Wednesday, December 30, 2009

తెభాస రాయలసీమ ప్రాంతీయ కార్యదర్శి గా తవ్వా ఓబుల్ రెడ్డి

తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంతీయ కార్యదర్శి గా తవ్వా ఓబుల్ రెడ్డి నియమితులయ్యారు.27న గుంటూరులో నిర్వహించిన తెలుగు భాషోద్యమ సమాఖ్య కేంద్ర కార్యవర్గ సమావేశంలో సమాఖ్య అధ్యక్షఁలు డా. సామల రమేష్‌బాబు ఆయనను నియమించారు. ఈ సందర్భంగా తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో తెలుగుభాషాభిమానుల సహకారంతో తెలుగుభాషా పరిరక్షణకూ, వికాసాఁకి కృషి చేస్తానని తెలిపారు. రాయలసీమలోని జిల్లా, మండల స్థాయిల్లో తెలుగు బాషోద్యమ సమాఖ్య శాఖలను విస్తరించేందుకు భాషాభిమానులు, రచయితలు, కవులు ముందు కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయమై సమాచారం కోసం 9440024471 నెంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. మైదుకూరులోని సెయింట్‌జోసెఫ్‌ ఆంగ్లమాధ్యమ పాఠశాలలో తెలుగుభాషకు అవమానం జరిగిన సంఘటనపై ప్రజలు, భాషాభిమానులు, పెద్ద ఎత్తున ఉద్యమించారన్నారు. దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలు ఇంతవరకు తీసుకోలేదని అన్నారు.
ఓబుల్ రెడ్డి నియామకంపై పలువురి హర్షం
తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంతీయ కార్యదర్శిగా తవ్వా ఓబుల్ రెడ్డిని నియమించడం పట్ల తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ ప్రతినిధులు ఎస్‌ సాదక్‌, ఎ.వీరాస్వామి, ముండ్లపాటి వెంకట సుబ్బయ్య, ధర్మిశెట్టి వెంకట రమణయ్య, పి.కృష్ణయాదవ్‌, పి.బాబయ్య భారతీయ సాహిత్య పరిషత్ వ్యవస్థాపకులు, ప్రముఖ సాహితీకారులు టక్కోలు మాచిరెడ్డి, ప్రముఖ కథా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, రచయితలు నూకా రాంప్రసాద్ రెడ్డి, వేంపల్లి రెడ్డి నాగరాజు, టి తిప్పారెడ్డి, ఆన్ లైన్ మీడియా సంపాదకులు ఎం. విజయ భాస్కర రెడ్డి, తవ్వా విజయ భాస్కర రెడ్డి, జె. కోటేశ్వర రెడ్డి, అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా నాయకులు పి. భాస్కర్, అబ్దుల్లా, తెలుగు పండితులు మూలే సాంబశివా రెడ్డి, ప్రముఖ న్యాయవాది బి.ఎన్. శ్రీనివాసులు, యోగా శిక్షకుడు, సంఘసేవకులు నారాయణ రెడ్డి, తెలుగు భాషాభిమానులు విజయ్ , శీర్ల నాగమోహన్, పి. బసయ్య , పిచ్చపాటి వీరా రెడ్డి, కానుగ దానం తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

పక్క చిత్రం: ఈనాడు దినపత్రిక , డిసెంబరు 29, 2009 వార్తాంశం..

Tuesday, December 22, 2009

ఇతర రాష్ట్రాల్లో తెలుగుభాష పై వివక్ష! !

తర రాష్ట్రాల్లో తెలుగుభాష పై వివక్ష దారుణంగా సాగుతోందనడానికి తాజాగా తమిళనాడు లోని కృష్ణగిరి సంఘటన తార్కాణంగా నిలుస్తుంది. తమిళనాడు లో తెలుగు మాతృభాష గా గల జనాభా 42 శాతం ఉన్నట్లు అక్కడి తెలుగు భాషోద్యమ సంఘాల అంచనా! తమిళనాడు లోని కృష్ణగిరి , ధర్మపురి జిల్లాలలో దాదాపు 60 శాతం మంది తెలుగు మాతృభాషగా గలవారు కావడం విశేషం! తిరువళ్ళూర్, వేలూర్, కోయంబత్తూరు జిల్లాలలో కూడా అధిక సంఖ్యలో తెలుగువారున్నారు. ఈనేపథ్యంలో తెలుగు భాషను అక్కడ రెండవ అధికార భాషగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలనే తెలుగు వారి డిమాండ్ ముమ్మాటికీ సముచితమైనది.. ఏ రాష్ట్రంలో నైనా అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషను మొదటి అధికార భాషగా గుర్తిస్తారు. ఆ తర్వాత 12 శాతానికి మించి ఇతర భాషను మాట్లాడే వారు ఉంటే ఆ భాషను రెండవ అధికార భాషగా గుర్తిస్తారు!
ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడే వాళ్ళున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 8.5 కోట్ల మంది, తమిళనాడు లో 2.8కోట్ల మంది(42%), కర్నాటకలో 1.8 కోట్ల మంది(33%), మహారాష్త్రలో 1.5 కోట్ల మంది(16%), ఒరిస్సాలో 90 లక్షల మంది(23%), కేరళ, పాండిచ్చేరి, చత్తీస్ ఘడ్ లలో మరో 60 లక్షల మంది, దేశ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో లక్ష మంది తెలుగు వారుండగా, మిగిలినవారు విదేశాల్లో జీవిస్తున్నారు. అంటే తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, మహారాష్త్ర లలో తెలుగు భాషకు రెండవ అధికార భాషగా గుర్తింపు పొందేందుకు అర్హత ఉంది.
ఇతర మైనారిటీ భాషల పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఉదారతను చూపింది. కేవలం 12 శాతానికి పైగా భాషా వ్యవహర్తలుంటే చాలంటూ దేశంలోనే మొట్టమొదటి సారిగా ఉర్దూ భాషను రెండవ అధికార భాష గా గుర్తించడమే ఇందుకు నిదర్శనం. ఆంధ్ర ప్రదెశ్ లో ఉర్దూ భాషను 13 జిల్లాలలో రెండవ అధికార భాషగా గుర్తించడం జరిగింది. హైదరాబాద్, కడప, రంగా రెడ్డి, మెదక్, నిజామాబాద్, కర్నూలు, అనతపురం, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, వరంగల్, మెహబూబ్ నగర్, మరియు ఆదిలాబాదు జిల్లాలలో ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా గుర్తించారు. ఆయా జిల్లాలలోని మొత్తం జనాభాలో 12 శాతానికి పైగా ఉర్దూ భాషను మాట్లాడే వారు ఉండటమే ఇందుకు కారణం!

Monday, December 21, 2009

తెలుగు వారిపై తమిళ దురహంకారుల దాష్టీకం!

తెలుగు భాషను రెండవ అధికార భాష గా గుర్తించాలంటూ తమిళనాడు లోని కృష్ణగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తున్న తెలుగు వారిపై సోమవారం (21 డిసెంబరు 2009) తమిళులు దాష్టీకం చెశారు. ఈ సంఘటన పోలీసుల లాఠీచార్జీ కి దారి తీసింది. వివరాలివి. తమిళనాడు లో తెలుగు మాతృభాష గా గల జనాభా 42 శాతం ఉన్నట్లు తెలుగు భాషోద్యమ సంఘాల అంచనా! తమిళనాడు లోని కృష్ణగిరి , ధర్మపురి జిల్లాలలో దాదాపు 60 శాతం మంది తెలుగు మాతృభాషగా గలవారు కావడం విశేషం! ఈనేపథ్యంలో తెలుగు భాషను అక్కడ రెండవ అధికార భాషగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలనేది తెలుగు వారి డిమాండ్ . గతంలో కూడా తమ ఉనికి కోసం గళమెత్తిన తెలుగు వారిపై కొందరు ఛాందసులైన తమిళులు అకృత్యాలకు పాల్పడ్డారు కూడా! తాజాగా అక్కడి తెలుగు భాషోద్యమ కార్యకర్తలు సోమవారం కృష్ణగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తున్న తెలుగు వారిపై కొందరు తమిళులు దాడి చేశారు. ఐనప్పటికీ తెలుగు వారు శాంతియుతంగానే ధర్నా కొనసాగించడానికి పూనుకున్నారు. తెలుగు భాషను రెండవ అధికార భాషగా గుర్తించాలంటూ దశాబ్దాలపాటుగా తాము చేస్తున్న ఆందోళననను పరిష్కరించని పక్షంలో అధిక సంఖ్యలో తెలుగు వారున్న తమ కృష్ణగిరి జిల్లాను ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమలో కలపాలని వారు ఈ సందర్భంగా నినదించారు . ఈ నినాదాన్ని సహించలేని కొందరు తమిళ దురహంకారులు ఈ దాడికి పాల్పడ్డారు. తమిళులు సత్యాగ్రహ శిబిరం లో అల్లకల్లోలం సృష్టించడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ సందర్భంగా కొందరు గాయపడ్డారు. ఏ రాష్ట్రంలో నైనా అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషను మొదటి అదికార భాషగా గుర్తిస్తారు. ఆ తర్వాత 12 నుంచి 15 శాతానికి మించి (ఆయా రాష్ట్ర విధానాలకు అనుగుణంగా )ఇతర భాషను మాట్లాడే వారు ఉంటే ఆ భాషను రెండవ అధికార భాషగా గుర్తిస్తారు! ఆంధ్ర ప్రదెశ్ లో ఉర్దూ భాషను 13 జిల్లాలలో రెండవ అధికార భాషగా గుర్తించడం జరిగింది. ఆయా జిల్లాలలోని మొత్తం జనాభాలో 12 శాతానికి పైగా ఉర్దూ భాషను మాట్లాడే వారు ఉండటమే ఇందుకు కారణం! తమిళనాడు తో పాటు ఇతర ప్రాంతాలలోని తెలుగు వారి హక్కులను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
చిత్రం : తమిళనాడు రాష్ట్రం , ఎరుపు వర్ణంలో గుర్తించిన ప్రాంతమే కృష్ణగిరి జిల్లా .

Saturday, December 19, 2009

పొట్టి శ్రీ రాములు గారి ఆమరణ దీక్ష -కొన్ని వాస్తవాలు !

మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందే 1946 లో ఎన్నికల సందర్భంగా కాంగ్రేస్ వెలువరించిన ప్రణాళిక తోనే ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరిక అప్పటి తెలుగు నేతల్లో మొలకెత్తింది. భాషా, సంస్కృతుల ఆధారంగా దేశంలోని రాష్ట్రాలన్నింటినీ పునర్వ్యవస్తీకరిచవలసి వుంటుందని కాంగ్రేస్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించడమే ఇందుకు కారణం. దీనికి తోడు 1947 నవంబరు 27 న భాషా ప్రయుక్త రాష్ట్రాల సూత్రాన్ని తమ ప్రభుత్వం అంగీకరించిందని ప్రధాన మంత్రి నెహ్రూ ప్రకటించారు కూడా!
ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల అనంతరం 1952 అచ్టోబరు 19 న పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు చేపట్టిన ఉద్యమానికి, తెలుగు ప్రజల ఉనికి కోసం జరిగిన ఉద్యమంగానే పేరొచ్చిందిగానీ మరొకటి కాదు. 1952 డిసెంబరు 15 న ప్రాణాలను వదిలారు. దీంతో ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక చేసేది ఏమీ లేక నెహ్రూ 1952 డిసెంబరు 19 న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కొంత ప్రక్రియ తర్వాత 1953 అక్టోబరు 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
తెలంగాణా , కోస్తా, రాయలసీమ మూడూ కలిస్తే విశాలాంధ్ర అవుతుంది. చరిత్ర అలాగే చెబుతొంది. విశాలాంధ్ర ఏర్పాటు కోసం కమ్యూనిస్టులు కృషి చేశారు. అయితే విశాలాంధ్ర కోరిక ఫలించలేదు. 1953 లో అంధ్ర రాష్ట్రం మాత్రమే ఏర్పడింది. 1956 నవంబరు 1 న కోస్తా, రాయసీమ, తెలంగాణా (హైదరాబాదు రాష్ట్రం) ప్రాంతాలను కలుపుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దీంతో విశాలాంధ్ర కోరిక కొంతవరకు ఫలించింది.

Thursday, December 10, 2009

తెలుగు భాష, సాహిత్యం, కళలపై మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి! (మొదటి పరీక్ష) జవాబులు

1. వంతపాట గల కళా రూపం పేరు?
జవాబు: బుర్రకథ
2. జుట్టు పోలిగాడు పాత్ర గల కళా రూపం?
జవాబు: తోలుబొమ్మలాట
3. మహా భారతానికి గల మరొక పేరు?
జవాబు: జయకావ్యం
4. శివ కవులలో మొదటి వారు ?
జవాబు: నన్నెచోడుడు
5. తెలుగులో మొదటి రామాయణం పేరు?
జవాబు: రంగనాథ రామాయణం
6. పోతన గురువు గారి పేరు ?
జవాబు: ఇవటూరి సోమశేఖరుడు
7. తెలుగులో తొలి దండకం పేరు?
జవాబు: భొగినీ దండకం
8. తెలుగులో భాగవతాన్ని పోతనతో పాటు ఎవరు ఏ ఏ స్కంథాలు రచించారు?
జవాబు: పోతన భాగవతంలో 1,2,3,4,7,8,9,10 స్కంథాలను రచించగా,
ఐదవ స్కంథాన్ని బొప్పరాజు గంగయ,
ఆరవ స్కంథాన్ని ఏల్చూరి సింగయ,
11,12 వ స్కంథాలను వెలిగందల నారయ లు రచించారు.

9. ప్రబంధాలలో ముఖ్యమైన రసమేది?
జవాబు: శృంగారం
10. శ్రీ కృష్ణ దేవరాయలు నివసించిన మందిరం పేరు?
జవాబు: మలయకూటం

Sunday, November 29, 2009

మైదుకూరులో ఘనంగా "నడుస్తున్న చరిత్ర" ఆవిష్కరణ

నడుస్తున్న చరిత్ర తాజా సంచికను ఆవిష్కరిస్తున్న కొండపల్లి వీరభద్రయ్య.
మైదుకూరులో ఒక ప్రైవేటు ఆంగ్లమాధ్యమ పాఠశాల లో తెలుగు భాషను అవమానపరచిన సంఘటన అనంతరం ఈ సంఘటన పై సాగిన ఉద్యమం ముఖచిత్ర కథనం గా వెలువడిన "నడుస్తున్న చరిత్ర" తెలుగు జాతి పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నవంబరు 22 వ తేదీన మైదుకూరులో తెలుగు భాషాభిమానుల మధ్య ఘనంగా జరిగింది. రాయలసీమ జానపదుల కళాకారుల సంఘం వ్యవస్థాపకులు, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కార గ్రహీత కొండపల్లి వీరభద్రయ్య పత్రికను ఆవిష్కరించారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య సభ్యుడు, తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ది సంస్థ అధ్యక్షుడు, కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి అధ్యక్షతన మైదుకూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన సభలో వీరభద్రయ్య మాట్లాడుతూ తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించుకొనేందుకు తెలుగు ప్రజానీకం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలోని ప్రజలలో ప్రజల్లో వారి భాష పట్ల ఉన్న చైతన్యం మన తెలుగు వారిలో కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విశిష్టమైన తెలుగు భాష పరిరక్షణకు తెలుగు భాషోద్యమ సమాఖ్య, మైదుకూరులోని తెలుగు సంస్థ సాగిస్తున్న ఉద్యమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కొన్ని టెలివిజన్‌ ఛాన్‌ల్స్‌ తెలుగును సంకరీకరణ చేయడం వల్ల అచ్చమైన తెలుగు భాష కలుషితమై పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు నేలపై సంచారజాతులకు ఉన్న ఒక ప్రత్యేకమైన భాషా మాండలికాలూ , పదసంపద
సభలో ప్రసంగిస్తున్న కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి.
కూడా అంతరించిపోతున్నాయని ఈ సమావేశంలో పాల్గొనడం వల్ల సంచార భాషా సంపదను కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత స్ఫురించిందని పేర్కొన్నారు.
కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అందరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న భాషలసంఖ్య నానాటికీ పెరిగి పోతోందని, ప్రపంచంలో మొత్తం 6,500 భాషలను ప్రజలు మాట్లాడుతున్నారని, వాటిలో 2,500 భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో 196 భాషలు అంతరించి పోయేదశకు చేరుకున్నాయని వాటిలో 120 భాషలు ఈశాన్య రాష్ట్రాలకు చెందినవని ఆయన పేర్కొన్నారు. ఆంగ్ల సామ్రాజ్య వాదం సాగిస్తున్న సాంస్కృతిక విధ్వంసం వల్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో భాషలకు, జాతులకు, సంస్కృతులకు ముప్పును, కలుగుతున్న ప్రమాదాన్ని సోదాహరణంగా వివరించారు.
పాల్గొన్న తెలుగు భాషాభిమానులు
విజయవాడలో ఈనెల 15న డా. సామల రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ర్ట కార్యవర్గ సమావేశపు వివరాలను ఈ సందర్భంగా ఓబుల్ రెడ్డి వెళ్లడించారు. తెలుగు భాషను ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల మంది మాట్లాడుతున్నారని ఆంగ్ల పెత్తనం తెలుగు మీద కూడా సోకుతోందని, ఎంతో వైవిధ్యం ఉన్న తెలుగు సంపద, నుడికారాలు తరిగి పోతున్నాయన్నారు. మైదుకూరు సంఘటనపై తక్షణమే చట్టపరంగా, శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రముఖ కవి లెక్కల వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలుగు మాండలిక పద సంపదను కాపాడుకొనేందుకు భాషోద్యమకారులు వివిధ కార్యక్రమాలను రూపొందించాల్సి ఉందన్నారు. తెలుగు వారు తెలుగు వారితో తెలుగులో మాట్లాడుకొని మాతృభాషపై గౌరవాన్ని ప్రదర్శించాలని కోరారు.
పాల్గొన్న మరికొందరు తెలుగు భాషాభిమానులు
అభ్యుదయ రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డివిఎస్ నాయుడు మాట్లాడుతూ తెలుగు భాష విశిష్టతను వివరించారు. మైదుకూరు ఉద్యమం తెలుగు భాషపై విస్తృత చర్చను, స్ఫూర్తినీ కలిగించిందని పేర్కొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి భాస్కర్‌ మాట్లాడుతూ మైదుకూరు సంఘటన దురదృష్టకరమైనా, భాషా ఉద్యమాన్ని రగిలింపజేసిందని, కర్నాటక, తమిళనాడులలో మాదిరిగా విద్యాలయాల్లో తెలుగు ఒక అంశంగా బోధనను తప్పనిసరి చేయాలని కోరారు. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కార గ్రహీత కొండపల్లి వీరభద్రయ్యను తెలుగు సంస్థ ఈ సందర్భంగా ఘనంగా సత్కరించింది. ప్రముఖ కవి లెక్కల వెంకటరెడ్డి వీరభద్రయ్య ను శాలువాతో సత్కరించగా, సంస్థ ఉపాధ్యక్షుడు అరబోలు వీరాస్వామి పూలమాలతో సన్మానించారు. సంస్థ కార్యదర్శి ముండ్లపాటి వెంకట సుబ్బయ్య జ్ఞాపికను అందచేశారు. వెలుగు వెంకట సుబ్బా రావు రచించిన తెలుగు పతాక గీతం, యలమర్తి రమణయ్య రచించిన తెలుగు భాషోద్యమ గీతాలను సంస్థ సంయుక్త కార్యదర్శి ధర్మిశెట్టి రమణ, వీరాస్వామి. వెంకటసుబ్బయ్య, డౌలకిస్ట్ మౌలాలీ బాష, వాసు లు పాడి సభికులను రంజింపజేశారు. ఈ కార్యక్రమంలో రాటా అధ్యక్షుడు కొండపల్లి శేషగిరి, పత్రికల, ప్రసార మాధ్యమాల ప్రతినిధులు, సంస్థ సలహా మండలి సభ్యుడు సాదక్, సంస్థ కార్యవర్గ సభ్యులు పెరుగు క్రిష్ణయ్య యాదవ్, బాబయ్య, సిపిఐ నేత రమణ, హరితమిత్ర వ్యవసాయ కేంద్రం అధ్యక్షుడు పోలు కొండారెడ్డి, యక్షగాన కథకుడు యడవల్లి రమణయ్య, రాష్ట్రీయ స్వయం సేవక
కొండపల్లి వీరభద్రయ్య ను సత్కరిస్తున్న దృశ్యం
సంఘ్‌ ప్రతినిధి టి వెంకటేశ్వర్లు, బిజెపి రాష్ర్ట కార్యవర్గ సభ్యులు బిపి ప్రతాప్‌రెడ్డి, మోహన్‌, విజయభాస్కర్‌రెడ్డి, కెజిపి వెంకటయ్య, సందిళ్ల బాల సుబ్బయ్య యాదవ్, అంకన్న, , అధిక సంఖ్యలో తెలుగు అభిమానులు పాల్గొన్నారు. తెలుగు భాషొద్యమకారులూ, తెలుగు భాషాభిమానులూ ఈ సందర్భంగా ధరించిన తెలుగు పతాకం, తెలుగులో మాట్లాడటం మా జన్మ హక్కు అనే బ్యాడ్జీలులు పలువురిని ఆకట్టుకున్నాయి.

Saturday, November 7, 2009

సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాల నిర్వాకంపై ఉద్రిక్తత మధ్య విచారణ

మైదుకూరు సంఘటనపై ఆందోళన 
విద్యార్థులు తెలుగులో మాట్లాడుతున్నారని స్థానిక సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల చేసిన నిర్వాకంపై మంగళవారం ఉద్రిక్తత మధ్య విచారణ కొనసాగింది. ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో తెలుగులో మాట్లాడుతున్నారని 'ఐ నెవర్‌ స్పీక్ ఇన్‌ తెలుగు' (నేను తెలుగులో మాట్లాడను) అని రాసిన బోర్డులను ఇద్దరు విద్యార్థుల మెడలో వేశారు. ఈ విషయం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విధంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ, తెలుగు సామాజిక, సాంస్కృతిక, సాహిత్యాభివృద్ధి సంస్థ, ఎఐఎస్‌ఎఫ్‌ మంగళవారం పాఠశాల గేట్‌ వద్ద ధర్నా చేశారు. వీరికి మద్దతుగా సిపిఐ, బిజెపి, మైదుకూరు రైతు సేవా సంఘం అధ్యక్షుడు డిఎన్‌ నారాయణ, ఎపిటిఎఫ్‌ నాయకులు సివి ప్రసాద్‌, ఎస్టీయు నాయకులు ఎపి శ్రీనివాసులు, కె.పాలకొండయ్య ఆందోళనలో పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు డిప్యూటీ డిఇఓ సుబ్బారెడ్డి సంఘటనపై విచారించేందుకు పాఠశాలకు చేరుకున్నారు. అప్పటికే పాఠశాల గేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐతోపాటు వివిధ పార్టీల నాయకులు, ఉపాధ్యాయ యూనియన్‌లు, రైతు నాయకులు ఆందోళన చేస్తున్నారు. విచారణ బహిరంగంగా చేపట్టాలనీ, నిజాయితీగా సాగాలనీ డిప్యూటీ డిఇఓ సుబ్బారెడ్డిని నిలదీశారు. విచారణలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నా సహించేది లేదని పట్టుబట్టారు. గతంలో కూడా ఈపాఠశాలలో చోటు చేసుకున్న వేధింపులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో విచారణ చేయాలన్నారు.
అంతేకాదు తెలుగు భాషను అవమాన పరిచిన పాఠశాల యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంగళవారం ఉదయమే ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా చీఫ్‌ సెక్రటరీ పి.దస్తగిరిరెడ్డి, ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, ఓబులేస్‌, కొండయ్య, శేఖర్‌, చంద్ర బైఠాయించారు. ఆందోళనలో ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు మద్దిలేటి, ఏరియా కార్యదర్శి ఎస్‌.అబ్దుల్లా, సిపిఐ నాయకులు ఎవి రమణ, పి.శ్రీరాములు, ఎస్‌.రంతుల్లా, ఎఐవైఎఫ్‌ నాయకులు పి.భాస్కర్‌, బిజెపి నాయకులు బిపివి ప్రతాప్‌రెడ్డి, ఎ.రాజమోహన్‌రెడ్డి, పుల్లయ్య, తెలుగు సామాజిక , సాహిత్యాభివృద్ధి సంస్థ ప్రతినిధులు ఎ.వీరాస్వామి, డి.రమణ, వెంకటసుబ్బయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు భాషపై ప్రవర్తించిన తీరు అనాగరికం
తెలుగుభాష అణచివేతను నిరసించాలనీ, మాతృభాషను పరిరక్షించాలనీ నినాదాలను చేశారు. తెలుగు భాష వర్ధిల్లాలంటూ నినదించారు. ఈసందర్భంగా తెలుగు సామాజిక, సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ గౌరవాధ్యక్షులు తవ్వా ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ మాతృభాషలో విద్యను అభ్యసించే వీలు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల పాఠశాల యాజమాన్యం వ్యవహరించిన తీరు అనాగరికమన్నారు. దీన్ని నిరసిస్తున్నామన్నారు. ఈ సంఘటన భాషాభిమానుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొందన్నారు. ఇలాంటి సంఘటన జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకోకూడదన్నారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్టీయు జిల్లా నాయకులు ఎపి శ్రీనివాసులు మాట్లాడుతూ త్రిభాషా సూత్రానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. ఎపిటిఎఫ్‌ ప్రతినిధి సివి ప్రసాద్‌ మాట్లాడారు.
పర్యవేక్షించిన డిఎస్పీ
సెయింట్‌ జోసఫ్‌ పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటనపై విచారణలో ఉద్రిక్తత ఏర్పడడంతో మైదుకూరు డిఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి, అర్బన్‌ సిఐ ఇ.శ్రీనివాసులు సిబ్బందితో పర్యవేక్షించారు. ఉద్రిక్తత, ఆందోళన కారుల చర్చల అనంతరం డిప్యూటీ డిఇఓ సుబ్బారెడ్డి విచారణ చేపట్టారు. విద్యార్థులతో విచారణ చేశారు. ఈనివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈవిచారణలో మండల విద్యాశాఖాధికారి పి.సు కవనం పాల్గొన్నారు.
క్షమాపణ చెప్పిన యాజమాన్యం
సోమవారం తమ పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటనపై పాఠశాల యాజమాన్యం ప్రభాకర్‌ మంగళవారం ఆందోళన కారులకు క్షమాపణ చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూస్తామని తెలిపారు. అయితే దీనికి ఆందోళన కారులు అంగీకరించలేదు.
మీడియాపై దాడి
సోమవారం సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌లో చోటు చేసుకున్న సంఘటనపై చేస్తున్న విచారణలో పాఠశాల యాజమాన్యం మీడియాపై దురుసుగా ప్రవర్తించి, దాడికి దిగింది. విచారణలో పాఠశాల యాజమాన్యం అసహనానికి గురైంది. ఈవిషయాన్ని మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తెలుగుభాషను అవమానపరిచిన సెయింట్‌జోసెఫ్‌ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలనందిస్తూ ఉపాధ్యాయులు ఎంఆర్‌సి భవనం నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుభాషోద్యమ సమైక్య నాయకులు తవ్వా ఓబుల్‌రెడ్డి కూడలిలో
శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుభాషను అణచివేసేందుకు ప్రంపంచీకరణ వాదులు జరుపుతున్న కుట్రలో భాగంగా సెయింట్‌జోసెఫ్‌ పాఠశాలలో జరిగినటువంటి ఉదంతాలు చోటు చేసుకు0టున్నాయ ని అన్నారు. ప్రపంచంలో ని అనేక జాతుల భాషలను తుదముట్టచడమే ఇంగ్లీష్‌ వారి ధ్యేయమని అన్నారు. ఎస్‌టియు జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పాలకొండయ్య మాట్లాడుతున్న తెలుగుభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఎస్‌టియు నాయకులు స్వామినాథ్‌, మల్లేశ్వరరెడ్డి, ఏపిటిఎఫ్‌ నాయకులు వెంకటసుబ్బయ్య, అంకన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలుగుభాష పరిరక్షణ కోసం భాషోధ్యమ సంస్థలు, రాజకీయ, విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలు, పత్రికలు, ప్రసార సాధనాలు ని ర్వహిస్తోన్న ఉద్యమం తెలుగునేలకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ రచయిత సంపాదకుడు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అభినందించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేతు విశ్వనాథరెడ్డి తెలుగుభాష మాట్లాడిన బాలల పట్ల మైదుకూరు సెయింట్‌జోసెఫ్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాల యాజమాన్యం శిక్షలను అమలు చేయడం పట్ల నిరసనలు పెల్లుబికడం రాష్ట్ర వ్యాప్తగా ఉద్యమం తీవ్ర దాల్చడాన్ని తెలుసుకుని అమెరికా నుంచి స్థానిక తెలుగుసాహితీ సాంస్కృతిక వేదిక వారి ద్వారా మాట్లాడారు. ప్రపంచంలో అన్ని జాతుల వారినీ, అన్ని భాషల వారినీ తమ బాసలుగా మార్చుకునేందుకు పాశ్య్చాత్య శక్తులు, సామ్రాజ్య వాదులు ఇంగ్లీషు పెత్తనాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాయనిచెప్పారు. తెలుగుభాషను, జాతిని పరిరక్షించుకోవడానికి తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు.
'మా తెలుగుతల్లి ఉత్తర్వులు హర్షణీయం
మైదుకూరు తెలుగు ఉద్యమంతో నిదురమేల్కున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు, ఇంగ్లీషు మీడియ పాఠశాలలో 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' గేయాన్ని ప్రతి రోజూ తప్పనిసరిగా ఆలపించాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేయడం హర్షణీమని తెలుగుభాషోద్యమ సమాఖ్య ప్రతి ని ధులు తవ్వా ఓబులరెడ్డి, వీరాస్వామి, వెంకసుబ్బయ్య, రమణ ఒక ప్రకటనలో హర్షం వక్తం చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వర ప్రతి పాఠశాలలో తెలుగును తప్పనిసరి చేస్తూ 2003 లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. మా తెలుగు తల్లి గేయాలాపన తప్పనిసరిగా జరిగేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.

ఇంత అలుసా? ప్రజాశక్తి సంపాదకీయం

'దేశ భాషలందు తెలుగు లెస్స ' అంటూ ఘనంగా పలికారు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన ఏలిన రాయలసీమలో ఇప్పుడు 'నేనెప్పుడూ తెలుగు మాట్లాడను' అని ముక్కు పచ్చలారని చిన్నారుల మెడలో ఇంగ్లీషు ప్లకార్డులను వేలాడ దీయడం అత్యంత దుర్మార్గమైన చర్య...తెలుగు జాతి సిగ్గుతో తలవంచుకొనేలా చేసిన ఘటన ఇది. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. మాతృ భాషను అవమానించడం ముమ్మాటికీ నేరమే. మైదుకూరులోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూలులో జరిగిన ఈ దారుణం లోకానికంతటికీ తెలిసింది. ఇలాంటి ఘటనలు వెల్లడి కాకుండా వివిధ రూపాల్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. మైదుకూరులో కఠిన చర్యలు చేపడితే మిగిలిన వారూ కళ్లు తెరుస్తారు. ఒళ్లు మరిచిపోకుండా వ్యవహరిస్తారు. నిండా ఎనిమిదేళ్లు లేని మధు, శాంతి చేసిన పాపమల్లా క్లాసులో తెలుగు మాటాడడమే. దానికే వారికి ...డీషీటర్ల మాదిరిగా మెడలో ప్లకార్డులు వేలాడ దీయడం పైశాచికమొక్కటే కాదు. తెలుగు భాషపట్ల ఉన్న అలుసు కూడా దీనికి ప్రధాన కారణం. ఇంగ్లీషు మీద లేదా ఇంకేదైనా భాష మీద ఎవరికైనా మోజుంటే దాన్ని తప్పు పట్టలేం. అది వారి వ్యక్తిగతం. కాని మరో భాష పట్ల ద్వేషం లేదా నిర్లక్ష్యం వుండరాదు. అదీ మాతృభాష పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం దారుణం. తెలుగు మాటాడితే ఇంగ్లీషు రాదు లేదా నేర్చుకోలేరని కొందరి దురభిప్రాయం. ఇంకొందరైతే ఏకంగా ఎప్పుడూ అదేపనిగా మాటాడుతుంటే ఇంగ్లీషు తేలికగా వచ్చేస్తుందన్న భ్రమలూ కల్పిస్తుంటారు.ఇవన్నీ అశాస్త్రీయ భావనల ఆధారంగా వచ్చిన అభిప్రాయాలు. ఇలాంటి వాటి పర్యవసానమే మైదుకూరు ఘటన. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అమాత్యవర్యులు సెలవిచ్చారు. ఆ క్లాసు టీచర్‌ ఉద్యోగం ఊడగొడితే సమస్యకు సరైన పరిష్కారం దొరకదు. ఆ స్కూలులో అనుసరిస్తున్న విధివిధానాలూ పై స్థాయి వారి ఆదేశాలు (అవి రాతమూలకంగా వుండకపోవచ్చు కూడా) వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. సమగ్ర విచారణ ద్వారానే విషయాలన్నీ వెలుగులోకొస్తాయి.
భావాన్ని వ్యక్తీకరించడం కోసమే భాష. మాతృభాషలోనే మనసులోని పూర్తి భావాన్ని వ్యక్తం చేయగలరని అనేక అధ్యయనాలు, పరిశోధనలూ ఘంటాపథంగా చెప్పాయి. మన విద్యావిధానానికి మార్గదర్శనం చేసిన వాటిలో ప్రధానమైనది కొఠారి కమిషన్‌ సిఫార్సు. పాఠశాల విద్యను తప్పనిసరిగా మాతృభాషలోనే బోధించాలని చెప్పింది. అనంతరం వచ్చిన అనేక కమిషన్లు, నిపుణుల నివేదికలూ దాన్నే పునరుద్ఘాటించాయి. విద్యనందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించిన రోజల్లో ఆ విధానాలు, వైఖరులూ అమలు జరిగాయి. ప్రభుత్వం విద్యను అంగడి సరుకుగా మార్చేశాక ఇలాంటి వెరిత్రలలు పెరిగిపోయాయి. ప్రపంచబ్యాంకు ఆదేశాలకు తలొగ్గిన మన పాలకులు రోజుకో రీతిన విద్యావిధానంలో మార్పులు తెచ్చేస్తున్నారు. తాజాగా మన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సక్సెస్‌ స్కూలు పథకం ఈ కోవకే వస్తుంది. అందువల్ల చాలా స్కూళ్లు మూతపడ్డం,వేలాది మంది విద్యార్ధులు విద్యకు దూరం కావడమో ప్రైవేటు స్కూళ్లకు చేరువ కావడమో జరిగింది. ఇంగ్లీషు వ్యామోహాన్ని ప్రభుత్వమే పెంచింది. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రజలపై రుద్దింది. అదే విధంగా కొందరు తల్లిదండ్రులకూ ఇంగ్లీషుపై మోజు ఎక్కువగా వున్న మాట నిజం. ఇంకో భాషపట్ల మక్కువ వున్నంత మాత్రాన మన భాషను తక్కువ చేయడం తగని పని.
ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌గా పేరుగాంచిన మన తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి ఇంగ్లీషు వాడైన సిపి బ్రౌన్‌ విశేష కృషి చేశారు. మరి అలాంటిది మనమెంత జేయాలి? మనలో ఎంతమందిమి తెలుగు భాషాభివృద్ధి గురించి దృష్టి పెడుతున్నాం? కాదు కనీసం ఆ దిశగా ఆలోచిస్తున్నాం అని చూస్తే సమాధానం చాలా నిరాశాజనకంగా వుంటుంది. ఇప్పటి వారిలో చాలా మంది భాషను అభివృద్ధి చేయడానికి కృషి చేయకపోయనా ఫర్వాలేదు కాని మైదుకూరులో మాదిరిగా అవమానించకపోతే చాలనిపిస్తోంది. ఇలాంటి ఘటన మన పొరుగునున్న తమిళనాటో కర్ణాటకలోనో జరిగితే తీవ్ర పరిణమాలు సంభవించేవి అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజం కూడా కావచ్చు. మనతో పోల్చితే వారికి స్వభాషాభిమానం చాలా ఎక్కువ. మాతృభాషను అభిమానించడం అభివృద్ధి చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఐతే అది దురభిమానంగానో పర భాషా ద్వేషంగానో వుండరాదు.
తెలుగుకు ప్రాచీనభాష హోదా సాధించుకోడం కోసం పెద్ద ఉద్యమం సాగింది. వివిధ స్రవంతులకు చెందిన తెలుగు వారంతా అందులో పాల్గొనడమో సహకరించడమో చేశారు. అలాంటి ప్రత్యేక సందర్భాల్లో తప్ప మాతృ భాష పట్ల జాతిని జాగృతం చేసే కార్యక్రమాలు సందర్భాలూ తక్కువగానే వుంటున్నాయి. మైదుకూరు లాంటి ఘటనలు జరిగినపుడు కొంత చర్చ నడిచి తర్వాత చల్లబడిపోతుంది అలా జరగరాదు. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికా బద్ధ కృషి జరపాలి. అధికారభాషా సంఘాన్ని నియమించేయడంతో తన పని ఐపోయిందని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. ప్రజల భాషలో పరిపాలన సంపూర్తిగా జరగడానికి గట్టిగా వ్యవహరించాలి. ప్రజల భాషలో పరిపాలన అన్నది కేవలం భాషాభిమానంతో చేసే డిమాండ్‌ కాదు. అది ప్రజల హక్కు. పరిపాలన ప్రజల భాషలో జరగకపోతే అది అప్రజాస్వామికమే అవుతుంది. భాషాభిమానులు, భాషా ఉద్యమకారులూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు స్వచ్ఛంద కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహించాలి. అందుకవసరమైన వాతావరణాన్ని రూపొందించాలి. భాషాభివృద్ధికి అన్ని వైపుల నుండి సమైక్య కృషి జరగాలి. బతుకు బాటను మాతృభాషతో అనుసంధానం చేయాలి. అది ఓ నిరంతర స్రవంతిలా నడవాలి. అపుడే భాష సజీవంగా సమున్నతంగా ఎదగడమే గాక ఇలాంటి అవమానాలకు ఆస్కారం కూడా లేకుండా వుంటుంది. తెలుగు భాషను సమున్నతంగా అభివృద్ధి చేసుకోవాలని ప్రతి తెలుగువాడూ ప్రతినబూనడం నేటి అవసరం.

తెలుగుకు అవమానం- ఆంధ్రప్రభ సంపాదకీయం

తెలుగు భాషకు తెలుగు వారి రాష్ట్రంలోనే అవమానాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ఇది తెలుగు అభిమానులను మరింతగా నొప్పిస్తున్నది. కడప జిల్లా మైదుకూరులో ఒక పాఠశాలలో తెలుగులో మాట్లాడినందుకు ఇద్దరు చిన్నారులను 'ఇక మీదట తెలుగులో మాట్లాడను' అనే వాక్యం రాయించిన ప్లకార్డులను మెడలో వేలాడదీయించి శిక్షించిన సంఘటన జనం మనస్సులలో నుంచి ఇంకా చెరిగిపోక ముందే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లోని పాఠశాలలో కూడా తెలుగులో మాట్లాడినందుకు ఒక విద్యార్థిని ఉపాధ్యాయురాలు 'డోంటాక్‌ తెలుగు' అంటూ 300 సార్లు రాసి ఇవ్వవలసిందని ఆదేశించిన ఉదంతం భాషాభిమానులకు ఆగ్రహావేశాలు కలిగిస్తున్నాయి. తాను ఇంగ్లీషు పాఠాలు బోధిస్తాను కనుక తన క్లాసులో మాత్రమే తెలుగులో మాట్లాడవద్దని కోరానని ఆ టీచర్‌ వివరణ ఇచ్చారు. ఇది మరొక వివాదానికి దారి తీసే అవకాశం ఉందని గ్రహించి ఆమె ఈవిధంగా మాట మార్చినట్లు కనిపిస్తున్నది. ఈ రెండు సంఘటనలపై ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తామంటున్నది. అయితే, మరీ బాధాకరమైన విషయమేమంటే రాష్ట్రంలోని పలు విద్యా సంస్థలు పాశ్చాత్య మోజులో పడి తెలుగు తల్లికి మాయని మచ్చ తీసుకురావడం. తెలుగు మాధ్యమంలో విద్యార్జన చేసిన వారి కన్నా ఇంగ్లీష్‌ మీడియంలో చదివిన విద్యార్థులకే ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభిస్తుండడంతో విద్యా సంస్థలలో ఇంగ్లీష్‌ మీడియంలో బోధనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వాస్తవానికి దేశంలోని విద్యా సంస్థలలో అనేక సంవత్సరాల క్రితమే త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టారు. మాతృభాషను, అనుసంధాన భాష ఇంగ్లీష్‌ను, జాతీయ అధికార భాష హిందీని లేదా మరొక భారతీయ భాషను పాఠశాలల్లో బోధించాలని అప్పట్లో సూచించారు. ఇతర రాష్ట్రాల సంగతి అలా ఉంచితే ఈ సూత్రాన్ని మన రాష్ట్రంలోని పాఠశాలల్లోనే ఎక్కువగా అమలు పరుస్తున్నారు. కాని కొన్ని చోట్ల తెలుగుకు ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గిస్తున్నట్లు కనిపిస్తున్నది.
జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలను తొలిసారి నిర్వహించిన తరువాత రాష్ట్రంలో అధికార భాషగా తెలుగు వాడకం పెరిగింది. కాని ఎన్‌టి రామారావు 'తెలుగువారి ఆత్మగౌరవం' నినాదంతో చిత్రరంగం నుంచి రాజకీయ రంగంలోకి దూకి పార్టీని స్థాపించి ఉధృతంగా ప్రచారం చేసి తొలి ప్రయత్నంలోనే అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు రావడమే కాకుండా, తెలుగు భాష కూడా మరింత ప్రాముఖ్యం సంతరించుకున్నది. ఎన్టీఆర్‌ హయాంలో అన్నిటికీ తెలుగు పేర్లు పెట్టసాగినప్పుడు ఆయన మరీ అతిగా వ్యవహరిస్తున్నారనే మాట వచ్చినా తెలుగు వాడకం స్థాయి పెరిగిందనే మాట నిజం. ఎన్టీఆర్‌ తరువాత అధికారం స్వీకరించిన చంద్రబాబు నాయుడు మొదటి హయాంలో తెలుగు వాడకం పరిస్థితి మెరుగ్గానే ఉంది. కాని చంద్రబాబు రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఐటికి ఇతోధిక ప్రాధాన్యం ఇవ్వసాగడంతో తెలుగు వాడకం స్థాయి తగ్గిపోయిన సంగతి ఎవరూ పట్టించుకోలేదు. ఆతరువాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా పరిస్థితి మెరుగు కాలేదు. ఎవరి హయాంలోనైనా అధికార భాషా సంఘం అనేది కొనసాగుతున్నప్పటికీ అది సూచనలు, సలహాలు ఇవ్వగలదే గాని ఆదేశాలు జారీ చేయలేదు కదా. మన పొరుగు రాష్ట్రాలలో ఆయా మాతృభాషలలోనే అధికార కార్యకలాపాలన్నీ సాగుతున్నాయి. ఆయా రాష్ట్రాలలో ఇతర భాషలవారు ఉన్నప్పటికీ ఏ దరఖాస్తులు పెట్టాలన్నా ఆ రాష్ట్రాల అధికార భాషలలోనే వాటిని స్థానికుల సాయంతో రాయించుకుంటున్నారు. కాని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, చివరికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాచీన భాషగా గుర్తింపు ఉత్తర్వు తెచ్చుకున్నప్పటికీ మన రాష్ట్రంలో రకరకాల కారణాలతో అధికార భాషగా తెలుగు వాడకం విషయంలో అలా జరగడం లేదు.
నిజానికి తెలుగు భాష ఎంతో తియ్యనైనది. సులభంగా అర్థం అవుతుంది. అందుకే ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ఒక సందర్భంలో 'సుందర తెలుంగు' అని పేర్కొన్నారు. ఏ మాండలికంలో మాట్లాడినా అందులో ఉండే కమ్మదనం ఎంతో గొప్పది. విదేశాలలో ఉన్న ఆంధ్రులు కూడా తమ పిల్లలు తెలుగులో మాట్లాడాలనే ఆశయంతో వారికి తెలుగు నేర్పిస్తున్నారు. పండుగలు వంటి సందర్భాలలో నిర్వహించే కార్యక్రమాలలో తెలుగు వాడకానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. కాని స్వరాష్ట్రంలో అలా చేయడం తప్పుగా కనిపిస్తున్నది. అధిక సంఖ్యాక కుటుంబాలలో 'అమ్మా, నాన్నా' అనడానికి బదులు 'మమ్మీ, డాడీ' అని లేదా 'మామ్‌, డాడ్‌' అని పిలిపించుకోవడాన్నే ఇష్టపడుతున్నారు. ఆ వ్యామోహంతోనే కాన్వెంట్లలో తమ పిల్లలను చదివిస్తున్నారు. అందుకే తెలుగులో పొరపాటున మాట్లాడినందుకు విద్యా సంస్థల సిబ్బంది తమ పిల్లలను దారుణంగా శిక్షించినా అదేమని తల్లిదండ్రులు వారిని గద్దించలేకపోతున్నారు. మాతృభాషను కించపరిచే విధంగా ఎవరైనా ప్రవర్తించినప్పుడు ఉద్యమించడం, కళ్ళెర్ర చేయడం వంటివి తెలుగు వారు చేస్తున్నారు. కాని ఆతరువాత చల్లబడిపోతున్నారు. అందుకే తెలుగువారు ఆరంభ శూరులనే నిందకు గురవుతున్నారు.
రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్‌లో కూడా తెలుగు వాడకం తగ్గిపోతున్నది. మెట్రోపాలిటన్‌ నగరం స్థాయిని హైదరాబాద్‌ అందుకోవడంతో ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వస్తుండడంతో తెలుగుకు అంతగా ప్రాధాన్యం లభించడం లేదు. ఇది అతిశయోక్తిగా కనిపించవచ్చు కాని నిజం. 'హిందీ నై మాలూం', 'స్పీక్‌ ఇన్‌ ఇంగ్లీష్‌' అనే మాటలు వినిపిస్తుంటాయి. మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఇలా అనే ధైర్యం వారికి ఉండదు. కాని మన దగ్గర మాత్రం ఇది చెల్లుబడి అవుతోంది. తెలుగువారి సహనశీలం వారికి ఇలా అక్కరకు వస్తోంది. ఏమైనా, తెలుగు భాషకు ఇటువంటి అవమానాలు జరగకుండా ఉండడానికి అటు ప్రభుత్వంలోను, ఇటు జనంలో కూడా చైతన్యం రావాలి.

మాతృభాష తెలుగుకు అవమానం


మైదుకూరు, అక్టోబర్‌ 26 :మన మాతృభాష తెలుగు అధికార భాష అయినా పలు చోట్లా భాషకు అవమానం తప్పేట్లు లేదు. తాజాగా మైదుకూరులోని ఓ పాఠశాలలో వెలుగు చూసిన సంఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. వివరాలిలా వున్నాయి. స్థానిక మైదుకూరు పట్టణంలో బద్వేల్‌ రోడ్డులో గల సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో తెలుగులో మాట్లాడిన విద్యార్థులకు దండన విధించారు. అదేమిటంటే అలా మాట్లాడిన విద్యార్థులకు మెడలో నేను తెలుగులో మాట్లాడను అని ఆంగ్లంలో ఐ నెవర్ స్పీక్ ఇన్ తెలుగు అని రాసిన అట్ట బోర్డులను మెడకు తగిలించి తరగతి గదుల బయట ఎండలో నిలబెట్టారు. ఇలా ఒక్కో తరగతిలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థుల చొప్పున సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎండలో నిలబెట్టి దండన విధించారు. విషయం తెలుసుకున్న మీడియా, పత్రికా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న మండల విద్యాధికారి సుఖవనం, తాహసీల్దార్‌ సుబ్బరాయుడు అక్కడకు చేరుకున్నారు. సంఘటనపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎంఇఓ సుఖవనం తెలిపారు. అక్కడ కరస్పాండెంట్‌, ప్రిన్సిపల్‌ లేకపోవడం గమనార్హం.
జిల్లాలో ఇలాంటి సంఘటనల్‌ మరెన్నో...
ఇలాంటి సంఘటన వెలుగు చూసిన నేపథ్యంలో ఇలాంటి దండనలు జిల్లాలో ప్రతి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో జరుగుతున్నాయని, అధికారులు పర్యవేక్షణపై మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని ప్రజలు అంటున్నారు. తెలుగు బాషకు ఇటువంటి అవమానకర సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
'ఐ నెవర్‌ స్పీక్‌ తెలుగు'
వేంపల్లి గంగాధర్‌
రేత్రంతా గిడ్డంగుల దగ్గర న్నుంచి రైలు పట్టాల దగ్గర గూడ్యుబోగీల్లోకి సిమెంటు బస్తాలు మోసిన అంకన్న, కొడుకుకు నిన్ననే కాన్వెంటులో ఫీజు కట్టివచ్చినాడు. వాడు ఇప్పుడిప్పుడే ఎబిసిడి అని పలకలో రాయి చ్చుకొని దిద్దుకుంటావుండాడు. వాడ్నిజూస్తే అంకన్నకు య్యాడ లేని సంతోషమైతాది. ఇంటికిపోయిన కాన్నుంచి సంబరంలో వాడికి బొంకులోని చాక్లెట్లు అన్నీ కొనక్కపోయి తినిపిస్తా వుంటాడు. కొడుకును దొరలాగా కోటు,బూటు, సూటు, నెత్తిన హ్యాటుపెట్టి చూసుకోవాలని కలలు కంటావుండాడు. వాడి నోటి నుంచి ఇంగ్లీషుభాష వరదలాగా పొంగిపొర్లుతా రావాలని ఆశపడ్తావుండాడు. కొడుకును పైచదువులు బాగా చదివించి మంచి ఆఫీసర్‌ను చేస్తానని కనపడినోళ్ళందరి దగ్గర మీసాలు దువ్వుకుంటా చెప్తాండడు. ఈకత ఇట్లా నడుస్తానే వున్నింది.

అదో పడమటి దేవళం ప్రక్కన సందులో ఆటోరిక్షా పడిపే బాబయ్య కొడుకు అనిల్‌గాడు కూడా ఇదే కాన్వెంటులోనే సెకండ్‌క్లాస్‌ చదువుతాండడు.వాడు తెల్లవార్లూ చదివిన పదాలే చదువతాడు.అయినావాడిపేర్లు, స్పెల్లింగులు గుర్తుండి చావవు. ఏం చేస్తాడు? స్కూల్లో గోడకుర్చీ వేస్తాడు. గుంజిల్లు తీస్తాడు. డెస్క్‌పైకెక్కి ఒక పిరియడ్‌ నిలబడి శిక్ష అనుభవిస్తాడు. ఇట్లాటి శిక్షలన్నీ మళ్ళా ఇంటి కొచ్చినాంక బాబయ్యకు చెప్తాడు. తాగు బోతు బాబయ్య గాడికత పిల్లోడు అనిల్‌గాడికి ఏం తెలుసు?

'నేను నానా కష్టాలు పడి ఆటో తోలుకుంటా ఇంగ్లీష్‌ చదువు చదువుకోమని కాన్వెంటులో చేర్పిస్తే నువ్వు నేర్చుకోకుండా దెబ్బలు తినివచ్చి మళ్ళా నాకే వాళ్ళగురించి చాడిలు చెప్తావా? అని కొడుకు అనిల్‌ను నాలుగు గుద్దులు గుద్దాడు. వాడికి జర్వం తగులుకొని కలవరించుకుంటా ముడుక్కొని నులక మంచమెక్కినాడు. వాళ్ళమ్మ లక్షుమ్మ వాడ్ని చంక కెత్తుకొని పోయి ఆదివారం పూట జెండామానుదగ్గర పక్కీరయ్యతో యాపాకు మండలతో దిష్టి తీయించుకొని, తాయత్తు కట్టించు కొని గూడా వచ్చింది.

ఇప్పుడే సైకిల్‌ షాపు పెట్టుకొని టైర్లకు పంక్చర్‌ వేస్తాండే సలీం గూడా తన కొడుకు అక్బర్‌ను కాన్వెంటు బడికి పంపిస్తా వుండాడు. వాడు వారానికి రెండుసార్లు మాత్రమే స్కూల్‌కు పోతాడు. వాళ్ళమ్మ అక్బర్‌ను తీసుకొని కాన్వెంట్‌లో కూర్చో బెట్టి వస్తుంది. వాడు వెంటనే పైకి లేచి ఏడ్సుకుంటా వెంట పడ్తా బయటికి పరిగెత్తుకుంటా వచ్చేస్తా వుండాడు. వాడెందుకు స్కూలంటే యింతగా బెదిరిపోతా వుండాడో వాళ్ళమ్మకు ఇప్ప టికీ అర్థం కావడం లేదు. ఇంగ్లీషు భాషలో అమ్మను 'మమ్మీ అని నాన్నను 'డాడీ అని పిలుస్తావుంటే ఇంటిల్లిపాదీ ఎంతగా పొంగిపోయినారో...టౌనుకుపోయి ఫస్ట్‌క్లాస్‌కే కట్టలకట్టల నోటుపుస్తకాలు, రంగురంగుల ఖరీదైన టెక్ట్స్‌బుక్‌ కొనుకొచ్చి పిల్లోళ్ళకు ఇస్తాండరు.

స్కూల్‌బస్‌లో పిల్లోడిని కాన్వెంటుకు పంపడమంటే పల్లెలో ఇప్పుడొక హోదా అయిపోయింది. పిల్లోడు ఏం నేర్చుకుం టాడు? ఎట్లా చదువుకుంటాడు? వాడికి అర్ధమైతాందా? లేదా? రోజూ ఎందుకు క్లాస్‌లో దెబ్బలు తినాల్సి వస్తోంది? వాడి మానసిక పరిస్థితి ఎలా ఉంది? అనే ప్రశ్నలకు ఎవరూ జవాబిచ్చే తల్లిదండ్రులేలేరు. ఊరంతా పిల్లోడు ఇంగ్లీష్‌ మాట్లాడితే చాలని కలలుకంటా వుండాది. స్కూల్‌ బస్‌ వూర్లోకి రాగానే నీట్‌గా పిల్లోడిని తీర్చిదిద్ది బస్‌లోకి తోసెయ్యడంతో వాడు సాయంత్రానికి 'ఇంగ్లీష్‌దొరలా తయారై వస్తాడనే భ్రమల్లోనే వున్నారు. మున్సిపాలిటీ వాళ్ళ కుక్కల బండికి, స్కూల్‌ బస్‌కు తేడా ఏముంది?

ఉదయం ఎప్పుడో క్లాస్‌లో రెండు తెలుగు మాటలు మాట్లాడాడని శరభయ్యకొడుకు సాంబుజిని పిలిచి మెడల్‌ 'ఐ నెవర్‌ స్పీక్‌ తెలుగు అనే బోర్డును సాయంత్రం వరకు వేసి టీచర్‌ పనిష్మంట్‌ ఇచ్చాడు ఇంగ్లీష్‌ చదువుకోసం.వాడొక్కడే ఏముంది? అంకన్న కొడుకు పాపోడు, బాబయ్య కొడుకు అనిల్‌, సలీం కొడుకు అక్బర్‌, అన్నయ్య కూతురు అమృత...ఇట్లాగే ఇంకా ఎందరో ఈ బోర్డులు ఏదో ఒకసారి మెడకు తగిలించుకొని మోసిన వారేకదా! 'దేశ భాషలెందు తెలుగు లెస్స అని మనం ఎంతపైకి అనుకున్నా లోలోపల ముసుగులోంచి 'ఇంగ్లీష్‌ రాక్షసి మనల్ని వికృతంగా కవ్విస్తూనే ఉంటోంది.కబళిస్తూనే ఉంటోంది. మనల్ని మన సంస్కృతిని మన మాతృభాషను తల్లి భాషలోని మమతను, మమకారాన్ని భక్షిస్తూనేఉంది. పిల్లోడు తెలుగులో మాట్లాడితే స్కూల్లోనూ, ఇంట్లోనూ మండిపోతా వుండారు. వేలకువేలు పోసి కాన్వెం టుకు పంపిస్తావుండేది ఎందుకు? నువ్వు కూడా మాలాగానే కోడిని, మేకను అట్లాగే పిలుస్తే తేడా ఏముంది? హెన్‌, గోట్‌ అనే మాటలు వాడవెందుకని ఒక తండ్రి కొడుకును స్కూల్‌ న్నుంచి రాగానే ఉతికి ఆరేశాడు కోపంతో ఊగిపోతూ.

అట్నే బస్సు ఎక్కుతూ 'నీళ్ళసీసా మర్చిపోయినానని అనిన వెంటనే అమృతను వాళ్ళమ్మ చెంపకందిపోయేలా చాచి కొట్టింది. 'వాటర్‌ బాటిల్‌ అని అను అని నీకెన్నిసార్లు చెప్పా లని గదమాయించింది. ఆ పిల్లఏడుస్తూనే స్కూలుకు వెళ్ళింది. తల్లిదండ్రులు ఇట్లుండారు కాబట్టే కాన్వెంటు స్కూల్‌ టీచర్లు, మేనేజ్‌మెంట్లు కూడా అదే దార్లోనే నడుస్తున్నాయి. స్కూల్‌ గేటుదాటి లోపలికి అడుగుపెడ్తానే తెలుగు మాటలు ఆగి పోవాలి. ఓన్లీ ఇంగ్లీష్‌నే స్పీక్‌ చేయాలి అని ఆర్డర్‌ను జారీ చేశాయి. శిక్షల్ని కఠినతరం చేశారు. నిన్నటికి నిన్న కడపజిల్లా మైదుకూరులోని సెయింట్‌ జోసఫ్‌ స్కూల్లో జరిగినట్లుగానే ఇప్పుడు రాష్ట్రంలో అన్నీ చోట్లా 'ఇంగ్లీష్‌ పిచ్చి వెర్రితలలు వేస్తూనే వుంది. 'ఐ నెవర్‌ స్పీక్‌ తెలుగు అని రాసివుంచిన బోర్డులను పిల్లల మెడలో మూర్చబిళ్ళల మాదిరి వేలాడదీసి అవమానిస్తున్నారు. నిజంగా వీళ్ళు అవమానిస్తున్నదెవర్ని? పిల్లల్నా...వారిని పుట్టించిన తల్లిదండ్రుల్రా...మన నరనరాల్లో యింకి మనతోనే ప్రవహిస్తున్న మాతృభాషనా? తల్లి భాషకు పాడెకడ్తున్నదెవరు? ఈ ద్రోహానికి శిక్షఏమిటి? పిల్లల అమాయక ముఖాల్లోని దీనత్వాన్ని మాతృభాష ద్వారా వెలుగు నింపలేమా? మనం నిజంగా యింత నిస్సహాయ స్థితిలోనే వున్నామా? కాన్వెంటు స్కూల్‌ బస్‌లోని కిటికిల్లోంచి బెదురుగా పిల్లలు చూస్తూనే వున్నారు!