Saturday, February 5, 2011

బరంపురంలో తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభం

తెలుగువాణి సంచికను ఆవిష్కరిస్తున్న నవీన్ పట్నాయక్
బరంపురం: అఖిల భారత 6వ తెలుగు మహాసభలు ఒడిశా లోని బరంపురం సిటీ హైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. నవీన్ పట్నాయక్ తన ప్రసంగాన్ని తెలుగు మాటలతో ప్రారంభించడం సభికులకు ఆనందోత్సాహాలను కలిగించింది. జగన్నాథుడు కొలువైన ఒడిశాకు వచ్చిన తెలుగు ప్రజలకు నమస్కారం.. స్వాగతం అంటూ ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి సభలను ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం(హైదరాబాద్) ఆధ్వర్యంలో స్థానిక ఆంధ్ర భాషాభివర్ధినీ సమాజం సహకారంతో నిర్వహిస్తున్న ఈ సభలు మూడు రోజులు జరగనున్నాయి. సీఎం  అన్ని పండుగలను ఉభయ భాషల వారు కలసికట్టుగా జరుపుకుంటారని చెబుతూ ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత బలపడాలన్న ఆకాంక్ష వ్యక్తం చేయడం సముచితమని సభకు హాజరైన ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
తెలుగు భాషోద్యమానికి ఈ మహాసభలను వేదికగా ఉపయోగించుకోవాలని తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ అనుమాండ్ల భూమయ్య పిలుపు ఇచ్చారు. ఈ సభలు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. మహాసభల నిర్వాహక అధ్యక్షుడు పి.సత్యనారాయణ బాబు మాట్లాడుతూ ఒడి శాలోని తెలుగు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను, ఇతర సమస్యలను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దృష్టికి తీసుకువెళ్లారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే కె.నారాయణరావు మాట్లాడుతూ ఈ మహాసభల ద్వారా ఒడిశాలోని తెలుగు ప్రజల సమస్యలు తీరాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఒడిశాలో తెలుగు విద్యాభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని తెలుగు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను సరిగా సరఫరా చేయడం లేదని, తెలుగు ఉపాధ్యాయుల నియామకం విషయంలో సహకరించటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రతాప్ జెన్నా మాట్లాడుతూ తెలుగు ఉపాధ్యాయుల కోసం చికిటి, పర్లాకిమిడి పట్టణాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చికిటి, కబి సూర్యనగర్ ఎమ్మెల్యేలు ఉషారాణి, సుజ్ఞానిదేవి మాట్లాడుతూ ఒడిశాలోని తెలుగువారు ఎదుర్కొంటున్న విద్యా సమస్యలను వివరించారు.
కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సామల రమేష్ బాబు, ఒడిశా రాష్ట్ర విభాగం కార్యదర్శి డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి , బరంపురం ఎంపీ సిద్ధాంత్ మహాపాత్రో, ఎమ్మెల్యే రమేష్‌చంద్ర పట్నాయక్, మేయర్ శివశంకర్ దాస్, రాజ్యసభ సభ్యురాలు రేణుబాల ప్రదాన్, అస్కా ఎంపీ నిత్యానంద్ ప్రధాన్, గోపాల్‌పూర్ ఎమ్మెల్యే ప్రదీప్ పాణిగ్రహి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ రాచకొండ వరహాలు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఎస్.చెల్లప్ప, తెలుగు విశ్వవిద్యాలయం డెరైక్టర్ మునిరత్నం నాయుడు, తెలుగు సినీ ప్రముఖు గొల్లపూడి మారుతీ రావు, సాయికుమార్, శివారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ పాల్గొన్నారు. 
తెలుగుపట్టని తెలుగు పాలకులు
తెలుగు భాష పట్ల అత్యంత ప్రీతికలిగిన ఆంధ్రప్రదేశ్ పాలకులు అఖిల భారత తెలుగు మహాసభలకే డుమ్మా కొట్టారు. ఒడిషాలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఆరో అఖిల భారత తెలుగు మహాసభలకు ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సిన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరుకాకపోవడం పట్ల ఒడిషా పాలకులు, అధికారులు అసంతృప్తికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్ర భాషాభివర్థనీ సమాజం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మహాసభల ద్వారా ఆంధ్ర-ఒడిషా రాష్ట్రాల ప్రజల మధ్య సంబంధాలు మరింత పెంపొడంతోపాటు, భౌగోళిక, జల వివాదాలకు సయోధ్యకు మార్గం అవుతుందన్న ఆశలు ఒడిషాలో నివశిస్తున్న లక్షలాది మంది ఆంధ్రులకు రాష్ట్ర పాలకులు లేకుండా చేసారంటూ ఆందోళన వెల్లగక్కారు. ఎన్నో సమస్యలతో బతుకుబండి నడిపిస్తున్న ఒడిషాలో ఉన్న ఆంధ్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వినతులు ఇచ్చేందుకు సిద్ధమైతే అసలు సిఎం లేదా ఒక్క మంత్రయినా రాకపోవడంతో వారంతా డీలాపడ్డారు. దక్షిణ, పశ్చిమ ఒడిషా ప్రాంతాల్లో నివశిస్తున్న 40 లక్షల మంది తెలుగువారి సమస్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పుకునే ఛాన్స్ దక్కిందనుకున్న వారంతా అసహనానికి గురయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ఈ మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర పెట్రోలియం, సహజవాయువులశాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్, రాష్ట్ర సమాచారశాఖ మంత్రి డి.కె.అరుణ హాజరుకావల్సి ఉంది. ఒకనొక స్థాయిలో ఈ కార్యక్రమానికి హాజరైన ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయిక్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పాలకులు హాజరుకాకపోవడం ఈ ప్రారంభోత్సవ మహాసభలు అసంతృప్తి కలిగించిందంటూ పేర్కొనడం గమనార్హం. ప్రత్యేక అతిథిగా మాత్రం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.చెల్లప్ప ప్రారంభోత్సవ సభలకు హాజరయ్యారు.

No comments:

Post a Comment