Monday, May 2, 2011

తెలుగు భాష - చారిత్రక నేపథ్యం

నేటి తెలుగు వెలుగు నీడల సమ్మేళనమై, ఆనంద విషాదాల సమ్మిశ్రితమై ఉన్నదనడం ఒక చేదు నిజం, ఒక తియ్యటి సత్యం. దక్షిణ ఆసియాలోని 24 ద్రావిడ భాషల్లో అధిక సంఖ్యాకుల అమ్మ భాషైన తెలుగు, శాతవాహనుల కాలం నుండి సాంస్కృతిక చరిత్ర గల తెలుగు, తూర్పు చాళుక్యుల కాలంలో పాలనా భాషైన తెలుగు, జాతీయ భాషైన హిందీకి ద్వితీయ స్థానంలో నిలిచిన తెలుగు, ప్రపంచ భాషల్లో 16వ దిగా లెక్కింపబడిన తెలుగు, రాష్ట్రంలోనేకాదు దేశంలోనే అధికార భాషగా అలరారవలసిన తెలుగు నేడు పురోగతిలో తిరోగతిని చూస్తోందా? వెలుగు కిరణాల వెనుక తరగని క్రీనీడల్ని చవిచూస్తోందా? మహోన్నత కీర్తి శిఖరాల నుండి శిథిలాల నిశీధిలోకి జారిపోతోందా? ఈ సందేహ త్రయ నివృత్తికి గతంలోకి ఒక్కసారి దృష్టి సారించి, వర్తమానంలోకి చూపు నిలిపి ఈ కాలపు తెలుగు గురించి తెలుసుకుందాం.
మన మాతృభాషకీనాడు ఆంధ్రం, తెనుగు, తెలుగు అనే మూడు పేర్లూ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆంధ్రులు ఆగంతకులైన ఆర్యులకన్నా ఈ దేశ ఆదిమవాసులన్నది ఒక చారిత్రక సత్యం. వీరుత్తరార్యావర్తం నుండి దక్షిణాపథానికి వలసవచ్చి, రాజ్యాన్ని స్థాపించుకున్నారు. మౌర్యుల తర్వాత చతురంగ బలసంపన్నులని మెగస్తనీసు; అందమైనవారు, విహార ప్రియులని ఉద్యోతనుడు వీరినభివర్ణించి ఉన్నారు. ఆంధ్రుల బహుముఖ ప్రజ్ఞాపాటవాలకు వివిధ శిలాశాసనాలు, బౌద్ధ -సంస్కృత వాఙ్మయాలు అద్దం పడుతున్నాయి. వేల సంవత్సరాలుగా, విశ్వవ్యాప్తంగా కీర్తి బావుటాల నెగురవేసిన తెలుగుజాతి తన చారిత్రక నేపథ్యాన్ని హృదయాలకు హత్తుకొని ఇంకా మున్ముందుకి సాగిపోవాలి. సూర్యుడు -వెలుగు, చంద్రుడు -వెన్నెల, తెలుగూ -తెలుగువాడు వేర్వేరు కాదు, కాకూడదని, ''తెలుగు జాతి నిండుగ వెలుగు జాతి'' ఉన్నట్లే -తెలుగు భాష నిండుగ వెలగు భాష కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ కాలపు తెలుగును పరిశీలిద్దాం.
తెలుగు భాషకు కీర్తి కిరీటాలు :
సాహితీ సమరాంగణ చక్రవర్తి, ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణ దేవరాయలు మన తెలుగు భాషామతల్లికి అలంకరించిన కీర్తి కిరీటం -ఈ క్రింది పద్యం: ''తెలుగు దేలయన్న దేశమ్ము తెలుగేను, తెలుగు వల్లభుండ, తెలుగొకండ, ఎల్ల భాషలయందు ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స.'' అట్లే -తన హరికథాగానలహరిలో దక్షిణ భారతాన్ని ముంచి తేల్చిన ఆదిభట్ల నారాయణదాసు గారు ఆంధ్రమాతను ప్రశంసిస్తూ సమర్పించిన పద్యరత్నాలలో రెండు చరణాలను చూద్దాం -''తేనె తీయదనము తెన్గునగేగాక, పరుష సంస్కృతాఖ్యభాషకేది?'' -ఇంకా కవి శేఖరులు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ''ఆంధ్ర భాష యమృత మాంధ్రాక్షరంబులు, మురువు లొలుగు గుండ్ర ముత్తియములు'' అని తెలుగు భాషను ప్రశంసించారు. ఇక ఈ వ్యాసకర్త మాతృభాషామతల్లి కొసగిన కీర్తి మకుటంలోని పద్యం -''తేట తేనియలకె తీపినింపిన భాష, విశ్వ భాషవోలె వెలుగుభాష, చందనమ్మునకె సుగంధ మద్దిన భాష, తెలుగు భాష నమ్ము, తెలుగువాడ! కరుణశ్రీ శ్రీ జంధ్యాలవారి కలం అభిషేకించిన పద్యసుగంధాన్ని ఆశ్వాదిద్దాం -''తెలుగు దనము వంటి తీయందనము లేదు, తెలుగు కవుల వంటి ఘనులు లేరు, తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా! లలిత సుగుణబాల! తెలుగుబాల''. మహాసహస్రావధాని డా|| గరికిపాటి నరసింహారావు గారు -''అమ్మ ప్రేమ కన్న కమ్మదనము లేదు, తెలుగు భాషకన్న తేనెలేదు'' అని ఆంధ్రమాతకు అవధానార్చన గావించారు. ఒక్క నిమిషం రాష్ట్ర సరిహద్దులు దాటి చూస్తే -''సుందరం తెలుంగు'' అని, కవిత్వం వ్రాస్తే తెలుగులోనే వ్రాయాలని కీర్తించినవారు, జాతీయకవి సుబ్రహ్మణ్య భారతిగారు, ఇటలీ యాత్రికుడు ''నికొలయ్‌కంటి'' విజయనగరాన్ని దర్శించి ''భారతదేశంలోని తెలుగు ఇటలీభాష వంటిది అని కితాబు ఇచ్చారు. ఆఖరిగా... ఆంధ్రమాతకు ఒక అజ్ఞాతకవి అర్పించిన అక్షరాభరణం -''మురళి రవళులు కస్తూరి పరిమళములు, కలిసి యేర్పడె సుమ్ము మా తెలుగుభాష'' ఎందరెందరో కవికుమారులచే కీర్తించబడిన తెలుగు భాషామతల్లి నేడెట్లున్నది? నాటి తెలుగు భాషా వైభవ ప్రాభవాలు నేడు ఏమైనవి? ఒక్క నిమిషమాలోచించండి. మన తెలుగు తల్లి పూర్వ యశస్సును నిలిపేందుకు మనమంతా మనభాషను క్రమ్మిన తమస్సుని తొలగించి శాశ్వత ఉషస్సుని సాధించేందుకు, ఈ కాలపు తెలుగులోకి మరింత వెలుగునిచ్చేందుకు కన్నబిడ్డలుగా కలసిరండి.
నిత్య నూతన జానపద సాహితీ సౌరభాలు :
తెలుగు భాషకు సహజసిద్ధమైన సాహితీ వెలుగు నిచ్చేది జానపద సాహిత్యం. ప్రపంచంలోనే తొలినాగరికులు, ఆదిబౌద్ధులు, గణతంత్ర ప్రభుత్వ స్థాపకులు మన ఆంధ్రులు -నదీ తీరాలలో జనపదాలను నిర్మించుకొని, శ్రమైక జీవన సౌందర్యాన్ని విశ్వసించి, శ్రమనుండి భాష పుట్టినట్లే, పనినుండి పాటను పలికించిన తొలి జానపదుడు మన తెలుగువాడు. అందుకే ఆంధ్రుడు సేద్యానికి ఆద్యుడైనాడు, అన్నపూర్ణకి ముద్దుల బిడ్డడైనాడు, ఈ జానపదగీతాలు ఏరువాక నుండి బతుకమ్మ పండగదాకా పాటలు సెలయేరై పారుతాయి. శ్రామిక -శృంగార -స్త్రీల -బాలల పాటలై ప్రవహించుతాయి. నాటి బ్రౌన్‌దొర నుండి నిన్నటి బిల్‌క్లింటన్‌ దాకా పాశ్చాత్యుల్ని సైతం పరవశింపజేస్తాయి.
బసవరాజు గేయాల్లో (గుత్తి వంకాయ..), నండూరి కావ్యాల్లో (ఎంకి పాటలు), గద్దర్‌ విప్లవ గర్జనలో, అంజయ్య సినీ గీతాలలో, గిరిజన బృందగానాలలో ఇప్పటికీ పచ్చగా, వెచ్చగా, సజీవంగా విశ్వజనీనంగా నిలిచి ఉన్నాయి. అయితే అప్పుడప్పుడూ ఈ జానపదగేయాలకి నగరపు నగిషీలు తొడిగి, మైదానపు గొంతుల్లోంచి ఒలికించే సందర్భాలున్నాయి గాని అవి అసందర్భంగానూ, అసహజంగానే మిగిలిపోతున్నాయి. సతత హరిత సీమల్లోంచి సహజాతి సహజంగా, ఆశుకవితాధారగా, అడవి మల్లెల పరిమళంలా అలరారుతున్న ఈ జానపద సాహితీసంపదను కాపాడుకుందాం.
- ఎస్‌.వెంకటరత్నం (సవేర)

4 comments:

  1. "జాతీయ భాషైన హిందీకి ద్వితీయ స్థానంలో నిలిచిన తెలుగు"

    This is because unlike Bangla, Tamil, Urdu & Punjabi, Telugu is spoken almost entirely by Indians. Telugu is *not* the second largest Indian language but the second largest language in India.

    "ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణ దేవరాయలు"

    Contrary to propaganda, Rayalu was no Telugu fanatic. He was proficient in Sanskrit, Kannada & Telugu. He patronized meritorious people of all languages (e.g. Timmarusu, a Tamil).

    "కరుణశ్రీ శ్రీ జంధ్యాలవారి కలం"

    This is the same man who called Telangana "దక్షిణ పాకిస్తానము". How do you expect us to be proud about his work?

    I am not against any language but oppose hegemony in the name of Telugu.

    ReplyDelete
  2. ప్రణవిMay 5, 2011 at 12:01 PM

    జై గారూ,
    మీరు ఏదో లోతైన విషయం చెబుతున్నారని అర్ధమైంది.
    కానీ, ఇంగ్లీషు సరిగా రాని నాలాంటివారి కోసమైనా తెలుగులో రాస్తే బాగుండేది.

    ReplyDelete
  3. అయ్యా జై గారూ,

    1. మీరు భాష విస్తృతి గురించి మాట్లాడితే తెలుగుకన్నా తమిళమే అధిక ప్రాంతాలలో మాట్లాడబడుతుంది. అలాగే బెంగాలు విభజన జరగకపోయి ఉంటే బెంగాలీకి రెండవ స్థానం దక్కేది. తెలుగు మాట్లాడేది కేవలం దక్షిణ బారతదేశములో మాత్రమే. తెలంగాణభాష-మిగిలిన ఆంధ్రప్రదేశ్ భాష వేర్వేరయిన సందర్భములోనూ మళ్ళీ బెంగాలీకే ఆ స్థానం దక్కుతుంది మరి. ఆధారం 2011 జనాభా లెక్కలు. పరిశీలించుకోవచ్చు.

    2. ఒక మనిషికి భాషలు తెలియటము వేరు. ఒక భాషపై అభిమానము ఉండటము వేరు. కృష్ణదేవరాయల మాతృభాష తుళు అయినా ఆయన అభిమానించినది తెలుగు. వారి ఆస్థాన భాష తెలుగు. ఇతర భాషలను ప్రోత్సహించినా అయన్ని ఆంధ్రభోజుడనటములో ఎవ్వరికీ ఏ సందేహమూ లేదు.

    3. ఆంధ్రా బ్రాహ్మణులకు........అంటూ కె.సి.ఆర్ గారి మాటలు మరి వేదవాక్కులు. జంధ్యాలగారి అభిప్రాయము తృణీకారమూనూ. భేష్.

    ఇక్కడ ఈ వ్యాస ఉద్దేశం తెలుగుభాష, తెలుగుజాతి ఔన్నత్యాలకు సంబంధించినది. మీ పైత్య వికారాలను కాస్త కట్టిపెట్టండి లేదా తెలంగాణ ప్రాంతములో మాట్లాడే భాషకేదయినా కొత్తపేరు కనిపెట్టండి.

    ReplyDelete
  4. Mee Krishi abhinandaneeyam, aacharana amogham. Telugu Velugu Nalu Moolala Viraajillali. Mana Bhasha Mana Amma..... Joharlu Sodharaaa...

    ReplyDelete