నడుస్తున్న చరిత్ర తాజా సంచికను ఆవిష్కరిస్తున్న కొండపల్లి వీరభద్రయ్య. |
మైదుకూరులో ఒక ప్రైవేటు ఆంగ్లమాధ్యమ పాఠశాల లో తెలుగు భాషను అవమానపరచిన సంఘటన అనంతరం ఈ సంఘటన పై సాగిన ఉద్యమం ముఖచిత్ర కథనం గా వెలువడిన "నడుస్తున్న చరిత్ర" తెలుగు జాతి పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నవంబరు 22 వ తేదీన మైదుకూరులో తెలుగు భాషాభిమానుల మధ్య ఘనంగా జరిగింది. రాయలసీమ జానపదుల కళాకారుల సంఘం వ్యవస్థాపకులు, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కార గ్రహీత కొండపల్లి వీరభద్రయ్య పత్రికను ఆవిష్కరించారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య సభ్యుడు, తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ది సంస్థ అధ్యక్షుడు, కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి అధ్యక్షతన మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సభలో వీరభద్రయ్య మాట్లాడుతూ తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించుకొనేందుకు తెలుగు ప్రజానీకం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలోని ప్రజలలో ప్రజల్లో వారి భాష పట్ల ఉన్న చైతన్యం మన తెలుగు వారిలో కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విశిష్టమైన తెలుగు భాష పరిరక్షణకు తెలుగు భాషోద్యమ సమాఖ్య, మైదుకూరులోని తెలుగు సంస్థ సాగిస్తున్న ఉద్యమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కొన్ని టెలివిజన్ ఛాన్‌ల్స్ తెలుగును సంకరీకరణ చేయడం వల్ల అచ్చమైన తెలుగు భాష కలుషితమై పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు నేలపై సంచారజాతులకు ఉన్న ఒక ప్రత్యేకమైన భాషా మాండలికాలూ , పదసంపద
సభలో ప్రసంగిస్తున్న కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి. |
కూడా అంతరించిపోతున్నాయని ఈ సమావేశంలో పాల్గొనడం వల్ల సంచార భాషా సంపదను కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత స్ఫురించిందని పేర్కొన్నారు.
కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అందరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న భాషలసంఖ్య నానాటికీ పెరిగి పోతోందని, ప్రపంచంలో మొత్తం 6,500 భాషలను ప్రజలు మాట్లాడుతున్నారని, వాటిలో 2,500 భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో 196 భాషలు అంతరించి పోయేదశకు చేరుకున్నాయని వాటిలో 120 భాషలు ఈశాన్య రాష్ట్రాలకు చెందినవని ఆయన పేర్కొన్నారు. ఆంగ్ల సామ్రాజ్య వాదం సాగిస్తున్న సాంస్కృతిక విధ్వంసం వల్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో భాషలకు, జాతులకు, సంస్కృతులకు ముప్పును, కలుగుతున్న ప్రమాదాన్ని సోదాహరణంగా వివరించారు.
పాల్గొన్న తెలుగు భాషాభిమానులు |
విజయవాడలో ఈనెల 15న డా. సామల రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ర్ట కార్యవర్గ సమావేశపు వివరాలను ఈ సందర్భంగా ఓబుల్ రెడ్డి వెళ్లడించారు. తెలుగు భాషను ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల మంది మాట్లాడుతున్నారని ఆంగ్ల పెత్తనం తెలుగు మీద కూడా సోకుతోందని, ఎంతో వైవిధ్యం ఉన్న తెలుగు సంపద, నుడికారాలు తరిగి పోతున్నాయన్నారు. మైదుకూరు సంఘటనపై తక్షణమే చట్టపరంగా, శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రముఖ కవి లెక్కల వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలుగు మాండలిక పద సంపదను కాపాడుకొనేందుకు భాషోద్యమకారులు వివిధ కార్యక్రమాలను రూపొందించాల్సి ఉందన్నారు. తెలుగు వారు తెలుగు వారితో తెలుగులో మాట్లాడుకొని మాతృభాషపై గౌరవాన్ని ప్రదర్శించాలని కోరారు.
పాల్గొన్న మరికొందరు తెలుగు భాషాభిమానులు |
అభ్యుదయ రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డివిఎస్ నాయుడు మాట్లాడుతూ తెలుగు భాష విశిష్టతను వివరించారు. మైదుకూరు ఉద్యమం తెలుగు భాషపై విస్తృత చర్చను, స్ఫూర్తినీ కలిగించిందని పేర్కొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి భాస్కర్ మాట్లాడుతూ మైదుకూరు సంఘటన దురదృష్టకరమైనా, భాషా ఉద్యమాన్ని రగిలింపజేసిందని, కర్నాటక, తమిళనాడులలో మాదిరిగా విద్యాలయాల్లో తెలుగు ఒక అంశంగా బోధనను తప్పనిసరి చేయాలని కోరారు. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కార గ్రహీత కొండపల్లి వీరభద్రయ్యను తెలుగు సంస్థ ఈ సందర్భంగా ఘనంగా సత్కరించింది. ప్రముఖ కవి లెక్కల వెంకటరెడ్డి వీరభద్రయ్య ను శాలువాతో సత్కరించగా, సంస్థ ఉపాధ్యక్షుడు అరబోలు వీరాస్వామి పూలమాలతో సన్మానించారు. సంస్థ కార్యదర్శి ముండ్లపాటి వెంకట సుబ్బయ్య జ్ఞాపికను అందచేశారు. వెలుగు వెంకట సుబ్బా రావు రచించిన తెలుగు పతాక గీతం, యలమర్తి రమణయ్య రచించిన తెలుగు భాషోద్యమ గీతాలను సంస్థ సంయుక్త కార్యదర్శి ధర్మిశెట్టి రమణ, వీరాస్వామి. వెంకటసుబ్బయ్య, డౌలకిస్ట్ మౌలాలీ బాష, వాసు లు పాడి సభికులను రంజింపజేశారు. ఈ కార్యక్రమంలో రాటా అధ్యక్షుడు కొండపల్లి శేషగిరి, పత్రికల, ప్రసార మాధ్యమాల ప్రతినిధులు, సంస్థ సలహా మండలి సభ్యుడు సాదక్, సంస్థ కార్యవర్గ సభ్యులు పెరుగు క్రిష్ణయ్య యాదవ్, బాబయ్య, సిపిఐ నేత రమణ, హరితమిత్ర వ్యవసాయ కేంద్రం అధ్యక్షుడు పోలు కొండారెడ్డి, యక్షగాన కథకుడు యడవల్లి రమణయ్య, రాష్ట్రీయ స్వయం సేవక
కొండపల్లి వీరభద్రయ్య ను సత్కరిస్తున్న దృశ్యం |
సంఘ్ ప్రతినిధి టి వెంకటేశ్వర్లు, బిజెపి రాష్ర్ట కార్యవర్గ సభ్యులు బిపి ప్రతాప్‌రెడ్డి, మోహన్, విజయభాస్కర్‌రెడ్డి, కెజిపి వెంకటయ్య, సందిళ్ల బాల సుబ్బయ్య యాదవ్, అంకన్న, , అధిక సంఖ్యలో తెలుగు అభిమానులు పాల్గొన్నారు. తెలుగు భాషొద్యమకారులూ, తెలుగు భాషాభిమానులూ ఈ సందర్భంగా ధరించిన తెలుగు పతాకం, తెలుగులో మాట్లాడటం మా జన్మ హక్కు అనే బ్యాడ్జీలులు పలువురిని ఆకట్టుకున్నాయి.
No comments:
Post a Comment