Sunday, May 29, 2011

తెలుగు బడిని నిలిపిన చల్లని ఒడి

తమిళనాడులోని డెంకణి కోట పక్కనున్న అన్యాళం గ్రామంలోని తెలుగు మాధ్యమిక పాఠశాలని నిలపడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తా ఉన్నది లక్ష్మమ్మ. ఎంతోమంది పెద్దలు తలపట్టుకుని చేతులెత్తేశారు. చదువుకునే పిల్లలు చేరకుంటే బడిని మూస్తారు.
మగత నిద్రలో దూరంగా తోవమీద హారన్ శబ్దాలు, ఇంట్లో పిల్లల కేరింతలు... ఆమె నిద్రా ధ్యానంలో కూడా ఆలోచిస్తున్నది.
ఆ సమయంలో-
ఓ రోజు పగటిపూట వలలు పట్టుకుని పదిమంది గువ్వలవారు (షికారీలు) అనే కులంవాళ్లు లక్ష్మమ్మ పొలంలోకి పక్షుల వేటకు వచ్చారు. లక్ష్మమ్మ ప్రతి పంట కోతలప్పుడు గువ్వలకోసం ధాన్యం కోయకుండా కొంత పొలం వదిలిపెడుతుంది. వేలాది గువ్వలు ఆ చేనులో వాలి కడుపు నింపుకునేవి. అదో...వాటిమీద గువ్వలవాళ్ల కన్ను పడింది. రెండేళ్లనుండి వాళ్లని వేటాడనివ్వకుండా అడ్డుపడుతోంది లక్ష్మమ్మ. కొడుకు అశ్వత్థరెడ్డి తెలుగు భాషా ప్రచారం కోసం దూర గ్రామాలలో ఉన్నాడు. ఎరువులు తేవడం కోసం పక్కూరెళ్లింది లక్ష్మమ్మ. ఎలా తెలిసిందో! భయంతోఒక్కసారి చేనుమీంచి పెద్ద పక్షుల గుంపు-్భయంతో రెక్కలు విదిలించి ఆకాశంలోకి ఎగిసిన శబ్దం! దూరంలో ఉన్న లక్ష్మమ్మ ఎలా విందో ఏమో గాని గువ్వల చేనుకాడ వాలిపోయింది. ఆమె గుండెల్లో దడ తగ్గలేదు. నుదుటిమీద చెమట...ఒళ్లంతా రొప్పుతూ అక్కడే కూలబడింది.
గువ్వలు ఎగిరిపోతే పోయాయి. మరుసటి రోజు వస్తాయి. కానీ లక్ష్మమ్మ కంటబడ్డాం కదా అని గువ్వలవాళ్లు బెదురు కళ్లేసుకున్నారు.
వాళ్ల వెంట వచ్చిన చిన్న పిల్లల్ని చూసి ‘‘ఏరా ఎంతమందుంటారు మొత్తం మీ గువ్వలోళ్ల ఇళ్లల్లో పిల్లలు’’ అని ఆరా తీసింది. మొత్తం ఇరవైమంది. పదిమంది ఆడెక్కలు, పదిమంది మగ కుంకలు అని చెప్పారు. వేళ్లమీద తర్జనభర్జన పడి ఒకరినొకరు అడుక్కుని పక్కా లెక్క తేల్చారు.
‘‘లక్ష్మమ్మ కళ్లల్లో తెలుగు గూడు కదలాడింది. ‘‘ఏమిరా పిల్లల్ని గువ్వల్లాగా గాలికొదిలేదేనా? కొంత సదువు, ఇంత బలపం కావాలా? మీలాగే వాళ్ల బతుకుల్ని గాలి కొదిలేయకండి.’’ తెలుగు భాషరా మనది అంటూ నాలుగు వేమన పద్యాలు, సుమతీ పద్యాలు అందుకుంది. ఈలోగా కొత్త గువ్వలు కొన్ని పొలంమీద వాలాయి. పద్య రాగాలు విందామని కాబోలు.
మా పిల్లలకు చదువెందుకన్న గువ్వల వాళ్లని సరే ఆలోచిద్దాం లెమ్మనేవరకూ తీసుకొచ్చింది మాటలతో.
మరి పొలంమీద వాలే గువ్వల షికారు చేసుకుంటాం అని మెల్లిగా ఖరాకండి షరతు పెట్టారు వేటగాళ్లు.
వాళ్ల తెలివి ముందు ఆమె మ్రాన్పడిపోయంది.
తెలుగుబడి నిలపాలా? గువ్వల గూడుని రక్షించాలా? మళ్లీ నీరసపడిపోయిందామె.
ఏమీ మాట్లాడలేక-
‘‘రేపీయాళ్లకు రండి’’ అని మాట్లాడకుండా గమ్మునుండిపోయింది.
గువ్వలు కాదు లక్ష్మమ్మే వలలో పడినంత సంతోషంగా భుజాల మీద ఖాళీ వలలతో వెనుదిరిగారు.
వందలాది అమాయక పక్షులు ఒకవైపు, గువ్వలవాళ్ల వెనక బుడిబుడి అడుగులు వేస్తున్న పిల్లలు మరోవైపు. ఇద్దరూ కావాలి తనకు. ఎలా?
ఊరంటే గడపలు కాదు. పొలాలూ, తోటలే కాదు. చెరువులూ, కుంటలూ, బావులూ, చెట్లు, చేమలూ, పక్షులూ, పరిశుభ్రమైన గాలీ... తెలుగు సంస్కృతి ఎంత ముఖ్యమో ఆ వాతావరణాన్ని సజీవంగా నిలిపే పక్షుల రెక్కల చప్పుడూ అంతే ముఖ్యం. ఆ రాత్రి దీర్ఘంగా ఆలోచించింది.
మళ్లీ గువ్వలు ఒక్కసారి భయంతో రెక్కలు అల్లార్చాయి. ఈసారి వాటిలో నిన్నటి అంత భయంలేదు. లక్ష్మమ్మ ఇంట్లోనే ఉంది కదా అని వాటి ధీమా.
కాని లక్ష్మమ్మ ఏమి చేయాలా అని ఆలోచిస్తూనే ఉంది.
తెల్లారినా కూడా మనసు కుదుటపడ లేదు.
పేపర్‌లో టీవీ ధర తగ్గింపు ఆఫర్ వార్తని మనమలు చూపినప్పుడు ఆమె మనస్సు మరింత బాధకు లోనైంది.
దూరంగా షికారీలు వలలూ, పక్షులను వేటాడి తీసుకెళ్లడానికి ప్లాస్టిక్ సంచులూ పట్టుకుని వస్తున్నారు.
లక్ష్మమ్మ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా లేచి నిలుచుంది.
ఆకాశంలో పక్షులు గింగిర్లు కొడుతునే ఉన్నాయి. పొలంలో ఎప్పుడు వలలు విసురుదామా అని గువ్వల వేటకి వచ్చిన పదిమంది ఒక్కొక్కరు ఒక్కో బస్తా ధాన్యం భుజాన వేసుకుని వచ్చిన దారి పట్టడం చూసి గువ్వలు చిరుగుంపులై హాయిగా పొలంలోకి దిగాయి. లక్ష్మమ్మ కళ్లల్లో ఆనందం. వెళ్ళుతున్న వాళ్లని ఆపింది. అలాగేనమ్మా అన్న మాట- రేపు పిల్లల్ని తీసుకువచ్చి బడిలో వేస్తామని ఇచ్చిన హామీ- తెలుగు తరగతిలో పద్యాలు వినపడినంత సంతోషం వేసిందామెకు.
రాత్రి వచ్చిన కొడుకు అశ్వత్థరెడ్డి కాళ్లు కడుక్కుంటూ తెలుగుబడి ఈసారికి బతికిందమ్మా! గువ్వలోళ్లు తమ పిల్లల్ని చేర్పిస్తున్నారట తెలుసా అన్నాడు సంతోషంగా.
ఒకవైపు మురిసిపాటు. మరోవైపు దిగులు చారలు. తన ఇద్దరు మనమళ్ల టీవీ కల మాత్రం ఆవిరైపోయింది.
పదిబస్తాల ధాన్యం ఒక టీవీకి సరిసమానమని-
ఈ ఏడు కూడా మనమళ్లకి టీవీ లేదని ఎలా చెప్పాలా అని చూస్తోంది.
ఐదేళ్ల తరువాత...
గువ్వల పొలాన్ని, తెలుగుబడిని నిలిపిన లక్ష్మమ్మతో వాళ్లింట్లో కరచాలనం చేసి ఆమె పాడిన కమ్మని తెలుగు పద్యాలు విన్న సంతృప్తి మరువలేనిది. రాష్టప్రతితో కలిసిన దానికన్నా ఎక్కువే నాకు గుర్తుంటుంది. ఆనాడు మేం తీసిన ఒకే ఒక్క ఫోటో ఇలా పనికి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఆమె బోసి బుగ్గల్లో, భాషను బతికించే బిగబట్టిన కాంక్షా పరిమళం ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఆమె ఒక జ్ఞాపకం కాదు. ఆమె నిండైన ఒక తెలుగు అక్షరం.
అన్యాళం బడిని చూసినా దాని బొమ్మను చూసినా నాకు లక్ష్మమ్మ తల్లి గుర్తొస్తుంది.
గువ్వల్ని చూసినా, పరారైన పిచుకల్ని చూసినా ఆమె గుర్తొస్తుంది.
 -ప్రొఫెసర్  జయధీర్ తిరుమల రావు,
( ఆంధ్రభూమి దినపత్రిక సౌజన్యంతో..)

2 comments:

  1. ఈ వ్యాసాన్ని మీరు పరిచయం చెయ్యకపోతే లక్ష్మమ్మ గారి గురించి తెలుసుకోలేకపోయేవాణ్ణి. నెనరులు సార్.

    ReplyDelete
  2. కావలసింది మేం కాదు
    మాలాంటి మీరూ కాదు
    అమ్మలు కావాలి
    అమ్మలగన్న అమ్మలు కావాలి
    అమ్మకడుపు చల్లగా
    లక్ష్మమ్మలు కావాలి.
    వేనవేలుగా..,
    వేలు పట్టుకుని నడిపించడానికి
    వేడుకగా బతికించడానికి
    తెలుగుని
    తీయగా వినిపించడానికి
    తేనియలు ఒలికించడానికి
    ప్రణవి

    ReplyDelete