Monday, August 29, 2011

అమెరికాలో తెలుగు భాషా శిక్షణకు పెరుగుతున్న ఆదరణ

మెరికాలోని ప్రవాసాంధ్రుల కుటుంబాలకు చెందిన పిల్లలు తెలుగు భాష మాధుర్యాన్ని అనుభవించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న హిందూ దేవాలయాల్లో శని, ఆది వారాల్లో తెలుగు భాష నేర్పడం కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులుకు మంచి ఆదరణ లభిస్తోంది. 2008లో 'సిలికానాంధ్ర' సంస్థ చేపట్టిన మనబడి కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోంది. తొలుత కాలిఫోర్నియా రాష్ట్రంలోని 19 ప్రాంతాల్లో తెలుగు నేర్పే 'మనబడి' పాఠశాలలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో ఈ తరహా పాఠశాలలు పనిచేస్తున్నాయి. వీటిలో ఓనమాలు నుంచి వ్యాకరణం వరకు భాషపై పూర్తి అవగాహన కల్పించేందుకు నాలుగేళ్ల కోర్సు ఒకటి రూపొందించారు. ఈ కోర్సు నిర్వహణకు హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం సహకారం అందిస్తోంది. కోర్సు పూర్తిచేసిన వారికి ధ్రువపత్రాలు అందిస్తున్నారు.
వర్సిటీల్లోనూ తెలుగు వెలుగు: అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తప్పనిసరిగా ఓ విదేశీ భాష నేర్చుకోవాలి. దీనికి సంబంధించి ధ్రువపత్రం పొందాలి. దీన్ని గుర్తించిన ప్రవాసాంధ్ర ప్రముఖులు తొలిసారిగా 'విస్కాన్సిన్‌' విశ్వవిద్యాలయంలో తెలుగు కోర్సును ప్రవేశపెట్టేలా కృషి చేశారు. టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో అందిస్తున్న తెలుగు భాషలో శిక్షణకూ మంచి స్పందన లభిస్తోంది. ఐదేళ్లపాటు శిక్షణ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు లక్ష డాలర్లను 'తానా' ఈ వర్సిటీకి విరాళంగా అందజేస్తోంది. ప్రవాసాంధ్ర పిల్లలు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు వారి మాటలు అర్థంకాక ఇక్కడి బంధువులు ఇబ్బందిపడేవారు. ఇకపై ఈ సమస్య తప్పనుంది.
-ఈనాడు   

1 comment:

  1. ఇదే మాదిరిగా అన్ని దేశాలలో నివసిస్తున్న ప్రవాస తెలుగు కుటుంబాలవారు కృషి చేస్తే మనం జన్మ భూమి ఋణం కొంతైనా తీర్చుకున్న వారమవుతాం.

    ReplyDelete