న్యూఢిల్లీ: దక్షిణాది విద్యార్థులు ఏదో ఒక రూపంలో హిందీని పాఠ్యాంశ రూపంలో నేర్చుకుంటున్నట్టు ఉత్తర భారత విద్యార్థులూ ఏదో ఒక దక్షిణాది భాషను పాఠ్యాంశంగా ఎంచుకుంటే జాతీయ సమైక్యత బలోపేతమవుతుందని ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ ఉద్బోధించారు. ఆంగ్లభాష ప్రభావం ఏమాత్రం కనిపించని విధంగాప్రతి ఒక్క ఉత్తరాది విద్యార్థి ఏదో ఒక దక్షిణాది భాషను నేర్చుకోవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఈ ప్రక్రియలోపించటంతో దక్షిణాది సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్య విలువలు ఉత్తరాది వారికి అందకుండా పోతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర హిందీ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సంకలనం చేసిన ‘సహస్ర వర్షోం కా తెలుగు సాహిత్య’ అన్న పుస్తకాన్ని అన్సారీ తన నివాస గృహంలో ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు మాట్లాడే భాషల జాబితాలో తెలుగు మూడో స్థానంలో ఉండడం గర్వకారణమని ఆయన ప్రశంసించారు. ప్రాచీన భాష హోదా లభించిన తెలుగు గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోడానికి యార్లగడ్డ వంటి వారు తెలుగులోని గొప్ప కృతులను హిందీలోకి అనువదించి భావి తరాలకు అందచేయాలని ఆయన సూచించారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుకు సుదీర్ఘమైన చరిత్ర ఉందని స్పష్టం చేశారు. రచయిత యార్లగడ్డ మాట్లాడుతూ తెలుగుతో సహా దక్షిణాది భాషలకు సంబంధించిన అనువాదాలు ఉత్తర భారత దేశ ప్రజలకు అందకపోవటం వల్ల రెండు ప్రాంతాల ప్రజల మధ్య సాంస్కృతిక, సమైక్యత కుదరడం లేదని అన్నారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్య విలువలు దేశ వ్యాప్తంగా తెలియక పోవటంతో కేవలం రెండు జ్ఞానపీఠ్ అవార్డులతో సరిపెట్టుకోవలసి వచ్చిందన్నారు.
No comments:
Post a Comment