హైదరాబాద్: సెప్టెంబరు12: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్ష చేపట్టిన సీఎం
కేసీఆర్ తెలుగు భాషా పరిరక్షణకు పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. వచ్చే
విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో మొదటి తరగతి
నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను ఖచ్చితంగా ఒక సెబ్జెక్టుగా బోధించాలి.
అదేవిధంగా తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల
బోర్డులను ఖచ్చితంగా తెలుగులోనే రాయాలని పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో
ప్రపంచ తెలుగు మహసభల నిర్వహణపై సీఎం కేసీఆర్ మంగళవారం సమీక్ష చేపట్టారు.
మహాసభల నిర్వహణకు రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్య
అకాడమీకి రూ. 5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ. 2 కోట్లు నిర్వహణ ఖర్చుల
కింద మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ ప్రపంచ
తెలుగు మహాసభల నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా పనిచేయనుంది. తెలంగాణలో
తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా తెలుగు భాషను
పరిరక్షించే నిమిత్తం సీఎం రెండు కీలక నిర్ణయాలను ప్రకటించారు.
తెలుగును ఖచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో ఇకపై అనుమతి
లభించనుంది. ఉర్థూ కోరుకునే విద్యార్థులకు ఉర్థూ భాష కూడా ఆప్షనల్
సబ్జెక్టుగా ఉండొచ్చు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ తరగతుల్లో
బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ రూపకల్పన చేయాలన్నారు.
సిలబస్ రూపొందించి వెంటనే పుస్తకాలు ముద్రించాలని తెలిపారు. సాహిత్య అకాడమీ
రూపొందించిన ఈ సిలబస్‌నే అన్ని పాఠశాలల్లో బోధించాలన్నారు. ఇకపై ఎవరిష్టం
వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదన్నారు. ఈ విషయంలో
ప్రభుత్వం అత్యంత కఠినంగా, ఖచ్చితంగా వ్యవహరించనున్నట్లు చెప్పారు.
అదేవిధంగా అన్ని రకాల సంస్థల బోర్డులపైన స్పష్టంగా పేర్లను తెలుగులో
రాయాలన్నారు. ఇతర బాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టమన్నారు. ఈ రెండు
నిర్ణయాలకు సంబంధించి త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయాలని సీఎం
కేసీఆర్ నిర్ణయించారు.
* నమస్తే తెలంగాణా
No comments:
Post a Comment