హైదరాబాద్: తెలుగుతల్లి గళసీమలో ప్రాచీన భాష హోదా మాలను అలంకరించుకున్నామని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. శాసనమండలి, శాసనసభలోనూ సభ్యుల హర్షధ్వానాల మధ్య శుక్రవారం ఆయన ఈ విషయం తెలియజేశారు. తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2006 ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని గుర్తు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2008 అక్టోబరు 31న ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ చెన్నై హైకోర్టులో ఉన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం తీర్పునకు ఇది లోబడి ఉంటుందని తెలియజేసిందని వెల్లడించారు. సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి ఇటీవల తెలుగు భాషావేత్తల ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారని, ఈ విషయంలో సహకరించాల్సిందిగా ఎంపీలను కోరారన్నారు. ఇందుకు స్పందించిన ఎంపీలు ప్రధాన మంత్రి, న్యాయశాఖ మంత్రికి లేఖలు రాశారని తెలిపారు. దీనిపై వెంటనే తగిన చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9వ తేదీన మైసూరులోని భారతీయ భాషల అధ్యయన సంస్థ సంచాలకులు, విశ్వవిద్యాలయ విరాళాల సంఘ అధ్యక్షులకు లేఖను పంపిందని వెల్లడించారు. దీంతో తెలుగువారి చిరకాల కోరిక నేరవేరిందని సీఎం అన్నారు. ఇందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరినా అందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భాషావేత్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్టీఆర్ హయాంలో అధికార భాషా మంత్రిత్వశాఖ ఉందని, దాన్ని పునరుద్ధరించాలని దాడి వీరభద్రరావు చేసిన సూచనకు సీఎం సానుకూలంగా స్పందించారు.
No comments:
Post a Comment