రాజ నారాయణ్ ( కీరా ) |
*మీ కుటుంబం గురించి చెప్పండి ? .
సుమారు ఎనిమిదివందల ఏండ్ల క్రిందట మా కుటుంబం ఉత్తరానున్న ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి పాండ్య మండలంలో కుదురుకునింది. మాది వ్యవసాయ కుటుంబం. నా తల్లితండ్రులు లక్ష్మమ్మ, కృష్ణ రామానుజనాయకర్ గార్లు. మాది తూతుకుడి జిల్లా, కోవిల్పట్టి తాలూకాలోని ఇడైచేవల్అనే చిన్న గ్రామం. నా భార్య పేరు కనవతి అమ్మ.
తెలుగు జానపద కథలను సేకరించాలనే కోరిక ఎలా కలిగింది. ?
నేను చిన్నబిడ్డగా ఉన్నప్పుడు మా అమ్మ, అవ్వ, ఇంకా ఇంట్లో పెద్దలు, ఊర్లోని చుట్టాలు చాలా కథలను చెప్పేవాళ్ళు. అవన్నీ తెలుగులోనే ఉండేవి. వినడానికి ఎంతో బాగుండేవి. అట్లాగే వీరబాహు అనే ఆయన బయటి ఊరి నుంచి వచ్చి ఒక రకమైన వాద్యాన్ని మీటుతూ పాటలు పాడేవాడు. ఈ వీరబాహులు తెలుగు దళితులు. వీళ్ళు గ్రామా ల్లో తిరుగుతూ కథాగానం చేస్తూ యాచన చేస్తుంటారు.
ఆ వాద్యం డుంగ్ డుంగ్ అనే శబ్దం చేస్తూ ఉంటే వీరబాహు చేసే కథాగానం అద్భుతంగా ఉండేది. పాటకు నడుమ నడమ కొన్ని కథలను చెప్పేవాడు. పాట, కథలు అంతా తెలుగులోనే ఉండేవి. అవన్నీ జానపద కథలే. నేను సేకరించిన కాలానికి చాలామంది పరిశోధకులు జానపద పాటలనే సేకరించినారు. నోటి కథలను పట్టించుకోలేదు. మా పెద్దలు, మా వీరబాహు, మా ఊరి జనం చెప్పిన కథలను భద్రపరచాలనుకొన్నాను. అట్లా మొదలయింది నా సేకరణ.
కీరా అనే మీ కలం పేరు వెనుక కథ ఏదైనా ఉందా.?
నా పూర్తిపేరు రాయంగల కృష్ణ రాజనారాయణ పెరుమాళ్ రామానుజం నాయకర్. ఇందులో రాయంగల మా ఇంటి పేరు. కృష్ణ మా నాయన పేరు. నాయకర్ కులపట్టం. మిగతాది నా పేరు. నాయకర్లనే తమిళనాడు ఉత్తరం పక్క నాయుడు అంటారు. ఇంత పెద్ద పేరుతో పిలువలేరు కదా. మా అమ్మ ముద్దుగా రాజు అనేది. మా అవ్వ రాజయ్య అని పిలిచేది.
ఇక కీరా అనే పేరు ఎట్లా వచ్చిందంటే.. ఒకసారి నేను కోర్టుకు పోవలసి వచ్చింది. అక్కడి బంట్రోతు నా పూర్తి పేరు చెప్పలేక తడబడి పోయినాడు. అప్పడనిపించింది నాకు పేరును పొట్టిగా చేసుకోవాలని. మా నాయన పేరు కృష్ణ రామానుజం లోని తొలి అక్షరాన్ని (కృష్ణను తమిళంలో కిరుష్‌ణ అని రాస్తారు) నా పేరులోని తొలి అక్షరాన్ని కలిపి కి. రా. అని పెట్టుకొంటిని. అదే క్రమేణా కీరా అయింది.
మనదేశంలో జానపద సాహిత్యాన్ని సేకరించడం, భద్రం చేయ డం జరగలేదంటున్నారు, సాంకేతికంగా వెనుకబడడమే కారణమా.?
అదొక్కటే అనుకొనేదానికి వీల్లేదు. సాంకేతికంగా మనకన్నా వెనుక ఉండే దేశాలవాళ్ళు కూడా వాళ్ళ నోటి సాహిత్యాన్ని నిండా పదిల పరచుకుంటున్నారు. వాళ్ళు జానపద కథలను సేకరించడమేకాదు. వాటిని అన్ని ప్రక్రియల్లోకి తీసుకునిపోయి ప్రచారం కల్పిస్తున్నారు. వాటిని పాటలుగా ఆధునిక కథలుగా, నవలలుగా, నాటకాలుగా, సినిమాలుగా తీర్చిదిద్దుకొన్నారు. అట్లా చేయాలనే యోచనే మనకు లేనప్పుడు ఎంత సాంకేతికత ఉండీ ఏం ప్రయోజనం.
ఈ మధ్య వచ్చిన హారిపోర్టర్, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకొనింది కదా, దానికి మూలం జానపద సాహత్యమేనంటారా?
కచ్చితంగా. ఆ కథ జానపదుల్లో లేకపోవచ్చు. కానీ ఆ రచయిత్రి ఊహకు ప్రేరణ కచ్చితంగా జానపదులే. మనమూ మన మూలాలను- నేలను-ఊరిని-వాడుకలను-జనాన్ని మరిచిపోకుండాపట్టుకుంటే, అంత టి సంచనలనం కలిగించే కథలను, ఇంకా గొప్ప కథలను పుట్టించవచ్చు.
జానపద సాహిత్యంలో మూఢనమ్మకాలు ఉంటాయి. అవి ఈ ఆధునిక కాలానికి ఉపయోగపడవు అనే వాదన ఉంది.?
ఈ వాదనను నేను ఒప్పుకోను. మనం పొలంలో పంటను నూర్చి ధాన్యాన్ని రాశిపోస్తాము. ఆ రాశిలో తాలూ, తరకా, గట్టి అన్నీ ఉంటా యి. దాన్ని గాలికి తూరి తాలూ, తరకా ఎగరగొట్టి గట్టి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుంటాము. అంతేగానీ తాలూ తరకా ఉందని ధాన్యాన్ని విడిచిపెట్టి వచ్చేస్తామా? ఇదీ అంతే.
కాలానుగుణంగా సమాజంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అందుకు అనుగుణంగా ఉండేవాటిని తీసుకుని ప్రచారం చేయవచ్చు. లేదా చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఈ పనిని నోటి కథలు చెప్పే వాళ్ళు కూడా చేసినారు. మూఢనమ్మకాలను తప్పుపట్టే ఎన్నో కథలు మన పల్లెల్లోని పెద్దవాళ్ళ నోళ్ళలో ఉన్నాయి. మచ్చుకు నేను సేకరించిన ఈ కథను వినండి....
ఒక కుక్క దాని కూతురి కోసం పెండ్లి కొడుకును చూసేందుకు బయలుదేరింది. గడప దాటి కాలు బయటపెట్టి, వీధి పక్క చూసింది. ఎదురుగా సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చింది. కుక్క కోపంతో వెనక్కు తిరిగి ఇంట్లోకి వెళ్ళి పోయింది. ఆ కుక్క పెండ్లాము, ఏమి, ఏమి వచ్చేస్తివి? అని అడిగింది. దానికి మొగుడుకుక్క ఇట్లా చెప్పింది. 'శకునం సరిలేదు, ఎదురు గా లక్ష్మి వచ్చింది. లక్ష్మి మాదిరి మోసగత్తె లోకంలోనే ఇంకొకతె ఉండదు. ఎక్కడా స్థిరంగా ఉండని లక్ష్మి ఎదురువస్తే ఏ పనీ జరగదు' అనింది. ఆ మాటకు ఆలుకుక్కకు నిండా ఆశ్చర్యం కలిగింది.
సరేనని కొంచెం నీళ్ళు తాగి మరలా తలపాగా చుట్టుకుని, అంగవస్త్రం వేసుకుని బయలుదేరింది మొగుడుకుక్క. ఈసారి పరాశక్తి ఎదురు వచ్చింది. గిరుక్కున తిరిగి ఇం ట్లోకి పోయి, ఆలుకుక్కతో 'ఆ పరాశక్తి ఎదురువచ్చింది శకునం సరిలేదు. అది ఎక్కడకు పోయినా జగడాలమారే. జనాన్ని చంపేదే దాని పని. లోకాన నెమ్మదినంతా కాజేసే ఆడది అది' అని చెప్పింది మొగుడు కుక్క. ఇంకా ఆశ్చర్యపోయింది ఆలుకుక్క. మూడోసారి బయలుదేరింది మొగుడుకుక్క.
ఈసారి ఆవులించుకుంటూ నిద్ర కళ్ళతో మూదేవి (నిద్రాదేవి) ఎదురువచ్చె. మంచి శకునం అనుకుని పోయి ఒక మంచి అల్లుడిని చూసి తెచ్చి కూతురికి పెండ్లి చేసింది మొగుడుకుక్క. ఒకనాడు ఆలూమొగుడూ తీరిగ్గా కూచొని ఉన్నప్పుడు, 'మూదేవి ఎదురు వస్తే మంచి శకునం ఎల్ల అవుతుంది?' అని అడిగింది ఆలుకుక్క. అప్పుడు మొగుడుకుక్క, 'పిచ్చిదానా, ఈ లోకాన సకల జీవరాశులకూ నిద్రకావాల.
నిద్ర లేదంటే పిచ్చి పట్టును. నిద్ర లేదంటే సిరి, శక్తి ఏమీ ఉపయోగం ఉండదు. అందుకే నిద్రాదేవి మంచి శకునం' అని చెప్పింది. ఈ కథ శకునం చూడడమనే మూఢనమ్మకాన్ని ఎదిరించింది. కథ ఎదిరించింది అంటే కథను చెప్పిన జానపదుడు ఎదిరించినాడు. ఇట్లాంటివి ఎన్నో ఉండాయి.
మీకు ముందు ఎవరూ ప్రయత్నం చేయలేదు కదా, మీకు మాత్రం మాండలికంలో రాయాలని ఆసక్తి ఎందుకు కలిగింది.?
ఇట్లా కలిగింది, అట్లా కలిగింది అని చెప్పేది నటన అవుతుంది. తల్లిపాలపైన ఎందుకంత ఇష్టం అని బిడ్డను అడిగితే ఏమి చెబుతుంది?
ఒక భాషకు చెందిన వారందరికీ రచన చేరాలంటే ఏదో ఒక ప్రామాణికత అవసరం కాదా, ఒక ప్రాంతపు మాండలికాన్ని ఇంకొక ప్రాంతం వాళ్ళు చదివి అర్థం చేసుకునేందుకు ఇబ్బంది పడరా.
ప్రభుత్వ ప్రకటనలు, ఆస్తి పత్రాల నమోదు, కోర్టు తీర్పులు ఇట్లాంటి విషయాల్లో ప్రామాణికత అవసరమే.
అయితే సాహిత్య రచనలు మాండలికాల్లో రావడమే మంచిది. మాండలికాలు అర్థంకావు అనే విమర్శకు ఇప్పుడు చోటు లేదు. మొదట్లో అట్లాంటి విమర్శ ఉండేది. రానురాను అన్ని ప్రాంతాల మాండలికాల్లో రచనలు రావడంతో ఆ సమస్య తీరిపోయింది. దేశంలో అతి తక్కువ వానలు కురిసే ప్రాంతాల్లో మా ప్రాంతమూ ఒకటి.
అట్లాంటి పాండ్య మండలపు రైతుల కరువు జీవితాలను, వెతలను, కథలను, ముంగార్లతో, మూన్నూట అరవై దినాల పచ్చదనంతో మురిసిపోయే తంజావూరు యాసలో ఎట్లా చెప్పగలం? చెప్పి పాఠకుడిని ఎట్లా మెప్పించగలం? చెప్పినా పొసగుతుందా? భాష అనే తల్లికి దేహం ఒకటే. అయితే ముఖాలు పలు. ఆ ముఖాలే మాండలికాలు. కథలు, నవలలు, కవితలే కాదు, సినిమాలు, టీవీ నాటకాల్లో కూడా మాండలికాలు రావాలి. అప్పుడే ప్రచారమవుతాయి.
? తమిళనాడులో ఉన్న మాండలికాల గురించి చెప్పండి
పాత కాలంలో తమిళనాడు నాలుగు మండలాలుగా ఉండేది. 1. తొండమండలం, 2. చోళమండలం, 3. కొంగుమండలం, 4. పాండ్య మండలం. ఈ మాండలికానికే కరిసల్ (నల్లరేగడి) మాండలికం అనిపేరు. తంజావూరు, తిరుచి ప్రాంతాలు చోళ మండలపు మాండలికం. కోయంబత్తూరు నుంచి ధర్మపురి వరకూ ఉన్నది కొంగు మాండలికం.
ఆంధ్రదేశాన్ని ఆనుకుని ఉండే చెంగల్పట్టు, ఉత్తర, దక్షిణ ఆర్కాడులు, పాండిచేరి ప్రాంతంలోనిది తొండమండల మాండలికం. కేరళ సరిహద్దుల్లో ఉండే కన్యాకుమారి ప్రాంతపు తమిళాన్ని నాంజిల్నాడు మాండలికం అంటారు. సూక్ష్మంగా చూస్తే కొంచెం కొంచెం తేడాలు ఎన్నో ఉండును. తమిళం కన్నా తెలుగులో తేడాలు ఇంకా ఎక్కువ.
గోపల్లగ్రామం, గోపల్ల పురత్తుమక్కళ్ నవలల రచనకు ప్రేరణ.?
రచనలు మొదలుపెట్టడానికి చాలా ముందు నుంచే నాలో చాలాప్రశ్నలు ఉండేవి. మా ప్రాంతం గురించి, మా పల్లెలు, మా భాష, మా కుటుంబాల గురించి ఎన్నో ప్రశ్నలు. మా నల్లరేగడి ప్రాంతంలో తెలుగువాళ్ళు, తెలుగు పల్లెలు విపరీతంగా ఉండాయి.
ఇక్కడ తెలుగు ఎంత ఎక్కువంటే, మా చిన్నప్పుడు మా పల్లెల్లో ఉండే తమిళులు ఇంట్లో తమి ళం మాట్లాడుకుని, వీధికి వస్తే తెలుగు మాట్లాడేవాళ్ళు. పల్లెల పేర్లన్నీ తెలుగులోనే ఉండేవి. బడి పుస్తకాల్లో ఇదంతా తమిళనాడు అని ఉండేది. మాకు అర్థం కాక మా పెద్దవాళ్ళని అడిగేవాళ్ళం. కొంచెం పెద్దయినాక మా అవ్వను అడిగితే, తరతరాలుగా మా ఇంట్లో చెప్పుకునే కథను ఆమె నాకు చెప్పింది. మా కుటుంబాల వలస జీవితాన్ని విడమరచి చెప్పిన కథ అది.
ఆ కథను మళ్ళీ మళ్ళీ అడిగి ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు. దానినే గోపల్లగ్రామం నవలగా రాసితిని. ఉత్తరాన్నుంచి ఎనిమిది వందల ఏండ్ల క్రితం వలస వచ్చి, ఇక్కడ అడవులను కొట్టి, నేలను తీర్చి సాగులోకి తెచ్చిన మా పెద్దల కథే గోపల్ల గ్రామం నవల. ఆ తరువాత ఆగ్రామం పెరిగి పెద్దదయి, ఎన్నో కులాలను కలుపుకుని స్వతంత్రోద్యమ కాలాన ఎట్లా ఉండిందో చెప్పిన కథే రెండో నవల గోపల్ల పురత్తుమక్కళ్.
ఆంధ్ర దేశంతో, ఆంధ్ర దేశపు తెలుగుతో మీ అనుబంధం.?
తెలుగు రుచి తగిలితేనే నిండా బాగుండును. అది ఆంధ్ర దేశపుదైతే నిండానిండా బాగుండును. మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ తేట తెలుగుదనాన్ని నేను రుచి చూస్తున్నాను. మనమంతానూ తెలుగు బిడ్డ లం. ఏదో కాలవశాన వందల ఏండ్లప్పుడు మేము ఈ పక్కకు వచ్చేస్తిమి. 1946లో నాకు క్షయవ్యాధి వచ్చింది. అప్పుడు క్షయకు మందు దొరికేదికష్టం.
ఆ మందూ ఈ మందూ తీసుకుంటా నాలుగేండ్లు గడిపినాను, నయంకాలేదు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో క్షయ ఆసుపత్రి ఉందని విని, వంటవాడిని తోడు తీసుకుని రైలు ఎక్కేస్తిని. రాత్రంతా ప్రయాణం, బాగా నిద్రపోతా ఉంటిని, తెల్లవారింది తెలియలేదు. దిడీలున మెలుకువ వచ్చింది. రైలు పాకాల జంక్షన్లో నిలిచి ఉంది. అక్కడందరూ తెలుగులోనే మాట్లాడుకుంటా ఉండారు.
వడలు అమ్మేవాళ్ళు, ఫలహారాలు అమ్మేవాళ్ళు, పేపర్, టీ అమ్మేవాళ్ళు, ప్రయాణికులు అందరూ ఒరేయ్మామ, ఏడకి పోతుండావురా ఇట్లా నాకు ఏదో దేవలోకానికి వచ్చినట్లు అనిపించింది. ఎన్నో తరాల క్రితం నా పెద్దలు బతికిన భూమికి వచ్చినట్లయి ఉద్వేగంతో కండ్లనీళ్ళు వచ్చేసినాయి. అదే నేను ఆంధ్రాకు తొలిసారి పోయింది. చివరిసారీ అదే.
మీ రచనల్లో మీకు ఎక్కువ తృప్తిని ఇచ్చినదేది? కథలా, నవలలా, వ్యాసాలా, జానపద కథల సేకరణా.?
నేనట్ల వేరు చేసి చెప్పలేనమ్మా, నలుగురు బిడ్డలూ నాకు ఒక్కటే. మీ ద్వారా ఆంధ్రావాళ్ళకి ఒక విన్నపం చేయాలనుందమ్మా. నాకిప్పుడు 86 ఏండ్లు నేను పోయే లోపు నారచనలు ముఖ్యంగా నా తెలుగు వాళ్ళ గురించి నేను రాసిన రెండు నవలల్ని (గోపల్లగ్రామం, గోపల్ల పురత్తుమక్కళ్), తెలుగు అక్షరాల్లో చూసుకోవాలని నా కోరిక. వీలయితే ఈ కోరికను తీర్చమని నా విన్నపం.
ఇంటర్వ్యూ : సుధారాణి
ఆంధ్రజ్యోతి సౌజన్యంతో-
Excellent!. Thank you for the good information. Hope some one translate those two books into Telugu.
ReplyDeleteతెలుగు మీద ఈపెద్దాయనకున్న ప్రేమ చదూతుంటే "కండ్లనీళ్ళు వచ్చేసినాయి".
ReplyDeletei REQUEST TELUGU ACADEMI AND TELUGU UNIVERSITY & TTD should combinely take up the translation and publication of Gopalla Gramam , goallapurutumakkal novel of Thiru Rajanarayan.
ReplyDelete