Sunday, February 12, 2012

మారిషస్ లో 'తెలుగు' అభివృద్ధి కోసం చేస్తున్న నరసింహప్పడు

శ్రీ నరసిం హప్పడు 
ఆయనకి ముగ్గులంటే ఇష్టం! ముగ్గు యంత్రాన్ని కనిపెట్టారు.
చిత్రలేఖనం అభిరుచి. 'సంస్కృతి' చిత్రాలు గీస్తారు.
కళలపై మక్కువ. నాటకాలూ పుస్తకాలూ రాస్తారు.
 ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. మనరాష్ట్రంలోని దేవాలయాలకే వస్తారు. ఇంకా ఎన్నెన్నో చేస్తారు. ఎందుకు చేస్తున్నారూ అంటే... 'నాకు తెలుగు భాషపై మమకారం. భాషకోసం ఏదైనా చేయాలన్న తపన' అంటారు సంజీవ నరసింహప్పడు. అయితే, ఆయన పుట్టిపెరిగింది ఆంధ్రదేశంలో కాదు, మారిషస్‌లో! అక్కడ తెలుగువారికోసం... తెలుగు భాషకోసం ఎంతో చేస్తున్నారు.
 విజయనగరం నుంచి...
నరసింహప్పడు పూర్వీకులది విజయనగరం. 1837 ప్రాంతంలో... దేశం బ్రిటిష్‌ పాలనలో ఉండేది. అప్పట్లో విదేశాల్లో వ్యవసాయ పనులు చేసేందుకు మనరాష్ట్రం నుంచి చాలామంది రైతులను తీసుకెళ్లేవారు. అలా నరసింహప్పడు ముత్తాతలు కూడా విజయనగరం నుంచి మారిషస్‌ వెళ్లిపోయారు. అలా వెళ్తున్నప్పుడే మన పురాణాలూ ఇతిహాసాలూ గ్రంథాలూ వెంట తీసుకెళ్లారు. మారిషస్‌ చేరిన తెలుగువారందరూ ఒకే చోట ఉండేవారు. పండగలూ శుభకార్యాలను అందరూ కలిసి జరుపుకునేవారు. స్థానికంగా ఆంగ్లం, ఫ్రెంచి భాషల ప్రభావం వారి పిల్లలపై పడకుండా చక్కగా తెలుగే నేర్పించేవారు. భరతనాట్యం, కూచిపూడి, అన్నమయ్య కీర్తనలు... ఇలాంటివన్నీ పిల్లలకు పరిచయం చేసేవారు. నరసింహప్పడు కూడా ఇలాంటి పరిస్థితుల మధ్యే పుట్టి పెరిగారు. అక్కడే తెలుగు ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. చిన్నప్పట్నుంచే ఆయనకి తెలుగు భాషపట్ల మమకారం... మాతృభాష కోసం ఏదైనా చెయ్యాలన్న తపన ఉండేవి.
 తెలుగు కోసం
మూడు దశాబ్దాల కిందటే మారిషస్‌ తెలుగు వారికోసం ప్రత్యేకంగా ఓ పతాకాన్ని రూపొందించారు. నరసింహప్పడుకి చిత్రలేఖనంలో ప్రవేశం ఉంది. రావి ఆకులపై 504 చిత్రాలు గీశారు. అవి కూడా తెలుగు కవులూ కళలూ పండగలూ ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించేలా గీసినవే. మారిషస్‌ తెలుగు వారసత్వ కళానికేతనం, ఆంధ్ర లలితకళా సమితి, మారిషస్‌ ప్రభుత్వ తెలుగు సాంస్కృతిక కేంద్రం... వీటన్నింటికీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతేకాదు, ఆ దేశ ప్రభుత్వం నుంచి తెలుగు భాషాభివృద్ధికి కావాల్సిన నిధులనూ రాబట్టారు. 'దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తుంటాం. తెలుగువారిని కలుసుకుంటూ కలుపుకుంటూ నాటకాల ప్రదర్శన, సాహిత్య చర్చలు వంటి కార్యక్రమాలు చేపడుతుంటాం. ఇక్కడి విద్యా సంస్థల్లో తెలుగు బోధన ఎలా ఉందో కూడా సమీక్షిస్తుంటాం. నేను పాఠశాలలతోపాటూ కళాశాలల్లోనూ తెలుగు బోధిస్తుంటాను. ఏడు నుంచి పన్నెండు తరగతులవారికి ప్రాచీన, ఆధునిక యుగంలో తెలుగు భాష, వ్యాకరణం, సాహిత్యం బోధిస్తున్నాను' అని వివరిస్తారు నరసింహప్పడు. ఈయన మారిషస్‌లో పాఠశాలల తెలుగు బోధనా విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. అంతేకాదు, మారిషస్‌ జాతీయ ఆకాశవాణి, దూరదర్శన్‌ ప్రసారకునిగానూ వ్యవహరిస్తున్నారు. 'రోజుకి కనీసం రెండుమూడు గంటలపాటైనా తెలుగు ప్రసారాలు ఉండేట్టు చూస్తాం. మన సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాల ప్రసారానికి ప్రాధాన్యం కల్పిస్తాం. తెలుగువారి పండగలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటాం' అని చెబుతారు.
ప్రతీయేటా 'విజయ తీర్థయాత్ర'ను కూడా చేపడుతున్నారు నరసింహప్పడు. 30 లేదా 60 లేదా 90 మంది చొప్పున మారిషస్‌ వాసులను ఆంధ్రప్రదేశ్‌ తీసుకొస్తారు. వారంతా ఇక్కడి పుణ్యక్షేత్రాలూ దేవాలయాలూ నదులూ పర్యాటక ప్రదేశాల్లో పర్యటిస్తారు. మారుమూల పల్లెలకు సైతం వెళ్తారు. కొద్దిరోజులపాటు గ్రామీణులతో మమేకమై వారి సంప్రదాయాలనూ జీవన విధానాన్నీ తెలుసుకుంటారు. వీళ్లంతా తిరిగి మారిషస్‌ వెళ్లాక అక్కడి తెలుగువారితో ఈ అనుభవాలను పంచుకుంటున్నారు. 1985 నుంచీ ఇప్పటివరకూ ఈ విజయ తీర్థయాత్ర కొనసాగుతూనే ఉంది.

వీటితోపాటూ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్య సభలూ సమ్మేళనాలను కూడా నిర్వహిస్తుంటారు. 'మన సంస్కృతికి ప్రతీకలు ముగ్గులు. ఇంటి ముందున్న ముగ్గును బట్టీ చెప్పొచ్చు... ఆ ఇంట్లోని వ్యక్తులు తెలుగు సంప్రదాయానికి ఎంత విలువనిస్తారో అన్నది. అందుకే నేను కూడా ముగ్గులు నేర్చుకున్నాను. అయితే, ఈతరం వాళ్లకి గంటల తరబడి ముగ్గులు వేసే సమయం ఉండదు. కానీ, ముగ్గులంటే ఇష్టపడేవాళ్లూ ఉన్నారు. అందుకే అలాంటి వాళ్లకోసం ముగ్గు యంత్రాన్ని తయారు చేశాను. ఎంత క్లిష్టమైన ముగ్గునైనా ఇది చిటికెలో వేసేస్తుంది. మన తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే వివిధ రకాల ముగ్గులతో 8 పుస్తకాలు వేశాను. ఏం చేస్తున్నా తెలుగు భాషకు కొంత సేవ చేయాలన్నదే నా ఆశయం. అందుకే నా వస్త్రధారణ దగ్గర్నుంచీ మాటల వరకూ అన్నీ అచ్చ తెలుగులోనే ఉంటాయి. ఎవర్నో ఆకర్షించాలన్న ఉద్దేశంతో చేసుకున్న మార్పులు కావివి. నా చుట్టూ తెలుగు వాతావరణం ఉండాలి, నా చుట్టూ ఉన్నవారందరి చుట్టూ కూడా తెలుగే ఉండాలి అన్నది నా ఆశయం' అని చెబుతారు. దేశంకాని దేశంలో తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని మనమూ అభినందిద్దాం.
-         ముత్తా నారాయణరావు, న్యూస్‌టుడే, విశాఖపట్నం
         (ఈనాడు" సౌజన్యంతో.. )

2 comments:

  1. నిజమైన తెలుగు వారిని పరిచయం చేశారు. బాగుంది.

    ReplyDelete
  2. నరసింహప్పడు అనే పేరులో ఉన్న తెలుగుదనం తెలుగునాట ఎక్కడైనా చూశామా ? చూస్తామా ? చూడగలమనే ఆశయినా ఉందా ? కనీసం పేర్లలోకూడా తెలుగువారు పేరు నిలబెట్టుకోలేకపోతున్నందుకు అందరం కలిసి సామూహికంగా సిగ్గు పడదాం.

    ReplyDelete