాసానికి జరిగే కృషిలో ప్రభుత్వాలది క్రియాశీలక పాత్ర. ఆ పాత్రను ప్రభుత్వాలు సక్రమంగా పోషిస్తేనే మాతృభాష బతికి బట్ట కడుతుంది. నిజానికి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాక దేశంలో అవతరించిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. చిత్రమేమంటే ఆ తర్వాత పదేళ్లకుగానీ తెలుగును అధికార భాషగా గుర్తించే తీర్మానం శాసనసభ చేయలేకపోయింది. ఆ విషయంలో ఉత్తర్వులు జారీ చేయడానికి ఏళ్లూ పూళ్లూ పట్టింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు డిగ్రీ స్థాయి వరకూ మాతృభాషలో విద్యా బోధన ఉండాలని సంకల్పించి తెలుగు అకాడమీకి ఆ బాధ్యత అప్పగించి అన్ని పాఠ్యాంశాలూ తెలుగులో లభ్యమయ్యేందుకు దోహదం చేశారు.

ఆ విషయంలో తర్వాత వచ్చిన పాలకులు మరింత చురుగ్గా వ్యవహరించి తెలుగుపై శ్రద్ధ పెట్టి ఉంటే భాషా వికాసం మరింతగా సాధ్యమయ్యేది. భాష జాతికి తల్లివేరులాంటిది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఏ జాతి అయినా ఎదుగుతుంది. ఈ సంగతి మనకంటే తమిళనాడు, కర్ణాటక నేతలకు బాగా తెలుసు. మాతృభాష కళ్లయితే పరాయిభాష కేవలం కళ్లజోడని తమిళనాడు తొలి ముఖ్యమంత్రి అన్నాదురై అన్నారు. ఆ దృష్టితోనే ఆయనా, ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు తమిళభాషకు పెద్ద పీట వేశారు. దాని సర్వతోముఖాభివృద్ధికి పాటుబడ్డారు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకు ఆచరణలో సమస్యలెదురయ్యే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటిచోట్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారి ఆధ్వర్యంలో విద్యా సంస్థలు నడుస్తున్నాయి.

ఆ సంస్థలు సైతం తెలుగును ఇకపై ఒక పాఠ్యాంశంగా బోధించడం తప్పనిసరి. అలాగే కొన్ని విద్యా సంస్థలు వేటికవి వేర్వేరు ప్రైవేటు ప్రచురణకర్తలు వెలువరించిన తెలుగు పుస్తకాలను వాడుతున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఇది కుదరదు. చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం ఉంటే ఈ నిబంధనలు అమలయ్యేలా చూడటం పెద్ద కష్టం కాదు. ఏ ప్రాంత భాష అయినా నేర్చుకోవాలనుకునేవారు అందుకు శాస్త్రీయంగా రూపొందించిన పాఠ్యాంశాన్నే అనుసరించాలి. ఆ పాఠ్యాంశం అక్కడి సంస్కృతిని, నుడికారాన్ని ప్రతిబింబించాలి. అప్పుడు మాత్రమే తాము ఉంటున్న రాష్ట్రం గురించిన సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.

తెలుగు భాషా వైభవానికి కృషి చేస్తానని చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విషయంలో ఇంతవరకూ ప్రగతి సాధించకపోగా అందుకు విరుద్ధమైన పోకడలకు పోతున్నారు. తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని, ప్రత్యేక బడ్జెట్‌ కేటా యిస్తామని వాగ్దానం చేశారు. తెలుగు భాషా పీఠం ఏర్పాటు చేస్తామన్నారు. స్వయం ప్రతిపత్తిగల ప్రాధికార సంస్థను ప్రారంభిస్తామని చెప్పారు. ప్రత్యేక తెలుగు కేంద్రం ఉంటుందన్నారు. వీటన్నిటికీ మించి తెలుగును రెండో జాతీయ భాషగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లారు. కానీ ‘రెండో జాతీయ భాష’ గురించి ప్రధాని నరేంద్ర మోదీ వద్ద కనీసం ప్రస్తావనైనా తెచ్చారో లేదో అనుమానమే.

కనీసం పార్లమెంటులో ఆ పార్టీ ఎంపీలు సైతం ఇంతవరకూ దీని ఊసెత్తలేదు. తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వచ్చినా అది నామమాత్రం గానే మిగిలింది. తెలుగుకు పల్లకీ మోత సంగతలా ఉంచి మున్సిపల్‌ పాఠశాలలను ఒక్క కలం పోటుతో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలుగా మారుస్తూ గత జనవరిలో ఉత్తర్వులు జారీచేశారు. అందుకు సంబంధించి అభ్యంతరాలు తలెత్తడంతో తెలుగు మీడియం కూడా కొనసాగుతుందని ప్రకటించారు. కనీసం ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వ తాజా నిర్ణయాలను గమనించాకైనా  మార్పు వస్తే... మాతృభాషా పరిరక్షణకు కృషి చేస్తే మంచిది .
సాక్షి దినపత్రిక సంపాదకీయం ౧౪-౦౯-౨౦౧౭ .

Wednesday, September 13, 2017

హైదరాబాద్‌లో డిసెంబరు15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలు

హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను
ముందుగా అనుకున్నట్లుగా అక్టోబరులో కాకుండా డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను ఆహ్వానిస్తామని.. రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో ఉత్సవాలను జరుపుతామని తెలిపారు. మహాసభలను పురస్కరించుకొని ఆయన తెలుగును పరిరక్షించే కీలక నిర్ణయాలను ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభలపై మంగళవారమిక్కడ ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు రమణాచారి, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందినీ సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘అక్టోబరులోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. కానీ, 5 నుంచి 9 వరకు దాదాపు 90 దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రపంచ పర్యాటక సదస్సు హైదరాబాద్‌లో జరుగుతుంది. నవంబరు 28 నుంచి దాదాపు 170 దేశాలు పాల్గొనే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్‌కు ఆతిథ్యమిస్తోంది. ఈ రెండు కార్యక్రమాల నిర్వహణలో అధికారయంత్రాంగం తలమునకలై ఉన్న తరుణంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపితే అనుకున్నంత ఘనంగా నిర్వహించలేమని భావించాం. అందుకే డిసెంబరులో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని నిర్ణయించాం’’ అని చెప్పారు. తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నందున తెలుగు భాషను పరిరక్షించే బాధ్యత తమపై ఉందన్నారు.
సాహిత్య అకాడమీ పుస్తకాలే ప్రామాణికం
తెలుగును విధిగా బోధించాలన్న నిర్ణయం నేపథ్యంలో తెలంగాణలో ఇకపై ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకొని బోధించడం కుదరదు. సాహిత్య అకాడమీ రూపొందించిన సిలబస్‌తో ఉన్న పుస్తకాలనే బోధించాలి. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. దీనిపైన, తెలంగాణలోని బోర్డులను తెలుగులోనే రాయాలనే నిర్ణయంపైనా త్వరలోనే మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేస్తాం.
వేదికలు
ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి. రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కళాశాల మైదానం, భారతీయ విద్యాభవన్‌, పింగళి వెంకట్రామిరెడ్డి హాల్‌, శిల్ప కళావేదిక, ఇతర వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయి.
తెలంగాణ తెలుగుకు ప్రాశస్త్యం
తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి జరిగిన కృషిపై చర్చా గోష్ఠులుంటాయి. తెలంగాణలో వర్ధిల్లిన తెలుగును ప్రపంచ నలుమూలలకూ తెలిపే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలుంటాయి. బతుకమ్మ, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి, కలుపుపాట, నాటు పాట, బతుకమ్మ పాటలు, వినోద ప్రక్రియ కార్యక్రమాలుంటాయి. తానీషా-రామదాసుల మధ్య అనుబంధం, రామదాసు కీర్తనలు, తందనాన రామాయణం, శారదాకారులు, హరికథ ప్రక్రియ తదితర అంశాలను ప్రదర్శించాలి. పద్యగానం, సినీపాటల విభావరి నిర్వహించాలి. గ్రామీణ ప్రాంతాల్లో పాడుకునే కాట్ల పాటలు, కోత పాటలు, దుక్కి పాటలు, జానపద గేయాలను ఆలపించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు పాడే పాటలు ఒకతరం నుంచి మరో తరానికి ఎలా చేరాయో కళ్లకు కట్టినట్లు చూపించాలి.
ఆహ్వానాలు
దేశ విదేశాల్లోని తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు, కవులు, కళాకారులు, రచయితలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానిచాలి. మహాసభల ఔచిత్యాన్ని చాటడానికి సన్నాహాక సమావేశాలు నిర్వహించాలి. అమెరికా, యూరప్‌, గల్ఫ్‌ దేశాలతో పాటు మారిషస్‌, సింగపూర్‌, మలేసియా లాంటి దేశాల్లో అక్కడున్న తెలుగు వారి కోసం సమావేశాలు జరపాలి. ఏపీతో పాటు దేశం నలుమూలల్లో, తెలంగాణలోని అన్ని ముఖ్యపట్టణాల్లో ఈ సమావేశాలు జరగాలి. కేవలం తెలుగువారినే గాకుండా భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ, జ్ఞాన్‌పీఠ్‌ లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందిన ప్రముఖులను ఆహ్వానించాలి.
* మహాసభల నేపథ్యంలో తెలుగు భాష, ప్రక్రియలకు సంబంధించి పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి. తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు వైభవానికి కృషి చేసిన కవులు, పండితులు, సాహితీవేత్తలు, కళాకారులను గుర్తించి సన్మానం చేయాలి.
* అతిథులందరికీ ప్రభుత్వం తరఫునే బస, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించాలి. మహాసభలకు ముందే తెలుగు భాషాభివృద్ధికి దోహదపడే పుస్తకాల ముద్రణ జరగాలి. అతిథులకు నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపించాలి. తెలంగాణ పరిచయం కోసం ప్రత్యేక డాక్యుమెంటరీని తయారు చేయాలి.
సినారె స్మారక మందిరం
నగరంలో సి.నారాయణరెడ్డి స్మారకమందిరాన్ని నిర్మించాలి. రెండు మూడు రోజుల్లోనే స్థలం ఎంపిక చేసి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి. అధికార భాషా సంఘం, సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం, గ్రంథాయల పరిషత్‌ తదితర సంస్థలు కీలక భూమిక నిర్వహించాలి. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయ స్థాయిల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించాలి. మహాసభల సందర్భంగా హైదరాబాద్‌ నగరాన్ని అలంకరించాలి. ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ద్వారాలు ఏర్పాటు చేయాలి. జిల్లాల్లో కూడా అలంకరణలుండాలని కేసీఆర్‌ ఆదేశించారు.
                                                                            -ఈనాడు - హైదరాబాద్‌



Tuesday, September 12, 2017

ఇంటర్ దాకా తెలుగు తప్పనిసరి.. సీఎం కేసీఆర్

హైదరాబాద్: సెప్టెంబరు12: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్ష చేపట్టిన సీఎం కేసీఆర్ తెలుగు భాషా పరిరక్షణకు పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో మొదటి తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను ఖచ్చితంగా ఒక సెబ్జెక్టుగా బోధించాలి. అదేవిధంగా తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులను ఖచ్చితంగా తెలుగులోనే రాయాలని పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో ప్రపంచ తెలుగు మహసభల నిర్వహణపై సీఎం కేసీఆర్ మంగళవారం సమీక్ష చేపట్టారు. మహాసభల నిర్వహణకు రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్య అకాడమీకి రూ. 5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ. 2 కోట్లు నిర్వహణ ఖర్చుల కింద మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా పనిచేయనుంది. తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా తెలుగు భాషను పరిరక్షించే నిమిత్తం సీఎం రెండు కీలక నిర్ణయాలను ప్రకటించారు.
తెలుగును ఖచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో ఇకపై అనుమతి లభించనుంది. ఉర్థూ కోరుకునే విద్యార్థులకు ఉర్థూ భాష కూడా ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండొచ్చు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ తరగతుల్లో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ రూపకల్పన చేయాలన్నారు. సిలబస్ రూపొందించి వెంటనే పుస్తకాలు ముద్రించాలని తెలిపారు. సాహిత్య అకాడమీ రూపొందించిన ఈ సిలబస్‌నే అన్ని పాఠశాలల్లో బోధించాలన్నారు. ఇకపై ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా, ఖచ్చితంగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా అన్ని రకాల సంస్థల బోర్డులపైన స్పష్టంగా పేర్లను తెలుగులో రాయాలన్నారు. ఇతర బాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టమన్నారు. ఈ రెండు నిర్ణయాలకు సంబంధించి త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
* నమస్తే తెలంగాణా