|
5వ తరగతి గణితం (కొత్తది) |
|
5వ తరగతి గణితం (పాతది) |
|
తెలుగు అంకెలు |
ఐదవ తరగతి విద్యార్థులకు గత విద్యా సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన గణిత పాఠ్యప్రణాళికలో తెలుగు అంకెలకు సంబంధించిన పాఠ్యాంశాన్ని పూర్తిగా తొలగించడంతో భావితరాల వారికి తెలుగు అంకెలు ఎలా ఉంటాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఐదవ తరగతి విద్యార్థులకు 1994-95 విద్యా సంవత్సరం నుండి 2008-09 విద్యా సంవత్సరం వరకు గణితశాస్త్రంలో తెలుగు అంకెల పరిచయం ఒక అధ్యాయంగా ఉండేది. 2009-10 విద్యా సంవత్సరం నుండి ఐదవ తరగతికి కొత్త పాఠ్య ప్రణాళికను అమలులోకి తెచ్చారు. పాత పాఠ్య ప్రణాళికలో ఉండిన తెలుగు అంకెల విభాగాన్ని పూర్తిగా తొలగించారు. ఈ క్రతువులో తెలుగు అంకెల బలి కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేశారు. పాత పాఠ్యపుస్తకాల స్థానంలో కొత్త పాఠ్య పుస్తకాలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం 2009-10 విద్యా సంవత్సరంలో తనదైన క్రతువును ప్రారంభించింది. 2009-10 విద్యాసంవత్సరంలో 1వ తరగతితో పాటు, 3,5 తరగతుల పాఠ్య పుస్తకాలను సమూలంగా మార్పు చేశారు. ఆ తర్వాతి విద్యా సంవత్సరమైన 2010-11లో 2,4,6వ తరగతుల పాఠ్య పుస్తకాలను మార్పు చేశారు. ఆరవతరగతిలోని ‘సంఖ్యామానం’ అనే అధ్యాయంలో తెలుగు అంకెలను కనీసం పరిచయ అంశంగానైనా పొందుపరచలేదు. తెలుగు భాషపట్ల, తెలుగు సంస్కృతిపట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఈ అనాలోచిత చర్య పరాకాష్టగా చెప్పవచ్చు. పాత పాఠ్య పుస్తకంలో తెలుగు అంకెల పరిచయం ఇలా ఉంది. ‘‘తెలుగు భాషకు చెందిన ప్రాచీన గ్రంథాలు తెలుగులోనున్న జ్యోతిష్య శాస్త్ర పత్రికలు మొదలగు వాటిలో మనకు తెలుగు సంఙ్ఞ విధానంలో గూడా 10 అంకెలు వాడబడినాయి. స్థాన విలువ పద్ధతి కూడా ఉంది. హిందూ, అరబిక్ విధానంలోని స్థానాల్లో తెలుగు సంఙ్ఞ విధానంలో కూడా ఉన్నాయి. కనుక ఆ సంఙ్ఞ విధానంలోని సదుపాయాలు, లాభాలు దీనిలో (తెలుగు సంఙ్ఞ విధానంలో) కూడా ఉన్నాయి’’ అని పాఠ్య గ్రంథ రచయితలు తెలుగు అంకెల ప్రాధాన్యతను స్పష్టంగా పేర్కొన్నారు.
పాత పాఠ్య గ్రంథంలోని మొదటి అధ్యాయం పేరు ‘సంఖ్యామానం-సంఙ్ఞమానం’. ఇందులో తెలుగు అంకెల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు 4వ అభ్యాసాన్ని పొందుపరిచారు. ఈ అభ్యాసంలో రెండు సమస్యల్ని కూడా ఇచ్చారు. అయితే తెలుగు అంకెలపై పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఇవ్వరాదని ఒక హెచ్చరికను జారీ చేయడం గమనార్హం.
|
తెలుగు అంకెలపై ఆంధ్రభూమిలో 19-03-11 తేదీన ప్రచురితమైన వ్యాసం. |
తెలుగు అంకెలపై పరీక్షల్లో ప్రశ్నలను ఇవ్వకపోవడం బాధాకరం. కాగా రోమన్ అంకెల బోధనకు మాత్రం పెద్దపీట వేశారు. రోమన్ అంకెల్ని ఆజన్మాంతం మరచిపోకుండా ఉండేందుకు ప్రాజెక్టు పనుల్ని పకడ్బందీగానే పొందుపరిచారు. పాత పాఠ్యాంశం పరిస్థితి అలా ఉంటే కొత్త పాఠ్యాంశంలో తెలుగు అంకెల్ని ఏకంగా సమాధి చేసి రోమన్ అంకెలకు మరొక పేజీని అదనంగా కేటాయించి ‘ఇటాలియన్ సంస్కృతి’పట్ల విధేయతను ప్రకటించుకున్నారు. ఈ నిర్వాకాన్ని పునరుద్ఘాటిస్తున్నట్లుగా ‘‘రాష్ట్ర ప్రమాణాలకు అనుగుణంగా గణిత పాఠ్య ప్రణాళికను సమీక్షించి’’ అంటూ కొత్త పాఠ్యపుస్తకానికి రాసిన ముందు మాటలో సంకల్పం చెప్పుకున్నారు. పాత పాఠ్య ప్రణాళికలోని తెలుగు అంకెల పాఠ్యాంశాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం మాత్రం చేయలేదు. తెలుగు అంకెల్ని గణిత పాఠ్య ప్రణాళిక నుండి తొలగించిన విషయమై 15 రోజుల కిందట ‘‘రాష్ట్ర విద్యా పరిశోధక శిక్షణామండలి’’లో గణిత విభాగం అధిపతి శ్రీ బ్రహ్మయ్య గారిని సంప్రదిస్తే తాను ఇటీవల బాధ్యతలు చేపట్టానని, గతంలో ఈ నిర్ణయం జరిగి ఉండవచ్చునని వివరించారు. తెలుగు అంకెలు వినియోగంలో లేనందువల్ల ఆ పాఠ్యాంశాన్ని తొలగించి, ఉండొచ్చునని, ఏది ఏమయినా ఈ అంశాన్ని తమ మండలిలో పునఃసమీక్షిస్తామని తెలిపారు. ఎన్.టి. రామారావు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగు భాషాభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యతను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. తెలుగును అధికార భాషగా అమలు చేసేందుకు ఎన్.టి.ఆర్. పట్టుదల వహించారు. తెలుగు అంకెల పరిరక్షణకు ప్రత్యేక ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఆర్టీసీ బస్సులతోపాటు ఇతర వాహనాల నెంబరు ప్లేట్లపై తెలుగు అంకెలతో వాహనాల నెంబర్లను రాయించారు. వావిలాల గోపాలకృష్ణయ్య, నండూరి రామకృష్ణమాచార్య, డాక్టర్ సి. నారాయణ రెడ్డి, ఎ.బి.కె. ప్రసాద్ వంటి వారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా తెలుగు వికాసానికి ఎంతోకొంత పాటు పడ్డారు. ప్రస్తుతానికొస్తే 2009 మే నెల ఐదవ తేదీతో అధికార భాషా సంఘానికి గడువు తీరిపోయింది. ఇంతవరకు మళ్లీ నియామకం జరుగలేదు. తెలుగు భాషా సంస్కృతులకు ప్రపంచీకరణ ముప్పు దాపురించిందని మనం గగ్గోలు పెడుతున్నాం. ఆంగ్ల భాష ఆధిపత్యం కారణంగా తెలుగు భాష కనుమరుగైపోతోందని ఆవేదన చెందుతూ ఉద్యమబాట పడుతున్నాం. మన తెలుగు భాషను పరిరక్షించుకొనేందుకు ప్రపంచీకరణ, ఇంగ్లీషు ఆధిపత్యం లాంటి బయటి శక్తులతో అనేక రీతుల్లో పోరాటం చేస్తున్నాం. అయితే మన రాష్ట్ర ప్రభుత్వ తీరు ‘‘ఇంట్లోవాడే పెట్టే కంట్లో పుల్ల’’ అన్నట్లుగా మారిపోయింది. ప్రపంచానికి ‘సున్నా’ను అందించింది, ఎంతో విశిష్టమయినది మన భారతీయ సంస్కృతి అని, ఈనాడు ప్రపంచంలో వాడకులో ఉన్న అంకెలు హిందూ అరబిక్ అంకెలని మనకు తెలుసు. భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తికి అనుగుణంగా భిన్న సంస్కృతులకు ఆలవాలమైన మనదేశంలో అనేక వేషభాషలు, కులమతాలు, ఆచారవ్యవహారాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, తమిళం, మరాఠి, గుజరాతి, తదితర భాషల్లో ఒక్కో భాషకు ప్రత్యేకమైన నుడికారాలు, సంఙ్ఞలూ (అంకెలూ) ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆ భాషా సంస్కృతులను ఆయా భాషల్లోని ప్రత్యేకతలను వారు కాపాడుకుంటూ వస్తున్నారు. మన రాష్ట్రంలో తెలుగు భాష కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వశాఖ లేకపోవడంవల్ల ఇలాంటి సందర్భాల్లో ఎవరికితోచినట్లు వారు నిర్ణయాలు చేస్తున్నారు. తెలుగు విషయంలో ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేనందున ఈ పరిస్థితి నెలకొంది. తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, అధికార భాషా సంఘానికి విశేషాధికారాలను కల్పించి, తెలుగును రాష్ట్రంలో అన్ని స్థాయిల్లోనూ అధికార భాషగా పూర్తిగా అమలు చేయాలని, ఉద్యమకారులు ఎంతకోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉంటే పాఠ్య గ్రంథాల విషయంలోగాని, మరేదైనా విషయంలో గానీ తెలుగుకు అన్యాయం జరుక్కుండా జోక్యం చేసుకునేందుకు వీలుండేది. ఇప్పుడు తెలుగు కోసం ఏం కావాలన్నా ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఉంది. అధికార భాషా సంఘాన్ని వెంటనే నియమించడం, తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పర్చడం ఇవి తక్షణావసరాలు.-తవ్వా ఓబుల్ రెడ్డి
అంధ్రభూమి దినపత్రిక, 19-03-2011
నువ్వు ఏమీ కంగారు పడకు నాయన, బెంగాలురులో కన్నడ వాళ్ళు ఈ అంకెలను వాడుతున్నారు. :-)
ReplyDeletein karnataka children are taught kannada and hindi numbers also.
ReplyDeleteఅయ్యా ..
ReplyDeleteకన్నడ అంకెలకూ, తెలుగు అంకెలకూ తేడా ఉందన్న విషయాన్ని గమనించగలరు!
కన్నడ అంకెలు,
೦ ೧ ೨ ೩ ೪ ೫ ೬ ೭ ೮ ೯
తెలుగు అంకెలు.
౦ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯
చత్తీస్ గఢ్ ,బొరాయ్ జవహర్ నవోదయ పాఠశాల లో తెలుగు వెలుగులు..
ReplyDeletehttp://tiyyanitenugu.wordpress.com/2010/02/08/%E0%B0%9A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%80%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%97%E0%B0%A2%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%8A%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%9C%E0%B0%B5%E0%B0%B9%E0%B0%B0%E0%B1%8D/
good attempt.
ReplyDeleteస్వాభిమానం లేని తెలుగోడా మేలుకో !
ReplyDelete- డా. భాగవతము రామారావు
ఈనాటి (19-3-2011) ‘నుడి’లో ఓబుల్‌రెడ్డిగారి "తెలుగు అంకెల్ని సమాధి చేస్తారా?" చదివి ఆశ్చర్యపోయినాను. నేనిప్పటిదాకా ఎపుడో సమాధి చేయబడినాయని అనుకుంటున్నాను. రెడ్డిగారు చాలా సహృదయులు. సినారె మొదలైనవారు తెలుగు వికాసానికి కొంత పాటుపడ్డారన్నారు. నాకు తెలిసినవి రెండు. ప్రభుత్వ వాహనాలపై ఆంగ్లానికి బదులు తెలుగులో ‘ప్రభుత్వ వాహనం’ అని రాయించడం, కొద్దికాలం తర్వాత ఇది చెరపివేయబడింది. ఆర్టీసీ బస్సులతోపాటు ఇతర వాహనాలపై తెలుగు అంకెలతో నెంబర్లను రాయించారన్నారు. ఒక బస్సులపైనే రాయించారు. ఇది జరిగినప్పుడు శాసనసభలో కొందరు అభ్యంతరం పెట్టడం జరిగింది. కొన్ని తెలుగు పత్రికలు ‘ప్రయాణీకుల తికమక’ అని వార్తలు వ్రాయటం కూడా జరిగింది. తెలుగులో అదనంగా రాసి ఆంగ్లంలో ఉంచినా తికమక ఎందుకో? సున్నాతో పది అంకెలు నేర్చుకోవడానికి రోజుకొకటి చొప్పునైనా పదిరోజులు చాలుకదా!
రెడ్డిగారు అంకెల గురించి బాధపడుతున్నారు. కాని, ఎన్నో మాటలే వ్యవహారం నుండి కనుమరుగవుతున్నాయి. ఆటోలో పోతూ (అడ్రసుకు) డ్రయివరుతో ‘కుడివైపు’ అంటే అర్థంకాక మనను వింత జంతువువలె చూస్తాడు. మీ ఫాదర్, మదర్, వైఫ్ అనే తప్ప నాన్న, అమ్మ, భార్య అనే వారెందరు? ఇదేదో ఆంగ్లమాధ్యమంలో చదివినవారి సంగతి కాదు. ఆంగ్లం చదవలేనివారూ ఇంతే. సంస్కృతం, తెలుగు చదివి, పౌరోహిత్యం మొదలైన వృత్తుల్లో ఉన్నవారు కూడా టుమారో మామదర్ సెరెమనీ, మండే మీటవుదాం లాంటి మాటలు మాట్లాడటం నేను చాలా వింటుంటాను. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలకంటె పరకీయమైన వాటిమీద తెలుగువారికి మొదటి నుండీ ఆసక్తి మెండు. కంపు అనే పదం మొదట వాసన చెప్పేదే అయినా తర్వాత చెడువాసనకే వాడుతున్నాము. ఏదైనా విగ్రహం విరిగితే విరిగిందని అనగూడదు భగ్నమైనదని అనాలి అనేవారు. ఇట్లాంటివెన్నో. షిర్డి, అయ్యప్ప భక్తుల్లో తెలుగువారే ఎక్కువ. సక్కుబాయి, తుకారాం మొదలైనవారి సినిమాలు, నవలలు వచ్చినవి. మనలో టాగూర్లూ, రాజేంద్ర ప్రసాద్‌లు, నెహ్రూలు, గాంధీలు, తిలక్‌లు ఉన్నారు. ఇక కాంగ్రేసువారు ప్రతి సంస్థకు, విశ్వవిద్యాలయాలకు, విమానాశ్రయానికి, స్టేడియంలకు, రంగస్థలానికి, అన్ని పథకాలకు, ఒకటేమిటి... అన్నింటికీ రాజీవ్, ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లే తగిలిస్తారు. ప్రతి ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా వింటాము. చూస్తాము. కాని ఆంజనేయ దండకమున్నదని తెలిసినవారెందరు? అప్పుడప్పుడు స్వాభిమానం లేని తెలుగువాడిగా వచ్చే జన్మలో పుట్టగూడదని కోరాలని అనిపిస్తూ ఉంటుంది.
తెలుగు అంకెల గురించిన వ్యాసం చాలా ఆలస్యంగా చదివాను. అయినా మించిపోయిందేమీ లేదు. ఆలస్యం అమృతం విషం అంటారుగానీ, అది అది అన్నింటికీ వర్తించదు. తెలుగంటే నాకిష్టం.
ReplyDeleteసామాన్యంగా వలస మిత్రులకే గానీ స్థానికులైన తెలుగువారికి ఇంగ్లీషంటే తప్ప తెలుగంటే అంత ఆదరాభిమానాలుండవు. అలా ఉండక పోవడమే తెలుగువాడి ప్రత్యేకత.
తెలుగు అంకెల గురించి మాట్లాడేటప్పుడు మనం ముందుగా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. తెలుగునాట ఎక్కడా తెలుగు అంకెలు కనపడవు. నాకు తెలిసినంతలో చాలామంది తెలుగు అయ్యవార్లకి కూడా తెలుగు అంకెలు రావు. ఎవరికీ రాని ఆ అంకెలు ఉంటే ఎంత ఉండకపోతే ఎంత ?
ఇది నా ఉద్దేశం కాదు. తెలుగువాళ్ళలో అత్యధిక శాతం మేధావుల ఉద్దేశం . అందుకే, దాదాపు అయిదు తరాలు దాటిన తరవాత తెలుగు అంకెల గురించి ఇలా మాట్లాడుకోవలసిన దుస్థితి పట్టింది. అయినాసరే కనీసం ఇప్పుడయినా మేలుకొనే ప్రయత్నాలు జరుగుతున్నందుకు చాలా ఆనందంగా వుంది.
గతంలో కనీసం పాఠ్య పుస్తకాల్లో అయినా తెలుగు అంకెలు కనిపించేవి ఇప్పుడు అందులో కూడా కనిపించకుండా మాయయై పోయాయి. అంతే తేడా.
ఇది కేవలం అంకెల విషయంలో మాత్రమే కాదు లెక్క లేనన్ని తెలుగు పదాల విషయంలోనూ ఇదే జరుగుతోందనేది వాస్తవం. అలాగే అత్యుత్సాహంతో చాలా పదాలని అచ్చమైన తెలుగు అనుకుని సంస్కృతంలోకి అనువదిస్తూండటం కూడా వాస్తవమే. ప్రయాణ సాధనాలమీద తెలుగు అంకెలని వేయించడం గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ సందర్భంగా తెలుగు పత్రికలు తికమక పెడుతున్నాయని రాశాయన్నారు. అలా రాయడానికి మన తెలుగు పత్రికలకి నైతిక అర్హత లేదు. ఎందుకంటే, తెలుగు అంకెలు తెల్గు నాట కనపడకుండా పోవడంలో పత్రికల పాత్ర చాలావుంది.
భారత దేశంలో అన్ని భాషల్లోనూ వెలువడే పత్రికలు ఆయా భాషలలోని అంకెలనే ఉపయోగిస్తాయి. కేవలం తెలుగు పత్రికలు మాత్రమే తెలుగు కాని అంకెలని వాడతాయి.
ఎందుకు ?
తెలుగు పత్రికలకి విలువలంటే కేవలం వాణిజ్య విలువలు మాత్రమే.
కాబట్టీ, లాభం లేని పనులు చెయ్యవు. అందరూ ఏది కోరుతున్నా మేం అదే ఇస్తున్నామంటాయి. నిజానికి పత్రికలనేవి సమాజం కోరినది కాదు సమాజానికి కావలసినదివ్వాలి. ఆ కావలసినదాన్ని అందించడంలో పత్రికలు తమ బాధ్యతని విస్మరించాయి.
దాని పరిణామమే ఈ భాషా పరమైన అవనతికి కారణం. పత్రికల బాటలోనే ఎలక్ట్రానిక్ మీడియా కూడా పయనిస్తోంది. ఇప్పుడీ జాలా తోరణంలో కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. ఉదాహరణకి కన్నడిగులు తయారు చేసిన బరహ సాఫ్ట్ వేర్ లో మనం తెలుగులో టైపు చేస్తున్నప్పుడు తెలుగు అంకెలే అచ్చవుతాయి. అదే లేఖినిలో చేస్తే హిందూ అరబిచ్ సంకేతాలే కనిపిస్తాయి. అలాగే బరహ అంటే రాత అని అర్ధం. అది అచ్చ కన్నడ పదం. అదే మనవాళ్ళ సాఫ్ట్ వేర్ పేరు, లేఖిని. ఇది తెలుగు పదం కాదు. సంస్కృత పదం. ఇదే మన తెలుగు వాళ్ళ ప్రత్యేకత. ఎగదీస్తే ఇంగ్లీషు. దిగదీస్తే సంస్కృతం. అంతే తప్ప తీయని తెలుగుని దరిచేరనివ్వం. అందుకే మనం ఇలా ఇంగ్లీష్ మీడియంలో తప్ప తెలుగు మీడియంలో చదివితే పిల్లలకి తెలివితేటలు అబ్బవనే అపోహల్లోనే బతుకుతూ ముందు తరాలకి తెలుగు తీపిని అందిచలేని దౌర్భాగ్యంలో పడి కొట్టుకుంటున్నాం.
చాలా చక్కగా చెప్పారు. ప్రణవి గారు చెప్పినట్లు మనవాళ్ళు ఎగదీస్తే ఇంగ్లీషు దిగదీస్తే సంస్కృతం. తెలుగు వాళ్ళు చాలా తేడా గాళ్ళు. నేను ఇప్పుడు మన రాష్ట్రం వెలుపల, పుణెలో ఉంటున్నా. ఇక్కడ అన్ని కొట్లమీదా పేరుపలకలు తప్పనిసరిగా మరాఠీలొ ఉంటాయి. కానీ మన తలపట్టణంలో అయితే తెలుగు పేరుపలకల కొరకు పెద్ద భూతద్దం ఒకటి పట్టుకొని బయలుదేరాలి. పొరపాటున ఎక్కడైనా కనిపించినా అవి ఇంగ్లీషునో, సంస్కృతమునో తెలుగు లిపిలో వ్రాసినట్టుంటాయి.
ReplyDeleteనేను పదవ తరగతి వరకూ తెలుగు మీడియంలో చదివాను. సైన్సు పుస్తకాల్లో ఉండే 'టర్మినాలజి ' ని తెల్లం(అర్థం) చేసుకోవాలంటే సంస్కృతం నేర్చుకొనే తీరాలి. ఎన్నో యేళ్ళనుండి ఈ పుస్తకాల రచన చేసే అకాడెమీ తెలుగు తెలిసిన వారు కాక సంస్కృతాన్ని తెలుగు లిపిలో వ్రాసేవారితో నిండిపోయింది. ఈ పండితులకి తెలుగంటే ఎంతో చిన్న చూపు. వాళ్ళు మాట్లాడుకునే నుడి(భాష)ని అందరి మీదా రుద్దుతుంటారు. మనం కూడా 'మొగుడూపెళ్ళాలు ' అంటే చిన్నతనంగా అనుకుని, 'భార్యాభర్తలు ' అంటే గొప్ప గౌరవంగా అనుకుంటాం. మన మెదళ్ళలో అంతలా బలంగా నాటుకునిపోయింది సంస్కృతం. అంతకన్నా 'నాటారు ' అంటే బావుంటుందేమో. ఇక ఇప్పుడు కొత్తగా 'వైఫ్ అండ్ హస్బెండ్ ' అనడం సంస్కారం, అలా అనకపోతే మనకు ఇంగ్లీషు రాదనుకుంటారు, అప్పుడు తల తీసినట్టవదూ. ఇద్దరు తెలుగు వాళ్ళు బయట ఎక్కడ కలిసినా ఇంగ్లీషులోనే మాట్లాడతారనేది నాకు బాగా ఎరుకలోకి వచ్చింది.మొన్న ఒక తమిళాయనను కలవడం జరిగింది రైలు ప్రయాణంలో.మాటల్లో, తమిళం, కన్నడంలో ఇతర భాషా పదాలు చాలా తక్కువ, తెలుగు ఎక్కువమంది మాట్లాడే నుడి అయినప్పటికీ అందులో డెబ్బది పాళ్ళకు పైగా సంస్కృత పదాలే అంటూ దెప్పిపొడిచాడు. సంస్కృత పక్షపాతంతో తెలుగుని చంపేసిన మన అనువాద కవులూ, 'సంస్కృత ఏజెంట్ల ' గురించి ఆయనకు ఎలా చెప్పేది?
ఒరులను(ఇతరులను) బాగు చేయడానికి పూనుకొనే ముందు మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. వీలైంతవరకూ తెలుగులొనే(తెలుగులో, సంస్కృఅతంలో కాదు) మాట్లాడాలి సిగ్గుపడకుండా. మార్పు అనేది ఇలాగే మొదలవుతుంది మరి.
నేను మా ఊళ్ళో వాడే మాటలను ఒక చోట కూర్చాలనుకుంటున్నాను.
విజయ్ గారూ,
ReplyDeleteపూనాలో మరాఠీ ఏమాత్రం చదవకుండా చదువు ముగించే అవకాశం ఉందా ? నాకు తెలిసినంతవరకూ తమిళనాడు, కర్ణాటకల్లో అలాంటి అవకాశం లేదు. అదే తెలుగునాట అక్షరమ్ముక్క తెలుగు రాకపోయినా చదువులో పట్టాలు పొందే అవకాశం ఉంది. ఇది మనకి సిగ్గు చేటు. ఆంగ్లంలో చదివితేనే ఉద్యోగాలొస్తాయనే అపోహ కేవలం మనరాష్ట్రంలోనే బలిసిందా లేక అక్కడ కూడా ఉందా ? తెలియజేయగలరు.
మీరు మీ ప్రాంతంలో వాడే తెలుగు పదాలను ఒకచోట చేర్చాలనే నిర్ణయం తీసుకోవడం మన తెలుగువాళ్ళందరికీ ఒజ్జబంతిగా మారాలని మనసారా కోరుతున్నాను. నేను ఎక్కువగా ఒక ప్రాంతపు మాండలికంలో రాస్తాను. దాన్ని చదివిన ఇతర ప్రాంతాలవాళ్ళు వీలయితే ప్రామాణిక భాషలో రాయండి అప్పుడు అన్ని ప్రాంతాలవారికీ సులభంగా అర్థమౌతుందని సలహాలిస్తూంటారు. మా ప్రాంతంలో మాట్లాడేదీ తెలుగే. ఇతర ప్రాంతాల్లో మాట్లాడేదీ తెలుగే. అయినప్పటికీ తెలుగు పదాలని అర్థం చేసుకోవడం కష్టమౌతుందని తెలుగు రచయితలే సాటి తెలుగు రచయితలకి సలహాలివ్వడం అనేది తెలుగు రచయితలకి తప్ప మరే భాషా రచయితలకీ సాధ్యం కాదు. ఈ అనుచితమైన ఉచిత సలహాలిచ్చే తెలుగురచయితలందరూ మన తెలుగుకి ఎంతమాత్రం ఒప్పని ఎంగిలి ముక్కల్ని అక్కరగా నేర్చుకుంటారు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఆంగ్లం చాలా ఉపకరిస్తుందని తెగ మెచ్చుకుంటారు. అదీ తెలుగువారి ప్రత్యేకత.
ప్రణవి
ప్రణవి గారూ,
Deleteమీ తిరుగుని నేను చాలా జాగుగా చదివాను. పూనాలో నాకు తెలిసి మరాఠీ చదవకుండా చదువు ముగియదు నాకు తెలిసింత మట్టుకు. మన తెలుగు వాళ్ళు తేడాగాళ్ళు అని ముందే చెప్పాను.
ఇక మాండలికపు ముచ్చటకి వస్తే, మనం ప్రామాణిక నుడి(భాష) అని పిలుస్తున్నది దేన్ని? అక్కర ఉన్నా లేక పోయినా సంస్కృత మాటల్ని వాడుతూ తమకు ఏ పాటి సంస్కృతం తెలుసో చెప్తూ సాగే రాతలను కాక మరి దేన్ని? ఈ సంస్కృతం వకీళ్ళందరికీ పనికి వచ్చే, కుంటి సాకు ఏంటొ తెలుసా? మాండలికాలు. మన దగ్గర ఇన్ని మాండాలికాలు ఉన్నాయి. ఏ మాండలికాన్ని వాడాలి అని ఒక అడక లేవదీస్తారు. మిగతా వారిలో దీని మీద ఒక ఒప్పందం లేకపోవడం వలన వాళ్ళు తమకు అలవాటయిన సంస్కృతాన్ని అందరి మీద రుద్దుతారు. అంతె కానీ నిజంగా తెలుగు(సంస్కృతం కాదు) మీద నెనరు(అభిమానం) కల వాళ్ళు, వ్రాతరులందరూ కూర్చుని, అన్ని ఒక్కొక్క మాటను అన్ని మాండలికాల్లో, తెలుగునాటికి వెలుపల ఉన్నవి కూడా కలుపుకుని, ఏమంటారొ ఒక చోట కూర్చి, అందులోనుంచి తేలికగా ఉన్నట్టివీ, ఇంకా వాటినుంది మరిన్ని మాటలు పుట్టించ వీలున్న మాటలను ఎట్టి సీమ తేడాలు లేకుండా తీసుకుని, అట్టి మాటలతో కూడిన దాన్ని మన కొలనుడి(ప్రామాణిక భాష)గా ఎందుకు చేసుకోకూడదు?
దీనికి మొదటగా అడ్డు పడే వాళ్ళు, ప్రామాణికత పేరుతో, మంది నుడిని అణగదొక్కి తమ పబ్బం గడిపే వాళ్ళే. ఇలాంటి వారి మీద మానవ హక్కుల కమిషన్లో ఆరడి(ఫిర్యాదు) చేయాలి.
తెలుగుకి జరిగిన అన్యాన్ని(గొడు చెప్పుకోను కూడా అచ్చమైన తెలుగు మాట లేకుండా చేసారు) తలుచుకుంతే కడుపు తరుక్కొనిపోతున్నది.