Sunday, May 26, 2013

తెలుగు సాహిత్యోద్యమనేత సురవరం ప్రతాపరెడ్డి

తెలుగుభాషకు, తెలుగువారి సమైక్యతకు జవజీవాలు పోసిన మహామహులలో సురవరం ప్రతాపరెడ్డి ఒకరు. వారి
సురవరం ప్రతాపరెడ్డి
జీవిత కాలంలో చేసిన నాలుగు దశాబ్దాల సాహితీ సేవ ఎవరెస్ట్‌ శిఖరం లాంటిది. మహా పరిశోధకుడిగా, రచయితగా, భాషోద్యమనాయకుడిగా, పాత్రికేయుడిగా, గ్రంథాలయోద్యమకారుడిగా, విమర్శ
కుడిగా, స్త్రీజనోద్దారకుడిగా, చరిత్ర పరిశోధకుడిగా, సంఘ సంస్కర్తగా ఆయన చేసిన బహుముఖీన సేవా కార్యక్రమాలు నేటి తరానికి ఆదర్శాలే. ఆయన నిజామాంధ్రలో ఆంధ్రమహాసభ ద్వారా చేసిన భాషా సేవ, గోలకొండ పత్రిక స్థాపన, సంపాదకత్వం బాధ్యతల నిర్వహణ, తెలంగాణ ప్రాంత సాహిత్య చైతన్య దీపికగా ఆయన వెలువరించిన గోలకొండ కవుల సంచిక, ఇరవై ఏళ్లపాటు పరిశోధించి, శ్రమించి తెలుగుజాతికి అమూల్య కానుకగా, వారసత్వసంపదగా ఇచ్చిన ఆంధ్రుల సాంఘీక చరిత్ర ఉద్గ్రంథం, ఆయన రాసిన రచనలు, చేసిన తెలుగు భాషాసేవ అపారం, గురజాడ, గిడుగు, కందుకూరి వీరేశలింగం పంతులు వలె, రెడ్డిగారు ఆంధ్రమహాసభ ఉద్యమ నాయకునిగా, తెలుగు సాహిత్యోద్యమ వైతాళికులుగా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలలో లిఖించబడ్డారు. అందుకే తెలుగుభాషోద్యమ సమాఖ్య వారు ఆయన జయంతి మే 28న తెలుగుజాతి వారసత్వ దినోత్సవం ప్రకటించి, తెలుగు జాతి, సాహితీ, భాషా సంస్కృతుల ఔన్నత్యా నికి తెరలేపింది. ఆ మహామహుని సేవలను, త్యాగమయ సాహితీ జీవితాన్ని తెలుసుకుంటే కొంతైనా మన మాతృభాషపైన తెలుగుపట్ల అభిమానం పెరుగక తప్పదు. బ్రిటిష్‌ వాడి భాషా వ్యామో హానికి, పాశ్చాత్య సంస్కృతికి లోనైన మనకు, మన మాతృభాషైన తెలుగు ధనం విలువలు తెలియాల్సి వుంది. తెలుగునాట ఎక్కడచూసినా, వ్యాపార వస్తువుగా పరిగణింపబడుతున్న ఆంగ్ల బడులే అధికంగా కనిపిస్తున్నాయి. వాటికి లభిస్తున్న ఆదరణ అంతా, ఇంతా చెప్పనలవికాదు. నర్సరీ నుండి పీజీ స్థాయి వరకు, వైద్య సాంకేతిక కోర్సులలో ఆంగ్లభాషే ఆదిపత్యం చల యిస్తుం డగా, మమ్మి, డాడీలను పిలిపించుకోవాలన్న తహతహ పట్ల అన్ని వర్గాల ప్రజలు ప్రీతి కనబరుస్తుండటం గమనించదగిన విషయం. తెలుగుభాషకు ప్రాచీన హోదాను కట్టబెడుతున్నట్లు కేంద్ర ప్రభు త్వం ప్రకటించినా, తెలుగువాడిలో రావాల్సినంత చైతన్యం కానరావడం లేదు, ఇందుకై చర్చిస్తే ఎన్నెన్నో కారణాలు కనబడ తాయి. నిస్తేజంగా, నిర్లిప్తంగా వున్న తెలుగువాడిలో తెలుగుభాషా తేజం, చైతన్యం ప్రజ్వలింపజేయాల్సి వుంది, కొలిమి రగల్చాల్సిన తరుణం ఆసన్నమైంది. లేకుంటే ఐక్యరాజ్యసమితి నివేదికలోచెప్పినట్లుగా, 30 శాతం మంది ఆభాషకు దూరమైతే, సమీప కాలంలో ఆభాష కనుమరుగైపోతుంది. ఇట్లాంటి సంక్లిష్ట పరిస్థితులలో భాషా చైతన్యం, భాషోద్యమం రాజుకోవాలి.
జననం-విద్యాభ్యాసం
సురవరం ప్రతాపరెడ్డి 1896, మే 28న మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల సంస్థానంలోని అమలాపురం సమీపంలోని ఇటిక్యాల పాడులో జన్మించారు. వీరు కేవలం 58 సంవత్సరాలు మాత్రమే జీవించారు. తాను బతికినంత కాలం తెలుగుభాషోద్ధారకునిగా, సాహిత్య చైతన్యదీప్తిగా, పైపెచ్చు సాంఘీక సంస్కర్తగా పనిచేశారు.
1954 ఆగస్టు 25న మరణించారు. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనం లోనే మరణించారు. ఆయన చిన్నాన్న రామక్రిష్ణారెడ్డి ఎబియం మిషనరీ పాఠశాలలో ప్రాధమిక విద్యను హైదరాబాద్‌ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్‌, మద్రాస్‌ ప్రెసిడెన్సీ మరదలు పద్మావతిని 1916లో వివాహం చేసుకున్నారు. సంతానం పదిమందికాగా, ఇద్దరు కుమారులు విగతజీవులు. నలుగురు కుమారులు, నలుగురుపుత్రికల సంతానం. సురవరం ప్రతాపరెడ్డి తన చదువు పూర్తికాగానే హైదరాబాద్‌ కొత్వాల్‌గా వున్న రాజబహదుర్‌ వేంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలోని రెడ్డి హాస్టల్‌కు ఆయన కోరికపై వచ్చారు. ఇక్కడ ఆయన పనిచేసిన దశాబ్ది కాలంలో రెడ్డి హాస్టల్‌ నిర్వహణను ఒక విద్యాలయంగా తీర్చిదిద్దారు. నాటి నైవాసిక విద్యార్థులలో దేశభక్తి బీజాలను నాటారు. 1924 ప్రాంతంలో ఈహాస్టల్‌ వదాన్యుల సహకారంతో స్థాపించబడింది. ఆ విధంగా హైదరాబాద్‌లో రెడ్డి సాంఘీక సేవా జీవితం పునాదులు వేసింది. మద్రాస్‌ కళాశాలలో చదువుతున్న ప్పుడే నాటి జాతీయ ఉద్యమ ప్రభావం ఆయనపై పడింది. నిజాం రాష్ట్రాంధ్ర దుస్థితి రూపురేఖలను మార్చాలన్న తపన ఆనాటి నుండే సురవరం మనస్సులో నాటుకొని పోయింది. హాస్టల్‌ కార్యదర్శిగా వచ్చాక, వేయి గ్రంథాలున్న హాస్టల్‌ లైబ్రరరీని 11వేల గ్రంథాల వరకు పెంచి, విద్యార్థులలో భాషాభివృద్ధికి కృషి చేశారు.
జోగిపేట ప్రథమాంధ్రమహాసభ - 1930 1930, మార్చి, 3,4,5 తేదీలలో జోగిపేటలో మూడురోజులపాటు ప్రథమాంధ్ర మహాసభలు జరిగాయి. ఆనాటి సభలకు హైకోర్టు న్యాయవాదిగా ఉన్న సురవరం అధ్యకత వహించారు. 60 మంది ప్రతినిధులతో ఈ సభలలో పాల్గొన్నారు. సంగారెడ్డిమీదుగా జోగిపేటకు అందోల్‌ మీదుగా సత్కారాలు అందుకుని వచ్చారు. ఆనాటి సభలో రెడ్డి చేసిన ప్రసంగం చైతన్య స్ఫోరకమైనది. తెలుగు మాతృభాష దుస్థితిపై వారు ఎంతగా వ్యాకులపడిన విధం మనకు కనిపిస్తుంది. అక్కన్న మాదన్నల తర్వాత హైదరాబాద్‌ సంస్థానంలో భాషా పరంగా, రాజకీయంగా మనం బలహీనులమై పోయామని, ఈ దుస్థితి రావడానికి లోపాలను కనుక్కోవాలని అన్నారు. మన మాతృభాషను కాపాడుకోవాలని, ఉర్దూ రాజ్యమేలుతున్న హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను తెలుగు ఇతర భాషలకు చుక్కెదురు కావడాన్ని ఆయన నిరసించారు. నూటికి 90 శాతం కాని ప్రజలకు ఉర్దూభాషను విద్యాలయాలలో బోధనా భాషగా రుద్దుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. బలవన్మా ఘస్నానం వలన ఎవ్వరు ఏమి కట్టుకుందరో ఊహింపజాలమని ఆయన తన ఆదేవనను వ్యక్తం చేశారు. ఆనాటి మహాసభలలో వారి రాజకీయ గురువులు మాడ పాటి హన్మంతరావు, పులిజాల రంగారావు, ఉన్నవ వేంకట్రా మయ్య, వామననాయక్‌, అనంత వెంకటరావు, కృష్ణస్వామి ముదిరాజ్‌, దూపాటి వెంకట రమణాచార్యులు, భాగ్యరెడ్డివర్మ, ఎం. నారాయణరావు, ఆది రాజు వీరభద్రరావు, వేంకటేశం గుప్త, మహిళా ప్రతినిధి నడింపల్లి సుందరమ్మ తదితరలులు పాల్గొని, వివిధ తీర్మాణాలను ప్రతిపాదించినారు.
గోల్కొండ పత్రిక స్థాపన
సురవరం హాస్టల్‌ కార్యదర్శిగా పనిచేస్తూనే, కొత్వాల్‌ సహకా రంతో గోల్కొండ పత్రికను స్థాపనకు కదిలారు. తనకు ప్రజాహి తంగా ఒక పత్రికద్వారా సేవ చేయాలని ఉందన్న అభిలాషను వ్యక్తం చేయడంతో కొత్వాల్‌ పత్రిక స్థాపనకు చేయి అందిచారు. ఏడుగురు హైదరాబాద్‌ నగర పెద్దలను కొత్వాల్‌ పిలిపించి, తన వేయి రూపాయల చందాతో రెడ్డిని మద్రాస్‌కు పంపించి, ప్రింటింగ్‌ మిసన్‌, అక్షరాల టైపుపెట్టెలను తెప్పించారు. నిజాం రాజు అనుమతితో, పత్రిక నగరంలోని ట్రూప్‌ బజార్‌లో ద్వైవారపత్రికగా ఒక చిన్న భవనంలో స్థాపించారు. తదుపరి ఈ పత్రిక 1947 నాటికి దినపత్రిక స్థాయికి ఎదిగింది. దాదాపు 23 సంవత్సరాల పాటు సంపాదకునిగా బాధ్యతలను నిర్వర్తించి, సంపాదకీయాలే కాకుండా, అనేక ప్రక్రియలలో రచనలు గావిం చారు. పత్రిక నాలుగు దశాబ్దాల పాటు పనిచేసి, చివరకు నష్టాలకు గురై 1967లో మూతపడింది. ఆ కాలంలో నల్లగొండ, ఇనగుర్తిల నుండి నీలగిరి, తెలుగుపత్రికలు ప్రచురించ బడు తుండెడివి. తదుపరి ఈ రెండు పత్రికలు ఆగిపోయాయి. తెలుగు చదివిన సబ్‌ ఎడిటర్లు, ప్రూఫ్‌ చూసేవారు దొరకకపోవడం వల్ల ప్రతాపరెడ్డి, సంపాదకుల నుండి మేనేజర్‌గా, సబ్‌ ఎడిటర్‌, ఫ్రూఫ్‌ రీడర్‌గా, గుమాస్తాగా, ఛప్రాసీగా అన్నింటిని తన భుజస్కంధాలపై వేసు కొని, సవ్యసాచివలె బాధ్యతలను కొంత కాలం నిర్వహించారు. ఈ పత్రిక ద్వారా తెలుగుభాషా సాహిత్యోద్యమాన్ని పునర్జీవింప జేయడమే కాకుండా, కొడగట్టి పోయిన సాంఘీక చైతన్యాన్ని రగిల్చారు. ఒక్క గోల్కొండ పత్రిక లోనే రెడ్డి రచనలు 15 వందల దాకా అచ్చయ్యాయి. ఆనాటి గోల్కొండ కార్యాలయం సాహితీ నిలయంగా మలచబడి, వచ్చి పోయే విద్వాంసులతో సాహితీ చర్చలు జరిగేవి. 17 వాల్యూమ్‌ లుగా ఆయన పేర్చబడ్డా యని, రెండేళ్లకిందట అచ్చయిన సుర వరం దస్తూరి కావ్యంలో ఉటకించబడింది. ఆంధ్ర సారస్వత పరిషత్తులోని సురవరం వైజయంతి పీఠం సురవరం రచనల విశ్లేషణకు కృషి చేస్తున్నది.
గోల్కొండ కవుల సంచిక : ఇతర రచనలు
గోల్కొండ కవుల సంచిక ద్వారా నిజామాంధ్రలో సాహిత్యోద్యమ చైతన్య వ్యాప్తి జరిగింది. 1934లో సురవరం సంపాదకత్వంలో వెలువడిన ఈ సంచికలో 354 మంది ఆధునిక కవుల పద్య కవిత్వాలు చోటు చేసుకోబడ్డాయి. ఇందులో పదిమంది కవియి త్రులు. వస్తువును బట్టి 11 విభాగాల్లో ఈ కవిత్వాలు విభజింప బడ్డాయి. 183 మంది పూర్వకవుల పరిచయాలు ఇవ్వబడ్డాయి. తెలంగాణా జాగృతి సంస్థవారు 2009లో గోలుకొండ కవుల సంచి కను యధాతతంగా ముద్రించి తక్కువ ధరలో విక్రయిస్తున్నారు.
ఆంధ్రుల సాంఘీక చరిత్ర
1949లో ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రకటించిన, వీరి ఆంధ్రుల సాంఘీక చరిత్రనన్నది అద్భుత పరిశోధక గ్రంథం, నేటి కాలం వరకు ఎన్నెన్నో పునర్ముద్రణలకు నోచుకున్నది. రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ వంటి ఉద్దండుల ప్రశంసలకు నోచుకుంది. వారి మిత్రులు శంకరనారాయణ, దేవులపల్లి రామానుజరావు, పులి జాల వారిప్రోద్భలంతో రాశారు. ఇందులో వారు తూర్పు చాళుక్య యుగం, కాకతీయుల యుగం రెడ్డిరాజుల యుగం, రెండు అధ్యాయాలలో విజయనగర సామ్రాజ్యకాలంతోపాటు, క్రీ.శ. 1600 నుండి 1907 వరకు ఎనిమిది అధ్యాయాలలో విపులంగా చర్చించారు. రాజుల కాలం లోని సామాన్య ప్రజల జీవన విధా నాలను ఆయన పరిశోధించి, చర్చించి, చరిత్ర రచనకు కొత్త నిర్వచనం చెప్పారు. ఈ గ్రంథ పరిశోధనకుగాను, కేంద్ర సాహిత్య అకాడమీ 1955లో తొలి అవార్డును ప్రకటించి గౌరవించి నారు. రెడ్డి 1953లో విశాలాంధ్ర ఉద్యమ నేతగా కృషి చేశారు. వారి బహు ముఖీన సేవలు అనిర్వచనీయం. వారు భౌతికంగా వెళ్లి యాభై ఎనిమిదేళ్లు దాటినా, వారి రచనలు తెలుగుజాతి ఉమ్మడి సొత్తు. భౌగోళికంగా కలిసున్నా, విడిపోయినా వారి పేరిట తెలుగునాట జాతి వారసత్వ దినోత్సవంగా ప్రక టించడం ముదావ హమని ప్రముఖ రచయిత అంప శయ్య నవీన్‌ అన్న మాటలు అక్షరసత్యాలే.
ఆంధ్రప్రభ దినపత్రిక సౌజన్యంతో.

Sunday, April 14, 2013

తొలి తెలుగు శాసనం ఎక్కడ?

కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు
ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం.
పోగొట్టుకున్నాం!

ఈసారి పోయింది అట్లాటి ఇట్లాటి వస్తువు కాదు. తెలుగు భాషకు వెలుగు పూలు పూయించిన తొలి తెలుగు శాసనం...
తెలుగు భాషకు రాజ భాష హోదాను, శాసన భాషగా ఒక అధికార ప్రతిపత్తి కల్గించి, తెలుగు భాషకు అక్షర రూపం యిచ్చి చారిత్రకంగా, సాహిత్యపరంగా ఘన వారసత్వ కీర్తిని అందించిన 'కలమళ్ళ శాసనం' -తొలి తెలుగు శాసనం ఎక్కడుందో యిప్పుడెవరికీ తెలియడం లేదు. అందరూ నిస్సహాయంగా చేతులెత్తేస్తున్నారు. దీంతో దాదాపుగా మనం తొలి తెలుగు శాసనాన్ని కోల్పోయినట్లేనని భావించాల్సి వస్తోంది. కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. ఆ తర్వాత వారితో పాటూ ఆ శాసనాన్ని మద్రాసు మ్యూజియానికి తరలించారని అందరూ భావిస్తూ వచ్చారు. ఇదే నేపథ్యంలో నేను సమాచార హక్కు చట్టం ద్వారా 07 జనవరి 2013 నాడు శాసనం నమూనా ప్రతిని, స్క్రిప్ట్‌ను జతపర్చుతూ సమగ్ర వివరాలతో చెన్నై 'ఎగ్మోర్' ప్రభుత్వ మ్యూజియం వారిని ప్రశ్నించడం జరిగింది.

తొలి తెలుగు శాసనం, రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనంకు సంబంధించిన వివరాలు, మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారా? దానిని తగిన విధంగా సంరక్షిస్తున్నారా? వంటి ప్రశ్నలను వారి ముందుంచినప్పుడు- అలాంటి శాసనమేదీ తమ వద్ద లేదని- చెన్నై ప్రభుత్వ మ్యూజియం అసిస్టెంట్ డైరక్టర్ తిరు ఎస్. సెల్వ అరసు, అధికారికంగా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
దీంతో యింతకాలంగా ఎగ్మో ర్ మ్యూజియంలో వుందని భ్రమపడుతూ వచ్చిన శాసనం అక్కడ లేదని తేలిపోయింది. అంతకు మునుపే శాసన నిర్దేశకుల కార్యాలయం, భారతీయ పురాతత్వశాఖ, మైసూరు వారి వద్ద కూడా ఈ శాసనం లేదని వెల్లడైంది. ఈ మైసూర్ శాఖ ఎపిగ్రాఫియా ఇండియా, ఏన్యువల్ రిపోర్ట్ ఆన్ ఇండియన్ ఎపిగ్రఫీ అనే శాసన పత్రికలను కూడా ప్రచురిస్తోంది. ఈ మైసూర్ కార్యాలయానికి 125 సంవత్సరాల చరిత్ర కూడా వుంది. వీరి వద్ద రేనాటి చోళుల శాసనాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం వుంది. కానీ 'తొలి తెలుగు శాసనాన్ని' సేకరించకపోయినందుకు, సంరక్షించక పోయినందుకు మనం విచారించాల్సిందే!

ఇదే విధంగా భారతీయ పురాతత్వ సర్వేక్షణ, ఉప పురాతత్వ అధీక్షకులు- హైదరాబాదు వారిని కూడా 30 అక్టోబర్ 2012 నాడు రెండు లేఖల ద్వారా ప్రశ్నించడం జరిగింది. వారి నుంచి కూడా అసంతృప్తిని మిగిల్చే సమాధానాలే లభించాయి. తొలి తెలుగు శాసనం ఆచూకీ తమకు కూడా తెలియదని చేతులెత్తేయడం దిగ్భ్రాంతిని కల్గిస్తోంది.
సమాచార హక్కు చట్టం ద్వారా భారతీయ పురాతత్వ శాఖ, హైద్రా బాదు మండలం వారిని ఈ అంశంపై అడిగిన కొన్ని ప్రశ్నలు- వాటికి వారిచ్చిన సమాధానాలు ఇవి:
? కడప జిల్లాలో బయల్పడిన 'కలమళ్ళ శాసనం' ప్రస్తుతం ఎక్కడ వుంది?
ం కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో 1904లో మద్రాసు నందలి శాసన పరిశోధన విభాగం వారు ఈ శాసనాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఎక్కడ వుందో తెలియదు. ? కలమళ్ళ శాసనం పొడవు, వెడల్పు, ఆకారం, బరువు వంటి సాంకేతిక వివరాలు తెలపగలరు?
ం కలమళ్ళ శాసనం పొడవు, వెడల్పు, ఆకారం, బరువు వంటి సాంకేతిక వివరాలు లభించుట లేదు.
? కలమళ్ళ శాసనాన్ని మొదటిసారిగా ఎవరు, ఎప్పు డు, ఎక్కడ గుర్తించారు? తర్వాత ఎక్కడికి తరలించారు? ప్రస్తుతం ఎక్క డుంది?
ం కలమళ్ళ శాసనాన్ని తొలిసారిగా 1904లో మద్రాసు ప్రభుత్వ శాఖ వారు కలమళ్ళ గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో వున్న ట్లు గుర్తించారు. తర్వాత 1947-48 లో ఆచార్య కె.నీలకంఠ శాస్త్రి, యమ్. వెంకట రామయ్య ఈ శాసనాన్ని పరిష్కరించి ప్రచురించారు.
ఇంతకు మించి ఏ సమాచారం అందుబాటులో లేదు.
 తొలి తెలుగు శాసనంగా చెప్పబడుతున్న కడప జిల్లా లోని కలమళ్ళ శాసనంను భారతీయ పురాతత్వ శాఖ తొలి తెలుగు శాసనంగా అంగీకరిస్తోందా? అంగీకరిస్తే ఆధారాలు తెలుపగలరు? ం రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శిలాశాసనాన్ని తొలి తెలుగు శాసనంగా ప్రసిద్ధ శాసన పరిశోధకులు సహేతుకంగా నిర్ణయించారు. కావున మేము కూడా వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాము. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం. ఎరికల్ ముత్తురాజు వేయించిన ఎర్రగుడిపాడు శాసనం, పుణ్యకుమారుడి తిప్పలూరు శాసనాలు తర్వాత క్రమంలో వచ్చి చేరుతాయి.

'తెలుగు లిపి' నిర్మాణం...

తొలి తెలుగు శాసనం వల్ల నాటి నుంచి నేటి వరకు తెలుగు లిపి పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి వీలు కల్గుతుంది. ప్రాకృత, ద్రావిడ భాషల నుండి విడిపోయి వేరుగా తెలుగు లిపి నిర్మితం కావడం గుర్తించవచ్చు. తెలుగు వాక్య రచనా విధానం, ఉచ్ఛారణ సౌలభ్యం కోసం చేసుకున్న ఇతర మార్పులు విశదమవుతాయి. ప్రాకృత వాక్యాల స్థానంలో తెలుగు వాక్యాలు చేరడం గమనించవచ్చు. వీటి ద్వారా తెలుగు భాషా సంప్రదాయ, స్వరూపాన్ని విశ్లేషించవచ్చు.

చరిత్ర ఆధారాల్లో... 
రేనాటి చోళుల కారణంగా మనకు ఇవాళ ప్రాచీన తెలుగు వాక్య రచనా విధానం తెలుస్తోంది. రేగడినేల ఉన్న ప్రాంతం కాబట్టి 'రేగడినాడు' ప్రాంతం 'రేనాడు'గా మారి ఉండవచ్చునని చరిత్ర పరిశోధకుడు పుట్టపర్తి శ్రీనివాసాచారి అభిప్రాయపడ్డారు. రేనాటి చోళులు తాము కరికాల చోళుని సంతతికి చెందినవారమని చెప్పుకున్నారు. క్రీ.శ. 484 ప్రాంతంలో రేనాడు కరికాల చోళుని పాలనలో వుండేదని చరిత్రకారుడు నేలటూరి వెంకట రమణయ్య నిరూపించారు.
తెలుగులో మొట్టమొదటి శాసనాల్లో కన్పించే రేనాటి చోళుని పేరు ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు. ఇతడు నందివర్మ కుమారుడు. ధనుంజయ వర్మ పేరుకు ముందున్న 'ఎరికల్' అనేది రేనాటి సీమలోని గ్రామమై వుంటుందని కూడా చరిత్రకారుల భావన.
రేనాటి చోళులు 'చెప్పలియా' గ్రామం రాజధానిగా రేనాటి ప్రాంతాన్ని పాలించారు. రేనాడు ప్రాంతం కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, కమలాపురం, జమ్మల మడుగు, తాలూకాలు; కర్నూలు జిల్లా కోయిలకుంట్ల తాలూకాలోని కొన్ని ప్రాంతాలతో వున్న ఏడు వేల గ్రామాలున్న ప్రాంతంగా 'పూర్వోద్ధృతము' రచన నందు ఎస్.వి.రమణయ్య ఆధారాలు చూపారు. రేనాటి చోళులు తమ రాజధానిగా చేసుకున్న 'చెప్పలియా' ప్రాంతం నేడు కమలాపురం మండలంలోని 'పెద్ద చెప్పలి'గా తగిన ఆధారాలతో గుర్తించడం కూడా జరిగింది.
రేనాటి చోళుల వంశ వృక్షంలో 13 తరాల రాజుల పేర్లు శాసనాధారాల ద్వారా రూపొందించడమైంది. కశ్యప గోత్రానికి చెందిన నందివర్మ పరిపాలనా కాలం క్రీ.శ. 550 అని చెప్పుకోవచ్చు. తర్వాతి తరంలో వచ్చిన సింహ విష్ణు, సుందరనంద, ధనుంజయ వర్మలు క్రీ.శ. 575 ప్రాంతంలో వచ్చారు. పుణ్యకుమారుడు, వసంతపోరి చోళ మహరాణి భర్తగా, పోర్ముఖరామ, పురుష శార్దూల, మదన విలాస వంటి బిరుదులు ధరించి క్రీ.శ. 625లో నాల్గవ తరంలో కీర్తి పొందాడు. 11వ తరంలో నృపకామ (క్రీ.శ. 800), 12వ తరంలో దిహికర (క్రీ.శ. 825), 13వ తరంలో శ్రీకంఠ అధిరాజు (క్రీ.శ. 850) క్రమ పట్టికలో కన్పిస్తారు.
ఆనాటి కాలంలో యువరాజు కాకుండా మిగిలిన రాజకుమారులలో పెద్దవాడిని ముత్తురాజు అని పిలిచేవారు. అంటే యువరాజు తర్వాత రాజ్యానికి రాజుగా రావడానికి అవకాశాలున్న వారికే ఈ పట్టం యిచ్చేవారు. మహేంద్రవర్మ కొడుకైన పుణ్యకుమారుడి రెండు తామ్ర శాసనాలు, మూడు శిలాశాసనాలు లభిస్తున్నాయి. ప్రొద్దుటూరు రామేశ్వర శిలాశాసనంలో 'పృథివీ వల్లభ' అనే బిరుదు పేర్కొనడం జరిగింది. పుణ్య కుమారుడు హిరణ్య రాష్ట్రాన్ని పాలిస్తూ కొంత భూమిని దానం చేసినట్లు ఒక తామ్ర శాసనం చెప్తోంది. తర్వాత కాలంలో వైదుంబ రాజులు రేనాడును ఆక్రమించుకోగా వీరు పొత్తపి ప్రాంతానికి మరలిపోయినట్లు చరిత్ర కథనం.
చివరగా... 
గత ఏడాది డిసెంబర్ మాసంలో 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటూ నిర్వహించిన 'ప్రపంచ తెలుగు మహాసభల్లో' తొలి తెలుగు శాసనాన్ని ప్రదర్శిస్తారని ఎందరో భాషాభిమానులు, చరిత్ర పరిశోధకులు ఎదురుచూశారు. కానీ వారికి నిరాశే మిగిలింది. అధికార భాషా సంఘం, రాష్ట్ర సాంస్కృతిక శాఖ గానీ దీని పట్ల శ్రద్ధ పెట్టినట్లు కూడా కన్పించదు. భారతీయ పురాతత్వ శాఖ-హైదరాబాదు శాఖ గురించి యిక చెప్పనవసరం లేదు. కనీసం యికనైనా ఈ శాసనం ఆనవాళ్ళ గురించి, ఆచూకీ గురించి విస్తృతంగా అన్వేషణ జరగాల్సిన అవసరం తప్పనిసరిగా వుంది. లేదంటే- చరిత్ర ఎప్పటికీ మనల్ని క్షమించదు.
కలమళ్ళ శిలాశాసనము
దాత :
తెలుగు చోళవంశపు ధనంజయుడు

పరిపాలన కాలము:
క్రీ.శ. ఆరవ శతాబ్ది అంతము

శాసన కాలము :
అనిర్దష్టము

.........................
శాసనభాగ పాఠము 
: 1. ...................
2. కల్ముతురా
3. జు ధనంజ
4. య ఱు రేనా
5. ణ్డు ఏళన్
6. చిఱుంబూరి
7. రేవణకాలు (పం)
8. పు చెనూరు కాజు
9. ఆఱికాశా ఊరి
10. ణ్డవారు ఊరి
11. న వారు ఊరిస...

- డాక్టర్ వేంపల్లి గంగాధర్
94400 74893

Thursday, April 11, 2013

మిత్రులకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !