Sunday, April 3, 2011

సకల లోక మనో నివాసమైన చైత్రోత్సవమే “ ఉగాది ” !

ప్రాచీన కాలంనుండే ఋతువులు మానవజీవితంలో పండుగలుగా నెలకొన్నవి. చైత్రోత్సవం 'భవిష్యత్‌ పురాణం'లో ప్రస్తావించబడింది.
 ''చైత్రోత్సవే సకలలోక మనోనివాసం
 కామం వసంత మలయాద్రి మరుత్సహాయం
 రత్యా సహార్చ్య పురుష: ప్రవరా చ యోషిత్‌
 సౌభాగ్యరూపనుత సౌఖ్యయుతా సదాస్సాత్‌''
 సకల లోకమనో నివాసమైన చైత్రోత్సవం కోరికల విజృంభణకు మలయ మారుతం తోడై రతీ క్రీడలకు ప్రేరకమై సౌభాగ్య, సుఖ సంతోషాలకు హేతువు అయింది. యశోధరుడు తన 'జయమంగళ' కావ్యంలో వాత్స్యాయనుని కామసూత్రాలను వ్యాఖ్యానిస్తూ సువసంతక, మదనోత్సవ, హోళికోత్సవాలను వర్ణించాడు. క్రీ.శ. నాల్గవ శతాబ్దంలోని జ్యోతి ర్వేత్త వరాహమిహిరుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోని మొదటి రోజే వసంతకాలమని, వసంత విష్ణువ త్కాలంగా నిర్ణయించి, మాస ఋతుసామరస్యాని సాధించి, సంవత్సరాది వసంతకాలంలోనే అని నిర్ణయించాడు. అప్పటినుండి చైత్ర శుద్ధ పాఢ్యమినే సంవత్సరాదిగా యుగాది (ఉగాది)గా పాటించ బడుతున్నది.
 ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కొందరు ప్రభువులు వసంతోత్సవాలను ఆ ఋతువులో నిర్వహించి ఆనందాన్ని పొందినట్లు చరిత్ర చెబుతూంది. కొండవీటిని పాలించిన కుమారగిరిరెడ్డికి వసంతోత్సవం కారణంగానే 'కర్పూర వసంతరాయలు' అనే పేరు వచ్చింది. 'వసంత రాజీయం' అనే కృతి అతని మధుమాస ప్రేమకు ప్రతీక. విజయనగర సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి నంది తిమ్మన తన 'పారిజాతాపహరణం' కావ్య ప్రబంధంలో ప్రతివర్ష వసంతోత్సం ప్రశంస చేశాడు.
 ప్రాచీన అలంకారికుడు భామహుడు 'నగరార్ణవ శైలర్తు చంద్రార్కోదయ వర్ణనై' అని తన 'కావ్యాలంకారం'లో ఋతువర్ణం కావ్య లక్షణంగా పేర్కొన్నాడు. రాజశేఖరుడు తన 'కావ్య మీమాంస' లోని కాలవిభాగంలో ఋతు లక్షణాలను విశదీకరించాడు. 'ప్రాతర్మాధ్యాహ్న మృగయాశైలర్తు వన సాగరా,' అని విశ్వనాథుడు 'సాహిత్య దర్పణం'లో ఋతువర్ణనను పేర్కొన్నాడు. ఈ విధంగా సాహిత్య శాస్త్ర గ్రంథాలలో ఋతువర్ణన ప్రాధాన్యతను సంతరించుకున్నది.
 వసంతఋతు వర్ణనను కవులు కావ్య ప్రపంచంలో ఉద్దీపన విభావములుగా పేర్కొన్నారు. వసంత ఋతువు నాయికా నాయకులకు ఉద్దీపన విభావములు కల్పించే సమ్మోహనాస్త్రం అనగా మనోవికారా నికి హేతువు. చంద్ర మలయానిలం మొదలుకొని ప్రకృతిలోనున్న రమణీయ, వస్తు సందయములు ఉద్దీపనా విభావములే. చైత్ర మాసంలో వసంతఋతువులో శృంగార ఉద్దీపన విభావములు కలిగించే ప్రకృతి రమణీయతను పూవిలుకాని పంచబాణాలలో దర్శించడమయింది.
 ''అరవింద మశోకంచ, చూతంచ నవ మల్లికా!
 నీలోత్పలం చ పంచయితే, పంచ బాణస్యనాయకా:'
 తిరవిందలు, అశోకలు, మామిళ్లు, కొత్త మల్లెలు, నీలోత్ఫలాలు ఇవి అయిదు పూవిలుకాడు మన్మధుని బాణాలు. ఇవి వసంత కాలంలో నాయికా నాయకులతో శృంగార భావాలను ప్రేరేపిస్తాయి కనుక ఉద్దీపనా విభావములుగా కవి సమయాలు.
 'ఋ-గతౌ' అనే సంస్కృత ధాతువు నుండి 'ఋతు' శబ్దం నిష్పన్నము. 'ఇయర్తీతి ఋతు:', 'ఋచ్ఛతీతి ఋతు:' అనే వ్యుత్పత్తులో కాలగమనం, పరిణామం ఋతువులవలనే అనే అర్థం ఇమిడి వుంది. 'ఋతం' అంటే కంపనము, చలనము. 'ఇయర్తి హృదయం ఇతి ఋతమ్‌' 'ఋ-గతౌ', హృదయంగమనమైన గతియే ఋతము అని అమరకోశము వ్యాఖ్యానము. చేతనా చేతనం కలిగిన ప్రకృతిలోని అన్ని వస్తువులు క్రమము తప్పక, స్వధర్మాన్ని విడనాడక ప్రవర్తించేందుకు హేతువు ఋతువు అని, ప్రపంచ స్థితిలో కనబడే నియమమే ఋతమని పాశ్చాత్యులు దీనిని 'రిథిమ్‌' అంటారని పెద్దల భావన. సృష్టి, స్థితి, లయ కారకుడైన పరమేశ్వరుని ఈ మూడు లక్షణాలు ఋతుచక్రంలో ప్రతి ఫలిస్తాయి. వసంత, గ్రీష్మములు సృష్టి కారకములు. వర్షాశక్తులు స్థితి కారకములు. హేమంత శిశిరములు లయ కారకములు. 'జాయతే అస్తి వర్ధతే పరిణమతే అపక్షీయతే వినశ్యతి', అని సృష్టిలోని ప్రతిపదార్థానికి ఆరు దశలు ఉన్నవి. అదృశ్యమైన కాలము యొక్క షడ్భావ వికారరూపమైన కార్యక్రమానికి షడృ తువులు ప్రతీకలు.
 వసంత ఋతువులో చెట్లకు చివురుటాకులు ఉదయిస్తాయి. ఇది 'జాయతే' అనే తొలి దశ. గ్రీష్మ ఋతువు కార్యము 'ఆస్తి ఆకు వర్షఋతువులో వర్థిల్లుతుంది కనుక వర్థతే శరత్తులో సరిపక్వమవు తుంది కనుక పరిణమితే. హేమంత ఋతువు క్షీణ దశ అనగా 'అపక్షీయతే', శిధిలమయిన ఆకు శిశిరంలో రాలిపోతుంది, 'వినశ్యతి. ప్రకృతి ఋతువులు సృష్టి లక్షణాలను వాల్మీకి రామాయణంలో శ్రీరామునిచే ఇలా పలికించాడు.
 ''హృష్యంచృతు ముఖం, దృష్ట్యా నవం నవమిహాగతమ్‌'
 ఋతూనాం పరివర్తేన ప్రాణినాం ప్రాణి సంక్షయ:'
 మానవుడు పరిస్థితులను గుణంగా వ్యవహరిస్తూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనే సందేశం సృష్టికర్త ఋతుముఖేన అందించాడు.
 ఉపనిషత్సారమైన భగవద్గీత పర బ్రహ్మాన్ని అఖండ కాల స్వరూపముగ సంభావిస్తూ కాల విభాగంలో ఋతువులు పరమాత్మ తత్త్వానికి ప్రధాన స్పోరకములుగా పేర్కొంది.
 'మాసానాం మార్గశీర్షో అహం ఋతూనా
 కుసుమాకర:'
 మాసములలో మార్గశిరం, ఋతువులలో శ్రేష్ఠమైన వసంతము నేనే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. 'ఋతు: సుదర్శన: కాల: పరమేష్ఠీ పరిగ్రహ:' అని శ్రీ విష్ణు సహస్ర నామము ఋతువు పరమాత్మకు అభిన్నముగా వర్ణించింది. వాల్మీకి రామాయణంలో వసంతఋతువుకి అధిక ప్రాధాన్యత నిచ్చి ప్రకృతి వర్ణనలను సహజముగా స్వభావసిద్ధంగా తీర్చిదిద్ది, ప్రకృతికి పాత్రలకు తాదాత్మ్యము చూపిన ఆదికవి. ఋతువర్ణనలో వాల్మీకిని అనుసరించిన కాళిదాసు 'ఋతుసంహారము' ప్రత్యక్షంగా ఋతు వర్ణనల కోసం వ్రాయబడిన తాలికావ్యము.
 'పుంస్కోకిల: చూత రసాసవేన
 మత్త: ప్రియాం చుమ్చతి రాగ హృష్ట:
 కూజ ద్ద్విరేఫో ప్యయ మమ్బుజ స్థ:
 ప్రియం ప్రియాయా: ప్రకరోతి చాటు'
 మగకోకిల మామిడి చిగుళ్లను తిని మదించి అనురాగముతో తన ప్రియురాలిని ముద్దిడుకొంటూ ఉంది. తామర పువ్వులో ఝుంకారం చేసే మగతేటి తన ప్రియురాలి కిష్టమైన శృంగార చేష్టలు చేస్తూంది. వసంతము మానవ హృదయ పరితోషకము. ఋతువు లన్నింటిలో ఆహ్లాదకరమైన ఈ ఋతువును కవులు, రసజ్ఞులు 'ఋతురాజుని', 'ఋతూరాజో కుసుమాకర:' అని గౌరవించి అక్షరాభిషేకం చేశారు. ఆధ్యాత్మ రామాయణాన్ని తేట తెలుగులో వ్రాసిన మడక సింగన ఒక ప్రకృతి వర్ణన కూడా కనబడని వాసిష్ఠ రామాయణానువాదంలో వసంత వర్ణన క్లుప్తంగానైనా చేసి వసంత మహిమను నిరూపించాడు. తెలుగులో ఆదికవిగా ప్రసిద్ధిగాంచిన నన్నయ 'ఆంధ్రమహాభారతము' ఆది పర్వములో వసంతాన్ని సహజంగా వర్ణించాడు. 'కమ్మని లతాంతములకుమ్మెనసి వచ్చు మధుపమ్ముల సుగీత నిన్నదమ్ము లెసగెం,' తాపన వృత్తిలో నున్న పాండురాజుకు మాద్రిపై మరులు గొనుటకు ఇనుమడించిన వసంత శోభ కామోద్దీపకమైనట్లు వర్ణించాడు. నన్నెచోడుడు 'కుమారసుభవము'లో వసంతాన్ని యోగీశ్వరుడైన పరమేశ్వరునికి పార్వతిపై మనసు నిలుపడంలో అత్యంత రమ్యంగా వర్ణించి కామోద్దీపకరముగా చేశాడు. సర్వ ప్రాణులకు మనోవికారం కలిగించేటంతగా వసంత వాతావరణాన్ని కల్పించి, ధ్యాన మగ్న మానసుడైన శివుని రాగమగ్న మానసుని చేయటానికి వచ్చిన మన్మధుడు తానే కామాతురుడైనాడు.
 || ''ఆమనికి నెలమి విపులా
 రామంబుల పొల్పు సూచి రాగోత్కటమై
 కాముడు రతిగని తానును
 గామాతురుడై మనోవికారము నొందెన్‌''
 నన్నయ వర్ణించిన వసంతము పాండురాజుకు ప్రాణాంతకమైతే, నన్నెచోడుని వసంతము రతీకాంతుడు మన్మధునికి దేహుతకమైనది.
 కవులు ఒక ఋతువులో మరొక ఋతు లక్షణాలు తోచేటట్లు, ఒకే కాలంలో అన్ని ఋతువులు ద్యోతక మయేట్లు వర్ణించడానికి గురువు కాళిదాసు 'మేఘసందేశము'లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. ఎర్రన 'నృసింహ పురాణం'లోనూ, నన్నెచోడుడు 'కుమార సంభవంలోనూ, గోన బుద్ధారెడ్డి 'రంగనాథ రామాయణం'లోనూ ఈ బాటలోనే పయనించి చరితార్థులైనారు. 'నృసింహ పురాణం' లో హిరణ్య కశిపుని తపస్సుని భంగపరచటానికి దేవేంద్రుడు తిలోత్తమాది అప్సరసలను పంపాడు. ఈ సన్ని వేశంలో వర్ణితమైన వసంతంలో ఎర్రన వర్షఋతువు లక్షణాలను స్ఫురింపజేశాడు. పరమశివునికై, పార్వతి కఠోరమైన తపస్సు చేసే సందర్భంలో 'కుమారసంభవం' కావ్యంలో నన్నెచోడడు షడ్రుతువుల సమ్మేళ నాన్ని సందర్శించాడు. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో వసంతాన్ని వర్షఋతుపరంగా వర్ణించాడు. శ్రీరాముడు సీతను వెదుకుతూ వచ్చి పంపా సరోదరవరం వద్ద, సీతను పోగొట్టుకొని ఒంటరిగా ఉన్నప్పుడు, వసంత శోభ వర్షఋతువు వలె కనిపించి మానసిక క్షోభను కలిగించింది.
 'వసుధ రాలెడు విరుల్‌ వర్షో పలములు
 ముసురు తేనియసోన ముంచిన వాన
 గా నొప్పుచు వసంత కాలంబు చూడ
 వానకాలము బోలి వసుధ నొప్పియును'
 ఋతువర్ణనలనగానే తెలుగు వాఙ్మయంలో ప్రప్రధమంగా స్మరణకు వచ్చేవాడు శ్రీకృష్ణదేవరాయలు. నిశిత ప్రకృతి పరిశీలనతో, అనుభవైరో వేద్యమైన ఋతు లక్షణాలకు రమణీయ రూప కల్పన చేసి, ఋతువులలో జీవకోటి ప్రవర్తనలోని వైలక్షణ్యాన్ని సుస్పష్ట రేఖలతో ఉన్మీలించిన వర్ణచిత్రకారుడు రాయలు. ఆయా ఋతువుల్లోకి ప్రకృతి పరిస్థితుల్ని సూక్ష్మాతి సూక్ష్మవివరాలతో సాక్షాత్కరింప జేసిన ప్రతిభాశాలి. నిత్య జీవితంలో ఉపేక్షాపాత్రలైన అనేక దృశ్యాలను రాయలు పఠితల పరిశీలనకు పాత్రత కల్పించాడు. కొంగలు బొమ్మిడాయల భక్షించటం మొదలు అంత:పుర లీలావిలాసాల వరకు రాయలు వర్ణించాడు.
                                                                                                - మంగు శివరామ ప్రసాద్‌
అంధ్రప్రభ దినపత్రిక సౌజన్యంతో..! 

No comments:

Post a Comment