రోజు రోజుకు వెనుకబడిపోతున్న తెలుగును కాపాడుకుందామని వక్తలు పిలుపునిచ్చారు. అందుకు ప్రాథమిక స్థాయి నుంచే కచ్చితంగా తెలుగును అమలులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగు భాషోద్యమ సమితి, రాష్ట్ర సాంస్కృతిక మండలిల సంయుక్తాధ్వర్యంలో సోమవారం రాత్రి రవీంద్రభారతి ప్రాంగణంలోని కళాభవన్‌లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మండలి ఛైర్మన్ ఆర్వీ రమణమూర్తి జ్యోతి వెలిగించి వేదికకు శుభారంభాన్ని పలికారు. సీనియర్ జర్నలిస్టు, భాషోద్యమ నేత జి.ఎస్ వరదాచారి అధ్యక్షోపన్యాసం చేస్తూ... అంతరించి పోతున్న భాషల్లో తెలుగు కూడా ఉందని యూనెస్కో చేసిన హెచ్చరికతోనైన ప్రభుత్వం మేల్కొవాలన్నారు. ప్రపంచంలో అత్యధికుల మాతృభాషగా యునెస్కో గుర్తించిన పది భాషల్లో తెలుగు కూడా ఒకటన్నారు. అనధికార అంచనాల ప్రకారం తెలుగు మాతృభాషగా కలవారి సంఖ్య 18 కోట్ల పైనే ఉంటుందన్నారు. ప్రపంచీకరణ ప్రభావం, అమెరికా ఉద్యోగాలపై వ్యామోహం తల్లిదండ్రులను కొంత చాపల్యానికి గురి చేస్తోందన్నారు. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత ఓటు బ్యాంకు విధానాలు మాతృభాష పట్ల నిరాదరణ పెంచడానికి కూడా కారణమవుతున్నాయని అన్నారు. ఉప్పులూరి మల్లికార్జున శర్మ, ఆచార్య ఎన్.ఎస్.రాజు, ఆచార్య ఎస్వీ రామారావు, ఆచార్య కాశీనాథుని నాగేశ్వరరావులతో పాటు తెలుగుభాషా చైతన్య సమితి ప్రతినిధులు పాల్గొని మాట్లాడుతూ.. తెలుగు మాధ్యమంలో చదువుకొనే వారి సంఖ్య పెరిగే మార్గం అన్వేషించాలన్నారు. తెలుగు పొట్టకూడు పెడుతుందన్న భరోసా భావి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కలిగించాలన్నారు.
No comments:
Post a Comment