ప్రైవేటు విద్యాసంస్థల్లో తెలుగు మరీ అన్యాయమైపోతోందని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డాక్టర్ సి.నారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ తెలుగును ద్వితీయభాషగా కూడా తీసేస్తుండడం ప్రమాదకరమన్నారు. తెలుగులో రాస్తున్నాడు, మాట్లాడుతున్నాడనే నెపంతో ఒక విద్యార్థిని తరగతి నుంచి బహిష్కరించి, శిక్షించిన దృష్టాంతాన్ని మనం చూశామని, ఇది తెలుగు నాట తెలుగుకు జరుగుతున్న తీరని అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీల్లో ఆంగ్ల పదాల ఉపయోగం ఎక్కువగా ఉందన్నారు. ఒక 'ఈటీవీ'లోనే తెలుగు ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటూ 'స్వల్పవిరామం' అనే పదాన్ని ఉదహరించారు. ఇతర భాషా పండితులు కూడా తెలుగు ప్రాశస్త్యాన్ని, ఔచిత్యాన్ని కొనియాడారని సినారె గుర్తుచేశారు. తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
వాడుక భాషే తెలుగు భాషకు వేడుక అవుతుందని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అన్నారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో శనివారం ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభలకు రామోజీరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ''నిజమైన భాష పల్లె పట్టుల్లోనే ఉంటుంది. అక్కడ వాడుకలో ఉన్న పదాలను అందరం ఉపయోగిద్దాం. ఆ వాడుకే తెలుగుకు వేడుక అవుతుంది'' అని ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగు అంటే ఏ తెలుగు అనే మీమాంస అనవసరమని, భాషకు యాస బలమని, లక్షల మంది మాట్లాడే మాండలికాలన్నీ భాషకు ఆయువుపట్టులే, అన్నీ అవసరమే అని స్పష్టం చేశారు. పాఠశాల స్థాయి నుంచే భాషోద్ధరణ మొదలు కావాలని ఆకాంక్షించారు. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మరాఠీల భాషాభిమానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. భాషా ప్రియులకు తోడుగా 'ఈనాడు' ఉందని, నిర్దిష్ట ప్రణాళికతో ముందడుగు వేయాలని సూచించారు.
తీరికలేని ప్రభుత్వం: యార్లగడ్డ
తెలుగు గురించి పట్టించుకునే తీరిక మన పాలకులకు లేకుండా పోయిందని మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు అధికార భాషా సంఘానికి ఏడాదిగా సమితి లేక ఖాళీగా ఉందన్నారు. చివరకు తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వచ్చే తీరిక కూడా పాలకులకు లేకుండా పోయిందని అన్నారు. ప్రతి పాఠశాలలోనూ మన బిడ్డలకు తెలుగు తప్పకుండా నేర్పించాలంటూ ప్రభుత్వాలను, పాఠశాలల యాజమాన్యాలను నిలదీయాలని పిలుపునిచ్చారు. సభ గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష ఇప్పుడు దారులు మూసుకు పోయిన కూడలిలో దిక్కుతోచని స్థితిలో దీనంగా నిలబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలు సమగ్ర భాషా చైతన్యానికి పూనుకోకుంటే చరిత్ర మనల్ని క్షమించదనే ఆవేదనతోనే ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు. టీవీలు వచ్చాక పల్లెటూర్లలో కూడా తెలుగు భాష ఆంగ్లపదాలతో కలుషితమైపోయిందని ప్రముఖ కథా రచయిత, కథానిలయం వ్యవస్థాపకుడు కాళీపట్నం రామారావు అన్నారు. ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ మాట్లాడుతూ తెలుగు భాషపై అభిమానం ఉన్న పీవీ నరసింహారావు, బెజవాడ గోపాలరెడ్డి, ఎన్టీఆర్ లాంటి నేతలు ఇప్పుడు మనకు అవసరమన్నారు. ఇప్పుడున్న పాలకులకు తెలుగుపై అభిమానం లేదని, అలాంటి వారికి అవసరమైతే ఇది తెలుగు అని మనం నేర్పి, వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. శాంతా బయోటెక్ అధినేత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజల సంఖ్య, పత్రికల సంఖ్య పెరిగినా చదివే పాఠకుల సంఖ్య తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాశ్చాత్య ప్రభావానికి లోనైన యువతరాన్ని, చిన్న పిల్లలను ఆకట్టుకునే రచనలు రావాలని, ఆశావహ దృక్పథంతో రచనలు సాగాలని కోరారు. ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు భాషలో సాధక బాధకాలను పరామర్శించే తరం పత్రికల్లో లేకుండా పోయిందన్నారు. ఈ సమావేశంలో కేంద్ర సాహిత్య అకాడెమీ కార్యదర్శి అగ్రహారం కృష్ణమూర్తి, ప్రసిద్ధ ఉర్దూ కవి షీన్ కాఫ్ నిజాం, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు తుర్లపాటి కుటుంబరావు, రాష్ట్ర సాంస్కృతికశాఖ, పురావస్తుశాఖ సంచాలకుడు హర్షవర్ధన్, చెన్నారెడ్డి, కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచందు పాల్గొన్నారు.తెలుగు తల్లి విగ్రహావిష్కరణ
మహాసభల ప్రారంభానికి ముందు తుమ్మలపల్లి కళేక్షేత్రం ఎదుట తెలుగుతల్లి విగ్రహాన్ని రామోజీరావు, సినారె ఆవిష్కరించారు. మహాసభల సందర్భంగా రూపొందించిన 'తెలుగు పున్నమి' పుస్తకాన్ని రామోజీరావు ఆవిష్కరించారు.
No comments:
Post a Comment