Friday, April 15, 2011

తెలుగులో అంతర్జాలంపై హైదరాబాద్‌లో సదస్సు

అంతర్జాలం వేదికగా విస్తరిస్తున్న కాల్పనిక (వర్చువల్‌) గ్రంధాలలోని తెలుగులో భాషాపరంగా సాగుతున్న ఆధునికీకరణ సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఈ ప్రక్రియకు దిశానిర్దేశం చేసే ప్రక్రియలో పాలు పంచుకుంటున్న విద్యావేత్తలు, ఫాంట్‌ డెవలపర్లు, విషయ (కంటెంట్‌) డెవలపర్లు, భాషా శాస్త్రవేత్తలు రేపు (16న) హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. అంతర్జాల వాడకందార్ల దేశాల్లో చైనా (21.5%), అమెరికా (12.2%), జపాన్‌ (5%) తరవాత స్థానంలో భారత్‌ (4.1%) ఉంది. అయితే మొదటి 10 అంతర్జాల భాషల్లో ఏ భారతీయ భాషకూ స్థానం దక్కలేదు. 121 కోట్ల మంది నివసిస్తున్న దేశంలో అంతర్జాలాన్ని ఎక్కువమందికి దరి చేర్చాలంటే దేశీయ భాషల్లో వినియోగించేలా ఉండాలని ఇటీవల జరిగిన వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ (www) సదస్సులో ఆయా రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంగ్లం నుంచి దేశీయ భాషల్లోకి, దేశీయ భాషల మధ్య సమాచారాన్ని అనువదించే మెషీన్‌ ట్రాన్స్‌లేషన్‌ (ఎంటీ) సిస్టమ్స్‌ను ఈ సదస్సులో ప్రారంభించిన సంగతి విదితమే. http://sampark.org.in, www.tdil-dc.in వెబ్‌సైట్‌లలో 200 పదాలకు మించని విషయాన్ని పొందుపరిస్తే, అనువాదం లభిస్తుంది. ఈ ప్రక్రియలో ముఖ్యపాత్ర పోషించిన ట్రిపుల్‌ ఐటీ (హైదరాబాద్‌)తో పాటు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రతినిధులు తాజా సమావేశం ఏర్పాటులోనూ చొరవ తీసుకున్నారు. ఆయా భాషల్లో సమాచారాన్ని (ఇ కంటెంట్‌) పొందుపరచడం వల్ల నెట్‌ వినియోగంలో ఉన్న భాషాపరమైన అవరోధాన్ని తొలగించగలమని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ గారపాటి ఉమామహేశ్వరరావు చెప్పారు. గూగుల్‌కు పోటీగా చైనా సొంతగా సెర్చ్‌ ఇంజిన్‌ను అభివృద్ధి చేసుకుందని గుర్తు చేస్తూ, తెలుగు భాషలో ప్రశ్న వేస్తే, అంతర్జాలంలో ఇతర భాషల్లో ఉన్న సమాచారాన్ని వెతికి పట్టుకుని, తెలుగులో అందించే పరిజ్ఞానం అభివృద్ధి చేయాలన్నదే నిపుణుల ఆకాంక్ష అని ఆయన తెలిపారు. శనివారం ఉదయం హైదరాబాద్‌ (జూబ్లీహిల్స్‌)లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో  విద్యావేత్తలు, ఫాంట్‌ డెవలపర్లు, విషయ (కంటెంట్‌) డెవలపర్లు, భాషా శాస్త్రవేత్తలు రేపు హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు.

1 comment:

  1. మిత్రమా పైన మీరిచ్చిన అనువాద వెబ్‌సైట్స్ పని చేయట్లేదు..ఒక సారి వాటిని సరిచూడగలరు.

    ReplyDelete