Sunday, October 31, 2010

కళామతల్లికి దివ్య నీరాజనం-తెలుగు లలిత కళాతోరణం

తెలుగు భాషా సంప్రదాయ సంస్కృతుల పట్ల అపారమైన అభిమా నం, గౌరవం గల శ్రీ ఎన్.టి.రామారావు దృఢ సంకల్పంతో తెలుగు లలిత కళా తోరణంని మన జాతికి అందించారు. మహోన్నత కళాకారుడై న ముఖ్యమంత్రిగా ఆయన తన అనుభవాన్ని, ఆలోచల్ని కలబోసి సకల కళా ప్రాంగణంగా లలిత కళా తోరణం రూపకల్పనకు కృషి చేశారు. ఆయనతో పాటు పలువురు మహామహులు మూడు నెలల వ్యవధిలో అహరహం శ్రమిస్తేనే ఆ వేదిక నిర్మాణం పూర్తయింది.
హైదరాబాదు పబ్లిక్ గార్డెన్స్ లోని తెలుగు కళాతోరణం
తెలుగువారితో పాటు రాష్ట్ర రాజధానికి వచ్చే పర్యాటకులందరూ చూడాల్సినంత విశిష్టమైన ప్రాంగణం అది. రసరాజధానిగా సిసలైన కళాహృదయానికి దర్పణం పట్టే లా ఆ నిర్మాణం తీర్చిదిద్దిన తీరుతెన్నులు ఎన్టీఆర్ పలుకరించినట్టే ఉంటాయి. ముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలోకి వచ్చిన కొద్దికాలంలోనే 1985 ఆగస్టులో ఫెస్టివల్ ఆఫ్ ఇండియన్ పనోరమలో ప్రారంభించినపు డు జనవరిలో జరగబోయే ఫిల్మోత్సవ్-86కి అమోఘమైన ఆతిథ్యం ఇవ్వాలని ఆయన నొక్కి చెప్పారు.  ఆంధ్రప్రదేశ్‌లో తొట్ట తొలిసారిగా జరగబోతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంకు ప్రతిష్టాత్మకమైన వేదికగా ఒక ప్రాంగణాన్ని సంసిద్ధం చేయాలని ఎన్టీఆర్ తలపెట్టారు. వెంటనే అనుకూలమైన ప్రాంతాలు, ప్రాంగణాలను ఆయన స్వయంగా పర్యటించారు. రవీంద్రభారతిని ఆసాంతం అన్నివైపుల విస్తరించాలన్న ఆలోచనల్ని అధికారులు తెచ్చినా చారిత్రక సందర్భాల్లో జాతీయ రంగస్థలిగా నిర్మించిన దానిని మార్చకూడదు అంటూ ఎన్టీఆర్ నిర్ద్వందంగా నిరాకరించారు. సంజీవయ్యపార్క్, ఇందిరా పార్క్ ఎదురుగాఉన్న ఇప్పటి ఎన్టీఆర్ స్టేడి యం, పెరెడ్ గ్రౌండ్స్, రామకృష్ణ ఎస్టేట్, జూబిలిహాల్ ఎదురుగా గల లాన్స్ మొదలైనవి పరిశీలించి వాటి ఉనికి తన ఆలోచనలకు సరిపోదని ఇంకా స్థలాలు వెతికారు. ఆయన వెంట రాఘవేంద్రరావుతోపాటు ఉన్న అధికారుల బృందంలోని ఐ.ఎ.ఎస్. అధికారి ఎస్. బెనర్జి పబ్లిక్ గార్డెన్‌లో రహదారి ప్రక్కనే గల విశాల ప్రాంతంలోని 'గొయ్యి'ని తాను చూశానని పరిశీలించమని సూచించారు. ఆ జాగానంతా పరికించి చూసి నాకు ఇంత పల్లంలో ఉన్న స్థలమే కావాలి. 'ఒకే' అంటూ ఎన్టీఆర్ చకచక పనులు నాకు పురమాయించడం మొదలుపెట్టి 24 గంటల్లో ఆయన చెప్పిన వారందరిని రప్పించాలని నన్ను ఆజ్ఞాపించారు.
చీఫ్ ఇంజనీర్ రాఘవన్, సినిరంగ ప్రముఖులు, ఆయనకు ఆప్తులు అయిన డి.వి.ఎస్.రాజు, యు.విశ్వేశ్వర రావు ఆర్కిటెక్ట్‌లు రమణారెడ్డి బృందం వెంటవెంటనే స్పందించారు. ప్రముఖ శిల్పి గణపతిస్థపతి ఆయ న శిష్యులతో వెంటనే సంప్రదింపులు ఆరంభించారు. నిర్మాణ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త డాక్టర్ అప్పారావు, మద్రాసు కళాక్షేత్ర రాజగోపాలతో ఆ ప్రాంగణం అంతా పరిశీలించి రామారావు మదిలో మెదిలే ఆలోచనలకు ఆరుబయలు ప్రధాన ప్రదర్శన ప్రాంగ ణం సరిగ్గా సరిపోతుంది అన్నారు. ఆరు బయట ప్రాంగణం కాబట్టే కళాతోరణం పేరు ఒక్కటే ఔచిత్యభరితమైనది. జియోఫిజిక్స్ నిపుణుడు ప్రొఫెసర్ భీమశంకరం, విద్యుత్ రంగ నమూనాకర్త నార్ల తాతారావు, ప్రముఖ స్ట్రక్చరల్ ఇంజనీర్ జె.జగన్నాథన్‌తో ఎన్టీఆర్ అన్ని లోతుపాతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ వెంటనే స్వయంగా తమ మనసులో మెదిలే 'స్కెచ్'ని కాగితంపై పెట్టారు. ఆయన సన్నిహితులు డి.యోగానంద్, వల్లభజోస్యుల శివరాం, ఎం.ఏ. రహ మాన్ , 'కేతా'లతో తన ఆలోచనల్ని పంచుకున్నారు. చకచక పనులు మొదలుపెట్టారు. రోడ్డు భవనాల శాఖ సిబ్బందితో నిర్మా ణం పనులు మొదలు అయ్యాయి. ప్రతిరోజూ అక్కడకు అక్కడే కనీసం రెండు గంటలు నేనూ, శ్రీరామారావుగారూ ఉండేవాళ్లం. ఆయన సూచన లు అందిస్తూ నిర్మాణాన్ని శ్రద్ధగా పర్యవేక్షించేవారు. ఇంటికి వచ్చిన వెంట నే మళ్ళీ శ్రీ నర్సయ్యనో, శ్రీ లక్ష్మీనారాయణనో, శ్రీ ప్రసాద్ నో వెళ్ళి ఏం జరుగుతుందో చూసి తనకు చెప్పమనేవారు. అది ఆయన అనన్యసామాన్యమైన దీక్షాదక్షత. ప్రత్యేకమైన సినిమా సౌండ్, ప్రొజక్షన్ లు, తర్వాతి కాలంలో జరగబోయే కార్యక్రమాలకు అనుకూలంగా విశాల వేదిక, దాని వెనుకే వసతి, గ్రీన్ రూంల కల్పన వంటివి సాకారం అయ్యాయి. 70 ఎంఎంకి మూడురెట్లు పెద్దదైన 'తెర'కు బట్ట కన్నా పలుచని తెలు పు పెయింట్‌ను ఖాయం చేశారు. బొంబాయి నుంచి కావల్సినవన్నీ తెప్పించారు. దేశవిదేశాల్లో పెరెన్నికగన్న వెస్ట్రెక్స్ కంపెనీకి చెందిన ఎస్.పి.రావు, అప్పుడే కొత్తగా వస్తున్న 'ఫొటోఫోన్' పద్ధతులు, ఫిలిప్స్ ఇండియా లైటింగ్ సౌండ్ పరికరాలతోపాటు బొంబాయి నుంచి జాలి మిస్త్రిలు వచ్చి తమ నైపుణ్యంతో అమరికల్ని చేశారు. జర్మనీ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన 'లెన్స్'తో ప్రొజక్షన్ ను ఎన్టీ రామారావు స్వయంగా పర్యవేక్షించారు. విశాలమైన ఆ ప్రాంగణం లో వారం రోజులపాటు కలర్, బ్లాక్ అండ్ వైట్, సౌండ్ కెమెరాల్లో గొప్పవి అనుకున్న సినిమాల్ని ఆ తెరపై చూశారు. దాన వీర శూర కర్ణతో మొదలుపెట్టి శ్రీకృష్ణపాండవీయం, దేవదాసు, గుండమ్మకథ వంటి వాటితో పాటు 'ది బ్రిడ్జి ఆన్ ది రివర్ క్వాయ్' ప్రాంగణంలో నలుమూలల నుంచి చూశా రు.

ఆ ప్రయోగాలు ఏర్పాటు ఖరారు అయిన తరువాత మొత్తం ప్రాంగణం రూపు రేఖల్ని నిర్ధారించారు. మెయిన్‌రోడ్‌కి ఎడంగా ఆహ్లాదకరమైన పచ్చికబయలు చల్లగాలిలో వేదికపై ప్రదర్శనల్ని హాయిగా చూడాలని అభిలషించారు. ప్రొజెక్షన్ గదికి ప్రక్కన వి.ఐ.పి. బాక్స్‌లు ఆ ముందు ఎక్కడ కూర్చున్నా అనువుగా తిలకించేలా మెట్లుమెట్లుగా 'గ్యాలరీ' రూపొందిం ది. అసలు 'గొయ్యి' జాగాని తమ కౌశలంతో బ్రహ్మాండ ప్రదర్శన ప్రాంగణంగా తీర్చిదిద్దారు. తెలుగు సంస్కృతి వాస్తులపై విస్తృతమైన చర్చ జరిగింది. కళల నిలయం పవిత్ర ఆలయంలా ఉండాలని రామారావు అభిలషించారు. గోడలు, గోపురం, బురుజులు వంటివి అమరావతి, కాకతీయ శిల్పారామాలలో ఆయన చేసిన చేర్పులుమార్పులతో ఖరారు అయ్యాయి. వాటికి జేగురు రంగు వేయించారు. ప్రవేశద్వారం ముంగిటలోని, రంగస్థలిపైగాని నటరాజు విగ్రహం పెడదామని ముందు అనుకున్నారు. ఆ తరువాత దివాకర్ల వెంకట అవధాని వంటి పండితుల ఆమోదంతో లేపాక్షి బసవయ్య 'నంది'ని ఖరారు చేశారు. ఆ సమయంలోనే విశ్వవిఖ్యాత రచయిత, కళకారుడైన శ్రీ హరీంద్రనాద్ చటోపాధ్యాయను ఆహ్వానించి ఆ ప్రాంగణాన్ని చూపిస్తే "అద్భుతం, అమోఘం ఈ సృష్టి'' అంటూ రామారావుని ఆయన శ్లాఘించారు. ముందు 'ఫౌంటెన్'తో విశాల ప్రాంగణంలో అడుగుపెట్టంగానే కనుల కు విందుగా నందీశ్వరుడు ఉండేలా రూపుదిద్దుకుంది. ద్వార బంధాలు వాటి చెంత గజరాజు, మృగరాజుల వంటివి ఉండాలని రామారావు 'స్కెచ్' వేసి చూపించారు. 100 రోజులలోపు పూర్తయిన ఆ నిర్మాణం నామకరణంపై కూడా ఎంతో తర్జనభర్జన జరిగింది. నటరాజ స్థలి, ఉత్సవ రంగం, తెలుగు కళా క్షేత్రం, సకల కళా స్థలి వంటివి చర్చకు వస్తుంటే పేరు పెట్టడంలో తనదైన ప్రత్యేకత గల ఎన్టీఆర్ ఒక్క మెరుపులా తెలుగు లలితా తోరణం అన్నారు. ఒక్కసారిగా ఆ చుట్టూ ఉన్న పెద్దలు, మహామహులు మహదానందంగా స్పందిస్తూ ఆమోదించారు. ఆయన ప్రవేశపెట్టి న ప్రతి ప్రజా సంక్షేమ కార్యక్రమానికి, నిర్మాణానికి ముందు 'తెలుగు' పదం ఉండి తీరవలసిందే తెలుగు విధ్యాపీఠంలా. 1986 జనవరి 8 శుభముహూర్తంలోన ఉదయం 9-30 గంటలకు తోరణం లాంఛనంగా ప్రారంభించారు. ఇంక ప్రారంభోత్సవం కోసం ప్రత్యేకమైన ద్వారాలు వాటిపై వేదికలు పెట్టే అచ్చమైన తెలుగు కళారూపాల్ని ప్రదర్శించేలా చేశారు. మామిడి తోరణాలు, అరటి ఆకులు, గెలలు, పువ్వులు, వంటి వాటితో తెలుగు తోటగా ఆ ప్రాంగణం సంసిద్ధం అయింది. 3000 మంది అతిరథ మహారథులు, భారత, అంతర్జాతీయ చలనచిత్ర రంగ ఉద్దండు లు కలిసి తెలుగు విందు ను ఆరగిస్తూ దేశవిదేశాల్లో ఎక్కడా లేని 'లలిత కళా తోరణాన్ని ఆ ఆ నిర్మా ణ కౌశల్యానికి ఎంతో అభినందించారు. తన కృతజ్ఞతా ప్రసంగంలో మహానటుడు శ్రీ దిలీప్‌కుమార్ ఇటువంటి దేదీప్యమానమైన వర్ణనాతీతమైన ఉత్సవాన్ని తన అనుభవంలో చూడలేదని శ్రీ రామారావును అంగ్లభాషలో అభినందనలతో కీర్తించారు. తరువాత కాలంలో ఫిల్మోత్సవ్-86 తరువాత రాష్ట్ర సాంస్కృతిక శాఖకి ఈ ప్రాంగణాన్ని అప్పగించారు. సినిమాలు కాకుండా ఇతర ప్రదర్శనల కోసం కొల్లాప్పిబిల్ స్టేజిని 86-87 కాలం నాటి కే సంసిద్ధం చేశారు. రామారావు సూచనలపై చక్కని చిత్రాలు చూపించడంతోపాటు అగ్రశ్రేణి సంగీత విద్వాంసులు, కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు విరివిగా జరిగాయి. భారత రత్న లతామంగేష్కర్‌తో ఘంటసాల విగ్రహాన్ని ఈ ప్రాంగణం ప్రవేశద్వారం వద్ద ఆవిష్కరణకు ఏర్పాటు చేసిన పద్మశ్రీ బాలు ఆహ్వానం మేరకు అప్పుడు ముఖ్యమంత్రిగా పదవిలో లేని శ్రీ రామారావు వచ్చి ఆ వేదికపై నుంచి ప్రసంగించి ఏదో బాధతో విసవిస వెళ్ళిపోయిన సందర్భం ఇప్పటి కాలంలో చాలా మందికి మరిచిపోయిన జ్ఞాపకం.     శ్రీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే తెలుగు లతితకళాతోరణంలో అప్పటి దేశాధ్యక్షులు శ్రీ జైల్‌సింగ్, శ్రీ ఆర్. వెంకటరామన్-ఉపాధ్యక్షులు శ్రీ శంకర్ దయా ళ్ శర్మగారులు సన్మానింపబడ్డారు. సృష్టి ఒకటైనప్పటికీ శ్రీ రామారావుగారి దృష్టి బహుముఖీనమైనది. సువిశాలమైనది. నిర్వచనాల పరిధిని అధిగమించిన -అభివర్ణనాతీతమైన సమున్నతపూర్వకమైన విశిష్ట వ్యక్తి త్వం ఆ మహనీయునిది. "తెలుంగా నీకు దీర్ఘాయురస్తు; తెలుంగా నీకు బ్రహ్మాయురస్తు'' "రసోవైసః''

-గోటేటి రామచంద్రరావు ,అప్పటి ఎన్టీఆర్ ప్రత్యేక పౌరసంబంధాల అధికారి .(ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో..)

3 comments:

  1. "తెలుంగా నీకు దీర్ఘాయురస్తు; తెలుంగా నీకు బ్రహ్మాయురస్తు'

    ReplyDelete
  2. మన నందమూరి తారక రామారావుగారు అంత మక్కువగా తెలుగు లలితా కళాతోరణం అని పేరు పెడితే రాష్ట్రేతరుడి పేరు పెట్టాలని సూచించటానికి ఈ "తిక్కలోళ్ళకి" నోరు ఎలా వచ్చిందో కదా!

    ReplyDelete
  3. /రాష్ట్రేతరుడి పేరు పెట్టాలని సూచించటానికి /

    పోనీ రాష్ట్రంలోని వారి పేరు పెడదామా?
    రోశయ్య తెలుగుతోరణం, జగన్ తెలుగుతోరణం, కెసిఆర్ తెలుగు తోరణము, గుడిసెల వెంకటసామి తెలుగుతోరణము... ఇలా :P

    ReplyDelete