Saturday, March 5, 2011

తమిళనాడులోని హోసూరులో తెలుగు వారి ప్రదర్శన

తమిళనాడులోని హోసూరులో తెలుగు  వారి  ప్రదర్శన
ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందుగా ఫిబ్రవరి 20న తమిళనాడులోని హోసూరులో తెలుగు, కన్నడ, మలయాళ, ఉర్దూ భాషా ప్రజలు సంఘటితంగా పెద్ద ప్రదర్శన నిర్వహించారు. వీధుల్లో జరిగిన ఊరేగింపులో మూడువేల మందికి పైగా పాల్గొని తమ మాతృభాష రక్షణ తమ హక్కు అని నినదించారు. తమిళనాడు ప్రభుత్వం 15-12-2010న జారీ చేసిన నిర్బంధ తమిళ చట్టం నెం.316ను వెంటనే రద్దు చెయ్యాలని, 2006 వరకు ఉన్నట్లుగానే మొదటి భాషగా మాతృభాష ఉండాలని, గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక విజ్ఞానం వంటి అంశాలను కూడా మాతృభాషలో చదివే విధంగా ఉత్తర్వులను సవరించాలని కోరారు. తాము రాష్ట్ర అధికారభాష తమిళాన్ని ఒక భాషగా చదవడానికి ఇష్టంగా ఉన్నామని, అయితే తమ మాతృభాషను అణచివేయడాన్ని అంగీకరించం అని స్పష్టం చేశారు. ‘లింగ్విష్టిక్ మైనార్టీస్ ఫోరం’ అనే పేరుతో ఒక ఏడాదిగా తమిళనాడులో జరుగుతున్న ఆందోళనను తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నందున మళ్లీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నిరసన ప్రదర్శన తర్వాత పెద్ద బహిరంగ సభ జరిగింది. అన్ని భాషలకూ సంబంధించిన సంఘాలు, నేతలు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
హోసూరు-తెలుగు, కన్నడ రాష్ట్రాలకు ఆనుకొని తమిళనాడులో ఉంది. రాష్ట్రాల ఏర్పాటులో ఆ ప్రాంతాన్ని తమిళనాడులోకి చేర్చడంతో అక్కడ 80 శాతం ఉన్న తెలుగు ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ ప్రాంతంలో సుమారు 500 తెలుగు మాధ్యమ పాఠశాలలున్నాయి. అక్కడి హోసూరు, తమిళ అసెంబ్లీ నియోజకవర్గాలు రెండింటిలోనూ ఎన్నడూ ద్రవిడ పార్టీలు గెలుపొందవు. జాతీయ పార్టీలనే ఎన్నుకుంటారు. తెలుగువారు అత్యధికంగా, వారికి తోడుగా కన్నడిగులు సమైక్యంగా అన్ని ఉద్యమాల్లో వ్యవహరిస్తారు. ఒకనాటి మహానేత రాజగోపాలాచారి చదువుకొన్నది హోసూరులోని తెలుగు మాధ్యమ పాఠశాలలోనే. రాష్ట్రాల హద్దుల ఏర్పాట్లలో రాజాజీ తన స్వార్థం చూసుకొని తెలుగువారికి అన్యాయం చేశారని అక్కడివారికి కోపం. భాషాపరమైన అణచివేతను ఎదుర్కొంటూనే ఇనే్నళ్ళుగా స్వాభిమానంతో అక్కడి తెలుగు, కన్నడ ప్రజలు జీవిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి ప్రభుత్వ నేతలు ఎన్నోసార్లు అక్కడికి వెళ్లివచ్చారు కాని, వారికి తగిన తోడ్పాటు నివ్వడంలో మన ప్రభుత్వం విఫలం అయింది. తమ మాతృభాషను రక్షించుకోవడానికి ఉద్యమిస్తున్న అక్కడి తెలుగు, కన్నడ భాషా జాతీయులకు మన సంఘీభావాన్ని తెలుపుదాం.
-ఆంధ్రభూమి సౌజన్యంతో..

4 comments:

  1. We are not able to be united in our own state. How can we help hosur telugus?

    ReplyDelete
  2. హోసూరు ప్రాంత తెలుగువారికి జేజేలు. వారికి మాతృభాషపై ఉన్న ప్రేమ, అభిమానం అనుపమానం, ఆదర్శప్రాయం. అంత ప్రేమ ఇక్కడ సొంత రాష్ట్రంలోనే లేకపోవడం విచారకరం. ఇక్కడ కూడా అలాంటి ఉద్యమం ఎవరైనా ప్రారంభిస్తే బాగుండు.

    ReplyDelete
  3. మనకు భాష కన్నా ప్రాంతీయత మీదే మమకారం ఎక్కువ.

    ReplyDelete
  4. tamilnadu govt ala nirbanda vidya cheyyatam valla tamil matlade vallu roju rojuki taggi potunnaru.

    ReplyDelete