Sunday, May 29, 2011

తెలుగు బడిని నిలిపిన చల్లని ఒడి

తమిళనాడులోని డెంకణి కోట పక్కనున్న అన్యాళం గ్రామంలోని తెలుగు మాధ్యమిక పాఠశాలని నిలపడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తా ఉన్నది లక్ష్మమ్మ. ఎంతోమంది పెద్దలు తలపట్టుకుని చేతులెత్తేశారు. చదువుకునే పిల్లలు చేరకుంటే బడిని మూస్తారు.
మగత నిద్రలో దూరంగా తోవమీద హారన్ శబ్దాలు, ఇంట్లో పిల్లల కేరింతలు... ఆమె నిద్రా ధ్యానంలో కూడా ఆలోచిస్తున్నది.
ఆ సమయంలో-
ఓ రోజు పగటిపూట వలలు పట్టుకుని పదిమంది గువ్వలవారు (షికారీలు) అనే కులంవాళ్లు లక్ష్మమ్మ పొలంలోకి పక్షుల వేటకు వచ్చారు. లక్ష్మమ్మ ప్రతి పంట కోతలప్పుడు గువ్వలకోసం ధాన్యం కోయకుండా కొంత పొలం వదిలిపెడుతుంది. వేలాది గువ్వలు ఆ చేనులో వాలి కడుపు నింపుకునేవి. అదో...వాటిమీద గువ్వలవాళ్ల కన్ను పడింది. రెండేళ్లనుండి వాళ్లని వేటాడనివ్వకుండా అడ్డుపడుతోంది లక్ష్మమ్మ. కొడుకు అశ్వత్థరెడ్డి తెలుగు భాషా ప్రచారం కోసం దూర గ్రామాలలో ఉన్నాడు. ఎరువులు తేవడం కోసం పక్కూరెళ్లింది లక్ష్మమ్మ. ఎలా తెలిసిందో! భయంతోఒక్కసారి చేనుమీంచి పెద్ద పక్షుల గుంపు-్భయంతో రెక్కలు విదిలించి ఆకాశంలోకి ఎగిసిన శబ్దం! దూరంలో ఉన్న లక్ష్మమ్మ ఎలా విందో ఏమో గాని గువ్వల చేనుకాడ వాలిపోయింది. ఆమె గుండెల్లో దడ తగ్గలేదు. నుదుటిమీద చెమట...ఒళ్లంతా రొప్పుతూ అక్కడే కూలబడింది.
గువ్వలు ఎగిరిపోతే పోయాయి. మరుసటి రోజు వస్తాయి. కానీ లక్ష్మమ్మ కంటబడ్డాం కదా అని గువ్వలవాళ్లు బెదురు కళ్లేసుకున్నారు.
వాళ్ల వెంట వచ్చిన చిన్న పిల్లల్ని చూసి ‘‘ఏరా ఎంతమందుంటారు మొత్తం మీ గువ్వలోళ్ల ఇళ్లల్లో పిల్లలు’’ అని ఆరా తీసింది. మొత్తం ఇరవైమంది. పదిమంది ఆడెక్కలు, పదిమంది మగ కుంకలు అని చెప్పారు. వేళ్లమీద తర్జనభర్జన పడి ఒకరినొకరు అడుక్కుని పక్కా లెక్క తేల్చారు.
‘‘లక్ష్మమ్మ కళ్లల్లో తెలుగు గూడు కదలాడింది. ‘‘ఏమిరా పిల్లల్ని గువ్వల్లాగా గాలికొదిలేదేనా? కొంత సదువు, ఇంత బలపం కావాలా? మీలాగే వాళ్ల బతుకుల్ని గాలి కొదిలేయకండి.’’ తెలుగు భాషరా మనది అంటూ నాలుగు వేమన పద్యాలు, సుమతీ పద్యాలు అందుకుంది. ఈలోగా కొత్త గువ్వలు కొన్ని పొలంమీద వాలాయి. పద్య రాగాలు విందామని కాబోలు.
మా పిల్లలకు చదువెందుకన్న గువ్వల వాళ్లని సరే ఆలోచిద్దాం లెమ్మనేవరకూ తీసుకొచ్చింది మాటలతో.
మరి పొలంమీద వాలే గువ్వల షికారు చేసుకుంటాం అని మెల్లిగా ఖరాకండి షరతు పెట్టారు వేటగాళ్లు.
వాళ్ల తెలివి ముందు ఆమె మ్రాన్పడిపోయంది.
తెలుగుబడి నిలపాలా? గువ్వల గూడుని రక్షించాలా? మళ్లీ నీరసపడిపోయిందామె.
ఏమీ మాట్లాడలేక-
‘‘రేపీయాళ్లకు రండి’’ అని మాట్లాడకుండా గమ్మునుండిపోయింది.
గువ్వలు కాదు లక్ష్మమ్మే వలలో పడినంత సంతోషంగా భుజాల మీద ఖాళీ వలలతో వెనుదిరిగారు.
వందలాది అమాయక పక్షులు ఒకవైపు, గువ్వలవాళ్ల వెనక బుడిబుడి అడుగులు వేస్తున్న పిల్లలు మరోవైపు. ఇద్దరూ కావాలి తనకు. ఎలా?
ఊరంటే గడపలు కాదు. పొలాలూ, తోటలే కాదు. చెరువులూ, కుంటలూ, బావులూ, చెట్లు, చేమలూ, పక్షులూ, పరిశుభ్రమైన గాలీ... తెలుగు సంస్కృతి ఎంత ముఖ్యమో ఆ వాతావరణాన్ని సజీవంగా నిలిపే పక్షుల రెక్కల చప్పుడూ అంతే ముఖ్యం. ఆ రాత్రి దీర్ఘంగా ఆలోచించింది.
మళ్లీ గువ్వలు ఒక్కసారి భయంతో రెక్కలు అల్లార్చాయి. ఈసారి వాటిలో నిన్నటి అంత భయంలేదు. లక్ష్మమ్మ ఇంట్లోనే ఉంది కదా అని వాటి ధీమా.
కాని లక్ష్మమ్మ ఏమి చేయాలా అని ఆలోచిస్తూనే ఉంది.
తెల్లారినా కూడా మనసు కుదుటపడ లేదు.
పేపర్‌లో టీవీ ధర తగ్గింపు ఆఫర్ వార్తని మనమలు చూపినప్పుడు ఆమె మనస్సు మరింత బాధకు లోనైంది.
దూరంగా షికారీలు వలలూ, పక్షులను వేటాడి తీసుకెళ్లడానికి ప్లాస్టిక్ సంచులూ పట్టుకుని వస్తున్నారు.
లక్ష్మమ్మ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా లేచి నిలుచుంది.
ఆకాశంలో పక్షులు గింగిర్లు కొడుతునే ఉన్నాయి. పొలంలో ఎప్పుడు వలలు విసురుదామా అని గువ్వల వేటకి వచ్చిన పదిమంది ఒక్కొక్కరు ఒక్కో బస్తా ధాన్యం భుజాన వేసుకుని వచ్చిన దారి పట్టడం చూసి గువ్వలు చిరుగుంపులై హాయిగా పొలంలోకి దిగాయి. లక్ష్మమ్మ కళ్లల్లో ఆనందం. వెళ్ళుతున్న వాళ్లని ఆపింది. అలాగేనమ్మా అన్న మాట- రేపు పిల్లల్ని తీసుకువచ్చి బడిలో వేస్తామని ఇచ్చిన హామీ- తెలుగు తరగతిలో పద్యాలు వినపడినంత సంతోషం వేసిందామెకు.
రాత్రి వచ్చిన కొడుకు అశ్వత్థరెడ్డి కాళ్లు కడుక్కుంటూ తెలుగుబడి ఈసారికి బతికిందమ్మా! గువ్వలోళ్లు తమ పిల్లల్ని చేర్పిస్తున్నారట తెలుసా అన్నాడు సంతోషంగా.
ఒకవైపు మురిసిపాటు. మరోవైపు దిగులు చారలు. తన ఇద్దరు మనమళ్ల టీవీ కల మాత్రం ఆవిరైపోయింది.
పదిబస్తాల ధాన్యం ఒక టీవీకి సరిసమానమని-
ఈ ఏడు కూడా మనమళ్లకి టీవీ లేదని ఎలా చెప్పాలా అని చూస్తోంది.
ఐదేళ్ల తరువాత...
గువ్వల పొలాన్ని, తెలుగుబడిని నిలిపిన లక్ష్మమ్మతో వాళ్లింట్లో కరచాలనం చేసి ఆమె పాడిన కమ్మని తెలుగు పద్యాలు విన్న సంతృప్తి మరువలేనిది. రాష్టప్రతితో కలిసిన దానికన్నా ఎక్కువే నాకు గుర్తుంటుంది. ఆనాడు మేం తీసిన ఒకే ఒక్క ఫోటో ఇలా పనికి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఆమె బోసి బుగ్గల్లో, భాషను బతికించే బిగబట్టిన కాంక్షా పరిమళం ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఆమె ఒక జ్ఞాపకం కాదు. ఆమె నిండైన ఒక తెలుగు అక్షరం.
అన్యాళం బడిని చూసినా దాని బొమ్మను చూసినా నాకు లక్ష్మమ్మ తల్లి గుర్తొస్తుంది.
గువ్వల్ని చూసినా, పరారైన పిచుకల్ని చూసినా ఆమె గుర్తొస్తుంది.
 -ప్రొఫెసర్  జయధీర్ తిరుమల రావు,
( ఆంధ్రభూమి దినపత్రిక సౌజన్యంతో..)

Monday, May 2, 2011

తెలుగు భాష - చారిత్రక నేపథ్యం

నేటి తెలుగు వెలుగు నీడల సమ్మేళనమై, ఆనంద విషాదాల సమ్మిశ్రితమై ఉన్నదనడం ఒక చేదు నిజం, ఒక తియ్యటి సత్యం. దక్షిణ ఆసియాలోని 24 ద్రావిడ భాషల్లో అధిక సంఖ్యాకుల అమ్మ భాషైన తెలుగు, శాతవాహనుల కాలం నుండి సాంస్కృతిక చరిత్ర గల తెలుగు, తూర్పు చాళుక్యుల కాలంలో పాలనా భాషైన తెలుగు, జాతీయ భాషైన హిందీకి ద్వితీయ స్థానంలో నిలిచిన తెలుగు, ప్రపంచ భాషల్లో 16వ దిగా లెక్కింపబడిన తెలుగు, రాష్ట్రంలోనేకాదు దేశంలోనే అధికార భాషగా అలరారవలసిన తెలుగు నేడు పురోగతిలో తిరోగతిని చూస్తోందా? వెలుగు కిరణాల వెనుక తరగని క్రీనీడల్ని చవిచూస్తోందా? మహోన్నత కీర్తి శిఖరాల నుండి శిథిలాల నిశీధిలోకి జారిపోతోందా? ఈ సందేహ త్రయ నివృత్తికి గతంలోకి ఒక్కసారి దృష్టి సారించి, వర్తమానంలోకి చూపు నిలిపి ఈ కాలపు తెలుగు గురించి తెలుసుకుందాం.
మన మాతృభాషకీనాడు ఆంధ్రం, తెనుగు, తెలుగు అనే మూడు పేర్లూ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆంధ్రులు ఆగంతకులైన ఆర్యులకన్నా ఈ దేశ ఆదిమవాసులన్నది ఒక చారిత్రక సత్యం. వీరుత్తరార్యావర్తం నుండి దక్షిణాపథానికి వలసవచ్చి, రాజ్యాన్ని స్థాపించుకున్నారు. మౌర్యుల తర్వాత చతురంగ బలసంపన్నులని మెగస్తనీసు; అందమైనవారు, విహార ప్రియులని ఉద్యోతనుడు వీరినభివర్ణించి ఉన్నారు. ఆంధ్రుల బహుముఖ ప్రజ్ఞాపాటవాలకు వివిధ శిలాశాసనాలు, బౌద్ధ -సంస్కృత వాఙ్మయాలు అద్దం పడుతున్నాయి. వేల సంవత్సరాలుగా, విశ్వవ్యాప్తంగా కీర్తి బావుటాల నెగురవేసిన తెలుగుజాతి తన చారిత్రక నేపథ్యాన్ని హృదయాలకు హత్తుకొని ఇంకా మున్ముందుకి సాగిపోవాలి. సూర్యుడు -వెలుగు, చంద్రుడు -వెన్నెల, తెలుగూ -తెలుగువాడు వేర్వేరు కాదు, కాకూడదని, ''తెలుగు జాతి నిండుగ వెలుగు జాతి'' ఉన్నట్లే -తెలుగు భాష నిండుగ వెలగు భాష కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ కాలపు తెలుగును పరిశీలిద్దాం.
తెలుగు భాషకు కీర్తి కిరీటాలు :
సాహితీ సమరాంగణ చక్రవర్తి, ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణ దేవరాయలు మన తెలుగు భాషామతల్లికి అలంకరించిన కీర్తి కిరీటం -ఈ క్రింది పద్యం: ''తెలుగు దేలయన్న దేశమ్ము తెలుగేను, తెలుగు వల్లభుండ, తెలుగొకండ, ఎల్ల భాషలయందు ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స.'' అట్లే -తన హరికథాగానలహరిలో దక్షిణ భారతాన్ని ముంచి తేల్చిన ఆదిభట్ల నారాయణదాసు గారు ఆంధ్రమాతను ప్రశంసిస్తూ సమర్పించిన పద్యరత్నాలలో రెండు చరణాలను చూద్దాం -''తేనె తీయదనము తెన్గునగేగాక, పరుష సంస్కృతాఖ్యభాషకేది?'' -ఇంకా కవి శేఖరులు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ''ఆంధ్ర భాష యమృత మాంధ్రాక్షరంబులు, మురువు లొలుగు గుండ్ర ముత్తియములు'' అని తెలుగు భాషను ప్రశంసించారు. ఇక ఈ వ్యాసకర్త మాతృభాషామతల్లి కొసగిన కీర్తి మకుటంలోని పద్యం -''తేట తేనియలకె తీపినింపిన భాష, విశ్వ భాషవోలె వెలుగుభాష, చందనమ్మునకె సుగంధ మద్దిన భాష, తెలుగు భాష నమ్ము, తెలుగువాడ! కరుణశ్రీ శ్రీ జంధ్యాలవారి కలం అభిషేకించిన పద్యసుగంధాన్ని ఆశ్వాదిద్దాం -''తెలుగు దనము వంటి తీయందనము లేదు, తెలుగు కవుల వంటి ఘనులు లేరు, తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా! లలిత సుగుణబాల! తెలుగుబాల''. మహాసహస్రావధాని డా|| గరికిపాటి నరసింహారావు గారు -''అమ్మ ప్రేమ కన్న కమ్మదనము లేదు, తెలుగు భాషకన్న తేనెలేదు'' అని ఆంధ్రమాతకు అవధానార్చన గావించారు. ఒక్క నిమిషం రాష్ట్ర సరిహద్దులు దాటి చూస్తే -''సుందరం తెలుంగు'' అని, కవిత్వం వ్రాస్తే తెలుగులోనే వ్రాయాలని కీర్తించినవారు, జాతీయకవి సుబ్రహ్మణ్య భారతిగారు, ఇటలీ యాత్రికుడు ''నికొలయ్‌కంటి'' విజయనగరాన్ని దర్శించి ''భారతదేశంలోని తెలుగు ఇటలీభాష వంటిది అని కితాబు ఇచ్చారు. ఆఖరిగా... ఆంధ్రమాతకు ఒక అజ్ఞాతకవి అర్పించిన అక్షరాభరణం -''మురళి రవళులు కస్తూరి పరిమళములు, కలిసి యేర్పడె సుమ్ము మా తెలుగుభాష'' ఎందరెందరో కవికుమారులచే కీర్తించబడిన తెలుగు భాషామతల్లి నేడెట్లున్నది? నాటి తెలుగు భాషా వైభవ ప్రాభవాలు నేడు ఏమైనవి? ఒక్క నిమిషమాలోచించండి. మన తెలుగు తల్లి పూర్వ యశస్సును నిలిపేందుకు మనమంతా మనభాషను క్రమ్మిన తమస్సుని తొలగించి శాశ్వత ఉషస్సుని సాధించేందుకు, ఈ కాలపు తెలుగులోకి మరింత వెలుగునిచ్చేందుకు కన్నబిడ్డలుగా కలసిరండి.
నిత్య నూతన జానపద సాహితీ సౌరభాలు :
తెలుగు భాషకు సహజసిద్ధమైన సాహితీ వెలుగు నిచ్చేది జానపద సాహిత్యం. ప్రపంచంలోనే తొలినాగరికులు, ఆదిబౌద్ధులు, గణతంత్ర ప్రభుత్వ స్థాపకులు మన ఆంధ్రులు -నదీ తీరాలలో జనపదాలను నిర్మించుకొని, శ్రమైక జీవన సౌందర్యాన్ని విశ్వసించి, శ్రమనుండి భాష పుట్టినట్లే, పనినుండి పాటను పలికించిన తొలి జానపదుడు మన తెలుగువాడు. అందుకే ఆంధ్రుడు సేద్యానికి ఆద్యుడైనాడు, అన్నపూర్ణకి ముద్దుల బిడ్డడైనాడు, ఈ జానపదగీతాలు ఏరువాక నుండి బతుకమ్మ పండగదాకా పాటలు సెలయేరై పారుతాయి. శ్రామిక -శృంగార -స్త్రీల -బాలల పాటలై ప్రవహించుతాయి. నాటి బ్రౌన్‌దొర నుండి నిన్నటి బిల్‌క్లింటన్‌ దాకా పాశ్చాత్యుల్ని సైతం పరవశింపజేస్తాయి.
బసవరాజు గేయాల్లో (గుత్తి వంకాయ..), నండూరి కావ్యాల్లో (ఎంకి పాటలు), గద్దర్‌ విప్లవ గర్జనలో, అంజయ్య సినీ గీతాలలో, గిరిజన బృందగానాలలో ఇప్పటికీ పచ్చగా, వెచ్చగా, సజీవంగా విశ్వజనీనంగా నిలిచి ఉన్నాయి. అయితే అప్పుడప్పుడూ ఈ జానపదగేయాలకి నగరపు నగిషీలు తొడిగి, మైదానపు గొంతుల్లోంచి ఒలికించే సందర్భాలున్నాయి గాని అవి అసందర్భంగానూ, అసహజంగానే మిగిలిపోతున్నాయి. సతత హరిత సీమల్లోంచి సహజాతి సహజంగా, ఆశుకవితాధారగా, అడవి మల్లెల పరిమళంలా అలరారుతున్న ఈ జానపద సాహితీసంపదను కాపాడుకుందాం.
- ఎస్‌.వెంకటరత్నం (సవేర)