Saturday, November 7, 2009

తెలుగుకు అవమానం- ఆంధ్రప్రభ సంపాదకీయం

తెలుగు భాషకు తెలుగు వారి రాష్ట్రంలోనే అవమానాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ఇది తెలుగు అభిమానులను మరింతగా నొప్పిస్తున్నది. కడప జిల్లా మైదుకూరులో ఒక పాఠశాలలో తెలుగులో మాట్లాడినందుకు ఇద్దరు చిన్నారులను 'ఇక మీదట తెలుగులో మాట్లాడను' అనే వాక్యం రాయించిన ప్లకార్డులను మెడలో వేలాడదీయించి శిక్షించిన సంఘటన జనం మనస్సులలో నుంచి ఇంకా చెరిగిపోక ముందే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లోని పాఠశాలలో కూడా తెలుగులో మాట్లాడినందుకు ఒక విద్యార్థిని ఉపాధ్యాయురాలు 'డోంటాక్‌ తెలుగు' అంటూ 300 సార్లు రాసి ఇవ్వవలసిందని ఆదేశించిన ఉదంతం భాషాభిమానులకు ఆగ్రహావేశాలు కలిగిస్తున్నాయి. తాను ఇంగ్లీషు పాఠాలు బోధిస్తాను కనుక తన క్లాసులో మాత్రమే తెలుగులో మాట్లాడవద్దని కోరానని ఆ టీచర్‌ వివరణ ఇచ్చారు. ఇది మరొక వివాదానికి దారి తీసే అవకాశం ఉందని గ్రహించి ఆమె ఈవిధంగా మాట మార్చినట్లు కనిపిస్తున్నది. ఈ రెండు సంఘటనలపై ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తామంటున్నది. అయితే, మరీ బాధాకరమైన విషయమేమంటే రాష్ట్రంలోని పలు విద్యా సంస్థలు పాశ్చాత్య మోజులో పడి తెలుగు తల్లికి మాయని మచ్చ తీసుకురావడం. తెలుగు మాధ్యమంలో విద్యార్జన చేసిన వారి కన్నా ఇంగ్లీష్‌ మీడియంలో చదివిన విద్యార్థులకే ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభిస్తుండడంతో విద్యా సంస్థలలో ఇంగ్లీష్‌ మీడియంలో బోధనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వాస్తవానికి దేశంలోని విద్యా సంస్థలలో అనేక సంవత్సరాల క్రితమే త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టారు. మాతృభాషను, అనుసంధాన భాష ఇంగ్లీష్‌ను, జాతీయ అధికార భాష హిందీని లేదా మరొక భారతీయ భాషను పాఠశాలల్లో బోధించాలని అప్పట్లో సూచించారు. ఇతర రాష్ట్రాల సంగతి అలా ఉంచితే ఈ సూత్రాన్ని మన రాష్ట్రంలోని పాఠశాలల్లోనే ఎక్కువగా అమలు పరుస్తున్నారు. కాని కొన్ని చోట్ల తెలుగుకు ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గిస్తున్నట్లు కనిపిస్తున్నది.
జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలను తొలిసారి నిర్వహించిన తరువాత రాష్ట్రంలో అధికార భాషగా తెలుగు వాడకం పెరిగింది. కాని ఎన్‌టి రామారావు 'తెలుగువారి ఆత్మగౌరవం' నినాదంతో చిత్రరంగం నుంచి రాజకీయ రంగంలోకి దూకి పార్టీని స్థాపించి ఉధృతంగా ప్రచారం చేసి తొలి ప్రయత్నంలోనే అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు రావడమే కాకుండా, తెలుగు భాష కూడా మరింత ప్రాముఖ్యం సంతరించుకున్నది. ఎన్టీఆర్‌ హయాంలో అన్నిటికీ తెలుగు పేర్లు పెట్టసాగినప్పుడు ఆయన మరీ అతిగా వ్యవహరిస్తున్నారనే మాట వచ్చినా తెలుగు వాడకం స్థాయి పెరిగిందనే మాట నిజం. ఎన్టీఆర్‌ తరువాత అధికారం స్వీకరించిన చంద్రబాబు నాయుడు మొదటి హయాంలో తెలుగు వాడకం పరిస్థితి మెరుగ్గానే ఉంది. కాని చంద్రబాబు రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఐటికి ఇతోధిక ప్రాధాన్యం ఇవ్వసాగడంతో తెలుగు వాడకం స్థాయి తగ్గిపోయిన సంగతి ఎవరూ పట్టించుకోలేదు. ఆతరువాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా పరిస్థితి మెరుగు కాలేదు. ఎవరి హయాంలోనైనా అధికార భాషా సంఘం అనేది కొనసాగుతున్నప్పటికీ అది సూచనలు, సలహాలు ఇవ్వగలదే గాని ఆదేశాలు జారీ చేయలేదు కదా. మన పొరుగు రాష్ట్రాలలో ఆయా మాతృభాషలలోనే అధికార కార్యకలాపాలన్నీ సాగుతున్నాయి. ఆయా రాష్ట్రాలలో ఇతర భాషలవారు ఉన్నప్పటికీ ఏ దరఖాస్తులు పెట్టాలన్నా ఆ రాష్ట్రాల అధికార భాషలలోనే వాటిని స్థానికుల సాయంతో రాయించుకుంటున్నారు. కాని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, చివరికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాచీన భాషగా గుర్తింపు ఉత్తర్వు తెచ్చుకున్నప్పటికీ మన రాష్ట్రంలో రకరకాల కారణాలతో అధికార భాషగా తెలుగు వాడకం విషయంలో అలా జరగడం లేదు.
నిజానికి తెలుగు భాష ఎంతో తియ్యనైనది. సులభంగా అర్థం అవుతుంది. అందుకే ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ఒక సందర్భంలో 'సుందర తెలుంగు' అని పేర్కొన్నారు. ఏ మాండలికంలో మాట్లాడినా అందులో ఉండే కమ్మదనం ఎంతో గొప్పది. విదేశాలలో ఉన్న ఆంధ్రులు కూడా తమ పిల్లలు తెలుగులో మాట్లాడాలనే ఆశయంతో వారికి తెలుగు నేర్పిస్తున్నారు. పండుగలు వంటి సందర్భాలలో నిర్వహించే కార్యక్రమాలలో తెలుగు వాడకానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. కాని స్వరాష్ట్రంలో అలా చేయడం తప్పుగా కనిపిస్తున్నది. అధిక సంఖ్యాక కుటుంబాలలో 'అమ్మా, నాన్నా' అనడానికి బదులు 'మమ్మీ, డాడీ' అని లేదా 'మామ్‌, డాడ్‌' అని పిలిపించుకోవడాన్నే ఇష్టపడుతున్నారు. ఆ వ్యామోహంతోనే కాన్వెంట్లలో తమ పిల్లలను చదివిస్తున్నారు. అందుకే తెలుగులో పొరపాటున మాట్లాడినందుకు విద్యా సంస్థల సిబ్బంది తమ పిల్లలను దారుణంగా శిక్షించినా అదేమని తల్లిదండ్రులు వారిని గద్దించలేకపోతున్నారు. మాతృభాషను కించపరిచే విధంగా ఎవరైనా ప్రవర్తించినప్పుడు ఉద్యమించడం, కళ్ళెర్ర చేయడం వంటివి తెలుగు వారు చేస్తున్నారు. కాని ఆతరువాత చల్లబడిపోతున్నారు. అందుకే తెలుగువారు ఆరంభ శూరులనే నిందకు గురవుతున్నారు.
రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్‌లో కూడా తెలుగు వాడకం తగ్గిపోతున్నది. మెట్రోపాలిటన్‌ నగరం స్థాయిని హైదరాబాద్‌ అందుకోవడంతో ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వస్తుండడంతో తెలుగుకు అంతగా ప్రాధాన్యం లభించడం లేదు. ఇది అతిశయోక్తిగా కనిపించవచ్చు కాని నిజం. 'హిందీ నై మాలూం', 'స్పీక్‌ ఇన్‌ ఇంగ్లీష్‌' అనే మాటలు వినిపిస్తుంటాయి. మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఇలా అనే ధైర్యం వారికి ఉండదు. కాని మన దగ్గర మాత్రం ఇది చెల్లుబడి అవుతోంది. తెలుగువారి సహనశీలం వారికి ఇలా అక్కరకు వస్తోంది. ఏమైనా, తెలుగు భాషకు ఇటువంటి అవమానాలు జరగకుండా ఉండడానికి అటు ప్రభుత్వంలోను, ఇటు జనంలో కూడా చైతన్యం రావాలి.

No comments:

Post a Comment