న్యూఢిల్లీ,మార్చి13 : తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి కల్పించిన సౌకర్యాలు అమలుచేయవలసిందిగా కోరుతూ కేంద్రం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు, మైసూరులోని భారతీయ భాషల కేంద్రం సంస్థకు లేఖలు రాసింది. మానవ వనరుల మంత్రిత్వశాఖకు చెందిన సంయుక్త కార్యదర్శి డాక్టర్ అనితా భట్నాగర్ జైన్ యుజిసి, సిఐఐఎల్‌లకు లేఖలు రాశారు. తెలుగుకు ప్రాచీనహోదా కల్పిస్తూ జారీచేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని సౌకర్యాలు అమలుచేయడంలో ఎలాంటి అడ్డంకులూ లేవని న్యాయమంత్రిత్వ శాఖ స్పష్టీకరించడంతో యుజిసి, సిఐఐఎల్ ఇక తదుపరి చర్యలు తీసుకోవచ్చునని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు. తెలుగుకు ప్రాచీన హోదా అమలుపై రాష్ట్రప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు లక్ష్మీప్రసాద్ ఈ లేఖలను శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు.
ప్రస్తుతం కొన్ని కేంద్రీయ యూనివర్సిటీలలో తెలుగులో ప్రతిభావంతులైన పండితులకు కొన్ని పీఠాలు ఏర్పాటుచేయవలసిందిగా అనితా భట్నాగర్ యుజిసి ఛైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్‌కు రాసిన లేఖలో నిర్దేశించారు. ఈ ఉన్నత పీఠాల్లో నియమించే పండితుల వయసు, కాలపరిమితి, అర్హతలు, వేతన భత్యాలు మొదలైనవి యుజిసి తర్వాత నిర్ణయించవచ్చునని ఈ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర క్యాబినెట్ స్థాయిలో నిర్ణయం తీసుకున్న రీత్యా ఈ చర్యలకు గట్టి ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. ఇక, ప్రాచీన భాష అయిన తెలుగులో పండితులకు రెండు ప్రధాన అంతర్జాతీయ అవార్డులను వార్షికంగా ప్రకటించాల్సి వుందని మైసూరులోని సిఐఐఎల్‌కు కూడా కేంద్రం లేఖ రాసింది. సిఐఐఎల్‌లో భాగంగానో, లేదా సాహిత్య అకాడమీలో భాగంగానో ప్రాచీన హోదా గల భాషల్లో అధ్యయనాలకు ఒక ఉన్నత ప్రతిభా కేంద్రాన్ని ఏర్పరచాలని కూడా అనితా భట్నాగర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు తగిన భూమిని, సరైన మౌలిక సదుపాయాలను, ఫ్యాకల్టీని, పరిశోధకులను, ఇతర సిబ్బందిని నియమించాల్సి వుందని కూడా తెలిపారు.
అంతర్జాతీయ అవార్డులు, కన్నడ, తెలుగు భాషల్లో అధ్యయనంకోసం ప్రతిభాకేంద్రాన్ని ఏర్పరిచేందుకు చర్యలు తీసుకోవలసిందిగా ఆమె సిఐఐఎల్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేష్ సచ్‌దేవను కోరారు. నాలుగురోజులక్రితం ఢిల్లీ వచ్చిన లక్ష్మీప్రసాద్ తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు 40మంది ఎంపిల సంతకాలతో కూడిన లేఖలు సమర్పించడమే కాక, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీని కులుసుకున్నారు. ప్రాచీన హోదా కల్పించేందుకు న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవని మొయిలీ స్పష్టంచేసిన విషయం విదితమే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తలపెట్టిన ఈ బృహత్కార్యం ఎట్టకేలకు నెరవేరిందని, ముఖ్యమంత్రి రోశయ్య, రాష్ట్రమంత్రి గీతారెడ్డి ఎంతో చొరవ తీసుకున్నారని, తెలుగుకు ప్రాచీన హోదా అమలయ్యేలా చేసిన ఘనత వీరికి దక్కుతుందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు.
No comments:
Post a Comment