Wednesday, September 13, 2017

హైదరాబాద్‌లో డిసెంబరు15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలు

హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను
ముందుగా అనుకున్నట్లుగా అక్టోబరులో కాకుండా డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను ఆహ్వానిస్తామని.. రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో ఉత్సవాలను జరుపుతామని తెలిపారు. మహాసభలను పురస్కరించుకొని ఆయన తెలుగును పరిరక్షించే కీలక నిర్ణయాలను ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభలపై మంగళవారమిక్కడ ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు రమణాచారి, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందినీ సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘అక్టోబరులోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. కానీ, 5 నుంచి 9 వరకు దాదాపు 90 దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రపంచ పర్యాటక సదస్సు హైదరాబాద్‌లో జరుగుతుంది. నవంబరు 28 నుంచి దాదాపు 170 దేశాలు పాల్గొనే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్‌కు ఆతిథ్యమిస్తోంది. ఈ రెండు కార్యక్రమాల నిర్వహణలో అధికారయంత్రాంగం తలమునకలై ఉన్న తరుణంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపితే అనుకున్నంత ఘనంగా నిర్వహించలేమని భావించాం. అందుకే డిసెంబరులో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని నిర్ణయించాం’’ అని చెప్పారు. తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నందున తెలుగు భాషను పరిరక్షించే బాధ్యత తమపై ఉందన్నారు.
సాహిత్య అకాడమీ పుస్తకాలే ప్రామాణికం
తెలుగును విధిగా బోధించాలన్న నిర్ణయం నేపథ్యంలో తెలంగాణలో ఇకపై ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకొని బోధించడం కుదరదు. సాహిత్య అకాడమీ రూపొందించిన సిలబస్‌తో ఉన్న పుస్తకాలనే బోధించాలి. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. దీనిపైన, తెలంగాణలోని బోర్డులను తెలుగులోనే రాయాలనే నిర్ణయంపైనా త్వరలోనే మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేస్తాం.
వేదికలు
ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి. రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కళాశాల మైదానం, భారతీయ విద్యాభవన్‌, పింగళి వెంకట్రామిరెడ్డి హాల్‌, శిల్ప కళావేదిక, ఇతర వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయి.
తెలంగాణ తెలుగుకు ప్రాశస్త్యం
తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి జరిగిన కృషిపై చర్చా గోష్ఠులుంటాయి. తెలంగాణలో వర్ధిల్లిన తెలుగును ప్రపంచ నలుమూలలకూ తెలిపే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలుంటాయి. బతుకమ్మ, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి, కలుపుపాట, నాటు పాట, బతుకమ్మ పాటలు, వినోద ప్రక్రియ కార్యక్రమాలుంటాయి. తానీషా-రామదాసుల మధ్య అనుబంధం, రామదాసు కీర్తనలు, తందనాన రామాయణం, శారదాకారులు, హరికథ ప్రక్రియ తదితర అంశాలను ప్రదర్శించాలి. పద్యగానం, సినీపాటల విభావరి నిర్వహించాలి. గ్రామీణ ప్రాంతాల్లో పాడుకునే కాట్ల పాటలు, కోత పాటలు, దుక్కి పాటలు, జానపద గేయాలను ఆలపించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు పాడే పాటలు ఒకతరం నుంచి మరో తరానికి ఎలా చేరాయో కళ్లకు కట్టినట్లు చూపించాలి.
ఆహ్వానాలు
దేశ విదేశాల్లోని తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు, కవులు, కళాకారులు, రచయితలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానిచాలి. మహాసభల ఔచిత్యాన్ని చాటడానికి సన్నాహాక సమావేశాలు నిర్వహించాలి. అమెరికా, యూరప్‌, గల్ఫ్‌ దేశాలతో పాటు మారిషస్‌, సింగపూర్‌, మలేసియా లాంటి దేశాల్లో అక్కడున్న తెలుగు వారి కోసం సమావేశాలు జరపాలి. ఏపీతో పాటు దేశం నలుమూలల్లో, తెలంగాణలోని అన్ని ముఖ్యపట్టణాల్లో ఈ సమావేశాలు జరగాలి. కేవలం తెలుగువారినే గాకుండా భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ, జ్ఞాన్‌పీఠ్‌ లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందిన ప్రముఖులను ఆహ్వానించాలి.
* మహాసభల నేపథ్యంలో తెలుగు భాష, ప్రక్రియలకు సంబంధించి పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి. తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు వైభవానికి కృషి చేసిన కవులు, పండితులు, సాహితీవేత్తలు, కళాకారులను గుర్తించి సన్మానం చేయాలి.
* అతిథులందరికీ ప్రభుత్వం తరఫునే బస, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించాలి. మహాసభలకు ముందే తెలుగు భాషాభివృద్ధికి దోహదపడే పుస్తకాల ముద్రణ జరగాలి. అతిథులకు నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపించాలి. తెలంగాణ పరిచయం కోసం ప్రత్యేక డాక్యుమెంటరీని తయారు చేయాలి.
సినారె స్మారక మందిరం
నగరంలో సి.నారాయణరెడ్డి స్మారకమందిరాన్ని నిర్మించాలి. రెండు మూడు రోజుల్లోనే స్థలం ఎంపిక చేసి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి. అధికార భాషా సంఘం, సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం, గ్రంథాయల పరిషత్‌ తదితర సంస్థలు కీలక భూమిక నిర్వహించాలి. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయ స్థాయిల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించాలి. మహాసభల సందర్భంగా హైదరాబాద్‌ నగరాన్ని అలంకరించాలి. ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ద్వారాలు ఏర్పాటు చేయాలి. జిల్లాల్లో కూడా అలంకరణలుండాలని కేసీఆర్‌ ఆదేశించారు.
                                                                            -ఈనాడు - హైదరాబాద్‌



No comments:

Post a Comment