Saturday, April 16, 2011

తెలుగు అభివృద్ధికి 'అంతర్జాలం' కీలకం

మన సమాజం అత్యంత వేగంగా ‘ఉన్నత సాంకేతిక’ విజ్ఞానమే లక్ష్యంగా దూసుకు పోతోంది. ఇలాంటి సమాజం సమాచార సృష్టితో పాటు సమాచార ప్రసార వినిమయాలకు విశేష ప్రాధాన్యం ఇస్తుంది. కంప్యూటర్‌తో పాటు అంతర్జాలం (ఇంటర్నెట్) అన్ని రంగాలలోనూ విపరీతమైన మార్పులను తీసుకొచ్చింది. సాంకేతిక, విద్యారంగాలతో పాటు జీవ, ఖగోళ, భౌతిక, మానవ నిర్మాణ, సామాజిక, తత్వశాస్త్రాలు, సాహిత్యం మొదలైన అన్ని రంగాల్లో ఇవి వౌలికమైన మార్పులను తీసుకువచ్చాయి.
సాధారణంగా కంప్యూటరు, దాన్ని ఆధారంగా చేసుకున్న ‘అంతర్జాలం’ - జ్ఞానాన్ని అందుకొంటూ దాన్ని వ్యాపింప చేయడానికి తగిన రూపంలో జ్ఞాన సృజనకు వీలు కలిగిస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలను చేరుకోవడానికి సమాచార సాంకేతిక (Information Technology) ఓ సాధనం. ఇది జ్ఞానాధిక్యం లోనే కాదు. సాంకేతిక వైవిధ్యంలోనూ ఎన్నడూ లేనంత గుర్తింపు పొందింది. దీనిని వివిధ నిర్మాణ సేవలకి సంబంధించిన ఏ అంశానికైనా అనువర్తింపచేయవచ్చు. అంతర్జాలానికి అనుసంధించిన కంప్యూటర్లు ఎటువంటి పనికొచ్చే జ్ఞానాన్నయినా ‘వెంటనే ఉపయోగించదగిన జ్ఞానంగా’ మార్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. కంప్యూటర్లూ అంతర్జాలమూ ప్రస్తుత పరిస్థితిలో సమాజ అవసరాల కోసం భారతీయ భాషల అత్యవసర ప్రాధాన్యతని నిర్వచిస్తున్నాయి. కంప్యూటరీకరణలో భారతీయ భాషల ప్రవేశం జాతీయ బహుళ భాషల, బహుళ మాధ్యమాల కంప్యూటరీకరణలో భాగంగా చూడాలి. అంతేకాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాచార సాంకేతికతలో వాటి సహజ స్థానాన్ని పొందేందుకు భారతీయ భాషలను అభివృద్ధి చేయడానికి, ప్రచారం చేయడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానూ చూడాలి. కంప్యూటర్లు అక్షరాస్యతని పెంచడానికేగాక, మానవ వనరుల బహుళ ప్రయోజనం కోసం ఉపయోగపడుతున్నాయి.
ఇవి భాషా సాంకేతికతకు సంబంధించిన దార్శనిక ఆశయాలలో పేర్కొన్నట్లు సాంఖ్యక తేడాని (డిజిటల్ డివైడ్) తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ సందర్భంలో దీనిని ప్రజలందరి వినియోగం కోసం అవసరమైన జాతీయ లక్ష్యాలను చేరుకోవడానికి బాగా సరిపోయే ప్రయోజనకరమైన సాంకేతిక విజ్ఞానంగా భావించాలి. మన ప్రాంతీయ భాషలు ఈ రంగంలో తమ సరైన స్థానాన్ని పొందటం కోసం మనం ఎంతైనా కృషి చేయాలి. 2020 నాటికి భారతదేశం అంతర్జాల సాంకేతికతని ఉపయోగించి, సమాచార సాంకేతిక రంగంలో పనిచేసే నైపుణ్యంగల యువతీ యువకుల బలమైన శక్తిని కలిగి ఉంటుందని అంచనా. వీరివలన కంప్యూటర్లకి సంబంధించి పెద్ద మార్కెట్ అవసరం ఏర్పడుతుంది. ఫలితంగా భారతీయ భాషలకి సంబంధించిన సాఫ్ట్‌వేర్ల కోసం విపరీతమైన సంక్షోభం ఏర్పడుతుంది. అంతర్జాల విప్లవం సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా పంపిణీ చేయడమేగాక వినిమయంలో విపరీతమైన వేగాన్ని కూడా పెంచుతుంది. ఇంకోరకంగా చెప్పాలంటే ఉత్పాదకుడికీ వినియోగదారుడికీ మధ్య దేశకాలాదుల దూరం విపరీతంగా తరిగిపోతుంది. నేడు ఉత్పత్తయి, పంపిణీ అవుతున్న సమాచారమంతా దాదాపు ఆంగ్లంలోనో, రోమన్ లిపిలోని భారతీయ భాషలలోనే ఉంటోంది. ఈ రంగంలో భారతీయ భాషలూ భారతీయ లిపులూ ఇంగ్లీషూ యూరోపియన్ భాషలంత తరచుగా ఉపయోగించబడటం లేదు. ఎలక్ట్రానిక్ సమాచార సైట్లు భారతీయ భాషలలోనూ భారతీయ లిపులలోనూ సమాచారం పొందుపర్చడానికీ, సేకరించడానికీ వీలుగా అందుబాటులో ఉండాలి.
ఇటువంటి సైట్లు అన్ని ప్రముఖ కంప్యూటర్ కార్యసారణి వ్యవస్థలలోనూ (ప్లాట్‌ఫాం) ఉచితంగా వినియోగించుకొనేలా ఉండాలి. విభిన్న లిపులతో బహుళ ఫ్లాట్‌ఫాంల ద్వారా సులభంగా ప్రభావవంతంగా సాంఖిక సంపర్క సౌలభ్యాన్ని (డిజిటల్ కమ్యూనికబిలిటీ) సాధించాలి. ప్లాట్‌ఫాంలో స్వేచ్ఛని అంతర్జాలంతో సులభంగా కలిసిపోయే విధానంతోపాటుగా లక్ష్యాన్ని పూర్తి చెయ్యాలి. ఈ పరిస్థితి భారతదేశంలో కంప్యూటింగ్ అంతర్జాల సాంకేతికతకు సంబంధించి స్థానికీకరణం లేదా ప్రాంతీయకరణానికి పిలుపునిస్తుంది. భారతదేశంలో కంప్యూటర్లు భారతీయ భాషలకి ఉపయుక్తంగా ఉండాలి. 2020 నాటికి భారతదేశపు పాఠశాలలు 10 మిలియన్ల కంప్యూటర్‌లని ఉపయోగిస్తాయని, అందులో కనీసం ఐదు శాతం తెలుగులో ఉంటాయని అంచనా. దీన్ని పరిపూర్ణం చేయడానికి తెలుగు ఈ కొత్త తరహా వినియోగానికి తయారై ఉండాలి. ఈ అవసరాలని తీర్చడం కోసం తెలుగు భాషని పరిపుష్ఠం చేసి, దృశ్య ప్రాతినిధ్యానికి, అంతర్జాలంమీద పట్టుకి కావలసిన సాంకేతిక అవసరాలను చేరుకోవడానికి క్రమబద్ధీకృత ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉంది. ఇందులో భాగంగా తెలుగు లిపి కోడీకరణమూ, ప్రామాణీకరణమూ నిరవధికంగా సాగాలి. ఆధునిక కంప్యూటింగ్‌కి ఇది అత్యవసరం. తెలుగులో ఈ రోజు మనకు లభ్యమవుతున్న విషయం అంతా మామూలుగా సాంప్రదాయ ప్రచురణ మాధ్యమంలో లభ్యం అయ్యేదే. దీనిలో ఎలక్ట్రానిక మాధ్యమంలో ఉన్నది చాలా స్వల్పం. ఆధునిక సంపర్క భాషగా తెలుగుని అభివృద్ధి పరచాలంటే అది తన సొంత పట్టాలమీద ప్రయాణం చేయగలగాలి. అంతర్జాల సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచీకరణం చెందకముందే స్థానీకరించాలి. అందులో భాగంగా సమస్త విషయాలను ఎలక్ట్రానిక్ మాధ్యమంలో అంతర్జాతీయ భాషలలో సమాంతరంగా సృష్టించాలి. ఖచ్చితంగా సమాచార సాంకేతిక సేవికలు (సర్వర్లు) తెలుగు భాషలో ఉన్నప్పుడు సమాచార లభ్యతవలన ప్రజలకు తమ భాషపట్ల ఉన్నటువంటి చిన్నచూపుతగ్గి తమ అవసరాలకు తెలుగును వాడుకొనే ప్రయత్నం చేస్తారు. దీనితోభాషా ప్రణాళిక అమలు దానంతట అదే జరుగుతుంది.
ఇది మన భాషమీద కొత్త డిమాండ్లను కల్పిస్తూ కొత్త కోణాలలో అవసరాలను తీర్చే ప్రయోగాలను ప్రవేశపెట్టడం ఆసక్తిని కలిగించే అంశం. ఎన్నడూలేని విధంగా తెలుగుభాష సామాన్య ప్రజాజీవితంలోను, వ్యక్తిగత జీవితాలలోను తన కొత్త పాత్రలో కనిపిస్తుంది. ప్రపంచం సమాచార విప్లవం గుండా ప్రయాణిస్తోంది. నేడు ‘సమాచారమూ’, ‘జ్ఞానమూ’ విడదీయలేని విధంగా సమాజానికి అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఈ అవసరాన్ని తన సొంత వనరుల ద్వారా తీర్చుకోలేని సమాజం విదేశీ మార్కెట్ల నుంచి బలవంతంగా కనుక్కోవలసి వస్తుంది. ఒకవేళ అలా చేయకపోతే అది విప్లవంలో వెనకబడి పోతుంది.
సమాచార విప్లవాన్ని అందుకోవడానికి మూడు ప్రధాన స్రవంతులైన సాంకేతిక రంగాలు - భాషా సాంకేతికత, కంప్యూటింగ్ సాంకేతికత, అంతర్జాల సాంకేతికత వీటికి సంబంధించిన అంశాల మీద దృష్టి సారించవలసి ఉంటుంది. ఈ సాంకేతిక వసతులను తక్కువ ధరలో ప్రజల భాషలలో అందించవలసి ఉంటుంది. అప్పుడే సమాజంలోని అందరినీ ఇందులో విజయవంతంగా భాగస్వాములని చేయవచ్చు. నేడు దీనికి భిన్నంగా ఉన్న పరిస్థితిని లోతుగా పరిశీలించి సమూలంగా మార్చవలసిన అవసరం ఉంది.
గారపాటి ఉమామహేశ్వరరావు
సెల్ నెం: 9866128846
( ఆంధ్రభూమి దినపత్రిక సౌజన్యంతో ..)

No comments:

Post a Comment