Tuesday, July 31, 2012

కళాస్రష్టలు కొండపల్లి శేషగిరి రావు, వెంపటి చినసత్యం లకు నివాళి


తెలుగు కళామతల్లి నాల్గురోజుల వ్యవధిలో ఇద్దరు ఉత్తమ పుత్రులను కోల్పోయి విషణ్ణవదన అయింది. ఒక జాతి సాంస్కృతిక వారసత్వానికి, ఔన్నత్యానికి నిలువుటద్దం దాని కళా సంపద, ప్రాభ వం. శిల్పసంపదతో పాటు చిత్రలేఖనం, నాట్యం పరంపరాగత కళలేగాక కళోపాసకుల సృజనశీలతతో కొత్త పుంతలు తొక్కుతుం టాయి. ఆధునికతను, సమకాలీనతను సంతరించుకుంటూ వుం టాయి. సాంప్రదాయకతను స్వీకరిస్తూనే ఆధునికరీతుల రంగులద్ది వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్‌తరాల సాంస్కృతిక, ఆత్మిక వికాసా నికి, మానసికోల్లాసానికి ప్రాతిపదికలు నిర్మిస్తాయి. అటువంటి రెండు కళారూపాలకు జీవంపోసి, జీవనాధారం చేసుకుని శిష్యప్రశి ష్యులతో అజరామర కీర్తినార్జించిన కళాస్రష్టలు కొండపల్లి శేషగిరి రావు, వెంపటి చినసత్యం. ఇరువురూ వారు ఎంచుకున్న మార్గంలో సిద్ధహస్తులు, లబ్ద ప్రతిష్టులు. శేషగిరిరావు చేతిలోని కుంచె అద్భుత కళాఖండాలు సృష్టించగా, వెంపటివారి నర్తనం తెలుగువారి 'కూచి పూడి' నాట్యానికి ఖండాతర ఖ్యాతి ఆర్జించింది. ఇరువురూ ఎనభై పదులు పైబడిన నిండు జీవితం జీవించినవారే. వారు ఆ జీవితాన్ని సార్థకం చేసుకున్న సృజనశీలురు, మట్టిలో మాణిక్యాలు, చిరం జీవులు. గురువారం తెల్లవారుఝామున కన్నుమూసిన కొండపల్లి శేషగిరిరావు (89సం||) జన్మస్థలం వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలం పెనుకొండ గ్రామం. ఆంధ్రాయూనివర్శిటీ, రాజస్థాన్‌ బనస్థలి విద్యాపీఠ్‌, హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాప్ట్స్‌లో విద్యాభ్యాసం చేసిన శేషగిరిరావు శాంతినికేతన్‌లో నందలాల్‌బోస్‌ శిష్యరికంలో చిత్రకళను ఔపోసనపట్టారు. ప్రకృతిని ప్రేమించే చిత్ర కారునిగా ఆరంభమైన ఆయన జీవితం పౌరాణిక, ఇతిహాస ముద్రల గుండా ప్రయాణించి సమకాలీన జీవిత చిత్రణవైపు మరలింది. నిజాం నిరంకుశ పాలనలో జీవించిన ఆయన ఆ కర్కశపాలనకు వ్యతిరేకంగా ప్రజాతిరుగుబాటును సైతం కళ్లకుగట్టినట్లు చిత్రించారు. రైతాంగ సాయుధ పోరాటంతోపాటు ఆర్యసమాజ్‌ మొదలు కాంగ్రెస్‌ వరకు నిజాం వ్యతిరేక ప్రజాపోరాటంలోని భిన్నపార్శ్యాలను ఎంతో సృజనాత్మకంగా చిత్రించారు. తెలంగాణ కాకిపడగలు, రామ ప్పదేవాలయం విశిష్టతను తనకుంచెతో హృద్యమంగా చిత్రించిన తొలి చిత్రకారుడు ఆయనే. తెలుగు చిత్రకళను, అంతర్జాతీయవేదిక మీద సగౌరవంగా ఆవిష్కరించిన కొద్దిమంది చిత్రకారులలో గణ్యుడు శేషగిరిరావు. 1975లో రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతికశాఖ హైదరా బాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలో చూపరులను ఇట్టే ఆకట్టుకున్న ''తెలుగుతల్లి'' చిత్రపటం ఆయన సృజనకు దర్పణంగా నిలిచింది. ఎన్నో పురస్కారాలు ఆయన్ను వెదుక్కుంటూ వచ్చాయి. 1988లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రదానం చేసిన ఎమిరిటస్‌ ఫెలోషిప్‌, తెలుగు విశ్వవిద్యా లయం వారి గౌరవ పురస్కారం డాక్టరేట్‌, ప్రతిష్టాత్మక హంస అవార్డు ఎన్నదగినవి. సాంకేతిక, వృత్తివిద్యల వైపు పరుగుతో సాంప్రదాయ కళలు కనుమరుగయ్యే నేటి పరిస్థితుల్లో ప్రతి జిల్లాలో ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలను ప్రారంభించి కళాకారులను ప్రోత్సహించడంతో పాటు మన కళలను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది.
ఆదివారం తెల్లవారుజామున చెన్నైలో కన్నుమూసిన నాట్యా చార్యులు, పద్మభూషణ్‌ వెంపటి చినసత్యం (82సం||) పేరువినని వారుండరు. కృష్ణా జిల్లా దివితాలుకాలోని కూచిపూడి గ్రామం సిద్ధేంద్రయోగి ఆవిష్కృ తంగా చెప్పబడే నాట్యరీతికి పుట్టినిల్లు. అదే కూచిపూడి నాట్యరీతిగా ప్రసిద్ధమైంది. భాగవతులు వంశపారం పర్యంగా సాధనచేస్తూ బతికించుకుంటూవస్తున్న ఆ నాట్యానికి ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిపెట్టినవారు చిన సత్యం. ఈ నాట్యంలో ఒకప్పుడు ఆడవారికి ప్రవేశం లేదంటే ఆధునిక తరాలు నమ్మలేరు. సాంప్రదాయక పౌరాణిక కథావస్తువులతో సాగే ప్రదర్శనలో మగవారే స్త్రీపాత్రలు పోషించే వారు. అటువంటి ఛాందసాలను వదిలించి, సరికొత్త నృత్యనాటికలను రూపొందించి ' కూచిపూడి ' నాట్యానికి కొత్త రక్తం ఎక్కించి, ఆకర్షణీయం చేసి బహుళ ప్రాచుర్యం కలిగించిన వారు సత్యం. ఆంధ్రుల పారంపర్య నృత్యమైన ' కూచి పూడి' కనుమరుగయ్యే దశలో దాన్ని పునరుజ్జీవింపజేసేందుకు చిన సత్యం కృషి నిరుపమానం, అనితరసాధ్యం. అదొక అశిధారావ్రతం. భారతీయ శాస్త్రీయ నృత్యాల్లో చిన్నచూపుకు గురవుతున్న ' కూచిపూడి' రీతి సశాస్త్రీయతను నిరూపించి దానికి భారతప్రభుత్వ గుర్తింపు పొందటంలో ఆయన చేసిన కృషి ఆధునిక నాట్యాచార్యుల్లో అగ్రతాంబూలానికి అర్హుణ్ణిగావించింది. 1947లో మద్రాసు చేరి సోదరుడు పెదసత్యం వద్ద సినిమాలలో నృత్యదర్శకత్వంలో సహా యకునిగా, తదుపరి పలు చిత్రాలకు నృత్యదర్శకునిగా పనిచేసిన ప్పటికీ ఆయన దృష్టి అంతా 'కూచిపూడి' నాట్య విశిష్టతమిదే లగమైంది. '1963లో మద్రాసు టీనగర్‌లో ఆయన నెలకొల్పిన కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ' ఆయన జీవిత లక్ష్య సాధనకు సోపాన మైంది. భరతనాట్యం ప్రభావం ఎక్కువగా ఉన్న మద్రాసులో 'కూచిపూడి 'కి సముచితస్థానం సంపాదించేందుకు నడుంకట్టారు. పాతికేళ్ల కృషి 'కూచిపూడి'ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆయన వద్ద శిక్షణ పొందినవారిలో విదేశీయుల సంఖ్య కూడా గణనీయం.
పురాణ ఘట్టాలకు సృజనాత్మకతను జోడించి ఎంతో హృద్య మంగా చినసత్యం రూపొందించిన నృత్యరూపకాలలో శ్రీకృష్ణపారి జాతం, శ్రీనివాస కళ్యాణం, రుక్మిణి కళ్యాణం, చండాలిక, అర్థనారీ శ్వరం, హరవిలాసం, రామాయణం, క్షీరసాగరమథనం, కిరాతార్జు నీయం రసజ్ఞుల ప్రశంసలు పొందాయి. దేశవిదేశాల్లో అసంఖ్యా కంగా ప్రదర్శనలిచ్చారు. 2011లో హైదరాబాద్‌లో 2800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నృత్యకార్యక్రమంతో గిన్నీస్‌ రికార్డు నెలకొల్పారు. చినసత్యంగారికి ఆంధ్రవిశ్వవిద్యాలయం 1980లో గౌరవ డాక్టరేట్‌, కళాప్రపూర్ణ బిరుదు ప్రదానం చేయగా, భారతప్రభుత్వం 1998లో ' పద్మభూషణ్‌ 'తో సత్కరించింది. 'భరణి కళాప్రపూర్ణ' సహా నాట్యరంగంలో అందు కున్న పురస్కారాలు మరెన్నో. కూచిపూడి నృత్యమే తన శ్వాసగా జీవితాంతం శ్రమించి ఎందరో నర్తక, నర్తకీమణులను తయారుచేసి, ఆ నాట్యరీతికి భారతీయ నాట్యరీతుల్లో సముచితస్థానం ఆర్జించి పెట్టిన వెంపటి చినసత్యం సృృతి శాశ్వతం. ఆయన శిష్యకోటి ఆయన కృషికి సజీవ దర్పణాలు. కూచిపూడి నాట్యం సజీవంగా వున్నంతవరకు వెంపటి చినసత్యం చిరంజీవి.

-విశాలాంధ్ర దినపత్రిక సౌజన్యం తో .