Monday, March 8, 2010

అమ్మ భాష పరిరక్షణకు బెంగళూరులో సదస్సు

బెంగళూరు, మార్చి 7 : అదో విశిష్ట కార్యక్రమం. ఆంగ్ల వ్యామోహ పెనుతుపానులో కొట్టుకుపోతున్న మాతృభాషల్ని పరిరక్షించుకునే వ్యూహాన్ని చర్చించేందుకు ఏర్పాటైన సదస్సు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒరిస్సా, గోవా రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు. ఆయా రాష్ట్రాల్లో మాతృభాష దుస్థితి, సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. సదస్సు తీర్మానాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
మాతృభాష పరిరక్షణ మన లక్ష్యం కావాలి... సంరక్షణకు నడుం బిగిద్దామని ముక్త కంఠంతో పిలుపునిచ్చారు.
నగర శివార్లలోని వాగ్దేవి విలాస్‌ విద్యాలయ ప్రాంగణం విశిష్ట కార్యక్రమానికి వేదిక అయింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు భారతీయ మాతృభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర మాతృభాషా పరిరక్షణ తొలి సదస్సును ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి అధ్యక్షుడు ఎ.చక్రపాణి, బెంగళూరు కోళదమఠాధిపతి శాంతవీరమహాస్వామి ఆరంభించారు. ఆయా రాష్ట్రాల్లో అమ్మభాష దుస్థితి, సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి డాక్టర్‌ అశోక్‌ కామత్‌ (మహారాష్ట్ర), డాక్టర్‌ చిదానందమూర్తి (కర్ణాటక), డాక్టర్‌ ఉద్గాత (ఒరిస్సా), ఆచార్య డి.కృష్ణమూర్తి (బెంగళూరు), దామోదర మౌజో (కొంకణి) తదితరులు తమ ప్రసంగాల్ని కొనసాగించారు. యునెస్కో ఇటీవల ప్రకటించిన సర్వే నివేదికపై విస్తృతంగా చర్చించారు. మాతృభాషలు
మృతభాషలుగా మారకుండా తీసుకోవాల్సిన చర్యల్ని ప్రస్తావించారు. సాయంత్రం వరకు సదస్సు కొనసాగింది.
దేశం నుంచి బ్రిటిష్‌ పాలకుల్ని తరిమికొట్టినా వారి ఆంగ్లాన్ని వదల్లేకపోతున్నామని ఎ.చక్రపాణి విచారం వ్యక్తం చేశారు. కోళదమఠాధిపతి శాంతవీరస్వామి ప్రసంగిస్తూ... మాతృభాషలకు తగినంత ప్రాధాన్యత లభించడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. ఆంగ్ల వ్యామోహం అధికమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మభాషను గౌరవించని వ్యక్తుల్ని గుర్తించవద్దని హితవు పలికారు. కర్ణాటకలో పాలనా భాషగా కన్నడ అమలును కచ్చితంగా పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ... తెలుగు, కన్నడలకు ఏడాది క్రితమే ప్రాచీన హోదా లభించినా కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందనే నెపంతో కేంద్రం నిధులు విడుదల చేయటం లేదు. కేసు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదే సమయంలో భాషాభ్యున్నతికి తగినన్ని నిధుల్ని వెంటనే విడుదల చేయాలన్నారు. నిధుల కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ఎల్‌. వివేకానంద, కె.సి.కల్కూర, కె.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment