(శ్రీ పుట్టపర్తి వారి జయంతి సందర్భంగా..! )
బహుభాషా చక్రవర్తి అయిన పుట్టపర్తి నారాయణాచార్యులు 1914 మార్చి 28న అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకాలోని చియ్యేడు గ్రామంలో పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, లక్ష్మీ దేవమ్మ దంపతులకు జన్మించారు. దాదాపు ముప్పరుయేళ్ళ వరకు అనంతపురంలో వున్న ఆచార్యులు కడపజిల్లాకు చెందిన కనకమ్మను పెండ్లి చేసుకున్నాక జీవితం ఆఖరి వరకు కడప గడపలే తన సాహిత్య ప్రస్థానంగా జీవించారు. శతాధిక గ్రంథకర్త, బహుభాషావేత్త, విమర్శకుడు, అద్భుతమైన వక్త, అయిన ఆచార్యులు సాహిత్యంకోసం పుట్టి, సాహిత్యం కోసమే జీవించి, మరణశయ్యపై కూడా పెరిస్త్రోయికా గ్లాస్‌నోస్త్ పుస్తకం చదువుతూనే కన్నుమూసిన ధన్యజీవి ఆయన. ఆచార్యులు ఎన్నో గ్రంథాలు రచించినప్పటికీ కడపజిల్లా కమ్యూనిస్టు మిత్రులతో చేసిన మైత్రికి ప్రతిఫలమే 'మేఘదూతము' గేయకావ్యం.
నారాయణాచార్యులు వ్యక్తిత్వం దృక్పథం, అంతరంగం ఆవిష్కరించిన కావ్యం ఏదైనా వుందీ అంటే అది ఒక్క మేఘదూతము మాత్రమే !
మేఘదూతము ఆచార్యులు రచించడానికి పూర్వనేపథ్యం ఒక విషాదకరమైన దురదృష్టకర మైన ఘటన ఒకటుంది. ఆయన అనంతపురం విడిచి వచ్చాక కడపజిల్లా ప్రొద్దుటూరులో వుండే వారు. ఆచార్యుల సాహిత్య సృష్టి, జనాకర్షకమైన సాహిత్యోపన్యాసాలు యెందరినో అభిమానులుగా మార్చసాగింది. ఆకాలంలో రాష్ట్రశాసన మండలి సభ్యత్వ వ్యవహారం వచ్చింది. ఆచార్యులకే ఆ పదవి వచ్చేలా వుందని గట్టి ప్రచారం జరిగింది. అప్పుడు కొందరు స్వార్థపరులైనవారు ఆచార్యుల ఇంటిపై పరోక్షదాడి చేశారు. సున్నితమనస్కుడైన ఆచార్యులు ఆ హఠాత్ ఘటనతో చలించి పోయారు. విధిలేని పరిస్థితిలో కడపకు నివాసం మార్చుకున్నారు. అప్పుడు ఆచార్యులకు అండదండలుగా ఆనాటి సిపిఐ మిత్రులు గట్టిగా నిలిచారు. ఆ పరిచయం, ఆచార్యులను కారల్ మార్క్స్ దాస్ కాపిటల్ డైలెక్టికల్ మెటీరియలిజమ్ తదితర సాహిత్యం అధ్యయనం చేయించింది. ఫలితంగా ఆచార్యుల దృష్టిపథంలో ఒక కొత్త సామాజిక వాస్తవ దృశ్యం తొణికిసలాడుతూ కనిపించింది. మానవుని కల - కళగా ఆవిర్భవిం చాలని, సాహిత్యం ప్రజలకోసం, ప్రగతికోసం సగటు మనిషికి ప్రేరణ కలిగించాలనే సామాజిక బాధ్యతను గుర్తెరిగారు. ఆ ప్రభావం యెంతవరకు దారితీసిందంటే - కారల్‌మార్క్స్ - అరవింద ఘోష్‌ల ఆలోచనలు ఒక థియరీగా రాగలిగితే యెంత బావుణ్ణోకదా అని చెప్పేవారు ఆచార్యులు.
ఛందోబద్ధ పద్యరచనలోనే కాదు - మాత్రాఛందస్సులో గేయాలు రచించడం కూడా ఆచార్యుల కళాత్మక ప్రతిభకు ప్రతీకగా నిలుస్తుంది.
'మేఘదూతము' గేయకావ్యంలో ఆచార్యులు తీసుకున్న ఇతివృత్తము సమకాలీన సామాజిక సమస్యవే కావడం గమనార్హం. పేదలపై ధనికుల దౌర్జన్యాలను యెదురించి ప్రశ్నించిన ఓ సగటు మనిషిని ప్రభుత్వం చెరసాలలో పెట్టింది. ప్రజాపక్షంగా ప్రతిఘటించిన ఆ పేదవాడు - కొత్తగా పెళ్లి చేసుకుని ఉంటాడు కూడా. అతన్ని జైలుపాలు చేసినప్పుడు, ఆ బందీఖానాలో ఆ ఒంటరి ఖైదీ తన భార్యని గుర్తు చేసుకుంటాడు. ఆమె యెలావుందోననుకుంటాడు. ఒకవేళ తనను మరచిపోయి వుంటుందా అని అనుమానిస్తాడు. ఆ విధంగా చేయదని తానే జవాబు చెప్పుకుంటాడు. తన జైలు జీవితం యెలా వుందో ఆమెకు ఎలా తెలియచేయాలని ఆలోచిస్తున్న ప్పుడు జైలు కిటికీలోంచి మేఘం ఒకటి కనిపిస్తుంది. ఆ మేఘమే తన దూతగా భావిస్తాడు. ఆ మేఘంతో విషయాలు వివరించి, తన భార్య ఉంటున్న ఊరికి ఎలా ఏ మార్గంలో పోవాల్నో తెలియచేస్తాడు ఆ ఖైది. నిజానికతడు నిరపరాధి.
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే - ఖైదీని కలి ఆవహించి జైలు జీవితాన్ని అయితేనేమి, మేఘానికి ప్రయాణం చేయాల్సిన మార్గం తెలుపడానికైతేనేమి అన్నీతానై కవితాకళలో వివరించడం అనేదే విశేషం. ఆ జైలులో జోరీగలు తంబూరనాదంలా ధ్వనిస్తున్నాయి. చీకటి ఈగలు కొంచెం కొంచెం అనే నెత్తురు పీల్చేస్తున్నాయి. తలనిండా పేలుపడి రామునిసైన్యంలా ఉన్నాయి. రాముని సైన్యం అంటే కోతులగుంపు. కోతులనేవి వూరకే యెక్కడ ఉంటాయి. చిందరవందర చేస్తాయి. పేనులను కోతుల స్వభావంతో కవి చెప్పడం ధ్వని. ఇక ఆ ఖైదీ శరీరం నిండా మట్టి పేరుకునిపోయింది. స్నానం చేసి ఎన్నాళ్లు అయ్యిందోమరి. ఇక ఆ ఖైది శరీరం ఎలా ఉందంటే మామిడిపండును తిని, చివికి పారవేసిన వట్టి ముట్టెలా వుందంట. అంటే యెంతగా బక్కచిక్కిపోయాడో ధ్వనిగా కవి ఎరుకపరుస్తున్నారు.
అది కరువుల రాయలసీమ. అక్కడ కట్టుకోడానికి బట్టకు తినడానికి తిండికి కరువు. పంటలేలేవు. కాకపోతే పుట్టగొడుగులున్నాయి. అదే ఆ కరువు ప్రజల ఆహారము. ఇక అక్కడ మగవాళ్ళే లేరు. కారణం కూలికోసం వెదుక్కుంటూ వలసలు పోయారు.
ఇంత కఠినమైన కరువు ప్రాంతం చూశాక - ఓ మేఘమా నీవు నీరు కురిపించే స్వభావం గల మేఘానివి కదా! ఆ కరువు దేశంమీద వర్షిస్తే బాగుంటుంది. నీ నీరు యెలా వుంటుందంటే - ద్రాక్షారసము రుచిగల తుంగభద్రా నదీ జలాల మాదిరివుంటాయని ధ్వనిగా చెప్పాడు.
ఆ విధంగా మేఘానికి ఆ ఖైదీ దారి చెప్తూ (చూపిస్తూ) ఉండగా ఒక దగ్గర వేశ్యలు కనిపిస్తా రని - వారిని చూసి మొహం మాడ్చుకోవద్దని కోర్తూ ఇలా అంటాడు.
''కూటికై
తనువమ్ముకొన్నారు - తిన తిండియేయున్న
వారు పాతివ్రత్యభావంబు బలికేరు''
వాళ్ళకు తినడానికి కూడా తిండిదొరకక విధిలేని దుస్తితిలో శరీరాలు అమ్ముకొని కడుపులు నింపుకుంటున్నారనే చేదునిజం గ్రహించు - నిజంగా వాళ్ళకే ఆహార పానీయాలు వుండివుంటే పతివ్రతాస్త్రీలుగా తప్పక జీవించి వుందురు అంటాడు. అంటే సర్వసామాజిక సమస్యలకు పరిష్కారం ఆర్థిక పరిస్థితే కారణమని కవి ధ్వని. మేఘదూతం చదివితే తెలుగు ప్రజల జీవితాలనుండి వేగంగా దూరమైపోయిన, పోతున్న యెన్నో తెలుగుపదాలు, జాతీయాలు, నుడికారాలు, సామెతలు, ఆమెతలు యెదురౌతాయి. తప్పిపోయి దొరికిన అమ్మను చూసిన అనుభూతి కలుగుతుంది.
తిరువాన్కూర్ యూనివర్శిటీ వారు మలయాళ భాషా నిఘంటువు రూపొందించదలచి దక్షిణభారతదేశంలో బహుభాషా వేత్త యెవరైనా ఉన్నారా అని అన్వేషించింది. చివరికి యేలాగో కడపలో ఉన్న పుట్టపర్తి నారాయణాచార్యులను కనుగొన్నారు. ఆచార్యులు మలయాళ నిఘం టువు నిర్మాణం సమర్థవంతంగా పూర్తిచేయడమే కాక, ఎన్నో ఆదానప్రదానాలు చేశారు. ఆనాటి మలయాళ, సంస్కృత విద్వాం సుడు సూరనాడు కుంజన్ పిళ్ళరు. మలయాళంలోగొప్పకవి. ఆయనే ఆచార్యులను కనుగొని తమ భాషా నిఘంటువు నిర్మాణబాధ్యత అప్పగించారు.
టువంటి అరుదైన పండితుడు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు 1990 సెప్టెంబర్ 1వతేదీ కడపలో కన్నుమూశారు. ఆచార్యులు ఆసుపత్రిలో మరణశయ్యపై ఉండి కూడా గ్లాస్‌గోస్త్‌పెరిస్త్రోయికా చదువుతూ వుండ టం ఆయన పఠనాసక్తిని చాటుతోంది.
- శశిశ్రీ
పుట్టపర్తి వారి పాండిత్యం గురించీ, ఎన్నో సభలలో ఆయన గళంలోంచి ప్రవహించిన శివతాండవం వింటూ సభికులందరూ మైమరిచిన సంఘటనలను గురించీ, కొన్ని సంవత్సరాల క్రితం "రచన" మాసపత్రికలో ఒక అద్భుతవ్యాసం ప్రచురితమైంది.
ReplyDeleteఎక్కడెక్కడో పాడుకునే అమూల్య జానపదాలకు కూడా పుట్టపర్తివారి గళం ఒక ప్రచార / ప్రసార వేదిక అయిందన్నది వాస్తవం!
ఆ వ్యాసంలో నన్నాకర్షించిన కొన్ని పదాలు (భాష పేరు గుర్తు లేదు, కానీ రిథం అధ్బుతం... గమనించండి)
"జహరసియ సింగాయ - ఉద్ధరియ కందాయి"
"బహుదండ ఢక్కవియ - కోదండ ముంచాయి"
".... - ...."
"................. - .......... "
"................. - .......... "
"మారీయ దేవియే - దేవాల యేతమ్మి"