Tuesday, August 16, 2011

తేనెలొలికిన ‘తెలుగు’ రచయితల సభలు

సాంస్కృతిక శాఖ, హిందీ అకాడమీ, భారతీయ భాషా కేంద్రం (మైసూర్), సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) సౌజన్యంతో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాలు కవులు, రచయితల్లో భాషా స్ఫూర్తిని నింపాయి. బెంజిసర్కిల్ వద్ద ఉన్న ఎస్వీఎస్ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమాల ముగింపు సభకు హైకోర్టు న్యాయమూర్తి గ్రంధి భవానీప్రసాద్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ సారథ్యంలో రెండో మహాసభలు కూడా విజయవాడలోనే జరగడం విశేషమన్నారు. లోక్‌సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ తాను భాషా ప్రియుడినన్నారు. ఫ్రెంచ్, బెల్జియంలో రెండు భాషలు ఉన్న కారణంగా ప్రభుత్వం ఏర్పడలేదన్నారు. బెంగాలీ, పంజాబీ భాషల కారణంగా పాకిస్తాన్ విడిపోయిందన్నారు. భాషను విద్యా అంశంగా తీసుకోవాలని ఆయన సూచించారు. హెచ్‌ఎం టీవీ సీఈవో శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ పత్రికల ద్వారా భాషా సేవచేసే అవకాశం ఉందన్నారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్ కల్లూరి భాస్కరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రభ సంపాదకుడు విజయబాబు మాట్లాడుతూ అతి తక్కువ వయసున్న భాష ఇంగ్లిష్ అన్నారు. దానిని అంటరానిదానిగా, పరాయి భాషగా చూడాల్సిన అవసరం లేదన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ మాట్లాడుతూ తెలుగును ఆధునిక భాషగా గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఎమెస్కో ప్రచురణ సంస్థ అధినేత విజయకుమార్ మాట్లాడుతూ రచనలు సార్వజనీన స్థాయికి చేరుకుంటే పత్రికలు, ప్రచురణ సంస్థలు ముద్రించడానికి అవకాశముందన్నారు.ప్రముఖ హిందీ, బెంగాలీ రచయిత ప్రొఫెసర్ ఇంద్రనాథ్‌చౌదరి మాట్లాడుతూ ప్రాథమిక విద్య పూర్తిగా తెలుగు భాషలో ఉన్నపుడే పిల్లలు అర్థం చేసుకోవడానికి అవకాశముంటుందన్నారు. విశ్వనాథ, గురజాడ, శ్రీశ్రీ లాంటివారు మళ్లీ పుట్టాలని ఆకాంక్షించారు. హిందీ నవలా రచయిత్రి ప్రతిభారాయ్ మాట్లాడుతూ భాషాభివృద్ధిపైనే ఆయా దేశాల అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ తుర్లపాటి కుటుంబరావు, ప్రచురణకర్త ఇమ్మిడిశెట్టి రామ్‌కుమార్, ప్రొఫెసర్ ఉషాచౌదరి, సన్‌ఫ్లవర్ విద్యాసంస్థల అధినేత ఎంవీఎస్‌ఆర్ పున్నంరాజు, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, చిగురుపాటి వరప్రసాద్, హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి.సుబ్బారావు, జీవీ పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు.

‘సమాజాన్ని సమైక్యపరిచే తెలుగు’
సమాజాన్ని సమైక్య పరిచే శక్తి భాషా సంస్కృతులకే ఉందని రచయితల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మహాసభల్లో భాగంగా సోమవారం ఎస్వీఎస్ కల్యాణ మండపంలో ‘జాతీయతా భావం-రచయితల పాత్ర’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకోత్తర, మహత్తర త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామన్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ నేటి తరానికి తెలుగు మాట్లాడడమేగానీ చదవడం, రాయడం రావట్లేదన్నారు.

కలకత్తాకు చెందిన సంస్కృతాచార్యులు ఆచార్య ఉషాచౌదరి మాట్లాడుతూ జాతీయ భావాలకు, పరమత సహనం, వారసత్వానికి ఆది నుంచి భారతదేశం పెట్టింది పేరన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ నల్లవారి హక్కుల కోసం పోరాడి తెల్లవారి తుపాకులకు బలైన మార్టిన్ లూధర్ కింగ్ ఇంట్లో మహాత్మాగాంధీ విగ్రహం ఉన్న చరిత్ర భారతదేశానిదన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకుడు హర్షవర్థన్ మాట్లాడుతూ ఏ భాషనైనా కాలానుగుణంగా మార్చుకున్నప్పుడే మనుగడ సాధ్యమవుతుందని, మాతృభాష మృతభాషగా మారకుండా ఉంటుందన్నారు. సదస్సుకు సమన్వయకర్తగా వ్యవహరించిన సిలికాన్ ఆంధ్రా కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ తెలుగు భాషను ప్రపంచ భాషగా గుర్తింపు తెచ్చేందుకు కృషిచేద్దామన్నారు. కృష్ణా యూనివర్సిటీ మాజీ ఉపకులపతి మైనేని కేశవదుర్గాప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషను ఆధునికీకరించపోతే మనుగడ ఉండదన్నారు.అనంతరం తెలుగులో అంతర్జాల అన్వేషణ, ముద్రణారంగంలో సాంకేతిక తోడ్పాటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అలాగే ఇ-పుస్తకాల గురించి వెంకట్రామ్, వికీపీడియా గురించి చావా కిరణ్, లిపి ఎలా రూపుదిద్దుకుంటుందో శివరావ్ వివరించారు. సీపీ బ్రౌన్ వేదికపై జరిగిన ఈ సదస్సులో తెలుగు ఫాంట్ అభివృద్ధి కమిటీ సభ్యుడు అమర్‌నాథ్‌రెడ్డి, ఆచార్య జి.ఉమామహేశ్వరరావు, డి.అంబరీష్, వి.వెంకటరమణ, కళాసాగర్, కొత్తపల్లి నారాయణస్వామి, పెద్ది సాంబశివరావు, సలాక రఘునాథశర్మ, రహిమానుద్దీన్, కె.వీరభద్రశాస్త్రి పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. ఆ వివరాలు.. 
* పల్లె నుంచి నగరాల వరకు అంతా తెలుగే మాట్లాడాలి. ఇంట్లో, బయట అమ్మ భాషే మాట్లాడాలి.
* రాష్ట్రంలో తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖను వెంటనే ఏర్పాటు చేయాలని, దీనివల్ల భాషా సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి.
* రెండేళ్లుగా అధికార భాషా సంఘ కార్యవర్గాన్ని నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం విచారకరం. వెంటనే నియామకాలు జరపాలి.
* ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ'ని పునరుద్ధరించాలి.
* ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగులో బోధన తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల నెంబరు 86 విడుదల చేసినా దాన్ని ఇప్పటి వరకు అమలు చేయకపోవడాన్ని సమావేశాలు తప్పుపట్టాయి. (ఈ ఉత్తర్వు విడుదలయిన మూడు సంవత్సరాల తరువాత తమిళమాధ్యమంపై అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.) తెలుగు బోధించని ప్రభుత్వేతర పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి. గ్రామ స్థాయి నుంచి తెలుగు బోధన కోసం ఉద్యమాలు చేపట్టాలి.
* వచ్చే 'నందన'నామ సంవత్సరాన్ని తెలుగు భాషా సంస్కృతుల సంవత్సరంగా ప్రకటించి గ్రామస్థాయి నుంచి తెలుగుపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి.
* పాలన, బోధన భాషగా తెలుగు అమలుపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి.
* తెలుగు మాట్లాడే విద్యార్థులపై చర్యలు తీసుకునే విద్యా సంస్థలు ఉంటే నిరసనలు, ఆందోళనలు చేయాలి.
* తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ప్రోత్సాహంగా ఉద్యోగాల మౌఖిక పరీక్షల్లో అయిదు మార్కులు అదనంగా కేటాయించాలి

No comments:

Post a Comment