Monday, March 14, 2011

తెలుగు పతనానికి వ్యవస్థే కారణం- జస్టిస్ నాగార్జునరెడ్డి

న్యాయమూర్తి నాగార్జునరెడ్డి
తెలుగుభాష క్రమంగా పతనావస్థకు చేరువ కావడానికి  ఈ వ్యవస్థే కారణమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి నాగార్జునరెడ్డి అన్నారు. కడపలో ఆదివారం " పెన్నేటి కతలు, మనిషీ-పశువూ " తదితర రచనలు చేసిన విలక్షణ రచయిత పి.రామకృష్ణకు మల్లెమాల సాహిత్య పురస్కారం-2011 ప్రదానసభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుభాష స్థితిగతులపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్లభాషపై మక్కువ పెంచుకుంటూ తెలుగుభాషను నిరాదరిస్తున్నారని, అధికార భాషా సంఘం  ఏం చేస్తుందో అర్ధం కావడం లేదని విచారం వెలిబుచ్చారు. ప్రస్తుత విద్యావ్యవస్థ లోపభూయిష్టంగా ఉందన్నారు. భాషా సబ్జెక్టుల కంటే గ్రూప్ సబ్జక్టుల మార్కులకే ప్రభుత్వం విలువిస్తున్నందున ఈ పరిస్థితి ఏర్పడిందని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరచి తెలుగుభాషను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పాఠకుల కన్నా కవులు, రచయితలే ఎక్కువయ్యారని, దీంతో రచనలకు సార్థకత లభించడం లేదని పేర్కొన్నారు. భాష, విషయ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ, సునిశిత పరిశీలన, సృజనాత్మక శక్తి, ఆసక్తి ఉన్నవారే మంచి రచయితలు కాగలర ని చెప్పారు. తనకు తల్లి అంటే ఎంత ప్రేమో తెలుగుభాషన్నా అంతే ప్రేమని తెలిపారు. ఆంగ్లేయుడైన బ్రౌన్ తెలుగుపై చూపిన అభిమానాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలుగు భాషలో లేని సాహితీ సంపద ఇంగ్లీషులో లేదని ఆయన స్పష్టం చేశారు.
కొట్టుమిట్టాడుతున్న తెలుగు భాషాజ్యోతిని కాపాడుకునేందుకు కవులు, రచయితలు, కళాకారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి కవిత్వం బాగుందన్నారు. సభాధ్యక్షుడు డాక్టర్ జానుమద్ది హనుమచ్ఛాస్ర్తి మాట్లాడుతూ డాక్టర్ మల్లెమాల పేర ఉన్న ఈ అవార్డును అర్హుడైన రామకృష్ణకు ఇవ్వడం సంతోషకరమన్నారు. రామకృష్ణకు ఈ పురస్కారం అందుకునేందుకు అన్ని అర్హత లు ఉన్నాయన్నారు. డాక్టర్ మల్లెమాల పురస్కార నివేదిక సమర్పిస్తూ ఈ అవార్డును రామకృష్ణకు ఇవ్వడం గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. ఆయన రచయితగానే కాక వ్యక్తిగా కూడా ఉన్నతుడని పేర్కొన్నారు.
పుస్తకావిష్కరణలు
మల్లెమాల పురస్కారాన్ని అందుకుంటున్నరచయిత పి. రామకృష్ణ
ఈ సందర్భంగా డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి రాసిన వేణుగానం కవితా సంపుటిని జస్టిస్ నాగార్జునరెడ్డి ఆవిష్కరించగా, డాక్టర్ ఆవుల రామచంద్రయ్య రాసిన బఠానీలు కవితా కదంబం పుస్తకాన్ని డాక్టర్ జానుమద్ది హనుమచ్ఛాస్ర్తి ఆవిష్కరించారు. అనంతరం మల్లెమాల సాహితీ పుర స్కారాన్ని రచయిత రామకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు నగదు బహుమతి అందజేశారు. పూలమాలలు, శాలువా కప్పి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ వరలక్ష్మి సత్కార పత్రం అందజేశారు. పురస్కార గ్రహీత రామకృష్ణ మాట్లాడుతూ తనపై అభిమానంతో ఈ అవార్డు ఇచ్చినందుకు డాక్టర్ మల్లెమాలకు కృతజ్ఞతలు తెలి పారు. కార్యక్రమంలో మహావధాని నరాల రామారెడ్డి, కాళహస్తి మాజీ ఎమ్మెల్యే చెంచిరెడ్డి, రచయితలు వి. ప్రతిమ, వడలి రాధాకృష్ణ, వేంపల్లె అబ్దుల్‌ఖాదర్ తదితరులు ప్రసంగించారు.

No comments:

Post a Comment