Thursday, February 24, 2011

ధవళేశ్వరం బుడుగును నేను...! (ముళ్ళపూడి గారికి నివాళి )


ముళ్ళపూడి వెంకటరమణ గారు
( విజయభాస్కరరెడ్డి తవ్వా )
 ముళ్లపూడి వెంకట రమణ 'బుడుగు' సృష్టికర్తగా తెలుగు పాఠకులందరికీ సుపరిచితులే. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన పాత్రికేయునిగా, రచయితగా, నిర్మాతగా బహుముఖ పాత్రలను పోషించారు. 'నా రాత అతని గీత మా సినిమా తీతకు పునాదులు వేశాయి' అంటూ బాపుతో కలిసి తన సినీరంగ ప్రవేశం గురించి చెప్పే రమణ ఆరుసార్లు సినీ రచయితగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు.

ఎస్‌ఎస్‌ఎల్‌సి వర కూ చదువుకున్న ఆయన, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందజేసే 'రఘుపతి వెంక య్య అవార్డు'ను తన మిత్రుడు బాపుతో కలిసి అందుకున్నారు. ముళ్లపూడి రాసిన 'సీతాకళ్యాణం' కథకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది కూడా....

'ఉగాది రోజు 'నాబాల్యం' శీర్షికకు మీ బాల్యం కావాలండీ' - అని రెండు రోజులు ముందుగా అడిగితే...

'అంత తొందరేముందండీ - ఇంకొన్నాళ్ళాగి వేసుకోవచ్చుగా' అన్నారు.

'ఉగాది రోజు మీదైతే బావుంటుందనీ...'

'సరే. నేను రాసింది వేసుకుంటారా?' అన్నారు. బాపు-రమణల్లో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ.

'రచయితగా తెలుగు వారి హృదయాలపై చెరగని ముద్ర వేసిన వారు..

మీరు రాసిస్తానంటే అభ్యంతరం ఏముంటుందీ?'

హాస్యం, అమాయకత్వం, భావోద్వేగాల సమ్మిళితమైన ముళ్ళపూడి వెంకటరమణ బాల్యం ఇదిగో ఇలా వచ్చింది...

"మా ఊరు ధవళేశ్వరం. రాజమండ్రి దగ్గర. గోదావరి ఒడ్డున. రామపాదాల రేవులో మొదటి మేడ మా ఇల్లు. పక్కనే కొండమీద జనార్ధనస్వామి కోవెల, కొండ కింద శివాలయమూ ఉన్నా వాటి కన్నా మా ఇల్లే కోలాహలంగా ఉండేది. గుమ్మంలో ఎప్పుడూ ఒక పందిరి. పందిట్లో హరికథలూ, అవి లేనప్పుడు సావిట్లో జై హరనాథ జై కుసుమ కుమారి జై - భజనలూ. నట్టింట్లో దె య్యాలను సీసాల్లో బిగించే ముగ్గుల పూజ లూ, బైరాగులూ - పెరటి వసారాలో చుట్టాలూ - వాళ్ళ చుట్టాలకి పెట్టుకునే (వాళ్లింట్లో వీల్లేక) తద్దినాలూ - పెరట్లో బావి అవతల పడవ వాళ్ళకి మా అమ్మమ్మ పెట్టే భోజనాలూ - బువ్వలు తిని దుంగళ్ళూ - కొట్టేవాళ్ళు. మేడ వరండాలో హిందీ పాఠశాల - రాజమండ్రి నుంచి గుమ్మడిదల దుర్గాబాయమ్మ గారు జటకాలో వచ్చి మా అమ్మకీ, పక్కింటి వాళ్ళకీ మైతోహూం తూతో హై అంటూ చెప్పే హిందీ పాఠాలూ, పూనకాలూ, శాంతులూ, తర్పణాలూ - పూజగది పక్కన భజగోవిందం పాడుకుంటూ మా నాన్నగారు.

ఆఫీసు వేళ వంటవక ఏవిటీ జనం - ఇది ఇల్లా సంత బజారా అని ఆయన ఎప్పుడేనా ఒక్కొక్కసారి చుట్టాల మీద విసుక్కుంటే అంతవరకూ అందరికీ అన్నీ అందిస్తూ సందడిగా తిరిగే మా అమ్మకి కోపమొచ్చి, ఫిట్లొచ్చి నేలకి ఒరిగి పడిపోయేది. ఆవిడ చేతిలో ఉప్పూ తాళం చేతులు పెడితే లేచేది. మళ్ళీ మామూలే... అందుకే మా నాన్నగారు ఆదివారాలు కూడా ఆఫీసుకెళిపోయేవారు. ఒకసారి ఆసుపత్రికెళిపోయారు. అక్కడి నుంచి ఎక్కడికో వెళిపోయారు. ఇంకరారు అని చెప్పారు. మా అమ్మమ్మ పడవెక్కి భద్రాచలం వెళ్ళిపోయింది. అప్పుడు మా ఇల్లు చీకటయిపోయింది. దేవుళ్ళు, చుట్టాలూ, బాబాలు, బైరాగులూ, భజనవాళ్ళు, ఎవరూ కనబళ్ళేదు. అందరూ పారిపోయారు. నాకు భయం వేసింది.

దుర్గాబాయమ్మ గారి స్కూలావిడ రాజమండ్రి నుంచి వచ్చి భయపడవద్దని మా అమ్మకి చెప్పారు. మెడ్రాసు వెళ్ళిపొమ్మని చెప్పారు. మా అమ్మా నేనూ మా తమ్ముడూ మెడ్రాసొచ్చేశాం. మా బావ ఇంట్లో దిగాం. మెడ్రాసులో దుర్గాబాయమ్మ గారు పెద్ద సభ పెట్టారు. ఆంధ్రమహిళ సభ. "నువ్వు ధవళేశ్వరంలో నా దగ్గర హిందీ నేర్చుకున్నావు గదా. ఇక్కడ మన మహిళా సభలో వాళ్ళకి నీకొచ్చిన హిందీ నేర్పించు. నెలకిరవై రూపాయలు ఇస్తారు'' అన్నారు. నెలకిరవై చాలదని తెలుసు. ఇంకో పనేదన్నా చేసి ఇంకో ఇరవై గడించు - అని చెప్పారు.

రెండు వందలు ఖర్చుపెట్టిన మేడలోంచి, రెండు రూపాయల అద్దెకి, ఒక మెట్ల కింద గది లాంటి దాంట్లో దిగాం. చిన్నప్పణ్ణించీ మా అమ్మనీ, చుట్టాలనీ తిట్టిపోసే , ఇన్నాళ్ళూ దూరంగా ఉన్న మా చిన్నమ్మమ్మ ఇప్పుడు సాయం వచ్చింది - ఒక చిన్న రేకుపెట్టె, తలగడా పట్టుకుని. ఆ రేకు పెట్టెకు రెండు తాళాలు వేసేది. అందులో పది లక్షల రూపాయలు దాచుకుందని మా అమ్మకీ, నాకూ తెలుసు. కాని ఆవిడ - నా మొహం దమ్మిడీ లేదు పిచ్చి కుంకల్లారా అనేది.

మెట్ల మీద సామానులు సర్ది మెట్ల దారిమీదే పడుకునే వాళ్ళం. నలుగురం పడుకుంటే ఈ గోడ నించి ఆ గోడకి సరిగ్గా సరిపోయేది. అమ్మమ్మ కాశీ మజిలీ కథలు చెప్పేది. పొద్దున్న లేవగానే వీధరుగు మీద కూచుంటే ఆవిడ మెట్ల మీద - అన్నం, కూరా, చారూ, టిఫినూ వండిపెట్టేది. ఈ అమ్మమ్మ పెట్లో బోల్డు డబ్బుంది. ఇక భయం లేదు అనుకున్నాం. కాని లేదంటుంది గదా. మరి నెలకి ఇంకా పది రూపాయలు కావాలి.

ఓ రోజున కొట్టుమీద బియ్యం, చింతపండు, ఉప్పు తో బాటు ఓ కాణీకి కుట్టుడాకులు కొన్నాం. కాణీకి మూడు ఇచ్చాడు. కాని మేం నలుగురం. మా అమ్మమ్మ, అమ్మా తమ్ముడూ నేనూను. కాణీకి నాలుగిస్తావా అంది మా అమ్మ. నేను కొనేది కాణీకి అయిదు. మీకు నాలుగిస్తే నాకేం మిగిలేనూ, అన్నాడు కొట్టువాడు. అయితే కాణీకి అయిదాకులు నేను కుట్టిస్తా కొంటావా అంది మా అమ్మ. సరిదా అన్నాడు వాడు. ఆకు నువ్వే ఇవ్వాలి అంది మా అమ్మ. అయితే - కాణీకి ఎనిమిదాకులు ఇవ్వాలి. కుట్టుకూలే మీకు - అన్నాడు వాడు. సందెడేసి ఆకులూ చీపురూ పట్టుకుని సంతోషంగా ఇంటి కొచ్చాం. నెలకో అయిదు రూపాయలు వస్తాయి అంది మా అమ్మమ్మ లెక్కలు వేస్తూ... రాత్రి పన్నెండు దాకా ఇద్దరూ ఆకులు కుట్టాము.

కొన్ని రోజులు పోయాక కొట్టువాడు బేరం మార్చాడు. మీకు నిండా లాభంగా ఉంది. కాణీకి పదాకులు ఇవ్వండి అన్నాడు. మా అమ్మ ఇవ్వలేను నాయనా అంది. అయితే ఇంకోళ్ళకిస్తాను. నిండా మంది ఉన్నారు - అన్నాడు వాడు - ఇచ్చుకో అంది మా అమ్మ. నిండా కష్టపడతావు అన్నాడు. పరవాలేదు అని వచ్చేశాం. మా అమ్మ భయపడలేదు. ఇదిగాపోతే ఇంకోటి అంది. నేనూ అదే నేర్చుకున్నాను. తరువాత జీవితంలో పత్రికలో పని చేస్తూ ఉద్యోగం వదిలేశాను. సినిమాలో ఇద్దరు గొప్ప డైరెక్టర్లతో తేడా వస్తే ఒక్కసారి ఆరు సినిమాలు వదిలేశాను. ఇంతలో మా ఇంటి దగ్గరే స్టార్‌ టాకీసు పక్కనే మిలిట్రీ వాళ్ళు సిపాయిల కోసం బట్టలు కుట్టే మిల్లు పెట్టారు. గేట్లో చాలా మంది ఉన్నారు. వెళ్ళి చూశాం. అక్కడ పాంటులకీ, కోట్లకీ, కాజాలు కుట్టి గుండీలు పెట్టాలి. కాజాకి అణా ఇస్తారట.

మా అమ్మ నేనూ అక్కడి పెద్దాయనతో హిందీలో మాట్లాడాం. సందెడు బట్టలూ, గుండీలూ, దారాలూ, సూదులూ ఇచ్చారు. రాత్రి పన్నెండు దాకా కాజాలు కుట్టాం. మా అమ్మ వెళ్ళి దుర్గాబాయి గారికి చెప్పింది. రెండు పనులు తప్ప ఇంక దేనీకీ భయపడక్కర్లేదు, సిగ్గు పడక్కర్లేదు అన్నారావిడ. మా అమ్మని భేష్‌ అని మెచ్చుకున్నారు. దేనికీ ఎవరికీ భయపడకు ఇలా స్వత్రంత్యం గానే బతకడం నేర్చుకో అన్నారు. అన్నట్లు - కొత్తగా హాండ్‌మేడ్‌ పేపర్‌ సెక్షన్‌ పెట్టాం. చేతులతో కాగితం తయారు చేసే కుటీర పరిశ్రమ. వారం రోజుల్లో నేర్చుకోవచ్చు - తిండి ఒక్కటే కాదు - పిల్లల్ని చదివించాలి గదా - ఇంకో విద్య చేతిలో ఉంటే మంచిది - అని కూడా చెప్పారు. నేర్చుకుంది మా అమ్మ. అంతలో ఒక వేసం కాలం వచ్చింది. హిందీ నేర్చుకునే ఇల్లాళ్ళంతా ఊటీలకీ, సొంత ఊళ్ళకీ, పెళ్ళిళ్ళకీ వెళ్ళి పోయారు. అప్పుడు ఈ విద్య అంది వచ్చింది.

ఏలూరులో వెంకట్రామా అండ్‌ కో యజమాని ఈదర వెంకట్రావు పంతులు గారు - కొన్ని పుస్తకాలు ఖద్దరు పుస్తకాల్లో (హాండ్‌ మేడ్‌ పేపర్‌పై) వేస్తారని తెలిసింది. దుర్గాబాయి గారి సహాయంతో ఏలూరికి పది మైళ్ళ దూరంలో - చాటపర్రు గ్రామంలో మా అమ్మ హాండ్‌ మేడ్‌ పేపర్‌ ఇండ్రస్టీ పెట్టి యజమానురాలైపోయింది. ఏలూరులో ఇంటద్దే కూరానారా ప్రియం అని చాటపర్రులో పెట్టింది. పల్లెటూళ్లో అద్దెకి ఇళ్ళుండవంటారు గాని మాకు నాలుగ్గదుల ఇల్లు - పాక దొరికింది. నెలకి రూపాయిన్నర అద్దె. అంటే ఆ ఇంటి వాళ్ళు వాళ్ళబ్బాయికి పట్నంలో ఉజ్జోగం అయితే అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ఇంటికి మేము కాపలా ఉన్నట్టూ ఉంటుంది. అద్దె కూడా వచ్చినట్టూ ఉంటుంది వాళ్ళకి. అద్దె ఒకటే కాదు. దోసకాయలూ చవకే. అవొక్కటే చవగ్గానూ, ఊరికేనూ దొరికేవి. అందుకని మా అమ్మమ్మ దోసకాయ కూరా - దోసకాయ పచ్చడీ - దోస వరుగులూ - దోసావకాయ - కాల్చిన దోసకాయ పచ్చడీ - దోసగింజెల వడియాలూ ఇన్ని రకాలు చేసి పెట్టేది.

రోజూ దోసకాయేనా అని గునిస్తే - చక్రవర్తీ రోజూ అన్నమే తింటున్నాం గదా అనేది మా అమ్మమ్మ. దానిక్కూడా రకం మార్చాలంటే గోధుమన్నం, జొన్నన్నం చేస్తాను అంది. వద్దులే దోసకాయే బాగుంది అన్నాను.

*** *** ***
చాటపర్రులో వ్యాపారం గిట్టుబాటు కాలేదు. ఒక పెద్ద రేకు టబ్బులో నానేసిన గుజ్జును కర్రతో ఝూడించి కొట్టడం - అది పలచని గంజిలా వచ్చేది. దానిని, జల్లెడతో పేపరు తెట్టులా తీయడం - పూతరేకుల్లా తీసి ఆరవేయడం ఆరాక గాజు పేపరు వెయిట్లతో రుద్ది రుద్ది గ్లేజు చెయ్యడం - దాన్ని మిషనులో వేసి అంచులు కట్‌ చేయడం బలే సరదాగా ఉండేది. వింత చూడ్డానికి వచ్చే వాళ్ళు కూడా ఓ చెయ్యి వేసేవారు. వారానికి మూడు రీములు తీస్తే ఆ కట్టలు కూడా మెడ్రాసులో విస్తళ్ళ కట్టల్లాగానే నేనూ మా అమ్మా దొడ్డమ్మా ఏలూరు నడిచి వెళ్ళి వెంకట్రామా ప్రెస్సులో ఇచ్చేవాళ్ళం. మూడు మూళ్ళు తొమ్మిది విచ్చు రూపాయలు ఇచ్చేవారు. వచ్చే వారం పద్దెనిమిది - ఆ తరువాత వంద, వెయ్యి వచ్చేస్తాయని లెక్కలు చెప్పుకుంటూ ఝూమ్మని తిరిగి వచ్చేవాళ్ళం.

దార్లో తేళ్ళూ, మండ్రగబ్బలూ కుడుతూ ఉండేవి. నాకు తేలు మంత్రం వచ్చును. ఒకసారి సూర్యగ్రహణం అప్పుడు మెడ్రాసు సముద్రం బీచిలో మా అమ్మమ్మ నేర్పింది. మంత్రం ఎన్ని సార్లు వేసినా ఆ నెప్పి తగ్గేది కాదు. నేను భూతాల వాడిలా ఒక మొక్క పీకి దాంతో వాళ్ళని కొడుతూ - దిగిందా నెప్పి దిగిందా అంటూ మంత్రం మళ్ళీ మళ్ళీ చదివేవాడిని - తగ్గలేదంటే కోపం ఏడుపూ వచ్చేవి. అప్పుడు ఒరే నీది తేలు మంత్రం కదా - కుట్టింది మండ్రగబ్బేమోలే - పద ఇంటికి వెళ్తే అమ్మమ్మ మందేస్తుంది - అంటూ నాలుగడుగుల దూరం నన్నెత్తుకుని నడిచే వారు - (తేలు నన్ను కుట్టకుండా).

కొన్నాళ్ళు జరిగాక పద్దెనిమిది రూపాయలు కూడా రావడం మానేశాయి. ఖద్దరు పుస్తకాలు బాగా అమ్మటం లేదుట. ఓ పక్క నేను - మెడ్రాస్‌ వాడినిక్కడుండనని గోల. మా తమ్ముడు, మా బావ గారింట్లో మెడ్రాసులో ఉన్నాడు. స్కూళ్ళు తెరిచే నెల. చెడి చెన్నపట్నం చేరమన్నారు. పదండి అక్కడికే పోదాం - అంది మా అమ్మమ్మ. మళ్ళీ మెడ్రాసులో మహిళా సభకొచ్చేసాం. మహిళా సభలో పని చేసే వాళ్ళందరికీ సాయంత్రం అరటి దొప్పలలో చక్రపొంగలి, ఉప్మా ఇలాంటివి టిఫిను పెట్టేవాళ్ళు. అది మా అమ్మ నా చేతికిచ్చి కూచోబెట్టి తింటూ ఉండు. ఇప్పుడే వస్తాను అని పాఠాలకి వెళ్ళిపోయింది.

ఒకసారి ఒక బోయి వచ్చి (అక్కడ పనివాడిని బోయీ బోయీ అని పిల్చేవారు) నా చేతిలో పొట్లాం లాక్కున్నాడు. నువ్వు నంబరువా నీకెవరిచ్చారని - అంతలో మా అమ్మ వచ్చి అది నాదే బాబూ - వాడు మా అబ్బాయి అంది. కొంచెం దగ్గర్లో కూర్చున్న కృష్ణవేణమ్మ గారు (దుర్గాబాయి తల్లి) ఇది చూసి వాడిని కేకలు పెట్టింది. ఇంకోకటి కూడా పట్రా - రేపణ్ణించి ఆ అబ్బాయిక్కూడా ఇవ్వాలి అంది. మహిళా సభ వాళ్ళు వీపీ హాల్లో దశావతారాలు డ్రామా వేసినప్పుడు నా చేత మత్స్యావతారం వేషం కట్టించారు. ట్రాములో తీసుకెళ్ళి టిఫిను పెట్టి మా అమ్మకి రూపాయిచ్చారు.

*** *** ***
మా ఇంటి దగ్గరే స్టార్‌ టాకీసు ఉండేది. ఇప్పుడూ ఉంది. అమ్మా సినిమాకెళ్దాం అంటే కాజాలు కుట్టడం ఆపి తీసుకెళ్ళేది. గేటు దగ్గర నుంచుంటే సినిమాలో పాటలూ, మాటలూ, ఏడుపులూ అన్నీ వినిపించేవి. రతన్‌, దహేజ్‌ లాంటి సినిమాలన్నీ ఇలాగే వినే వాళ్ళం. ఎప్పుడేనా నేను కొంచెం గేటు దాటి తొంగి చూస్తే కొంచెం సినిమా బొమ్మ కనబడేది. గేటు వాడికి మేము అలవాటయిపోయి - ఓ సారి ఇంటర్వెల్‌ తర్వాత లోనికి వదలి తలుపు ఇవతల నుంచి చూడనిచ్చాడు. నాకప్పటికే రాజమండ్రిలో చూసిన అబు తేర సివా కోను మొరా కిష్ణ కనయ్యా - సునో సునో బనుకే రాణీ పాటలు వచ్చును. గేటువాడు సెబాస్‌ అనేవాడు.

యుద్ధం అయిపోగానే మాకు మిలిట్రీ కాజాల ఉద్యోగం పోయింది. అప్పుడు మా అమ్మమ్మ భయపడింది. కాని అమ్మ భయం లేదని చెప్పింది. రాయపేట కేసరి కుటీరంలో గృహలక్ష్మి ప్రెస్సు ఉంది. అందులో మా అమ్మకి కంపోజిటర్‌ ఉద్యోగం ఇచ్చారు. దగ్గర్లోనే కేసరి గారు స్కూలు కూడా పెట్టారు. నన్నక్కడే చేర్చింది. ఇద్దరం పొద్దున్నే ప్రెస్సుకి వెళ్ళేవాళ్ళం. పొద్దున్న ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా నిలబడి కంపోజింగ్‌ చేసేది మా అమ్మ. నేను తొమ్మిది గంటలకు స్కూలుకు వెడితే నాకు రెండు ఇడ్డెనలు కొనిపెట్టి మిగిలిన పచ్చడి తను తినేది. సాయంత్రం నాలుగున్నరకి వెళితే ప్రెస్సు వాళ్ళు ఏదేనా పెట్టేవాళ్ళు. మేమిద్దరం తినేవాడిని. ఏడు అయ్యాక కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ ట్రిప్లికేను వెళ్ళేవాళ్ళం. ట్రాము డబ్బులు పెట్టి మషాళా దోసె కొనుక్కుని పొట్లం మా అమ్మ చేతిలో పెట్టుకుని తింటూ ఇట్టే వెళ్ళిపోయేవాళ్ళం. దోసెలో బంగాళాదుంప కూర కోసం మా వేళ్ళు పోట్లాడుకునేవి - నువ్వంటే నువ్వని - ఒరే పూర్వ జన్మలో మనం క్లాస్‌మేట్సులుగా పుట్టి ఉంటామురా అంది మా అమ్మ ఓసారి. దారిలో జాంబజారులో బంగాళదుంపలు, ఉల్లిపాయలు కొనుక్కుని వెళ్ళేవాళ్ళం. చితికిన ఉల్లిపాయలు చూట్టానికి అసయ్యంగా ఉంటాయి గాని రుబ్బి వడియాలు పెడితే ఎండకి పురుగులన్నీ ఛస్తాయి - వడియాలు బాగుండేవి - తీరా ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ బంగాళ దుంపలు రేపు - పొద్దుటి తోటకూర - అలాగే ఉండిపోయిందనేది. ఇవాళే బంగాళ దుంపలు రేపే తోటకూర అన్నా వినేది కాదు. అప్పటికి నేను ఫోర్తు ఫాం. ఇంగ్లీషులో అరిచినా వినేది కాదు.

అప్పుడు నేను ్రపైవేట్లుకూడా చెప్తున్నాను. పొద్దున్నే ఏడు నుంచి తొమ్మిది దాకా రెండిళ్ళు - సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది దాకా రెండిళ్ళు - నెలకి మా అమ్మకి అయిదు రూపాయలూ, నాకు రెండేసీ.

చూస్తుండగా గొప్పవాళ్ళం అయిపోతున్నాం. కాని మా అమ్మకి రోజంతా ప్రెస్సులో నిలబడి - తర్వాత నడిచి కాళ్ళు నెప్పెట్టేవి. నేను అమ్మమ్మకి నడుము తొక్కి అమ్మకి కాళ్ళు పట్టేవాడిని. 'చక్రవర్తీ నీకేం ఖర్మ పట్టిందిరా' అని మా అమ్మమ్మ ఏడిచేది. ధవళేశ్వరంలో చిన్నప్పుడు నన్ను బుడుగూ అనీ చక్రవర్తీ అని పిలిచేవారు. నాకప్పుడు ఇద్దరు సేవకులుండే వారుట కూడాను. అందుకని నేను పడుకోగానే వాళ్ళు నా అరికాళ్ళకు కొబ్బరి నూనె రాసి తోమేవాళ్ళు. బలేగా 'మొగలాయీ' గా ఉండేది.
ఇలా ఉండగా నిడమర్తి వారింట్లో ఒక తరుడు ఫారం అమ్మాయికి 'రుక్మిణీ కళ్యాణం' ్రపైవేటు చెప్పమన్నారు. ఆ నిడమర్తి వారింట్లో బామ్మగారు - నన్ను నించోబెట్టి రెండు పద్యాలిచ్చి అర్థాలు చెప్పమంది. చెప్పాక 'పాసయ్యావురా - రేపణ్ణించి రా' అంది. 'ఇలా నిక్కర్లేసుకు రాకూడదు. ఇది ఆడపిల్లా - అంచేత పొడుగు లాగేసుకు రావాలీ' అంది. జీతం అయిదు రూపాయలంది.

ఆ రాత్రి మా అమ్మమ్మా, అమ్మా నాకు పొడుగు లాగూ కుట్టేశారు. ఎమ్మెస్‌ 55 అనే సైను గుడ్డ కొన్నారు. నన్ను నేల మీద వెల్లకిలా పడుకోబెట్టారు. బొగ్గుతో నా నడుంనించి కాళ్ళ దాకా, కాళ్ళ నించి మళ్ళీ నడుం దాకా గీతలు గీశారు. దాని ప్రకారం గుడ్డ మీద గీసి కత్తిరించారు. చెరో వేపునీ కూచుని రాత్రి పన్నెండు గంటల కల్లా కుట్టేసి బొందు కట్టారు. ఇంక మనం కాజాలు మానేసి లాగూల షాపు పెట్టేద్దాం అన్నారు. కాని లాగూ సరిగ్గా రాలేదు. అందరి లాగుల్లా కాకుండా కాళ్ళ మధ్య ఆర్చిలా వచ్చింది. తొడుక్కుని నడిస్తే పడబోయాను. వాళ్ళకే నవ్వొచ్చింది. రేపొక్కరోజూ ఇలా వెళ్ళు. సాయంత్రానికి మిషను వాడికిచ్చి కుట్టిస్తాను అని చెప్పింది మా అమ్మ.

అప్పుడు సిగరెట్టు కాల్చాను ఒక ఫ్రెండు చెప్పితే - ఓసారి కొన్నప్పుడు కొట్టువాడు తిట్టాడు. మా నాన్నకి అని చెప్పాను. ఓసారి రోడ్డు పక్కన నుంచుని కాలుస్తుంటే చూసి ఒకాయన నోట్లో సిగరెట్టు పీకి విసిరేసి వెళ్ళిపోయాడు. అప్పణ్ణించి గంటకి అణన్నర చొప్పున సైకిలు అద్దెకు తీసుకుని అందుమీద తిరిగేవాణ్ణి సిగరెట్టు కాలుస్తూ.

నా కీర్తి ట్రిప్లికేను నుంచి రాయపేట, మైలాపూరు, అడయారు దాకా వ్యాపించింది. అంటే సిగరెట్లది కాదు, ్రపైవేట్లది. టంగుటూరి, నిడమర్తి, గోవిందరాజుల, కాశీనాథుని వంటి పెద్ద పెద్ద ఇళ్ళల్లో ్రపైవేటు చెప్పాను. ఇంకా బెస్టేమిటంటే మా తెలుగు మాస్టారు జనార్ధన శర్మ గారు నన్ను వాళ్ళింటికి రమ్మని వాళ్ళమ్మాయికి ్రపైవేటు చెప్పించారు. క్లాసులో కూడా ఒరే కుర్ర మాస్టారూ అని పిలిచేవారు. నాకు సిగ్గు వేసేది. ఆయన కూడా వద్దని చెప్పినా వినకుండా రెండ్రూపాయల జీతం మా అమ్మ చేతికిచ్చే వారు. మా అమ్మ కూడా వద్దంటే మనందరం టీచర్లమేనమ్మా ఫరవాలేదు అని చెప్పేవారు. ఇలా నా కథంతా ్రపైవేటు మాస్టారు ధోరణిలోనే సాగింది. రచయితగా వార్తలు, కథలు, సినిమా డైలాగులు రాసి ఇంకోళ్ళకి చెప్పి వినోదమందించే సేవా భాగ్యం దొరికింది. ప్రవృత్తే వృత్తిగా లభించడం - దొరకునా ఇటువంటి సేవా? 76 ఏళ్ళు దాటినా  ఇంకా 16 ఏళ్ళ పొగరే కాలరెత్తుకుని ఉంటుంది. నా బాల్డ్‌ హెడ్డూ తెల్ల జుత్తూ చూసి ఎవరైనా నమస్కారం పెడితే - నా వెనక్కి చూసి తప్పుకుంటాను. పెద్దవారెవరో నా వెనుక ఉన్నారనుకుని. థ్యాంక్‌యూ.....
                                                   

Wednesday, February 23, 2011

తమిళనాడులో వేలయేండ్ల నుంచే తెలుగు వెలుగులు

నుడుల పేరుతో నాడులు ఏర్పడింది ఏభై అరవై సంవత్సరాల కిందట. కానీ అంతకుముందు వేలయేండ్ల నుంచే తెలుగుజాతి పరచుకొన్న తావు చాలా పెద్దది. వక్కణాన (ఉత్తరాన) మహానది దగ్గర నుంచి తెక్కణాన(దక్షిణాన) కన్యాకుమారి వరకూ తెలుగువాళ్లు ఉన్నారు, తెలుగు ఊర్లు ఉన్నాయి. ఇప్పుడున్న పద్దెనిమిది కోట్లమంది తెలుగువాళ్లలో సగం మంది ఇప్పటి ఆంధ్రప్రదేశం లోనూ, సగం మంది వెలుపటా ఉన్నారు. వెలుపట ఉన్నవారిలో నూటికి ఒకరిద్దరు మట్టుకే ఆంధ్రదేశం నుంచి పని పాటలు వెతుక్కుంటూ వలస వచ్చినవారు, మిగిలినవారంతా ఉండూరివారే. ఈ మొత్తం తెలుగునేలను, తెలుగువారిని వెతుక్కుంటూ పోతే మన నుడి, జాతి ఎంత పాతవో ఎరుక పడుతుంది. ఇక్కడ తమిళనుడితో పోల్చి తెలుగునుడి పాతదనాన్ని చెబుతారు. ఒక నుడి పాతదనాన్ని తెలుసు కొనేందుకు మనంచూసేది, తవ్వకాలలో దొరికిన కుండపెంకుల మీద, నాణలమీద ఉన్న రాతలు, రాళ్లపైని చెక్కడాలు (శాసనాలు), పాత సాహిత్యం, నోటి కతలూ పాటలు.
 కుండపెంకులు :
 ఇప్పటికి తమిళనాడులోని ఆదిచ్చనల్లూర్‌ అనే చోట, తవ్వకాలలో కొన్ని కుండపెంకులు దొరికాయి. ఒక పెంకుపైన 'ఉఱిపానై' అనే మాట 'బ్రాహ్మి' లిపిలో ఉంది. 'ఉఱి' అంటే వ్రేలాడేది అని, అది పాత తమిళమాట అని 'ఐరావతం మహదేవన్‌' అనే పరిశోధకుని మాట. 'పానై' అంటే పెద్దకుండ అని ఇప్పటికీ తమిళంలో ఉన్నమాట. ఉఱి అనే మాట తెలుగులో ఇప్పటికీ వాడుకలో వుంది, తమిళంలో లేదు. ఉఱి తీయడమంటే వ్రేలాడదీయడం అనే కదా. 'పానై' అనే మాట కూడా కొద్దిగా మారి 'బాన'గా ఇప్పటికీ తెలుగులో వుంది. అంటే 'ఉట్టిబాన' అనే తెలుగుమాట అన్నమాట. ఇది తమిళానికి ఎంత దగ్గరో, అంతకంటే ఎక్కువగా తెలుగుకు దగ్గరిమాట. ఆదిచ్చనల్లూరు కుండపెంకులు క్రీ.ము. 3వ నూరేడు నాటివి. కుండపెంకులపైన ఉన్న రాతలలో పాతవి తెలుగురాతలే అని చెప్పవచ్చు.
 నాణేలు :
నాణేలు దగ్గరకు వస్తే కావేరి తీరంలో దొరికిన శాతవాహన నాణేలలోని రాతలను తమిళనుడిగా ప్రచారం చేసుకొంటున్నారు తమిళులు. కాదు అది తెలుగే అని ఆరుద్రగారి లాంటి ఎందరో తెలుగు పెద్దలు నిరూపించినారు. ఆ నాణేలు పైన ఉన్న మాటలు ఇవి.
 ' అరచనకు వాచిట్టి మకనకు తిరు చాతకణి' కు
 ఇందులోని అరచ, మకన, తిరు అనేవి తమిళమాటలు కాబట్టి ఈ వాక్యం తమిళమని వారి వాదన. కానీ ఈ మాటలు తెలుగులో కూడా వాడుకలో వుండేవి అని తెలుగులో వచ్చిన ఎన్నో రాతిచెక్క డాలలో, కావ్యాలలో రుజువులు ఉన్నాయి. అన్నింటికీ మించి ఈ వాక్యంలో ఉన్న 'కు' అనే ఆరవ విభక్తి తెలుగు. తమిళం అయితే 'క్కు' అని ఉండితీరాలి. ఈ మందలను ఆరుద్ర గారి 'సమగ్రాంధ సాహిత్యం'లో చదువవచ్చు. ఈ నాణేలు  క్రీ.త. 1 నుండి 3వ నూరేండ్ల కాలానివి.
 వీటికంటే చాలాకాలం పాతవైన తెలుగు నాణలు కరీంనగరు జిల్లా కోటిలింగాల తవ్వకాలలో దొరికాయి. ఈనాణేలు  శాతవాహనుల కంటే ముందరివి. ఈ నాణేలు పైన గోప, నారన లాంటి తెలుగు రాజుల పేర్లు ఉన్నాయి. ఈ నాణేలు  క్రీ.ము. 3వ నూరేండ్లవి. వీటిని బట్టి నాణేలు పైన తమిళంకంటే తెలుగే ముందునుంచీ ఉన్న నుడి.
 రాతి చెక్కడాలు (శాసనాలు) :
 ఇక రాతిచెక్కల గురించి గమనిస్తే అన్ని తావుల్లో మొదట దొరికినవన్నీ ప్రాకృతం నుడివే. 'బ్రాహ్మీ' అనే లిపిలో ఉన్నాయి. క్రీ.ము. నుంచీ ఉన్న ఈ చెక్కడాలలో తెలుగు, తమిళ నుడులలోని ఊర్లపేర్లు, మందిపేర్లు కనబడుతున్నాయి. క్రీ.ము. 3వ నూరేండ్ల కాలాన, అశోకుని కంటే ముందు దొరికింది ఆంధ్రప్రదేశంలోని భట్టిప్రోలు చెక్కడము. ఇందులో పాత, పోతక అనే తెలుగుపేర్లు ఉన్నాయి.
 మనదేశ తొలి నాగరికతగా పేర్కొన్న హరప్పా, మొహంజోదారోలలో దొరికిన చిత్రలిపిని కొద్ది కొద్దిగా చదవగలుగుతున్నవారిలో ఐరావతం మహదేవన్‌ గారు ఒకరు. ఆయనే ఆ నాగరికత నుడి తమిళానికి ఎంత దగ్గరో తెలుగుకీ అంతే దగ్గర అని ఎన్నో మచ్చులు (ఉదాహరణలు) చూపించి చెప్పినారు. దాదా అదే కాలానికి చెందిన తుంగభద్రలోయ లిపులపైన పరిశోధనలు జరిగాయి. కర్నూలు జిల్లాలో దొరికిన ఈ లిపులలో క్రీ.ము. రెండువేల యేండ్ల నాటి 'ఆందింలోకం', 'గిబ్బతీగల' అనే తెలుగు మాటలు ఉన్నట్లు సుబ్రమణ్యం మలయాండి కాశీపాండ్యన్‌ (మరుగునపడిన మన వారసత్వం) లాంటి పరిశోధకులు తెలిపారు.
 వీటన్నింటికంటే పాతదైన సుమేరియన్‌ నాగరికత కాలానికి చెందిన చెక్కడాలలో 'ఉర్‌' 'నిప్పుర్‌' 'ఎంకిడు' లాంటి ఎన్నో తెలుగుమాటలు ఉన్నట్లు రాంభట్ల కృష్ణమూర్తి, సంయుక్త కూనియ్యలు వెతికి తెలిపినారు. ఇంత పాతచెక్కడాలు తమిళంలో లేవు.
 తెలుగువాళ్లు 'దక్షిణ బ్రాహ్మి' అని చెబుతున్న లిపిని తమిళులు 'తమిళ బ్రాహ్మి'గా ప్రచారం చేసుకొంటున్నారు. భట్టిప్రోలు లిపితో బాటు వింధ్య కొండలకు దిగువన కన్యాకుమారి వరకూ దొరికిన అన్ని బ్రాహ్మి చెక్కడాలను తమిళ బ్రాహ్మి అనే చెబుతున్నారు. నిక్కం మాట్లాడితే తెలుగు బ్రాహ్మి అని చెప్పుకోవాలి. దిగువ ఇచ్చిన పట్టికను చూస్తే తేటతెల్లమవుతుంది.
 తమిళంలో ల, , ళ అరు మూడు లకారాలు, , ఱ అనే రెండు రకారాలు, ,, న అనే మూడు నకారపు గుర్తులు. పాత బ్రాహ్మిలిపిలో కూడా ఇవి వున్నాయి కాబట్టి ఈ లిపి తమిళ బ్రాహ్మి అని తమిళుల వాదన. అంటే ళ,,, న అనే రాతలు (అక్షరాలు) తమిళనుడిలోనే ఉన్నాయని వాళ్లంటున్నారు. ళ, ఱ లు ఇప్పటికీ తెలుగులో ఉన్నాయి. 'ళ నన్నయ కాలం వరకూ తెలుగులోనూ ఉండినదే. ఆంధ్ర, కన్నడ, తమిళ, మలయాళ నాడులలో చదువురాని వారిలో ఈ '' అనేసద్దును సరిగ్గా పలుకగలిగేది, గోదావరి అంచులలో ఉన్న కొండరెడ్లు అనేవారు మట్టుకే. 'న అనే క్క రాతను పట్టుకొని ఆ లిపిని తమిళబ్రాహ్మి అనడం సరయినది కాదు.
 క్రీ.త. ఒకటవ నూరేడు నాటి 'జాంబై'(విల్లుపురం జిల్లా) చెక్కడంలో ఒకే నకారం ఉంది. ఆ చెక్కడంలో ఒకే నకారం ఉంది. ఆ చెక్కడంలోని మాటలు ఇవి:
 'సతియపుతో ఆదియన్‌ నెడుమాన్‌ అంచి ఈత్తపళి'
 ఇందులో 'సతియపుతో ఆదియన్‌ నెడుమాన్‌ అంచి' అనేది రాజు పేరు. 'ఈత్తపళి' అంటే ఇచ్చిన పళ్ళి (జైన బసది) అని.మాంగుళం, పుగళూరు చెక్కడాల్లో ఉన్నట్లు ఇందులో రెండు నకార గుర్తులు లేవు. అశోకుని చెక్కడాల్లో కనిపించే సత్యపుత్రులు తెలుగు రాజులే అనడానికి పల్లెపాటలలో రుజువులు న్నాయి. వాటిని తర్వాత చెబుతాను. ఈ జాంబై చెక్కడం కూడా అందుకొక రుజువుగా నిలుస్తుంది.

సాహిత్యం :
 ఇది రెండు రకాలు : 1. రాసి దాచిపెట్టుకొన్నది 2. నోటి సాహిత్యం. మొదటి రకంలో తమిళులకు రెండువేల యేండ్లనాటి సంగసాహిత్యం ఉంది. తెలుగువాళ్లకు పండ్రంగని అద్దంకి పద్యాలకు ముందు సాహిత్యం దొరకలేదు. అయితే ఇక్కడొక అనుమానం వస్తుంది. రెండువేల యేండ్లనాడే వేలపుటల సంగసాహిత్యం వెలసిన తమిళనుడిలో ఆ కాలాన ఒక్క తమిళ చెక్కడం కూడా లేదు ఎందుకని? ఆ కాలపు చోళ, చేర, పాండ్యరాజులు వేసినవన్నీ ప్రాకృతపు చెక్కడాలే. తెలుగువాళ్లలాగా తమిళులు మౌర్యవంశపు రాజుల ఏలుబడిలో లేరు కదా, స్వతంత్రులు కదా, మరి తమిళంలో చెక్కడాలు ఎందుకు లేవు? కలమళ్ల, ఎర్రగుడిపాడులో క్రీ.త 570 నాటికే పూర్తి తెలుగు చెక్కడాలు ఉండగా, పూర్తి తమిళచెక్కడం క్రీ.త. 700 నాటిది దళవానూరులో దొరికింది. అంటే తొలి తెలుగు చెక్కడానికీ, తొలి తమిళ చెక్కడానికి మధ్యన నూరేళ్ల తేడా వుంది.
 సరే, సంగసాహిత్యం ఏ కాలానిదైనా అది తమిళులకు మట్టుకే సొంతం కాదు. సంగసాహిత్యంలో ముల్లయ్‌, కుఱింజి, నెయ్‌దల్‌, మరుదం, పాలై అనే తావులను అక్కడ బ్రతికిన మందిని గురించి వివరంగా ఉంటుంది. సంగ సాహిత్యం వర్ణించినదంతా ఎక్కువగా తెలుగువాళ్ల గురించే. ముల్లయ్‌ తావులోని ఇడయర్లు, కుఱింజి తావులోని కొరవలు, నెయ్‌దల్‌ తావులోని పరదర్లు, పాలై తావు వేడర్లు ఇట్లా దాదాపు అన్ని కులాల మూలాలూ తెలుగే. అంటే తమిళ సంగసాహిత్యనికంటే ముందే తెలుగులో ఈ సాహిత్యం ఉండి ఉండాలి. 'సంగసాహిత్యానికి ఊపిరి తెలుగే, తెలుగువాళ్లే. నోటి సాహిత్యం గురించి చెప్పుకొంటే, అది కూడా చాలా పెద్ద వ్యాసం అవుతుంది. వీలయినంత కుదించి చెబుతాను. తెలుగువాళ్లకు ఉన్నట్లు పల్నాటి చరిత్ర, కాటమరాజు కతల్లాంటి నోటి కావ్యాలు తమిళులకు లేవు. తమిళులకు కుల పురాణాలు కూడా బాగా తక్కువ. తమిళ కులాలలో వన్నియర్లు, వెళ్లాల గౌండర్లు, దేవర్లు లాంటి కొన్ని కులాలవారికే నమ్ముకొన్న కులాలు (ఆశ్రిత కులాలు) ఉన్నాయి. అయితే వన్నియర్ల కులపురాణం చెప్పే నోక్కంవారు, వెళ్లాల గౌండర్ల కతను చెప్పే ముడవాండివారు, దేవర్ల జాతి బిడ్డలైన పిచ్చకణ్ణువారు తెలుగువారే.
 నోక్కంవారు వన్నియర్లకు చెప్పే కుల పురాణంలో రెండువేల ఏండ్లనాడు కొంగునాడు (కోయం బత్తూరు తావు) ను ఏలిన వీరరాయరెడ్డి, ఎరుమనాడు (మైసూరు) ను ఏలిన మాదిగ ఎల్లమ్మ గురించి ఉంటుంది. జాంబువులు చెప్పే కుల పురాణంలో 'ఆది జాంబువులు చెప్పే కుల పురాణంలో జాంబువుడు అసమకదేశంలో మాజేటి ఒడ్డువాడని' ఉంటుంది. ఉత్తర తెలంగాణా తావుకు అసమకదేశమని బుద్ధుని
 కాలం నుంచి క్రీ.త. 6వ నూరేడు వరకూ పేరు ఉంది. ఆ కాలానికి చెందిన కులపురాణం ఇది. తమిళులలో ఇప్పటికీ నిలిచివున్న నోటిపాటలలో వెయ్యేండ్ల చరిత్ర కలిగినవే అరుదు. అంతకుమించి పాతవి ఇప్పటికీ దొరకలేదు. ఇప్పటి తమిళనాడులోని తెలుగు నోటిపాటలలో రెండువేల సంవత్సరాల తెలుగువారి చరిత్ర వుంది. 'సిరివన్నె, కలికిరాముడు' అనే పాటను దళితులు నాలుగయిదు గంటలపాటు పాడుతారు. ఈ పాటలో అంతా రెండువేల యేండ్లనాటి మాదిగరాజుల గురించే వుంటుంది. ఇప్పటికీ తమిళనాడులోని మాదిగ లందరూ తెలుగే మాట్లాడుతున్నారు. మాదిగల్లో తమిళులే ఉండరు. 'సిరివన్నె'.... పాటలో సత్యపుత్ర రాజుల గురించి వస్తుంది. ఈ పాటను తోడు తీసుకొని చూస్తే సత్యపుత్రులు మాదిగలు. వాళ్ల తలనగరం తగడూరు. ఆ తగడూరే ఇప్పటి ధర్మపురి తమిళనాడు ఈ వ్యాసంలోనే చెక్కడాల గురించి చెప్పేటప్పుడు 'జాంబై' లో దొరికిన సత్యపుత్రులు మాదిగలే అని చెప్పడానికి ఆదిజాంబవుని పేరుతో ఏర్పరచుకొన్న 'జాంబై' అనే ఊరే పెద్ద రుజువు.
 ఇప్పటికీ తమిళనాడులోని దాదాపు డెబ్బై నమ్ముకొన్న కులాలు తెలుగువారివే. వీరందరి గురించీ పరిశోధన చేస్తే తెలుగుజాతి, తెలుగునుడి పాతదనాన్ని ఇంకా తేటంగా వెలికితీయవచ్చు.
                                                                                                                               -స.వెం. రమేష్

Tuesday, February 22, 2011

హైదరాబాదులో తెలుగు భాషోద్యమకారుల నిరసన

         నిరసనకార్యక్రమం లో ప్రసంగిస్తున్న దత్తాత్రేయ         
తెలుగు భాష పరిరక్షణ ,అభివృద్ధి తదితర అంశాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద గల ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం జరిగింది. ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం  సందర్భంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగినఈ కార్యక్రమం తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రయ, ప్రముఖ కవి ఎస్వీ సత్యనారాయణ, రచయితలు కాలువ మల్లయ్య, తవ్వా ఓబుల్ రెడ్డి,  తెలుగు భాషోద్యమకారులు, భాషాభిమానులు సింగా రావు, కోదండరామయ్య, పొట్లూరి హరికృష్ణ, అ.వీరాస్వామి, మహానందప్ప, భూదేవి, పలువురు తెలుగు భాషోద్యమకారులు  పాల్గొన్నారు. తెలుభాష పరిరక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయాలని, తెలుగు అధికార భాషగా పూర్తి  స్థాయిలో అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తెలుగు వ్యతిరేక ప్రభుత్వ విధానాల్ని నిరసించారు. అంతకు ముందు రోజు హైదరాబాదులోని  హైదరాబాదు స్టడీ సర్కిల్ లో తెలుగు భాష  పై చర్చా గోష్ఠి  జరిగింది. "
తెలుగు పై చర్చాగోష్ఠి
తెలుగునుడి అపోహలు,వాస్తవాలు, పరిష్కారం " అనే అంశంపై ఈ చర్చా గోష్ఠి జరిగింది.  నడుస్తున్న చరిత్ర మాస పత్రిక సంపాదకులు ,తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ చర్చాగోష్ఠిలో  ప్రముఖ భాషా పరిశోధకులు ఆచార్య జయధీర్ తిరుమల రవు, మాజీ ఐపీ ఎస్ అధికారి " ఆర్ట్ అండ్ లెటర్స్"  అధినేత చెన్నూరు ఆంజనేయ రెడ్డి, డాక్టర్ ధ్వానా శాస్త్రి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి, అచార్య విజయలక్ష్మి,  సామల శివరామ కృష్ణ  ,కె ఎల్ కామేశ్వరరావు, ఏకే ప్రభాకర్, ఎ.వీరాస్వామి, టి.మహానందప్ప , కోదండ రామయ్య, విజయగౌరి, గాయని భూదేవి, పొట్లూరి హరికృష్ణ పలువు తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.                

తెలుగును కాపాడుకుందామని వక్తలు పిలుపు

రోజు రోజుకు వెనుకబడిపోతున్న తెలుగును కాపాడుకుందామని వక్తలు పిలుపునిచ్చారు. అందుకు ప్రాథమిక స్థాయి నుంచే కచ్చితంగా తెలుగును అమలులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగు భాషోద్యమ సమితి, రాష్ట్ర సాంస్కృతిక మండలిల సంయుక్తాధ్వర్యంలో సోమవారం రాత్రి రవీంద్రభారతి ప్రాంగణంలోని కళాభవన్‌లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మండలి ఛైర్మన్‌ ఆర్వీ రమణమూర్తి జ్యోతి వెలిగించి వేదికకు శుభారంభాన్ని పలికారు. సీనియర్‌ జర్నలిస్టు, భాషోద్యమ నేత జి.ఎస్‌ వరదాచారి అధ్యక్షోపన్యాసం చేస్తూ... అంతరించి పోతున్న భాషల్లో తెలుగు కూడా ఉందని యూనెస్కో చేసిన హెచ్చరికతోనైన ప్రభుత్వం మేల్కొవాలన్నారు. ప్రపంచంలో అత్యధికుల మాతృభాషగా యునెస్కో గుర్తించిన పది భాషల్లో తెలుగు కూడా ఒకటన్నారు. అనధికార అంచనాల ప్రకారం తెలుగు మాతృభాషగా కలవారి సంఖ్య 18 కోట్ల పైనే ఉంటుందన్నారు. ప్రపంచీకరణ ప్రభావం, అమెరికా ఉద్యోగాలపై వ్యామోహం తల్లిదండ్రులను కొంత చాపల్యానికి గురి చేస్తోందన్నారు. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత ఓటు బ్యాంకు విధానాలు మాతృభాష పట్ల నిరాదరణ పెంచడానికి కూడా కారణమవుతున్నాయని అన్నారు. ఉప్పులూరి మల్లికార్జున శర్మ, ఆచార్య ఎన్‌.ఎస్‌.రాజు, ఆచార్య ఎస్వీ రామారావు, ఆచార్య కాశీనాథుని నాగేశ్వరరావులతో పాటు తెలుగుభాషా చైతన్య సమితి ప్రతినిధులు పాల్గొని మాట్లాడుతూ.. తెలుగు మాధ్యమంలో చదువుకొనే వారి సంఖ్య పెరిగే మార్గం అన్వేషించాలన్నారు. తెలుగు పొట్టకూడు పెడుతుందన్న భరోసా భావి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కలిగించాలన్నారు.

Wednesday, February 16, 2011

తమిళ మాండలిక పితామహుడి తల్లి భాష తెలుగు ! (" కీరా"తో ఇంటర్వ్యూ)

రాజ నారాయణ్ ( కీరా )
తమిళంలో మాండలిక పితామహుడిగా పేరుపొందిన రచయిత రాజనారాయణ్. తమిళ కథ, నవలా సాహిత్యంలో ఈయనది సుప్రసిద్ధ స్థానం. కీరా అనే కలం పేరుతో పలు రచనలు చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఎంతో ఇష్టమైన రచయిత ఈయన. రాజ నారాయణ్ నవల 'గోపల్లపురత్తు మక్కళ్' (గోపల్లె పుర జనులు)కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.దీనికి ముందు 'గోపల్ల గ్రామం' నవల రాశారు. రెండు నవలలూ పాండ్య మండలం (దక్షిణ తమిళనాడు)లోని తెలు గు వారి జీవితాలను ప్రతిబింబిస్తాయి. ఆయన వయస్సు 87 యేళ్ళు. తల్లి భాష తెలుగు. చదివింది ఐదవ తరగతి వరకే అయినా ఈయన ప్రతిభను గుర్తించిన పాండిచ్చేరి విశ్వవిద్యాలయం తమిళ మాండలిక శాఖలో ఆచార్య పదవినిచ్చి గౌరవించింది. పదవీ విరమణ తర్వాత కూడా పాండిచేరిలోనే స్థిరపడ్డారు. ఎనభై కథలూ, నాలుగు నవలలూ, ఎన్నో వ్యాసాలూ రాసిన రాజనారాయణ్ వేలాది తెలుగు జానపద కథలను సేకరించారు. తెలుగు చదవడం రాయడం రానందుకు రాజ నారాయణ్ బాధపడతారు. తెలుగులో పలుకరిస్తే పులకరించిపోతారు. తన తెలుగు మూలాలను తడుముకుని సంబరపడతారు. తమిళ సాహిత్యంలో రెపరెపలాడుతున్న తెలుగు కథా, నవలాకారుడితో సంభాషణ....
*మీ కుటుంబం గురించి చెప్పండి ? .
సుమారు ఎనిమిదివందల ఏండ్ల క్రిందట మా కుటుంబం ఉత్తరానున్న ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి పాండ్య మండలంలో కుదురుకునింది. మాది వ్యవసాయ కుటుంబం. నా తల్లితండ్రులు లక్ష్మమ్మ, కృష్ణ రామానుజనాయకర్ గార్లు. మాది తూతుకుడి జిల్లా, కోవిల్పట్టి తాలూకాలోని ఇడైచేవల్అనే చిన్న గ్రామం. నా భార్య పేరు కనవతి అమ్మ.
తెలుగు జానపద కథలను సేకరించాలనే కోరిక ఎలా కలిగింది. ?
నేను చిన్నబిడ్డగా ఉన్నప్పుడు మా అమ్మ, అవ్వ, ఇంకా ఇంట్లో పెద్దలు, ఊర్లోని చుట్టాలు చాలా కథలను చెప్పేవాళ్ళు. అవన్నీ తెలుగులోనే ఉండేవి. వినడానికి ఎంతో బాగుండేవి. అట్లాగే వీరబాహు అనే ఆయన బయటి ఊరి నుంచి వచ్చి ఒక రకమైన వాద్యాన్ని మీటుతూ పాటలు పాడేవాడు. వీరబాహులు తెలుగు దళితులు. వీళ్ళు గ్రామా ల్లో తిరుగుతూ కథాగానం చేస్తూ యాచన చేస్తుంటారు.
వాద్యం డుంగ్ డుంగ్ అనే శబ్దం చేస్తూ ఉంటే వీరబాహు చేసే కథాగానం అద్భుతంగా ఉండేది. పాటకు నడుమ నడమ కొన్ని కథలను చెప్పేవాడు. పాట, కథలు అంతా తెలుగులోనే ఉండేవి. అవన్నీ జానపద కథలే. నేను సేకరించిన కాలానికి చాలామంది పరిశోధకులు జానపద పాటలనే సేకరించినారు. నోటి కథలను పట్టించుకోలేదు. మా పెద్దలు, మా వీరబాహు, మా ఊరి జనం చెప్పిన కథలను భద్రపరచాలనుకొన్నాను. అట్లా మొదలయింది నా సేకరణ.
కీరా అనే మీ కలం పేరు వెనుక కథ ఏదైనా ఉందా.?
నా పూర్తిపేరు రాయంగల కృష్ణ రాజనారాయణ పెరుమాళ్ రామానుజం నాయకర్. ఇందులో రాయంగల మా ఇంటి పేరు. కృష్ణ మా నాయన పేరు. నాయకర్ కులపట్టం. మిగతాది నా పేరు. నాయకర్లనే తమిళనాడు ఉత్తరం పక్క నాయుడు అంటారు. ఇంత పెద్ద పేరుతో పిలువలేరు కదా. మా అమ్మ ముద్దుగా రాజు అనేది. మా అవ్వ రాజయ్య అని పిలిచేది.
ఇక కీరా అనే పేరు ఎట్లా వచ్చిందంటే.. ఒకసారి నేను కోర్టుకు పోవలసి వచ్చింది. అక్కడి బంట్రోతు నా పూర్తి పేరు చెప్పలేక తడబడి పోయినాడు. అప్పడనిపించింది నాకు పేరును పొట్టిగా చేసుకోవాలని. మా నాయన పేరు కృష్ణ రామానుజం లోని తొలి అక్షరాన్ని (కృష్ణను తమిళంలో కిరుష్ అని రాస్తారు) నా పేరులోని తొలి అక్షరాన్ని కలిపి కి. రా. అని పెట్టుకొంటిని. అదే క్రమేణా కీరా అయింది.
మనదేశంలో జానపద సాహిత్యాన్ని సేకరించడం, భద్రం చేయ డం జరగలేదంటున్నారు, సాంకేతికంగా వెనుకబడడమే కారణమా.?
అదొక్కటే అనుకొనేదానికి వీల్లేదు. సాంకేతికంగా మనకన్నా వెనుక ఉండే దేశాలవాళ్ళు కూడా వాళ్ళ నోటి సాహిత్యాన్ని నిండా పదిల పరచుకుంటున్నారు. వాళ్ళు జానపద కథలను సేకరించడమేకాదు. వాటిని అన్ని ప్రక్రియల్లోకి తీసుకునిపోయి ప్రచారం కల్పిస్తున్నారు. వాటిని పాటలుగా ఆధునిక కథలుగా, నవలలుగా, నాటకాలుగా, సినిమాలుగా తీర్చిదిద్దుకొన్నారు. అట్లా చేయాలనే యోచనే మనకు లేనప్పుడు ఎంత సాంకేతికత ఉండీ ఏం ప్రయోజనం.
మధ్య వచ్చిన హారిపోర్టర్, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకొనింది కదా, దానికి మూలం జానపద సాహత్యమేనంటారా?
కచ్చితంగా. కథ జానపదుల్లో లేకపోవచ్చు. కానీ రచయిత్రి ఊహకు ప్రేరణ కచ్చితంగా జానపదులే. మనమూ మన మూలాలను- నేలను-ఊరిని-వాడుకలను-జనాన్ని మరిచిపోకుండాపట్టుకుంటే, అంత టి సంచనలనం కలిగించే కథలను, ఇంకా గొప్ప కథలను పుట్టించవచ్చు.
జానపద సాహిత్యంలో మూఢనమ్మకాలు ఉంటాయి. అవి ఆధునిక కాలానికి ఉపయోగపడవు అనే వాదన ఉంది.?
వాదనను నేను ఒప్పుకోను. మనం పొలంలో పంటను నూర్చి ధాన్యాన్ని రాశిపోస్తాము. రాశిలో తాలూ, తరకా, గట్టి అన్నీ ఉంటా యి. దాన్ని గాలికి తూరి తాలూ, తరకా ఎగరగొట్టి గట్టి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుంటాము. అంతేగానీ తాలూ తరకా ఉందని ధాన్యాన్ని విడిచిపెట్టి వచ్చేస్తామా? ఇదీ అంతే.
కాలానుగుణంగా సమాజంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అందుకు అనుగుణంగా ఉండేవాటిని తీసుకుని ప్రచారం చేయవచ్చు. లేదా చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. పనిని నోటి కథలు చెప్పే వాళ్ళు కూడా చేసినారు. మూఢనమ్మకాలను తప్పుపట్టే ఎన్నో కథలు మన పల్లెల్లోని పెద్దవాళ్ళ నోళ్ళలో ఉన్నాయి. మచ్చుకు నేను సేకరించిన కథను వినండి....
ఒక కుక్క దాని కూతురి కోసం పెండ్లి కొడుకును చూసేందుకు బయలుదేరింది. గడప దాటి కాలు బయటపెట్టి, వీధి పక్క చూసింది. ఎదురుగా సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చింది. కుక్క కోపంతో వెనక్కు తిరిగి ఇంట్లోకి వెళ్ళి పోయింది. కుక్క పెండ్లాము, ఏమి, ఏమి వచ్చేస్తివి? అని అడిగింది. దానికి మొగుడుకుక్క ఇట్లా చెప్పింది. 'శకునం సరిలేదు, ఎదురు గా లక్ష్మి వచ్చింది. లక్ష్మి మాదిరి మోసగత్తె లోకంలోనే ఇంకొకతె ఉండదు. ఎక్కడా స్థిరంగా ఉండని లక్ష్మి ఎదురువస్తే పనీ జరగదు' అనింది. మాటకు ఆలుకుక్కకు నిండా ఆశ్చర్యం కలిగింది.
సరేనని కొంచెం నీళ్ళు తాగి మరలా తలపాగా చుట్టుకుని, అంగవస్త్రం వేసుకుని బయలుదేరింది మొగుడుకుక్క. ఈసారి పరాశక్తి ఎదురు వచ్చింది. గిరుక్కున తిరిగి ఇం ట్లోకి పోయి, ఆలుకుక్కతో ' పరాశక్తి ఎదురువచ్చింది శకునం సరిలేదు. అది ఎక్కడకు పోయినా జగడాలమారే. జనాన్ని చంపేదే దాని పని. లోకాన నెమ్మదినంతా కాజేసే ఆడది అది' అని చెప్పింది మొగుడు కుక్క. ఇంకా ఆశ్చర్యపోయింది ఆలుకుక్క. మూడోసారి బయలుదేరింది మొగుడుకుక్క.
ఈసారి ఆవులించుకుంటూ నిద్ర కళ్ళతో మూదేవి (నిద్రాదేవి) ఎదురువచ్చె. మంచి శకునం అనుకుని పోయి ఒక మంచి అల్లుడిని చూసి తెచ్చి కూతురికి పెండ్లి చేసింది మొగుడుకుక్క. ఒకనాడు ఆలూమొగుడూ తీరిగ్గా కూచొని ఉన్నప్పుడు, 'మూదేవి ఎదురు వస్తే మంచి శకునం ఎల్ల అవుతుంది?' అని అడిగింది ఆలుకుక్క. అప్పుడు మొగుడుకుక్క, 'పిచ్చిదానా, లోకాన సకల జీవరాశులకూ నిద్రకావాల.
నిద్ర లేదంటే పిచ్చి పట్టును. నిద్ర లేదంటే సిరి, శక్తి ఏమీ ఉపయోగం ఉండదు. అందుకే నిద్రాదేవి మంచి శకునం' అని చెప్పింది. కథ శకునం చూడడమనే మూఢనమ్మకాన్ని ఎదిరించింది. కథ ఎదిరించింది అంటే కథను చెప్పిన జానపదుడు ఎదిరించినాడు. ఇట్లాంటివి ఎన్నో ఉండాయి.
మీకు ముందు ఎవరూ ప్రయత్నం చేయలేదు కదా, మీకు మాత్రం మాండలికంలో రాయాలని ఆసక్తి ఎందుకు కలిగింది.?
ఇట్లా కలిగింది, అట్లా కలిగింది అని చెప్పేది నటన అవుతుంది. తల్లిపాలపైన ఎందుకంత ఇష్టం అని బిడ్డను అడిగితే ఏమి చెబుతుంది?
ఒక భాషకు చెందిన వారందరికీ రచన చేరాలంటే ఏదో ఒక ప్రామాణికత అవసరం కాదా, ఒక ప్రాంతపు మాండలికాన్ని ఇంకొక ప్రాంతం వాళ్ళు చదివి అర్థం చేసుకునేందుకు ఇబ్బంది పడరా.
ప్రభుత్వ ప్రకటనలు, ఆస్తి పత్రాల నమోదు, కోర్టు తీర్పులు ఇట్లాంటి విషయాల్లో ప్రామాణికత అవసరమే.
అయితే సాహిత్య రచనలు మాండలికాల్లో రావడమే మంచిది. మాండలికాలు అర్థంకావు అనే విమర్శకు ఇప్పుడు చోటు లేదు. మొదట్లో అట్లాంటి విమర్శ ఉండేది. రానురాను అన్ని ప్రాంతాల మాండలికాల్లో రచనలు రావడంతో సమస్య తీరిపోయింది. దేశంలో అతి తక్కువ వానలు కురిసే ప్రాంతాల్లో మా ప్రాంతమూ ఒకటి.
అట్లాంటి పాండ్య మండలపు రైతుల కరువు జీవితాలను, వెతలను, కథలను, ముంగార్లతో, మూన్నూట అరవై దినాల పచ్చదనంతో మురిసిపోయే తంజావూరు యాసలో ఎట్లా చెప్పగలం? చెప్పి పాఠకుడిని ఎట్లా మెప్పించగలం? చెప్పినా పొసగుతుందా? భాష అనే తల్లికి దేహం ఒకటే. అయితే ముఖాలు పలు. ముఖాలే మాండలికాలు. కథలు, నవలలు, కవితలే కాదు, సినిమాలు, టీవీ నాటకాల్లో కూడా మాండలికాలు రావాలి. అప్పుడే ప్రచారమవుతాయి.
? తమిళనాడులో ఉన్న మాండలికాల గురించి చెప్పండి
పాత కాలంలో తమిళనాడు నాలుగు మండలాలుగా ఉండేది. 1. తొండమండలం, 2. చోళమండలం, 3. కొంగుమండలం, 4. పాండ్య మండలం. మాండలికానికే కరిసల్ (నల్లరేగడి) మాండలికం అనిపేరు. తంజావూరు, తిరుచి ప్రాంతాలు చోళ మండలపు మాండలికం. కోయంబత్తూరు నుంచి ధర్మపురి వరకూ ఉన్నది కొంగు మాండలికం.
ఆంధ్రదేశాన్ని ఆనుకుని ఉండే చెంగల్పట్టు, ఉత్తర, దక్షిణ ఆర్కాడులు, పాండిచేరి ప్రాంతంలోనిది తొండమండల మాండలికం. కేరళ సరిహద్దుల్లో ఉండే కన్యాకుమారి ప్రాంతపు తమిళాన్ని నాంజిల్నాడు మాండలికం అంటారు. సూక్ష్మంగా చూస్తే కొంచెం కొంచెం తేడాలు ఎన్నో ఉండును. తమిళం కన్నా తెలుగులో తేడాలు ఇంకా ఎక్కువ.
గోపల్లగ్రామం, గోపల్ల పురత్తుమక్కళ్ నవలల రచనకు ప్రేరణ.?
రచనలు మొదలుపెట్టడానికి చాలా ముందు నుంచే నాలో చాలాప్రశ్నలు ఉండేవి. మా ప్రాంతం గురించి, మా పల్లెలు, మా భాష, మా కుటుంబాల గురించి ఎన్నో ప్రశ్నలు. మా నల్లరేగడి ప్రాంతంలో తెలుగువాళ్ళు, తెలుగు పల్లెలు విపరీతంగా ఉండాయి.
ఇక్కడ తెలుగు ఎంత ఎక్కువంటే, మా చిన్నప్పుడు మా పల్లెల్లో ఉండే తమిళులు ఇంట్లో తమి ళం మాట్లాడుకుని, వీధికి వస్తే తెలుగు మాట్లాడేవాళ్ళు. పల్లెల పేర్లన్నీ తెలుగులోనే ఉండేవి. బడి పుస్తకాల్లో ఇదంతా తమిళనాడు అని ఉండేది. మాకు అర్థం కాక మా పెద్దవాళ్ళని అడిగేవాళ్ళం. కొంచెం పెద్దయినాక మా అవ్వను అడిగితే, తరతరాలుగా మా ఇంట్లో చెప్పుకునే కథను ఆమె నాకు చెప్పింది. మా కుటుంబాల వలస జీవితాన్ని విడమరచి చెప్పిన కథ అది.
కథను మళ్ళీ మళ్ళీ అడిగి ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు. దానినే గోపల్లగ్రామం నవలగా రాసితిని. ఉత్తరాన్నుంచి ఎనిమిది వందల ఏండ్ల క్రితం వలస వచ్చి, ఇక్కడ అడవులను కొట్టి, నేలను తీర్చి సాగులోకి తెచ్చిన మా పెద్దల కథే గోపల్ల గ్రామం నవల. తరువాత ఆగ్రామం పెరిగి పెద్దదయి, ఎన్నో కులాలను కలుపుకుని స్వతంత్రోద్యమ కాలాన ఎట్లా ఉండిందో చెప్పిన కథే రెండో నవల గోపల్ల పురత్తుమక్కళ్.
ఆంధ్ర దేశంతో, ఆంధ్ర దేశపు తెలుగుతో మీ అనుబంధం.?
తెలుగు రుచి తగిలితేనే నిండా బాగుండును. అది ఆంధ్ర దేశపుదైతే నిండానిండా బాగుండును. మీతో మాట్లాడుతున్నప్పుడు తేట తెలుగుదనాన్ని నేను రుచి చూస్తున్నాను. మనమంతానూ తెలుగు బిడ్డ లం. ఏదో కాలవశాన వందల ఏండ్లప్పుడు మేము పక్కకు వచ్చేస్తిమి. 1946లో నాకు క్షయవ్యాధి వచ్చింది. అప్పుడు క్షయకు మందు దొరికేదికష్టం.
మందూ మందూ తీసుకుంటా నాలుగేండ్లు గడిపినాను, నయంకాలేదు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో క్షయ ఆసుపత్రి ఉందని విని, వంటవాడిని తోడు తీసుకుని రైలు ఎక్కేస్తిని. రాత్రంతా ప్రయాణం, బాగా నిద్రపోతా ఉంటిని, తెల్లవారింది తెలియలేదు. దిడీలున మెలుకువ వచ్చింది. రైలు పాకాల జంక్షన్లో నిలిచి ఉంది. అక్కడందరూ తెలుగులోనే మాట్లాడుకుంటా ఉండారు.
వడలు అమ్మేవాళ్ళు, ఫలహారాలు అమ్మేవాళ్ళు, పేపర్, టీ అమ్మేవాళ్ళు, ప్రయాణికులు అందరూ ఒరేయ్మామ, ఏడకి పోతుండావురా ఇట్లా నాకు ఏదో దేవలోకానికి వచ్చినట్లు అనిపించింది. ఎన్నో తరాల క్రితం నా పెద్దలు బతికిన భూమికి వచ్చినట్లయి ఉద్వేగంతో కండ్లనీళ్ళు వచ్చేసినాయి. అదే నేను ఆంధ్రాకు తొలిసారి పోయింది. చివరిసారీ అదే.
మీ రచనల్లో మీకు ఎక్కువ తృప్తిని ఇచ్చినదేది? కథలా, నవలలా, వ్యాసాలా, జానపద కథల సేకరణా.?
నేనట్ల వేరు చేసి చెప్పలేనమ్మా, నలుగురు బిడ్డలూ నాకు ఒక్కటే. మీ ద్వారా ఆంధ్రావాళ్ళకి ఒక విన్నపం చేయాలనుందమ్మా. నాకిప్పుడు 86 ఏండ్లు నేను పోయే లోపు నారచనలు ముఖ్యంగా నా తెలుగు వాళ్ళ గురించి నేను రాసిన రెండు నవలల్ని (గోపల్లగ్రామం, గోపల్ల పురత్తుమక్కళ్), తెలుగు అక్షరాల్లో చూసుకోవాలని నా కోరిక. వీలయితే కోరికను తీర్చమని నా విన్నపం.
ఇంటర్వ్యూ : సుధారాణి
ఆంధ్రజ్యోతి సౌజన్యంతో-