హైదరాబాద్: పత్రికలు, ప్రసార మాధ్యమాలకు ఉపయోగపడుతూ తద్వారా తెలుగు భాష సుసంపన్నం కావడానికి వీలుగా ఒక శాశ్వతమైన యంత్రాంగం ఉండాలని, ఆ యంత్రాంగం ఎప్పటికప్పుడు భాషా ప్రయోగానికి, నూతన పదకల్పనకు తోడ్పడాలని పలువురు దినపత్రికల సంపాదకులు అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంగళవారం ‘పత్రికలు-ప్రసార మాధ్యమాలు తెలుగు భాష వినియోగం’ అనే అంశంపై రెండు రోజుల చర్చా గోష్ఠి ప్రారంభమైంది. సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఎస్ చెల్లప్ప మాట్లాడుతూ తమిళం మొదలైన సోదర భాషల్లో భాష పరిరక్షణకు, ఆధునికీకరణకు జరుగుతున్న ప్రయత్నాలను తెలుసుకుంటూ తదనుగుణంగా తెలుగును అభివృద్ధి పరచుకోవాలని అన్నారు. సామాన్యుల వద్దకు తెలుగును తీసుకువెళ్తున్న పత్రికలు, ప్రసారసాధనాల కృషి ప్రశంసనీయమని అన్నారు. అయితే ఆంగ్లం ప్రాధాన్యాన్ని విడనాడి, తెలుగుకు పట్టం కట్టాలని అన్నారు. తెలుగు భాష స్థిరీకరణలో పత్రికల పాత్ర ఎనలేనిదని అన్నారు. తెలుగు మాటలు, పదాల వినియోగం ఇటు పత్రికల్లో, అటు ప్రసారమాధ్యమాల్లో తగ్గుతోందని, దీనికో పరిష్కారం చూడాలని అన్నారు.
భాషా వికాసానికి పాటుపడాలి: ఎం.వి.ఆర్ శాస్త్రి
తెలుగు భాషాభివృద్ధి గంభీరమైన సమస్య అని, ఆధునిక సమాజానికి అవసరమైన కొత్త పదాలను అందించడంతో పాటు భాషా వికాసానికి విశ్వవిద్యాలయాలు సైతం పాటుపడాలని ఆంధ్రభూమి సంపాదకుడు ఎం.వి.ఆర్ శాస్త్రి అన్నారు. పత్రికాభాష- తెలుగు వినియోగం అంశంపై జరిగిన తొలి సదస్సుకు ఎం.వి.ఆర్ శాస్ర్తీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు, ప్రసార మాధ్యమాలు అప్పటికప్పుడు వచ్చిపడే కొత్త పదాలను తెలుగులోకి అనువదించేందుకు తగిన పదజాలం లేదన్నారు. ఈ అవస్థల్ని తీర్చేందుకు విశ్వవిద్యాలయాల నుండి తగిన సహకారం కావాలని అన్నారు. గత 30, 40 ఏళ్లుగా ఆగిపోయిన పదసృష్టిని ఇప్పటికైనా ప్రారంభించాలని సూచించారు. నిఘంటువులు దగ్గర పెట్టుకున్నా కొన్ని పదాలు దొరకవని, ఈ అవస్థలను తీర్చాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపైనా, విద్యావేత్తలపైనా ఉందని ఎంవిఆర్ శాస్త్రి అన్నారు. ఈ అంశంపైనే ప్రత్యక సమావేశాలు ఏర్పరచి పదసృష్టి చేయాలని చెప్పారు. తెలుగు భాష ప్రామాణిక నిఘంటువులు తయారుకావాలని, ఆంగ్లంలో మాదిరి తెలుగుభాషకు సైతం అక్షరగుణింతాల పరిశీలనకు ఒక వ్యవస్థ ఉండాలని సూచించారు.
పదసృష్టికి ప్రత్యేక ప్రాజెక్టులు: ఆచార్య భూమయ్య
తెలుగు విశ్వవిద్యాలయం విసి ఆచార్య అనుమాండ్ల భూమయ్య మాట్లాడుతూ తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాలు తెలుగు భాషా వికాసానికి ఎంతగానో పాటుపడుతూ లక్షలాది మంది తెలుగు పాఠకులను తయారుచేస్తున్నాయని అన్నారు. తెలుగు పట్ల నిరాదరణ అధికంగా ఉన్న తరుణంలో భాషను నిలబెట్టేందుకు ఎన్నో కార్యక్రమాలు జరగాల్సి ఉందని చెప్పారు.
అంతా పట్టించుకుంటేనే భాష ఎదిగేది: రామచంద్రమూర్తి
అంతా పట్టించుకున్న రోజునే భాష ఎదుగుతుందని హెచ్‌ఎంటివి సిఇఓ డాక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. సమాజానికి, ప్రభుత్వానికీ పట్టింపు లేకపోవడం వల్ల, ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడం వల్ల తెలుగు భాష ఎదగడం లేదని చెప్పారు. ఆంగ్లంలో మాట్లాడితే గొప్ప అనే విధంగా అంతా భావిస్తున్నారని, తెలుగులోనే దస్త్రాలు తయారుచేసే అధికారులను సత్కరించడంతో పాటు అన్ని రంగాల్లో వ్యవహారికంలోకి వచ్చిన పదాలకు తెలుగు మాటలను గుర్తించాలని సూచించారు. పండితపరిషత్‌ను ఏర్పాటు చేసి వారం వారం సమావేశమై కొత్త తెలుగు పదాలను అందరి ఆమోదంతో వాడుకలోకి తేవాలని అన్నారు.
పత్రికలు తలచుకుంటే పదసృష్టి: వరదాచారి
పత్రికలు తలచుకుంటే పదసృష్టి సాధ్యమేనని హెచ్‌ఎం టివి అంబుడ్స్‌మన్ డాక్టర్ జి.ఎస్ వరదాచారి అన్నారు. కొత్త పదాలు ఎన్నో వాడుకలోకి వచ్చినా, జనం హర్షించినవే నిలుస్తాయని అన్నారు. అవసరం ఏర్పడినపుడు కొత్త పదాలు పుడతాయని, అలాగే పరిశోధనా ఫలితాలను ఆయా శాస్తవ్రేత్తలు తెలుగులో రాసినపుడు మంచి పదాలు పుడతాయని చెప్పారు. ఇపుడు అనేక రంగాలు విశ్వవ్యాప్తం కావడంతో అన్ని శాస్త్రాల్లో కొత్త పదాలకు తెలుగు మాటలను కనిపెట్టాల్సిన గురుతర బాధ్యత అందరిపై పడిందని అన్నారు.
చట్టబద్ధ వ్యవస్థ ఉండాలి: పొత్తూరి
తెలుగు భాషాభివృద్ధికి చట్టబద్ధ వ్యవస్థ ఉండాలని ప్రారంభోపన్యాసం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి పూర్వ అధ్యక్షుడు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. తెలుగు వాడకంలో పత్రికలు మేలు చేయడంతో పాటు కీడు కూడా చేశాయని అన్నారు. భాష ప్రామాణీకరణ సాధ్యం కాదని, భాషను సుసంపన్నం చేయడానికి కొత్త పదాలు, వృత్తి పదాలు, శాస్త్ర విజ్ఞాన పదాలను అందుబాటులోకి తేవాలని అన్నారు. తెలుగు భాషను అధికారిక భాషగా చట్టం చేసిన చట్టసభల్లోనే అధినేతలే ఆంగ్లంలో మాట్లాడుతున్నపుడు ఇక ఎవరు పట్టించుకుంటారని అన్నారు. ప్రెస్ అకాడమీని మీడియా అకాడమీగా తీర్చిదిద్దాలని, దానికి చట్టబద్ధత కల్పించి, ఎడిటర్లకు స్థానం కల్పించాలని పేర్కొన్నారు.
మాండలికాలు లేని భాష ప్రామాణికమా?- అల్లం నారాయణ
ఒకటి రెండు జిల్లాల్లో మాట్లాడే భాషను తీసుకువచ్చి ప్రామాణిక భాషగా చెప్పుకోవడం సరికాదని, ఆంగ్లంలోని పదాలను, హిందీ, ఉర్దూ పదాలను స్వీకరించి వినియోగిస్తున్న ప్రామాణిక భాషా నిపుణులు తెలుగులోనే ఇతర ప్రాంతాల మాండలికాలను ఎందుకు స్వీకరించడం లేదని నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ అల్లం నారాయణ ప్రశ్నించారు. భాషకు కులతత్వం, ప్రాంతీయ తత్వం వచ్చిందని, ఈ ప్రాంత మాండలికాలను వినియోగించని భాష ప్రామాణికం ఎలా అవుతుందని ప్రశ్నించారు. పత్రికలు ప్రజాస్వామ్య లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు.
విశ్వసేవ: శంకరనారాయణ
తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయడం విశ్వసేవ అవుతుందని ఈనాడు ప్రతినిధి శంకరనారాయణ అన్నారు. ఆంగ్ల పదాలకు తెలుగును సూచించే ప్రయత్నం గట్టిగా జరగాలని చెప్పారు. భాషా చట్టం ముందు అన్ని మాండలికాలు సమానమేనని, జిల్లా ఎడిషన్లు మాండలికాల్లోనే రాయాలని అన్నారు. ఏ కథనంలోనైనా తెలుగు వెలుగు కనిపించాలని అన్నారు.
శాశ్వత విభాగం ఉండాలి: కె.శ్రీనివాస్
భాషాభివృద్ధికి శాశ్వత విభాగం ఉండాలని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. భాషపై చర్చ జరిగినపుడు, వౌలికమైన పదాలకు సమానకార్థాలు వచ్చినపుడు భాష ఎదుగుతుందని అన్నారు. మాండలికాల పదకోశాలు తయారుచేయాలని, శ్రామిక వర్గాల సమూహాల నుండి వారు వినియోగించే పదాలను జనసామాన్య వాడుకకు తేవాలని సూచించారు.
ఇది నిజంగా అద్భుతమైన, అత్యవసరమైన ప్రయత్నము. లేకుంటే వచ్చే తరంవారు "ఓక లైవ్ రిపోర్ట్", "హెడ్-లైన్స్", "బ్రేక్", "ఇంటర్వ్యూ"... లాంటి పదాలు తెలుగే అనుకునే ప్రమాదం ఉంది. ఒక్కోసారి తెలుగు వార్తలు చూస్తుంటే నాకు చిరాకు, కోపం వచ్చేస్తుంది. ఎంచక్కా తమిళ వార్తలు చూద్దాంలే అనిపిచ్చేస్తుంది!
ReplyDeleteCentral governement offices like Railways , etc have a policy of displaying a black board , daily some words are written in hindi and equal English meaning. "learn hindi daily" policy by Hindi Rajbhasha Department of that office.Hindi learning is mandatory in Railways and other central govt offices.
ReplyDeleteSimilarly State government should setup Telugu Official Language Directorate and should appoint
Language and Translation Executives in all departments from Secretariat to Zillaparishad level to implement and monitor Telugu usage in govt offices of state.