Wednesday, March 17, 2010

తెలుగు భాష పరిరక్షణకు ఇంటింటి ప్రచారం!

మైదుకూరు; ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాషగా తెలుగును అమలు పరిచేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి, కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి కోరారు. ఉగాది పర్వ దినాన్ని పురష్కరించుకొని తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఉద్యమ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ లో మంగళవారం తెలుగు ఉధ్యమ ప్రచార గీతాల సిడి ని తవ్వా ఓబుల్ రెడ్డి ఆవిష్కరించారు. అలాగే ఉద్యమ నినాదాల స్టిక్కర్లను ఎస్‌టియు రాష్ట్ర నాయకుడు ఎపి శ్రీనివాసులు, కరపత్రాలను అభ్యుదయ రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డివిఎస్‌ నాయుడు, మైదుకూరు ఉధ్యమ గీతాన్ని రాటా అధ్యక్షులు కొండపల్లి శేషగిరి ఆవిష్కరించారు.
చీరాలలో ఈ నెల 14న జరిగిన తెలుగు భాషోద్యమ సమాఖ్య సర్వ సభ్య సమావేశ వివరాలను శాఖ ఉపాధ్యక్షులు ఎ. వీరాస్వామి వెళ్లడించారు. తెలుగు భాషపై సమాఖ్య చేపట్టిన ఉద్యమాన్ని ఇంటింటికి తీసుకెళ్లేందుకు సమాఖ్య అధ్యక్షుడు దాక్టర్ సామల రమేష్ బాబు అధ్యక్షతన రూపొందించిన కార్యక్రమంపై కార్యవర్గం చర్చించింది. 1నుండి 10వ తరగతి వరకు తెలుగు ఒక అంశంగా తప్పని సరిగా పాఠశాలల్లో భోదించేందుకు ఉద్యమాన్ని నిర్మించాలని, తెలుగులో మాట్లాడడం నేరంగా పరిగణించే పాఠశాలలపై చట్టపరమైన చర్యలకు డిమాండ్‌ చేయాలని కూడా ఈ సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎం వెంకట సుబ్బయ్య, సంయుక్త కార్యదర్శి ధరిమి శెట్టి రమణ, బాబయ్య, మహానందప్ప, పాల కొండయ్య, మల్లేశ్వర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

2 comments: